తెలంగాణలో ఎల్లో అలర్ట్:  నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక
x
హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం విడుదల చేసిన వెదర్ రిపోర్టు చిత్రపటం(ఫొటో కర్టసీ :ఐఎండీ)

తెలంగాణలో ఎల్లో అలర్ట్: నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

మండే ఎండలకు బ్రేక్… తెలంగాణలో వాతావరణ మార్పు


మండుతున్న ఎండల మధ్య తెలంగాణలో వాతావరణం మెల్లగా మారుతోంది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ, రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

తెలంగాణలోని నాలుగు జిల్లాలో మంగళవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు భారతవాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవవచ్చని హైదరాబాద్ ఐఎండీ కేంద్రం మంగళవారం ఉదయం విడుదల చేసిన వెదర్ రిపోర్టులో ఆమె పేర్కొన్నారు. తేలికపాటి వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆమె వివరించారు. మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మండే ఎండలతో ఉత్తర తెలంగాణలోని ప్రజలు అల్లాడారు. మంగళవారం కురుస్తున్న వర్షాలతో ఎండల బారినుంచి కొంత ఉపశమనం లభించినట్లయింది.

హైదరాబాద్ నగరంలో నేడు వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మరో గంటలో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నగరంలోని ఉప్పల్, నాగోల్, నాచారం, కాప్రా, ఎల్బీ నగర్, చర్లపల్లి, మల్లాపూర్, మల్కాజ్‌గిరి, అల్వాల్, నేరేడ్‌మెట్, మౌలాలీ, బోడుప్పల్, నాగారం, దమ్మాయిగూడ, బొల్లారం, సికింద్రాబాద్, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ పోస్టులో వెల్లడించారు.

సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

రేపు, ఎల్లుండి ఉరుములు,మెరుపులతో వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 22,23 తేదీల్లో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ. ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఏప్రిల్ 22వతేదీన అక్కడక్కడా వర్షాలు కురవవచ్చని ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ 23వతేదీన నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ధర్మారాజు వివరించారు.

ఒకవైపు వడగాలులు...మరో వైపు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని దుండిగల్, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, పటాన్ చెరు, రాజేంద్రనగర్, హయత్ నగర్, హకీంపేట ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. హైదరాబాద్ నగరంలో మంగళవారం పగలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా, సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని వెదర్ మ్యాన్ ఎక్స్ లో తెలిపారు.

మరో వారం పాటు వర్షాలు

ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండి కేంద్రం తెలిపింది. సాయంత్రం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, 20కి పైగా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి. ఈ వర్షాల కారణంగా సాయంత్రం ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, 20కి పైగా జిల్లాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు మంగళవారం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరికను హైదరాబాద్ ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో మండే ఎండల నుంచి ఉపశమనం ఇస్తున్న ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చినా… ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించడం అత్యవసరం.
Read More
Next Story