తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్:భారీ గాలులతో మోస్తరు వర్షాలు
x
తెలంగాణలోని 8 జిల్లాల్లో మోస్తరు వర్షాలు : ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్:భారీ గాలులతో మోస్తరు వర్షాలు

పలు జిల్లాల్లో మారుతున్న వాతావరణం.. ఎండల పెరుగుదల


తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఒకవైపు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో శనివారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశముందని ఆమె తెలిపారు. గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసేఅవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. శనివారం 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు నాగరత్న వివరించారు. హైదరాబాద్ నగరంలోనూ శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అధికారులు వివరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వారు తెలిపారు.

పెరిగిన ఉష్ణోగ్రతలు

మొత్తంమీద రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబగద్వాల, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కు చేరే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఒక వైపు వర్షాలు...మరో వైపు ఎండలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ కు పెరిగాయి.శుక్రవారం ఉరుములు,మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసిన తర్వాత ఎక్కువ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ పోస్టులో తెలిపారు. 8 జిల్లాలు మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా శనివారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల సెల్సియస్ కు పెరిగాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.మొత్తానికి తెలంగాణలో వర్షాలు, గాలులు ఒకవైపు, ఎండల తీవ్రత మరోవైపు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More
Next Story