సోషల్ మీడియా సెగలో జర్నలిజం
x

సోషల్ మీడియా సెగలో జర్నలిజం

నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా...


-శృంగవరపు రచన


2017 లో నాగ చైతన్య, సమంత పెళ్ళి చేసుకుని, 2021 లో విడాకులు తీసుకున్నారు..

2022 లో మహాలక్ష్మి అనే సీరియల్ యాక్టర్ ఒక నిర్మాతను పెళ్ళి చేసుకున్నారు...

ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన అంబానీల వివాహ వేడుకలో ఐశ్వర్యరాయ్, అభిషేష్ బచ్చన్ కలిసి కనిపించలేదు...

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దీపావళి జరుపుకున్నారు...

ఇవి వార్తలా...కాదా?

మన చుట్టూ జరిగే సంఘటనల సమాహారమే వార్తలు అనే నిర్వచనం ఒకటి ఉంది. ఆ సంఘటనలకి ఒక ప్రామాణికత అవసరం లేదా?ఆ సంఘటనల ప్రభావం పాఠకులపై ఎలా ఉంటుందో అన్న దానిపై ఒక సహేతుక అంచనా వేయడానికి ఏ నియమాలు ఉండవా? అంటే.... ఏమో! కొంతవరకు ఆ ప్రామాణికతలకు కొత్త అర్థాలు కనుగొని, పాఠకుల పర్సనల్ ఎమోషనల్ స్పేస్ (Emotional Space) కి చొచ్చుకుపోయే అవకాశంతో కోట్ల మందిని ఆకట్టుకుంటున్నసరికొత్త... సారీ... పాత నిర్వచనాలను ట్రెండ్ తో పాటు మారుస్తున్న ఫెనమిననే 'డిజిటల్ జర్నలిజం/సోషల్ మీడియా /నెట్ జర్నలిజం.'

డిజిటల్ జర్నలిజం అంటే డిజిటల్ గా అందరికీ వార్తలు సులువుగా అందుబాటులో ఉండేలా కొంత ప్రింట్ మీడియా (Print Media) ఈ రూపంలో కూడా ఉండటం ఒక మామూలు నిర్వచనం. కానీ దీన్ని మించిన డిజిటల్ జర్నలిజం పరిధి మాత్రం మనం కూడా ఊహించలేని స్థాయిలో విస్తరించి, ఇంకా విస్తరిస్తూ ఉంది.

మీకు ప్రపంచ రాజకీయాలు ఇష్టమా? లేక ఈ రోజు మీరు చూసిన సినిమాలో హీరో లైఫ్ లోనో, సినిమాలోనో జరిగినవి తెలుసుకోవాలనుకుంటారా? సరే, పైకి రాజకీయాలు అన్నా... లోపల మాత్రం హీరో గురించే తెలుసుకోవాలన్న కూతుహలం ఉండదూ! సరిగ్గా ఇలాంటి కుతూహలమే ఇప్పటి సోషల్ మీడియా జర్నలిజానికి అసలైన పునాదిగా నేడు మారింది! అలాగే ఒకప్పుడు సినిమా పత్రికలకు మాత్రమే పరిమితమైన వార్తలు ఇప్పుడు మెయిన్ స్త్రీమ్ కి ఈ సోషల్ మీడియా జర్నలిజం వల్ల వచ్చాయి.

ఇంకా అర్థం అయ్యేలా చెప్పాలంటే, ప్రింట్ మీడియా నుండి డిజిటల్ మీడియా (Digital Media) కు జరిగిన పరిణామం కొంత సాంకేతిక ప్రగతిగానే భావించబడుతుంది. కాకపోతే ఈ ప్రగతి వల్ల సాధారణ పాఠకులు ఎలా ప్రభావితం అవుతున్నారు? వారి స్పందన స్థాయి ఎలా మారింది? ఈ విషయాలను కొంత లోతుగా గమనిస్తే, డిజిటల్ మీడియాలో ఉన్న హ్యూమన్ ఇంటరాక్షన్ ప్రింట్ మీడియాలో ఉండదు. ప్రఖ్యాత ప్రింట్ మీడియా సంస్థలు ఎన్నో డిజిటల్ మీడియా వైపు అడుగులు వేసినా, ఆ ట్రెండ్ ను మాత్రం పట్టుకోలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మార్పు కేవలం ఒక వెబ్సైట్ రూపంలో కనిపిస్తుంది తప్ప, స్పందించే అవకాశం తక్కువ. దీని వల్ల ప్రింట్ మీడియా సంస్థల మీద ఉన్న పూర్వపు అభిమానాలే తప్ప కొత్త పాఠక అభిమానాలు ఈ డిజిటైజ్ అయిన సంస్థల వైపు చూసే అవకాశం తక్కువ.

ఇకపోతే డిజిటల్ మీడియా ద్వారా వనరుల మార్గాన్ని పట్టుకున్న ఈ జన్ జెడ్ (Generation Z) దానికి అనుకూలంగా జర్నలిజం స్టాండర్డ్స్ ను మార్చుకున్నారనే చెప్పాలి. ఎక్కువ వ్యూస్, లైక్స్, షేర్స్, కామెంట్స్, ఫాలోవర్స్... ఇదే 'సోషల్ మీడియా ఎర్నింగ్ ఆల్గరిథం.' ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. సాధారణంగా ప్రింట్ మీడియా చదివే వాళ్ళు డిజిటల్ మీడియా పాఠకులు అయ్యే అవకాశాలు దాదాపు తక్కువే. ఈ సందర్భంలో కొత్త పాఠకుల, వీక్షకుల కేంద్రంగానే ఈ సోషల్ మీడియా జర్నలిజం పని చేస్తుంది. డిజిటల్ కోవలోకే ఇవన్నీ వచ్చినా, ప్రింట్ -డిజిటల్ ఈ రెండు వర్గాలకు భిన్న పాఠకులు ఉన్నారన్నది వాస్తవం.

అంటే సినిమాలు, సరదా గాసిప్స్ నుండి; వివాద స్పద వ్యాఖ్యలు, వివాహేతర సంబంధాలు; ఇలాంటివి పైకి చెప్పుకోకపోయినా అంతఃఆసక్తి కలిగించే అంశాలు. అందుకే కదా ఈ రోజు సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ -దివ్వెల మాధురి (Divvela Madhuri), విశాఖ నక్షత్ర, వీరు తెలిసినంతగా మన దేశ మంత్రుల పేర్లు, మొన్న నోబెల్ సాధించిన సాహితీవేత్త పేరు ఎక్కువ మందికి తెలియదు. ఈ ఎక్కువ మందికి తెలియడం వల్ల ట్రెండ్ లో ఉండటం అన్నది ఒక కోణం. ట్రెండ్ అంటే ఆ పేరు లేదా అంశం ఎక్కువ చోట్ల కనిపించడం. అసలు ఏం గొప్పగా సాధించకుండానే ట్రెండ్ అయ్యే కోణం ఉంటుందని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత బహుశా ఈ సోషల్ మీడియా జర్నలిజానికే దక్కుతుంది అనుకుంటా!

సాధారణ మనుషులు అతిగా స్పందిస్తూ, ఎక్కువ సేపు రకరకాల ఊహగానాలు చేసే అంశాలే ఇక్కడ ముఖ్యమైనవి. వీటి వల్ల ప్రయోజనం ఉందా?లేదా? అంటే ఎవరికి ప్రయోజనం? అనే ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. ఆ వార్తలు వేసేవారికి ఎక్కువ వ్యూస్ వస్తే అదే వారి ప్రయోజనం. ఇక చూసేవారి అభిరుచి అదే అయ్యి ఉంటే, అదే కొనసాగుతుంది. మొదట చదివి ఎంజాయ్ చేసే వారు తర్వాత కొంత కాలానికి క్రమంగా వాటి పై స్పందిస్తూ ఏదో ఒక వైపు ఉన్న వారిని సమర్థిస్తారు. దీనితో దీన్ని సమర్థించే,వ్యతిరేకించే వర్గాలు ఏర్పడతాయి. ఈ వర్గాలకు తగ్గ ఛానల్స్ వార్తలు మరలా వండబడతాయి. ఇది ఒక వలయం అంతే!

సరే, ఆరోగ్యం -సమాజం కేంద్రంగా కొందరు రాసి, వీడియోలు చేసినా, వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కాలం పడుతుంది. వ్యక్తుల వాల్యూ సిస్టం మాత్రమే కంటెంట్ ఎలా ఉండాలి అన్నదాన్ని స్పష్టం చేస్తుంది.

ఇక ఆస్తిత్వ రాజకీయాలు ఓ వైపు...

వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు ఇంకో వైపు..

ట్రోలర్స్ మరో వైపు..

వీటికి మించి నిజమేదో, అబద్ధమేదో తెలియని అయోమయం నింపే కొత్త లోకం....

ఇవన్నీ ఈ సోషల్ మీడియా జర్నలిజానికి ఉన్న వికృత ఛాయలు.

అవును, సులువుగా ప్రతి పని జరగాలి...

స్మార్ట్ గా ఉండాలి...

ఇతరుల కన్నా భిన్నంగా ఉండాలి..

సోషల్ మీడియాలో టాప్ లో ఉండాలి..

ఇలాంటి కోరికలు ఇప్పటి తరానికి సహజమైనవే. మన చుట్టూ ఉన్న విషయాలు అంటే మన దేశం,రాజకీయాలు, ఆర్ధిక స్థితి గతులు అని కూడా అని ఈ సోషల్ మీడియా వైరల్ వరల్డ్ లో చాలా మందికి అనిపించకపోవడం శోచనీయం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన ఎమోషన్స్ తోనే చూస్తూ, జడ్జ్ మెంట్స్ ఇస్తూ, వాటిని స్పష్టం చేస్తూ, సాగేలా చేయడానికి ఈ సోషల్ మీడియా ఆస్కారం ఇస్తుంది. ఈ జర్నలిజం లో జర్నలిస్ట్ అనిపించుకోవడానికి ఏ సంస్థ, వ్యక్తుల ఆమోదం అవసరం లేదు. ఒక సొంత ఛానల్, ట్రెండ్ అయ్యే పేజ్, ప్రొఫైల్ ఏదైనా ఓకే.

మొత్తానికి మంచి-చెడు, నైతిక-అనైతిక కోణాల్లో దీని గురించి చెప్పాలంటే పెద్ద చర్చే అవుతుంది. కానీ వ్యక్తిగత ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఎక్కువ ఉండే ఈ జర్నలిజంలో పాఠకులకు, వీక్షకులను ఓ భావజాలానికో, సిద్ధాంతానికో, వ్యక్తిగత సమర్థిoపు కోసమో కాకుండా కొంత సమన్వయంతో స్పందించే దృక్పథాన్ని కలిగేలా చేయగలిగితే ఈ సోషల్ మీడియా /డిజిటల్ జర్నలిజం ట్రాక్ లో ఉన్నట్టే!

Read More
Next Story