వైసీపీలో కొత్త చిచ్చు.. 'మేమెందుకు సహకరించాలి'
వైసీపీ ఇంచార్జ్‌ల మార్పుతో కొత్తవారికి పాత నేతలు సహకరిస్తారా? పాత-కొత్త నేతల మధ్య సమన్వయం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందా?
వైసీపీ ఇంచార్జ్‌ల మార్పుల వ్యవహారం పార్టీలో పెద్ద చిచ్చే పెట్టింది. పాత-కొత్త నేతల మధ్య సమన్వయం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇంచార్జ్ మార్పులతో కొత్తవారికి సహకరించేది లేదని పాత నేతలు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో కొత్త వాళ్ళు ఇబ్బందులు పడుతూ తాడేపల్లికి క్యూ కడుతున్నారు. కొత్త మార్పుల సంగతేమే గాని మార్చిన చోట పంచాయితీలు మొదలయ్యాయి.
58 చోట్ల మార్పులు, చేర్పులు...
వైసీపీలో ఇంచార్జ్‌ల మార్పులు-చేర్పులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 58 చోట్ల మార్పులు చేసిన సీఎం వైఎస్.జగన్ మరికొన్ని స్థానాలకు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు లిస్ట్‌లు ప్రకటించారు. మరో రెండు లిస్ట్‌లు రానున్నట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గాల ఇంచార్జ్‌ల మార్పులతో వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. కొన్ని చోట్ల అంతా సక్రమంగానే ఉన్నా... మరికొన్ని చోట్ల మాత్రం మార్పులతో నియోజకవర్గాల్లో కొత్త పంచాయితీలు మొదలయ్యాయి. కొత్తవారికి సహకరించేది లేదని పార్టీలో పాత వర్గం నేతలు తిరగబడుతున్నారు. కొందరు సైలెంట్‌గా ఉంటే కొందరు మాత్రం బహిరంగంగా సహకారం ఉండదని క్లియర్ కట్‌గా తేల్చి చెప్తున్నారు. దీంతో కొత్త ఇంచార్జ్‌లు తాడేపల్లికి ఫిర్యాదు చేస్తున్నారు.
తాడేపల్లికి క్యూ కట్టిన నేతలు....
ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ తరహా పంచాయితీలు ఎక్కువగానే ఉన్నాయి. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తనకి సహకరించడం లేదంటూ తాడేపల్లికి ఫిర్యాదు చేశారు వంగా గీత. ప్రత్తిపాడులోనూ కొత్త ఇంచార్జ్ వరుపుల సుబ్బారావుకు సహకరించేది లేదని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సొంత ప్రచారం మొదలెట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకరించడం లేదని... కొత్త ఇంచార్జ్ వాపోతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఇదే సీట్ రిపీట్ అవుతోంది. విజయవాడ సెంట్రల్ MLA మల్లాది విష్ణు సైతం కొత్త ఇంచార్జ్ నియామకంపై లోలోపల మదనపడుతున్నారు. కొత్త ఇంచార్జ్‌కు తన సహకారంపై సైలెంట్‌గా ఉన్నారు. పెనమలూరులో కొత్త ఇంచార్జ్ మంత్రి జోగి రమేశ్‌కు అక్కడి నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జోగికి సహకరించేది లేదని పడమట సురేశ్‌బాబు, ఆయన కూతురు తేల్చిచెప్తుండగా... ఆ వ్యవహారం కాస్త తాడేపల్లికి చేరింది.
అరకు లోనూ ఇదే పరిస్థితి...
ఇక అరకు నియోజకవర్గంలో పంచాయితీ ఇంకా సెట్ కాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాల్గుణ వర్గం కొత్త ఇంచార్జ్ మాధవికి సహకరించేది లేదని చెప్తున్నారు. రాయలసీమలో మార్పులు జరిగిన కొన్ని చోట్ల ఇదే పరిస్థితి. నందికొట్కూరు కొత్త ఇంచార్జ్ డాక్టర్ సుధీర్‌కు... సిట్టింగ్ MLA ఆర్థర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరులో కొత్త ఇంచార్జ్‌కు కూడా సహకరించడం లేదు.
మొత్తానికి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంచార్జ్ మార్పులు వైసీపీలో కొత్త పంచాయితీలు మొదలయ్యాయి. ఓవైపు మార్పులు- చేర్పుల కోసం తాడేపల్లికి MLAలు వస్తుంటే మరోవైపు పాత ఇంచార్జ్‌లు సహకరించడం లేదని కొత్త ఇంచార్జ్‌లు కూడా క్యూ కడుతున్నారు.