తీన్మార్ మల్లన్న ప్లస్ లూ, మైనస్ లూ...!
x

తీన్మార్ మల్లన్న ప్లస్ లూ, మైనస్ లూ...!

అనుమానం లేదు, ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా బిడ్డ అయిన నవీన్ ది కచ్చితంగా ఒక సక్సెస్ స్టోరీనే.


తెలుగు జర్నలిజంలో లక్షల సంఖ్యలో జర్నలిస్టులు ఉంటారు గానీ తనదైన ముద్ర వేసుకునేవారు చాలా తక్కువ. వీ 6 ఛానెల్ లో ఎడిటర్ అంకం రవి గారు ప్రాణంపోసిన ఒక వినూత్న పాత్ర (తీన్మార్ మల్లన్న) ద్వారా తెలంగాణ ప్రజల మనసులు దోచుకుని, తన యూట్యూబ్ ఛానెల్ తో కేసీఆర్ ప్రభుత్వానికి గోరి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో అగ్రగణ్యుడు చింతపండు నవీన్ కుమార్ అనే తీన్మార్ మల్లన్న.

ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లా బిడ్డ అయిన నవీన్ ది కచ్చితంగా ఒక సక్సెస్ స్టోరీనే.

బీఆర్ఎస్ హవా తీవ్ర స్థాయిలో నడుస్తున్నప్పుడు, తెలంగాణ జాతిపిత మాట పెట్రోలై మండుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా లేచిన మొట్టమొదటి గళం నవీన్ ది. గులాబీ పార్టీ కి జనం కట్టిన సమాధికి మొదటి పది ఇటుకలు, ఫస్ట్ సిమెంట్ బస్తా ఈ యువకుడు సమకూర్చినవే. ఆయన్ను జాగ్రత్తగా డీల్ చేయకపోతే ప్రభుత్వానికి ఎసరు తప్పదని నేను అప్పట్లోనే చెప్పా గానీ పవర్ కిక్కు ఎక్కి ఉన్న రాజు, యువరాజు చెవికది ఎక్కలేదనేది వేరే విషయం. కేసుల మీద కేసులు బనాయించి, బాగా ఇబ్బంది పెట్టి అప్పటి పాలకులు చేజేతులా నవీన్ ను పెద్ద హీరో చేశారు. జనంనాడి తెలిసిన నవీన్ చట్ట సభల్లో ప్రవేశం కోసం ఒక దశాబ్దంగా చేసిన ప్రయత్నాలు నిజానికి ఆయన స్థాయికి మించినవి.
ఎం ఎల్ సీ ఎన్నికల్లో (2015, 2021, 2024), హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో (2019) నవీన్ కు లభించిన ప్రజాదరణ మామూలుది కాదు. మీడియా సాధనంగా ప్రజాబలం పొంది పెద్దల సభకు వెళ్లిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తర్వాత నవీన్ నన్ను అబ్బురపరిచిన జర్నలిస్టు.
బీ ఆర్ ఎస్ పెట్టిన కేసుల వల్ల అనూహ్య పరిస్థితిలో 2021 లో బీజేపీ లో చేరి, తరవాత 2023లో కాంగ్రెస్ లో చేరి ఎం ఎల్ సి అయిన నవీన్ ధైర్యం, పోరాట పటిమ గొప్పవి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన కుల గణన నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా బీసీ నినాదంతో దూసుకుపోతున్నారు.
బీసీ లకు రాజ్యాధికారం అన్న నినాదంతో నవీన్ ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) స్థాపించి వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వందకు పైగా కులాలు ఉన్న బీసీ ల ఐక్యతకు జరిగిన పెద్ద ప్రయత్నంగా దీన్ని చెప్పవచ్చు.
ధైర్యం, వ్యూహం తీన్మార్ మల్లన్న పెద్ద బలాలు. ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ ప్రజాబలం పొందే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. Q News వల్ల పెద్ద నెట్ వర్క్ ఉంది. లక్షల మందిని చేరే సాధనమైన ఆ ఛానెల్ ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. రెచ్చగొట్టే ప్రసంగాలు మెచ్చే ఒక సెక్షన్ ను మెప్పించే కమ్యునికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి.
బీసీ లు అంతా ఆయన్ను నాయకుడిగా ఆమోదిస్తారా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేని విషయం అయినా...నోటికి ఏది వస్తే అది లూజుగా ఆయన మాట్లాడడం నేను చాలాసార్లు గమనించాను. ఒక పద్ధతి, పాడూ లేకుండా జర్నలిస్టు మాట్లాడితే నడుస్తుంది కానీ ఒక గురుతర బాధ్యత ఉన్న నాయకుడికి అది తగదు. పదాల వాడకంలో పొందిక ఉండాలి.
అసలే జర్నలిస్టు అంటేనే జనాలకు మంట, అపనమ్మకం ఉన్నాయి. బ్లాక్ మెయిల్ జర్నలిజం చేసి ఆయన బాగా పోగేశాడన్న మాటను ప్రచారం చేసే సెక్షన్ ఇప్పటికే ఉంది. ఇలాంటి వాటిని విద్యావంతులు, మేధావుల సహకారంతో కొట్టివేస్తూ ప్రజల్లోకి మంచి పేరు తీసుకుపోయే ఒక వ్యూహాత్మక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. అహం బ్రహ్మస్మి... అనే ధోరణి ఆయన సభల్లో ఇప్పటికైనా ఉండకుండా జాగ్రత్త పడాలి. "వీడు మనల్నెక్కడ బతకనిస్తాడు?" అన్న సందేహం ఇతర నేతల్లో పడకుండా చూసుకోవాలి. కుట్రలు, కుహకాలు చేసే నేతలు చుట్టూ పొంచి ఉంటారని తెలియనంత అమాయకుడు ఆయన కాదు.
"బీసీ బ్లూ ప్రింట్" అన్నది లేకుండా, ప్రాబల్య బీసీ కులాలను కన్విన్స్ చేయకుండా వారికి ఒకే తాటి మీదకి తేవడం కష్టం. పవర్ షేరింగ్ మీద బైటకి కాకపోయినా... అంతర్గతంగా సీనియర్ నాయకులు, బీసీ విద్యావంతులతో ఒక అవగాహన కుదుర్చుకోవాలి. ఒక్క బీసీ నినాదంతోనే అధికారంలోకి వస్తామని అనుకోవడం అమాయకత్వం. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలపై మల్లన్న డెప్త్ తో మాట్లాడాలి.
ఎన్నికల వ్యయాలు బాగా పెరిగిన ఈ రోజుల్లో వనరుల సమీకరణ TRP కి పెద్ద సవాలు. ఈ విషయంలో మీడియా ముఖంగా అనుభవం ఉన్న మల్లన్న ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
ఇప్పటి నుంచి కష్టపడితే... మల్లన్న పార్టీ కి మంచి అవకాశం కచ్చితంగా ఉంది. ఆయన కొత్త పార్టీ కాంగ్రెస్ ను ప్రత్యక్షంగా దెబ్బతీసే అవకాశం ఉంది. నీరసంగా ఉన్న బీ ఆర్ ఎస్ లో ఒక సెక్షన్ ను ఆయన ప్రభావితం చేయగలరు. ఓసీ లీడర్లు, బీసీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్న బీజేపీకి TRP చేసే నష్టం ఇప్పుడే చెప్పలేం. ఈ కార్యకర్తలు అంత తేలిగ్గా కాషాయం వీడి రారు. ఈ నేపథ్యంలో మల్లన్న, ఆయన చుట్టూ ఉన్న నేతల వ్యక్తిత్వ హననం కోసం ప్రయత్నాలు ఇప్పుడు ఊపు అందుకుంటాయి. వాటిని తెలివిగా తిప్పి కొట్టాలి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రంజుగా ఉండబోతున్నాయి. ఒక 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాల మీద ఫోకస్ చేసి TRP ప్రభావం చూపగలిగితే... బీసీ రాజ్యాధికారం దిశగా మొదటి అడుగు పడుతుంది.
నేను గమనించిన ప్రకారం....TRP ప్రకటన నాడు పార్టీ జెండాలు ఉన్న ప్యాక్ ను వేదిక మీద ఓపెన్ చేయాల్సి వచ్చింది. అక్కడ కత్తెర వంటి ఏర్పాటు లేక... ఆ ప్యాక్ ను చించడానికి ఇబ్బంది పడ్డారు. చివరకి అతిథి గారు బలప్రయోగం చేసి దాన్ని చించారు. ఆ ధాటికి అందులో ఉన్న జెండాలు కింద పడి పోయాయి. కిందపడిన జెండాలని తీసుకుని ఆహూతులకు, మీడియాకి ప్రదర్శించారు.
బ్రదర్...మల్లన్న గారూ, సంసిద్ధత అంటే... చిన్న చిన్న ఏర్పాట్లను కూడా పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలి. దళితుల ఆశలను నీరుగార్చిన ప్రవీణ్ కుమార్ గారి లాగా కాకుండా, వచ్చే ఎన్నికలు మాత్రమే లక్ష్యం కాకుండా, దీర్ఘ కాల ప్రణాళికతో ముందుకు వెళ్తే...మేలు జరిగే అవకాశం ఉంది.
ఆల్ ద బెస్ట్.


Read More
Next Story