
పోలీసులపైకి పాముతో దాడిచేసిన యువకుడు(వీడియో)
కోపమొచ్చిన డ్రైవర్ ఆటోలో నుండి బయటకు రావటం రావటమే ఒక పామును పోలీసు మీదకు విసిరాడు
సమాజంలో చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం పోలీసులకు అంత సులభం ఏమీకాదు. పోలీసులు చెప్పినట్లు అందరు నడుచుకుంటారు అనేందుకు లేదు. కొందరు రకరకాలుగా పోలీసులకు ఎదురుతిరుగుంటారు. కొందరైతే ఎదురుదాడులు కూడా చేస్తుంటారు. దీనికి పాతబస్తీ తాజా సాక్ష్యంగా నిలిచింది. విషయం ఏమిటంటే పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట చౌరస్తాలో పోలీసులు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఆటోనడుపుతున్న యువకుడిని పోలీసులు ఆపారు. మద్యం తాగి ఆటోను నడుపుతున్నాడన్న అనుమానంతో బయటకు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ మీటర్ ను ఊదమని అడిగాడు కానిస్టేబుల్. దాంతో కోపమొచ్చిన డ్రైవర్ ఆటోలో నుండి బయటకు రావటం రావటమే ఒక పామును పోలీసు మీదకు విసిరాడు.
ఆటో డ్రైవర్ దగ్గర రెడీగా పాము ఎందుకు ఉన్నట్లు ? ఆ విషయం సదరు డ్రైవర్ కే తెలియాలి. అదేమీ బొమ్మ పాము కూడా కాదు. ఆటో డ్రైవర్ చేతిలోని పామును చూడగానే పోలీసుకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. పామును చూడగానే పోలీసు కానిస్టేబుల్ భయంతో వెనక్కు జరిగాడు. అయితే డ్రైవర్ భయపడకుండా పామును పట్టుకుని పోలీసు మీదకు ఉరికాడు. దాంతో తనను తాను రక్షించుకోవటం కానిస్టేబుల్ తలకుమించిన పనైంది. పామును డ్రైవర్ చేతికి చుట్టుకుని పోలీసుతో గొడవకు దిగాడు. దాంతో ఏమిచేయాలో తోచక సదరు కానిస్టేబుల్ పై అధికారులకు సమాచారం అందించాడు. దాంతో అదనపు సిబ్బంది వచ్చి డ్రైవర్ ను బెదిరించి అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశారు.
ఆటో సీజ్ చేయగానే మత్తులో ఉన్న డ్రైవర్ ఆటో కోసం పోలీసులతో గొడవపడ్డాడు. చివరకు డ్రైవర్ తో పాటు ఆటోను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు.

