ఈ విఐపి మీద కేసు నమోదుకు 42 రోజులు పోరాడిన ఒక తల్లి...
x

ఈ విఐపి మీద కేసు నమోదుకు 42 రోజులు పోరాడిన ఒక తల్లి...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదు పార్టీని డిఫెన్స్‌లో పడేసింది. దాని వెనక ఉన్న పోరాటం ఏమిటో తెలుసా?


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల తన కూతురిపై అఘాయిత్యం చేశాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఈ ఘటన ఫిబ్రవరి 2న జరిగింది. యడియూరప్ప ప్రముఖమైన వ్యక్తి కావడంతో వారు కేసు నమోదు చేయడానికి ఆలస్యం చేశారు. ఓ జాతీయ నేత, రాష్ట్ర మంత్రి జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదైంది. ఈ కేసును సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)తో దర్యాప్తు చేయించాలని బాధితురాలి తల్లి కోరుతుండగా.. సిద్ధరామయ్య ప్రభుత్వం సీఐడీని అప్పగించాలని డిమాండ్ చేస్తుంది.

బాలిక, ఆమె తల్లి యడియూరప్పను ఎందుకు కలిశారు...

బీజేపీ కార్యకర్త కూడా అయిన బాలిక తల్లి యడియూరప్పను కలిశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో సాయం చేయాలని కోరారు. కొన్నేళ్ల క్రితం తన కూతురి లైంగిక వేధింపులకు గురైందని, ఆ కేసులో విచారణ సరిగా జరగడం లేదని ఆరోపించారు. ఓ వ్యాపారి డబ్బు వ్యవహారంలో తమను మోసం చేశాడని, మోసంచేసిన వ్యక్తికి ప్రముఖ జాతీయ నాయకుడి అండదండలు ఉన్నాయని తెలిపింది.

బాధితురాలి తల్లి కథనం ప్రకారం..

“అత్యాచారానికి గురైన నా కూతురికి న్యాయం జరగాలని నేను గత తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నా. ఈ విషయం ఆయన (యడ్యూరప్ప)కు ముందే తెలుసు. ఓ వ్యాపారి చేతిలో కోట్ల డబ్బు నష్టపోయాం. దానికి సంబంధించి నా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలను ఆయనకు చూయించాను.

యడియూరప్ప నాతో, నా కూతురితో సుమారు 9 నిమిషాల పాటు మాట్లాడారు. నా కూతురు ఆయనను తాత అని పిలిచేది. నా కూతురిని గదిలోకి తీసుకెళ్లాడు. కాసేపటికి ఆమె తప్పించుకుని బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. గది లోపల జరిగిన ఘోరాన్ని నాకు చెప్పింది. వెంటనే నేను యడియూరప్పను నిలదీశాను. అమ్మాయి నాకు మనవరాలి లాంటిది. మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని అని ఆయన (యడియూరప్ప) హామీ ఇచ్చారు’’ అని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసుల నుంచి స్పందన లేదు..

తమ కూతురికి యడియూరప్ప చేసిన అన్యాయం ఆయనపై ఫిర్యాదు చేసేందుకు తల్లీకూతుర్లు ఇద్దరూ చాలా ప్రయత్నాలు చేశారు. ఇలా జరిగిందని పోలీసులకు చెప్పినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

‘‘ఓ సమావేశానికి వచ్చిన రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వరకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేయాలని వెళ్లాను. అయితే ఫిర్యాదు కాపీని మాత్రమే బెంగళూరు పోలీసు కమిషనర్‌కు అందజేయగలిగాను. అప్పటికి కూడా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

యడియూరప్ప చేసిన అమానుషం గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, రాష్ట్రపతి భవన్‌కు లేఖలు రాశాను. తర్వాత సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలను సంప్రదించేందుకు ప్రయత్నించాను.’’

‘‘ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ సంజయ్ నగర్ పోలీసులు యడియూరప్పపై కేసు నమోదు చేయలేదు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేస్తే తొలుత వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఒక జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి పోలీసు కమిషనర్‌తో మాట్లాడిన తర్వాతే యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు.’’ అని బాధితురాలి తల్లి పేర్కొన్నారు.

కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి..

యడియూరప్పపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆయన అనుచరులు పోలీసులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పడంతో భద్రత రీత్యా బాధితురాలు, ఆమె తల్లిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలిపై కూడా కేసు నమోదు చేయాలని యడియూరప్ప మద్దతుదారులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

చట్టప్రకారం ఎదుర్కొంటా..

కేసు నమోదు చేసిన విషయం పత్రికలు, ఛానళ్లలో రావడంతో.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, చట్ట ప్రకారం కేసును ఎదుర్కొంటానని యడియూరప్ప చెప్పారు. ఈ కేసు సున్నితమైందిగా పేర్కొంటూ.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.

Read More
Next Story