తెలంగాణ పంటల సాగులో పెను మార్పులు
x

తెలంగాణ పంటల సాగులో పెను మార్పులు

మోగుతున్న ప్రమాద ఘంటికలు


తెలంగాణా పంటల పొందికలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. తెలంగాణా లో గత రెండు మూడు సంవత్సరాల సగటును బట్టి ఖరీఫ్ లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 62,47,868 ఎకరాలు కాగా అది గత సంవత్సరంలో 66,78,312 ఎకరాలకు పెరిగింది. ఈ సంవత్సరం అది మరింత పెరిగి 67,30,408 ఎకరాలకు చేరుకుంది. మొక్క జొన్న సాధారణ విస్తీర్ణం 5,21,206 ఎకరాలు కాగా అది ఈ సంవత్సరం 6,44,652 ఎకరాలకు పెరిగింది.

రాష్ట్రంలో మిగిలిన పంటల విస్తీర్ణం మాత్రం గణనీయంగా పడిపోతున్నది. ముఖ్యంగా వరి తప్ప, మిగిలిన ఆహార పంటల విస్తీర్ణం బాగా తగ్గిపోతున్నది. ఖరీఫ్ లో జొన్న సాధారణ విస్తీర్ణం 50,730 ఎకరాలు కాగా, ఈ సంవత్సరం అది 36,239 ఎకరాలకు పడి పోయింది. రాగి, సజ్జ, ఇతర చిరు ధాన్యాల విస్తీర్ణం కూడా బాగా తగ్గి పోయింది.

పప్పు ధాన్యాలలో కంది సాధారణ విస్తీర్ణం 6,69,732 ఎకరాలు కాగా, ఈ సంవత్సరం అది 4,91,690 ఎకరాలకు పడిపోయింది. పెసర సాధారణ విస్తీర్ణం 85,779 ఎకరాలు కాగా, ఈ సంవత్సరం అది 61,696 ఎకరాలకు, మినుము సాధారణ విస్తీర్ణం 32,903 ఎకరాలు కాగా, ఈ సంవత్సరం అది 28,706 ఎకరాలకు పడిపోయింది.

నూనె గింజలలో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 27,547 ఎకరాలు కాగా, అది ఈ సంవత్సరం అది 10,865 ఎకరాలకు పడిపోయింది. నువ్వుల సాధారణ విస్తీర్ణం 1256 ఎకరాల నుండీ 76 ఎకరాలకు, పొద్దు తిరుగుడు 163 ఎకరాల నుండీ 12 ఎకరాలకు, ఆముదం 7972 ఎకరాల నుండీ 1298 ఎకరాలకు, సోయాబీన్ 4,20,625 ఎకరాల నుండీ 3,62,120 ఎకరాలకు పడిపోయాయి. పత్తి సాధారణ విస్తీర్ణం 48,93,016 ఎకరాల నుండీ 45,94,685 ఎకరాలకు, చెరకు సాధారణ విస్తీర్ణం 59, 275 ఎకరాల నుండీ 35,641 ఎకరాలకు పడిపోయింది.

2018- 2019 ఖరీఫ్ సీజన్ పంట సాగు గణాంకాలను గమనిస్తే, అప్పటికీ, ఇప్పటికీ పంటల పొందికలో ఎంత మార్పులు వచ్చాయో అర్థమవుతుంది. అప్పటి సీజన్ లో వరి సాగు విస్తీర్ణం 23,82,072 ఎకరాలు మాత్రమే. మొక్క జొన్న విస్తీర్ణం 11,37,798 ఎకరాలు, జొన్న విస్తీర్ణం 84268 ఎకరాలు మాత్రమే. కంది విస్తీర్ణం 685039 ఎకరాలు, పెసర విస్తీర్ణం 178921 ఎకరాలు, మినుము విస్తీర్ణం 58,847 ఎకరాలు గా ఉండేవి. వీటి విస్తీర్ణం ఎంతగా పడిపోయాయో మనం చూడవచ్చు.

రాష్ట్రంలో తగ్గిపోతున్న కూరగాయల సాగు విస్తీర్ణం :

మరో వైపు రాష్ట్రానికి అవసరమైన కూరగాయల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా పడిపోతున్నది. మొత్తం ఉద్యాన శాఖ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచడానికి పరుగులు పెడుతున్నది. కనీసం 5 లక్షల ఎకరాలలో కూరగాయల సాగు విస్తీర్ణం జరగాల్సి ఉండగా, ఉద్యాన శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2022-2023 లో టమాటా, వంగ, పచ్చి మిరప, ఉల్లిగడ్డ,బెండ, లాంటి కూరగాయల విస్తీర్ణం సుమారు 85 ,000 ఎకరాలకు, సొర, బీర, కాకర, పొట్ల , దోస లాంటి తీగాజాతి కూరగాయల సాగు 11,000 ఎకరాలకు పడిపోయాయి. గత రెండు సంవత్సరాల కూరగాయల సాగు గణాంకాలు అందుబాటులో లేవు కానీ, గత రెండు సంవత్సరాలలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల కూరగాయల రైతులు తీవ్రంగా నష్ట పోయిన విషయం మనం వింటున్నాం.

పంటల పొందికను పరిశీలించడానికి, 2018- 2019 సీజన్ ను పరిగణనలోకి తీసుకోవడానికి రెండు కారణాలు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి, కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తునామనే ప్రభుత్వ ప్రచారం అప్పుడే మొదలైంది. అదే సమయంలో అంతకు ముందు సాధారణ కరువు పరిస్థితుల నుండీ రాష్ట్రం బయట పడి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. మరీ ముఖ్యంగా 2020 నుండీ ఇప్పటి వరకూ గత ఐదు సంవత్సరాలుగా భారీ వర్షాలతో ప్రతి సీజన్ లో రాష్ట్ర వ్యవసాయం అతలాకుతలమైపోతున్నది. సాధారణ వర్షపాతం దాటి చాలా జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నది.

ఈ కారణంగానే ప్రతి సంవత్సరం ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు లలో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఈ మొత్తం పరిస్థితిని కాళేశ్వరం ప్రాజెక్టు విజయంగా అప్పటి ప్రభుత్వం చెప్పుకున్నా , నిజానికి ఆ ప్రాజెక్ట్ల నుండీ పొలాలకు అందిన నీరు చాలా తక్కువ. సాగు నీటి పారుదల శాఖ నివేదికల ప్రకారమే ఈ విషయాలను అర్థం చేసుకోవచ్చు.

సరే, ఆ విషయం పక్కన పెడితే, రాష్ట్రం నుండీ భారత ఆహార సంస్థ (FCI) ధాన్యం సేకరణ కూడా పెంచుకుంటూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించిన అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణా నుండీ ధాన్యం సేకరణ ఈ విధంగా ఉంది: 2014-15 వానాకాలం (ఖరీఫ్) లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 13.7 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. కానీ 2017-18 లో తెలంగాణా నుండీ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో ధాన్యం సేకరణ 54 లక్షల మెట్రిక్ టన్నులు, 2018 -2019 లో 77.46 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20 లో 111.26 లక్షల మెట్రిక్ టన్నులు, 2020-21 లో 141.09 లక్షల మెట్రిక్ టన్నులు, 2021-2022 లో 119.05 లక్షల మెట్రిక్ టన్నులు, 2022-23 53.04 లక్షల టన్నులు సేకరించారు.2023, 2024 సీజన్ లలో కూడా రాష్ట్రం నుండీ వరి ధాన్యం భారీగానే సేకరించారు.

వరికి అవసరమైన సాగు నీరు అందుబాటులో ఉండడం, వరి సాగులో నాట్లు, కోతల కార్యకలాపాలకు అందుబాటులోకి వచ్చిన యాంత్రీకరణ, కలుపు తీత ఖర్చులను తగ్గిస్తూ అందుబాటులోకి వచ్చిన కలుపు విషాలు, రాష్ట్రం నుండీ భారీగా జరుగుతున్న గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ, ఇతర పంటలతో పోల్చినప్పుడు, రైతుకు వరి సాగులో ఆదాయం మెరుగ్గా ఉండడం, మిగిలిన పంటలలో సగటు దిగుబడులు తక్కువగా ఉండడం, ప్రభుత్వం నుండీ సేకరణ గ్యారంటీ లేకపోవడం, రైతుకు నికర ఆదాయం తక్కువగా ఉండడం లాంటి కారణాలు ఈ పంటల పొందికలో మార్పుకు ప్రధాన కారణాలుగా పని చేస్తున్నాయి.

కానీ తెలంగాణా రాష్ట్రంలో వరి సాగు చేయడానికి రైతులు స్వయంగా పెడుతున్న ఖర్చులతో పాటు, వరి సేద్యానికి అవసరమైన నీటిని రైతు పొలాలకు అందుబాటులోకి తేవడానికి ఎత్తిపోతల పథకాల నిర్మాణం, లేదా అందుకు భారీగా విద్యుత్ వినియోగించడం, బోరు బావుల నుండీ, బావుల నుండీ నీటిని పొలాలకు అందించడానికి ఉచిత విద్యుత్ సరఫరా , సబ్సిడీ ధరపై అందుతున్న రసాయన ఎరువులు, స్వంత భూమి ఉన్న రైతుకు సహాయంగా అందిస్తున్న ఎకరానికి ఐదువేల రూపాయల రైతు భరోసా, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో కేటాయిస్తున్న డబ్బులను కూడా సరైన పద్ధతిలో వరి సాగు ఉత్పత్తి ఖర్చులో లెక్కించాలి. అదే సమయంలో వరి రైతులకు రాష్ట్రం సన్న ధాన్యం సేకరణకు ఒక సీజన్ లో అందించిన క్వింటాలు కు 500 రూపాయల బోనస్ కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఈ బోనస్ ను దృష్టిలో ఉంచుకుని కూడా రాష్ట్ర రైతులు మరింతగా వరి వైపు మళ్ళారు. కానీ రెండవ సీజన్ నుండే రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వడం మానేసింది.

అదే సమయంలో వరి సాగు వల్ల పెరుగుతున్న పర్యావరణ సమస్యలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అత్యధిక స్థాయిలో పెరుగుతున్న యూరియా వినియోగం (రాష్ట్రంలో యూరియా కొరత కు పంటల పొందికలో వచ్చిన మార్పు కూడా ఒక కారణం) కలుపు, పురుగు విషాల వినియోగం, వరి సాగులో అత్యధిక స్థాయిలో నీటి వినియోగం నుండీ వెలువడే ఉద్గార వాయువులు, వీటన్నిటి వల్లా భూసారంలో,భూమి స్వభావంలో వస్తున్న మార్పులు కూడా సరైన పద్ధతిలో లెక్క వేస్తే, అప్పుడు రాష్ట్రంలో పెరుగుతున్న వరి సేద్యం సృష్టిస్తున్న విధ్వంసం కూడా మనకు అర్థమవుతుంది.

రాష్ట్రానికి రెండు సీజన్ లు కలిపి 30 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే, రాష్ట్రానికి బియ్యం సరిపోతాయి. దేశ ఆహార బద్రత అవసరాలకు మరో 25 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే దానిని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాలలో వరి సేద్యం అర్థం లేని పని. కేంద్ర ప్రభుత్వం సేకరించిన పూర్తి ధాన్యాన్నిపేదల కడుపు నింపడానికి ఉపయోగిస్తుంది అనుకుంటే వేరే మాట. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని కాలుష్య కారక ఇథనాల్ తయారీకి సబ్సిడీపై అందిస్తుంది.

ఎవరి భూములు, ఎవరి నీళ్ళు, ఎవరి విద్యుత్, ఎవరి నిధులు ఉపయోగించి, వరి సాగు చేసి, ఎవరికీ సబ్సిడీలు అందిస్తున్నారు ? ఎవరిపై కాలుష్యం వెదజల్లుతున్నారు అనేది చూస్తే, రాష్ట్రంలో పెరుగుతున్న వరి సేద్యం స్వభావం అర్థం చేసుకోవచ్చు.

వరి సేద్యం రైతులకు సులువు అనుకుంటాం కానీ, నిజంగా రైతు పెడుతున్న అన్ని ఖర్చులనూ ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చులుగా లెక్క వేయడం లేదు. ఇందులో రైతు భూమికి అసలు విలువ వేయడం లేదు. రైతు కుటుంబ సభ్యుల శ్రమకు తగిన విలువ వేయడం లేదు. రైతులు మౌలిక సదుపాయాలపై పెడుతున్న ఖర్చులను అసలు పరిగణనలో ఉంచుకోవడం లేదు. రైతుల నుండీ కేంద్ర సంస్థ సేకరించిన ఉత్పత్తి ఖర్చులు కూడా , రాష్ట్ర, సేకరించిన ఉత్పత్తి ఖర్చుల కంటే, రైతు పెడుతున్న వాస్తవ ఉత్పత్తి ఖర్చులకంటే అతి తక్కువగా ఉంటున్నాయి. కేంద్రం సేకరించిన ఉత్పత్తి ఖర్చుల ప్రకారమే, కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తారు అనేది గుర్తుంచుకోవాలి.

వీటన్నిటికీ నిజంగా విలువ ఇచ్చి, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తే, పర్యావరణ సమస్యలను పక్కన బెట్టినా, రైతు కుటుంబాలకు ఆదాయాలు పెరుగుతున్నాయి అని కనీసం సంతోష పడవచ్చు. అది కూడా జరగడం లేదు. స్వంత భూమి ఉన్న రైతులతో పోల్చినప్పుడు కౌలు రైతులు కౌలు రూపంలో మరింత ఎక్కువ పెట్టుబడి పెడుతున్నా , వారికి ప్రభుత్వాల ద్వారా అందే సహాయం మరింత తక్కువ.

వరి సేద్యం బాగా పెరగడం వల్ల , మన రాష్ట్రానికి అవసరమైన పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయలు ఇతర రాష్ట్రాల నుండీ, ఇతర దేశాల నుండీ దిగుమతి చేసుకుంటున్నాం. ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ ఉండడం, రవాణా ఖర్చులు ఎక్కువ ఉండడం వల్ల ధాన్యం ఎగుమతి అవకాశాలు కూడా తక్కువే. గత రెండేళ్లుగా వరి ధాన్యం ఎగుమతులలో వచ్చిన అనుభవాలు ప్రజల ముందు లేవు. ఏ ధరకు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అనే విషయాలు కూడా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచడం లేదు.

సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక అమలు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకూ అటు వైపు దృష్టి సారించలేదు. పైగా గ్రామాలలో గిడ్డంగులు లాంటి మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించక పోవడం వల్ల, రైతులు ఎన్ని పంటలు పండించినా, రాష్ట్రంలో వాటిని దాచుకునే సౌకర్యాలు లేవు, పండించిన పంటలను ఎండ బెట్టు కోలేక, వర్షాలకు తడిచి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుండా, ఇదే స్థితి కొనసాగితే, గ్రామాలలో వ్యవసాయ కుటుంబాలు ఆర్ధికంగా మరింతగా చితికి పోతాయి. గ్రామాలలో ఆత్మహత్యలు కొనసాగుతాయి.

Read More
Next Story