12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు, తెలంగాణలో పర్యావరణ సంక్షోభం
x
Pic: Countgercurrents

12 లక్షల చెట్లు కొట్టేస్తున్నారు, తెలంగాణలో పర్యావరణ సంక్షోభం

విఎల్ ఎఫ్ రాడార్ స్టేషన్ కోసం అనంతగిరి అడవుల్లో చెట్లు నరకడానికి వ్యతిరేకంగా రాజుకుంటున్న ఉద్యమం నెగ్గేనా?


తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు. సముద్ర తీర ప్రాంతం లేదు. నౌకాశ్రయాలు లేవు, నౌకలూ లేవు. కానీ భారత నేవీ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ రాష్ట్రం పర్యావరణ పరంగా భారీ మూల్యం చెల్లించనుంది.

“అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ( Very Low Frequency : VLF) రాడార్ స్టేషన్” ఏర్పాటు కోసం, అనంతగిరి కొండల్లోని సహజమైన అటవీ భూములను భారత నౌకాదళానికి అప్పగించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 28న రాడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటారని మీడియా కథనాలు వచ్చాయి. కారణమేమితో తెలియదు కానీ, ఆ కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా పడింది.

దామగండం అటవీ పరిరక్షన నిరసన (ఫోటో #SaveDamagundam X)

స్థానిక ప్రజలు 'దామగుండం అటవీ సంరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ'గా సంఘటితమయి, ఈ ప్రాజెక్టు కు వ్యతిరేకంగా దశాబ్ద కాలంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. పర్యావరణ కార్యకర్తలు కూడా ఈ ప్రాజెక్ట్ కు అనుమతినిచ్చి అమలు చేస్తే కలిగే ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దట్టమైన దామగుండం అడవుల్లో జీవవైవిధ్యం అధికంగా ఉంది. ఇక్కడ అటవీప్రాంతంలో వందలాది అరుదైన చెట్ల రకాలు, ముఖ్యంగా ఔషధ మొక్కలు, అలాగే విలువైన వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి.

ఈ నేపధ్యంలో తాజాగా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంపై, ప్రజలపై దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలను చూపుతుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వర్షపు నీటికి, ఈ ప్రాంతం ఒక క్యాచ్‌మెంట్ జోన్‌గా కూడా పనిచేస్తుంది. ఈ అరణ్యాన్ని ధ్వంసం చేస్తే హైదరాబాద్ నగరంలో వరదలు మరింత తరచుగా రావచ్చు. దీనికితోడు ఈ అటవీ ప్రాంతంలోని చెట్లు వాతావరణంలోని మీథేన్ వాయువులను , కార్బన్ డయాక్సైడ్ ను కూడా గ్రహిస్తున్నాయి. దీన్ని విధ్వంసం చేస్తే, భారీ స్థాయిలో ఆక్సిజన్ కొరతను కూడా ప్రజలు ఎదుర్కుంటారు. ఇంత విలువైన ప్రకృతి వనరులను మానవ సమాజం తిరిగి పొందడం అసంభవం. పైగా, ఈ అటవీ ప్రాంతం సమీపంలోని నగరాల ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తూ, సరైన సమయంలో వర్షాలను కూడా అందిస్తోంది.

విశాఖ పట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) ప్రతిపాదించిన VLF రాడార్ స్టేషన్ తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి నౌకలు మరియు జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడానికి ఉద్దేశించబడింది.



ఈ ప్రాజెక్టు అంచనాల ప్రకారం, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో, ప్రాజెక్ట్ కోసం అనేక రకాలకు చెందిన మొత్తం 12 లక్షల చెట్లను నరికివేయవలసి ఉంటుంది. ప్రతిపాదిత ప్రాజెక్ట్ 2,900 ఎకరాల అటవీ భూమిలో ఉండగా, ఇందులో యాంటెన్నా పార్క్ కోసం 1400 ఎకరాలు, ఇతర సాంకేతిక అవసరాల కోసం 1090 ఎకరాలు, అధికారిక, నివాస సముదాయాల కోసం 310 ఎకరాలు, రేడియేషన్ ప్రమాదం నుండీ బయటపడటానికి, 100 ఎకరాల 'సేఫ్ జోన్' ఉన్నాయి.

స్థానిక ప్రజలు, శాస్త్రవేత్తలు మరియు పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనల పట్ల అధికారుల స్పందన అత్యంత నిర్లక్ష్య పూరితంగా ఉంది. ఈ అడవిలో నరికివేయబడే చెట్ల సంఖ్యకు ‘సమాన సంఖ్యలో తాజాగా మొక్కలు నాటబడతాయని’ చెప్పడం స్థానిక ప్రజలు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు లేవనెత్తిన విషయాల పట్ల వారికి ఏ మాత్రం అవగాహన లేదని తెలియచేస్తోంది. మానవ నిర్మిత అడవులతో, ‘నష్ట పరిహార అటవీ అభివృద్ధి’ ఆధారంగా పాత పర్యావరణ వ్యవస్థను తిరిగి సృష్టించడం అసాధ్యమని గత అనుభవాలు నిరూపించాయి.

ఈ ప్రాజెక్టు వల్ల. ఈ అడవికి చుట్టు పక్కల 20 గ్రామాల్లో నివసించే 60 వేల మంది ప్రజలు క్రమేణా ప్రభావితులవుతారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న చిన్న రైతులు, పశువుల కాపురుల జీవనోపాధి దెబ్బతింటుంది. వికారాబాద్ లో పుట్టిన మూసీ నదితో పాటు, కాగ్నా నది కూడా ప్రభావితమవుతాయి. అడవిని నరికివేయడం వల్ల, నేల కోతకు గురై, మొత్తం నదీ పరీవాహక ప్రాంతంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


దామగుండం ( Advocate Spandana Reddy X)


ఈ ప్రాజెక్ట్ నుండి విడుదలయ్యే రేడియేషన్ తో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున పుప్పొడి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల అది మనుషుల ఆరోగ్యాలపై తప్పకుండా ప్రభావం చూపుతుంది, ప్రత్యేకించి హైదరాబాద్ లో నివసించే వారికి కూడా శ్వాస కోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతం 500 సంవత్సరాల పురాతనమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంతో కూడా ప్రసిద్ది చెందింది. ఇది ముఖ్యమైన చారిత్రక, మత ప్రదేశం.

ప్రజలు వ్యక్తం చేసిన ఇటువంటి అనేక ఆందోళనల కారణంగా, తెలంగాణ హైకోర్టు ఈ ప్రాజెక్టుపై మొదట 4 సంవత్సరాల పాటు స్టే ఆర్డర్ జారీ చేసింది, అయితే దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ప్రారంభంలో స్టే ఎత్తేసింది. 2020లో దాఖలైన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందనగా, తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (PCCF) హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో మొత్తం 12,12,753 చెట్లు, గత ఐదేళ్లలో నరికివేయడానికి అనుమతించబడ్డాయని అంగీకరించారు. గత ఐదేళ్లలో ఇది అత్యంత ఎక్కువ స్థాయిలో జరుగుతున్న విధ్వంసం. మన విలువైన అడవులను నాశనం చేసే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించ కూడదు.

లోపభూయిష్టమైన ఇలాంటి ‘అభివృద్ది’ నమూనాల కారణంగా, ప్రపంచం మొత్తం తీవ్రమైన వాతావరణ సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా అసురక్షితమైన టాప్ 5 దేశాలలో ఒకటిగా ప్రకటించబడిన భారతదేశం కూడా ఈ పరిస్థితికి మినహాయింపు గా ఉండదు. ఇప్పటికే పర్యావరణ ప్రభావాలు, ముఖ్యంగా పేద మరియు కార్మిక వర్గాల ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల పరిస్థితులను చూపడం సాధారణమైపోయింది. ఫ్లాష్ వరదలు, వేడి తరంగాలు, పెరుగుతున్న కాలుష్యం, పంటల నష్టాలు మరియు ఇతర ప్రభావాలు సాధారణంగా మారాయి.


#SaveDamagundam నిరసన ( Source: X)


ప్రపంచవ్యాప్తంగా రష్యా మాత్రమే VLF ప్రాజెక్టును నిర్వహిస్తున్న దేశం గా ఉంది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు సైతం పర్యావరణ మరియు ఆరోగ్య ప్రభావాల కారణంగా ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను తమ దేశాలలో విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అనంతగిరి కొండల మధ్య దామగుండం అరణ్యంలో నావీ రాడార్ ప్రాజెక్టును అనుమతించడానికి చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకుని, ఉపసంహరించుకోవాలి. ఈ విషయాన్ని భారత నౌకాదళానికి మరియు భారత ప్రభుత్వానికి తక్షణమే తెలియ జేయాలి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. తెలంగాణలోని ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల ప్రజలకు భద్రమైన వాతావరణం అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది.

నిజానికి , అతి తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ఈ రాడార్ స్టేషన్ లకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటితో అడవుల విధ్వంసాన్ని ఆపవచ్చు. అమెరికా, యూరప్ దీశాలలో అటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

బ్రిటన్ లో RAF ఫ్లయింగ్ డేల్స్ రాడార్ స్టేషన్, అమెరికా లోని కెవలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ , ఆస్ట్రేలియా రక్షణ బలగాల రాడార్ నెట్ వర్క్ అలాంటి వాటిలో కొన్ని. ఇవన్నీ తక్కువ పర్యావరణ ప్రభావంతో పని చేస్తాయి. ఇటువంటి రాడార్ స్టేషన్ ఏర్పాటుకు భూమి కూడా తక్కువ అవసరం.

కొంత ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. కానీ,ప్రజల ఆరోగ్యాలకంటే, పర్యావరణం కంటే డబ్బులు ఎక్కువ కావు.


Read More
Next Story