ఉద్యోగం కోసమని వెళ్తే.. రష్యా సైనికులుగా మార్చేశారు..
x

ఉద్యోగం కోసమని వెళ్తే.. రష్యా సైనికులుగా మార్చేశారు..

రష్యాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్నారు. కాని ఏజెంట్ వారిని తప్పుదోవ పట్టించాడు. దొరికిపోయిన ఆ యువకులను సైనికులుగా మార్చేశారు.


రష్యా అధికారులు తమతో కొన్ని పత్రాలపై సంతకం చేయించుకుని ఉక్రెయిన్‌ సైనికులపై పోరాడాలని బలవంతం చేస్తున్నారని ఇండియాకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో ఎలాగైనా వారిని కాపాడాలని భారతీయులు కోరుతున్నారు.

ఓ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా.. సైనికుల తరహా జాకెట్లు ధరించిన ఏడుగురు వ్యక్తులు వీడియోలో కనిపించారు. వారిలో ఆరుగురు చిన్న గదిలో ఒక మూలన నిలుచొని ఉండగా.. ఏడో వ్యక్తి వీడియో తీశాడు. 19 ఏళ్ల హర్యానాలోని కర్నాల్‌కు చెందిన హర్ష్ తాము ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని వివరిస్తూ, సాయం కోసం వీడియోలో అర్థిస్తున్నాడు.

గత ఏడాది డిసెంబర్లో కొందరు యువకులు ఉద్యోగం కోసం రష్యా వెళ్లారు. వీరంతా 90 రోజులు చెల్లుబాటు అయ్యే రష్యా వీసాతో వెళ్లారని గుర్తించారు. అయితే వీరిని ఏజెంట్ తప్పుదోవ పట్టించి రష్యాలో భాగమైన బెలారస్ కు పంపాడు. ఇక్కడ ప్రవేశించాలంటే బెలారస్ వీసా అవసరం. విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని యువకులను రష్యా అధికారులకు అప్పగించారు. వారు తమవద్ద కొన్ని పత్రాలపై సంతకం చేయించుకుని ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కోసం పోరాడాలని ఒత్తిడి చేస్తున్నారని యువకులు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

నా కొడుకును రక్షించండి..

తన కొడుకు ఉద్యోగం వెతుక్కుంటూ డిసెంబర్ 23న రష్యాకు వెళ్లాడని హర్ష్ తల్లి చెబుతున్నారు. రష్యా సైనికులు అతని పాస్‌పోర్టును లాక్కొని బలవంతంగా ఆర్మీలో చేర్చుకున్నారని, చేరకపోతే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని బెదిరించారని చెబుతుంది. తాను బలవంతంగా సైనిక శిక్షణ పొందాల్సి వచ్చిందని హర్ష్ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఎలాగైనా తన కొడుకును క్షేమంగా ఇంటికి తీసుకురావాలని హర్ష్ తల్లి భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.

జైలుకు వెళ్తారా లేక సైన్యంలో చేరతారా?

వీడియోలో ఉన్న మరో వ్యక్తి పేరు గురుప్రీత్ సింగ్. గురుప్రీత్‌ను బలవంతంగా సైన్యంలో చేర్చారని భారతదేశంలోని అతని సోదరుడు అమృత్ సింగ్ అంటున్నారు. రష్యాలోని బెలారస్ కొన్ని పత్రాలపై సంతకం చేయించుకుని.. 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తారా? లేక రష్యా సైన్యంలో చేరాతారని అని బెదిరించారని తెలిపారు.

ఏజంట్ మాటలు నమ్మి..

భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పురుషులను ఉద్యోగాల పేరిట ఏజెంట్లు రష్యాకు పంపుతున్నారు. అందుకు ఏజంట్లు ఒక్కొక్కరి నుంచి ₹3 లక్షలు సేకరించారు. అక్కడికి పంపి ఇంకా తమకేమీ పట్టనట్లు ఏజంట్లు వ్యవహరిస్తున్నారని వీడియోలో ఏడుగురు యువకులు వాపోయారు.

రష్యన్ పాస్ పోర్టు ఇస్తారని..

చాలా మంది పురుషులు పేద కుటుంబాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఆటో డ్రైవర్లుగా, టీ అమ్మేవారు లేదా వీధి పక్కన చిన్న వ్యాపారం చేసుకునేవారే. ఏజెంట్లు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా శ్రీలంక, నేపాల్, యుఎఈ నుండి కూడా వ్యక్తులను రిక్రూట్ చేస్తున్నారు. కొన్ని నెలల సైనిక సేవ తర్వాత వారికి రష్యన్ పాస్‌పోర్ట్ ఇస్తారని ఏజంట్లు నమ్మబలుకుతుండడం గమనార్హం.

జీతాలు ఎక్కువని మోసపోతున్న వైనం..

UAEలో పనిచేస్తే అధిక జీతాలు ఇస్తారని ఏజంట్లు యువకులను ఆశపెడుతున్నారు. దాంతో వారి కుటుంబాలు రూ 3 లక్షలు అప్పులు తెచ్చి ఏజంట్లకు చెల్లిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకులు ఏజంట్లు చెప్పే మాటలు విని మోసపోతున్నారు.

సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ మెంట్..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ యూట్యూబ్ నిర్వాహకుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాడు. రూ1.5 లక్షల జీతం చెల్లిస్తారని నమ్మబలకడంతో కొంతమంది యువకులు ఆ ఏజంట్ డబ్బులు చెల్లించారు. దీంతో వారిని ఏజంటు రష్యాకు పంపాడు. అక్కడ రష్యా సైన్యంలో చేరాల్సి ఉంటుందన్న విషయం అక్కడికి వెళ్లే దాకా తెలియదని చెబుతున్నారు. యూపీకి చెందిన మరో వ్యక్తి కూడా తనను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా రిక్రూట్ చేసినట్లు చెప్పాడు. తనతో పాటు మరో ఇద్దరు యుద్ధంలో గాయపడ్డామని, తమను ఎలాగైనా రక్షించాలని అభ్యర్థించాడు. తెలియకుండానే రష్యన్ సైన్యంలోకి దింపిన వీరందరికి అసలు సైనిక నేపథ్యం లేదు. యుద్ధం చేయాలనే ఉద్దేశ్యం కూడా లేదు.

AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వంటి ప్రతిపక్ష నాయకులు ఈ సమస్యను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అభాగ్యులను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కోరారు.

Read More
Next Story