
యాదగిరిగుట్ట లో అంగరంగవైభవంగా ప్రారంభం అయిన వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్టలో ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామివారి కల్యాణం, రథోత్సవం వంటి ప్రధాన ఘట్టాల కోసం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఆలయ అర్చకుల స్వస్తి వచనంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 18 నుండి ఫిబ్రవరి 28 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రాల మంత్రోచ్ఛారణల మధ్య, బుధవారం ఉదయం ఆలయ అర్చకులు నిజాభిషేకం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు. సాయంత్రం, బ్రహ్మోత్సవాల ఆచారాల ప్రకారం ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. పూజలు ప్రారంభించే ముందు ఆలయంలో, మాడవీధులలో ఆలయ పూజారులు సంప్రోక్షణ నిర్వహించారు.
ఆలయ అర్చకులతో పాటు, వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూజ కార్యక్రమాల నిర్వహణ కోసం 100 మంది ఋత్వికులను ఆలయానికి ఆహ్వానించారు. వీరు 11 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలలో నిర్వహించే పూజ కార్యక్రమాలలో ఆలయ అర్చకులతో కలిసి పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని దేవతలను స్వాగతించే ధ్వజారోహణం ఫిబ్రవరి 19న ఉదయం 11 గంటలకు ఆలయంలో నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు భేరి పూజ చేస్తారు. ఫిబ్రవరి 20న లక్ష్మీనరసింహ స్వామి.. మస్త్యావతారంలో, ఫిబ్రవరి 21న వటపత్ర సాయి అలంకారంలో దర్శనమిస్తారు. ఫిబ్రవరి 22న లక్ష్మీనరసింహ స్వామిని కృష్ణ అవతారంలో, ఫిబ్రవరి 23న గోదార్ధన గిరి అలంకారంలో అలంకరిస్తారు. ఫిబ్రవరి 24న ఉదయం 8.45 గంటలకు ఎదురుకోలు ఉత్సవం నిర్వహిస్తారు. లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల లో కీలకమైన స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఫిబ్రవరి 25న రాత్రి 9.30 గంటలకు ఆలయ అర్చకులు ఘనంగా జరుపుతారు. ఫిబ్రవరి 26న రథోస్తవం, ఫిబ్రవరి 27న ఉదయం 9.30 గంటలకు చకరతీర్థం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 29న అష్టోత్తర శతఘటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.2 కోట్లతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కౌంటర్లలో తగినంత పరిమాణంలో లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచబడతాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ 1500 మంది భక్తులకు భోజన వసతి కల్పించబడుతుంది. అవసరమైతే అదనంగా మరో 1000 మందికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహించే ప్రత్యేక సేవల్లో పాల్గొనదలచిన దంపతులు రూ.20,000 చెల్లించి సేవలో భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల కారణంగా దేవాలయంలో రోజు నిర్వహించే నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలు, సుదర్శన నారసింహ హోమం ఏకాదశి లక్ష పుష్పార్చనలను ఫిబ్రవరి 28 వరకు రద్దు చేసారు. బ్రహ్మోత్సవం లు పూర్తి అయిన తరువాత ఈ సేవ కార్యక్రమములను పునరుద్దరించనున్నారు. పురస్కరించుకొని దేవాలయంకు దారి తీసే యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రధాన రహదారిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో దేవత మూర్తుల బొమ్మలను ఏర్పాటు చేసారు.
యాదగిరిగుట్ట పాత బస్టాండ్, కొత్త బస్సు స్టాండ్ ల నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ భక్తుల సౌకర్యార్ధం కొండా పైకి అదనపు సర్వీస్ లను నడపనుంది.
యాదగిరిగుట్ట పాత బస్టాండ్, కొత్త బస్సు స్టాండ్ ల నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ భక్తుల సౌకర్యార్ధం కొండా పైకి అదనపు సర్వీస్ లను నడపనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యాదగిరిగుట్ట పోలీస్ లు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. వాహన రద్దీ మూలంగా ట్రాఫిక్ జాం ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాహనాల రద్దీ అధికంగా ఉన్న రోజులలో వ్యక్తిగత వాహనాలను కొండ పైకి అనుమతించటం జరగదని పోలీసులు తెలిపారు.

