
యూట్యూబర్ కోమలి కేసులో కొత్త ట్విస్ట్.. ప్రియుడు ఏమన్నాడంటే..!
రాయదుర్గం యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కీలక మలుపు. పోలీసుల విచారణకు హాజరైన అఖిల్ రెడ్డి. ప్రేమ వ్యవహారం, సూసైడ్ లెటర్ వివరాలను వెల్లడించిన పోలీసులు.
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మృతికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు అఖిల్ రెడ్డి తాజాగా పోలీసుల ఎదుట హాజరయ్యాడు. తామిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం తాను వేరే యువతితో రిలేషన్‌లో ఉన్నానని కోమలికి స్పష్టం చేసినట్లు అఖిల్ తెలిపాడు.
మణికొండ చిత్రపురి కాలనీలో నివసించే కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైమ్ యూట్యూబర్‌గా రాణిస్తోంది. మూడేళ్లుగా అఖిల్ రెడ్డి అనే యువకుడిని ఆమె ప్రేమించింది. తాజా ఘటనపై రాయదుర్గం సీఐ వెంకన్న వివరాలు వెల్లడించారు. కోమలి మృతిపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది.
ఈ క్రమంలోనే కోమలి గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. మళ్లీ తన ప్రియుడు దక్కుతాడనే ఆశతో తిరుమల మెట్లు ఎక్కుతూ మొక్కులు తీర్చుకున్న వీడియోనే ఆమెకు చివరిదైంది. విచారణలో భాగంగా అఖిల్ పోలీసుల ముందుకు వచ్చి తన వివరణ ఇచ్చాడు. తనను వదిలేయాలని చెప్పినా కోమలి వినకుండా ఇబ్బంది పెట్టినట్లు అఖిల్ పోలీసులకు వివరించాడు. ఆత్మహత్యకు ముందు కోమలి తన తల్లికి 'ఐ లవ్ యూ మమ్మీ.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో' అని మెసేజ్ పంపింది.
అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. అంతకుముందే ఆమె అఖిల్‌కు కూడా మెసేజ్ చేయగా, అతను తన అక్కకు సమాచారం ఇచ్చాడు. ఆమె వచ్చి తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పోలీసులకు లభ్యమైన సూసైడ్ లెటర్‌లో కోమలి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అఖిల్ తన వాడు కాదని తెలిసినా, తనలోని చిన్న భాగం అతను మళ్లీ తననే ఎంచుకుంటాడని ఆశపడుతోందని అందులో రాసింది.
అతను మళ్లీ వస్తే తాను దూరంగా ఉండలేననే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కోమలి స్నేహితులు, పొరుగువారు ఆమె చాలా సరదాగా ఉండే అమ్మాయని, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

