నేడు గాజా ఊచకోత 150వ రోజు... రోజుకు మృతులెందరో తెలుసా?
x

నేడు గాజా ఊచకోత 150వ రోజు... రోజుకు మృతులెందరో తెలుసా?

ఇరాక్ యుద్ధంలో రోజుకి 51 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో 24, ఎమెన్ లో 16, సిరియాలో 97, సూడాన్ లో 52, ఉక్రెయిన్ లో 44 మృతులని 'ఆక్స్ ఫామ్' విశ్లేషించింది.మరి గాజాలో...



ఇఫ్టూ ప్రసాద్ (పిపి)


గాజాపై ఇజ్రాయెల్ యుద్దానికి నేటికీ 150 రోజులు! అంటే సరిగ్గా ఐదు నెలల నిండింది.

నాలుగు నెలలు (120 రోజులు) నిండిన సందర్భంగా 3-2-2024న ఓ రైటప్ రాశాను.

మరో నెల గడిచింది. నేటికి 150వ రోజుకు చేరింది. నేను ఆరోజు రాసిన వ్యాస సారం ఈ రైటప్ కి కూడా వర్తిస్తుంది. ఇది పాఠక మిత్రులకు విజ్ఞప్తి.
గత రైటప్ నాటికి గాజా మృతుల సంఖ్య రౌండ్ ఫిగర్ 27,000 గా పేర్కొన్నా. ఆ తర్వాత మరో మూడున్నర వేల మంది పెరిగారు. ఆ వివరాల్ని పేర్కొంటున్నా.
7-10-2023 న ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనది. ఆ యుద్ధంలో మృతుల సంఖ్యని ప్రతి పది రోజులకోసారి చొప్పున లెక్కల్ని ఇద్దాం.
మొదటి రోజు నుండి 10వ రోజు వరకు మృతుల సంఖ్య 2778. రోజుకు సగటున మృతుల సంఖ్య 279 మంది.
11 నుండి 20వ రోజు వరకు 4250 మంది. రోజుకు 425 మంది. 20వ రోజుకు మొత్తం మృతులు 7028 మంది.
21 నుండి 30వ రోజు వరకు 2742 మంది. రోజుకు 274 మంది. 30వ రోజుకు, అంటే మొదటి నెలలో మృతుల సంఖ్య మొత్తం 9770 మంది.
31 నుండి 40వ రోజు వరకు 1730 మంది. సగటున రోజుకి 173 మంది. 40వ రోజుకు మొత్తం మృతుల సంఖ్య 11,500 మంది.
41 నుండి 50వ రోజు వరకు మృతుల సంఖ్య 3354 మంది. రోజుకు 335 మంది. 50వ రోజుకు మృతుల సంఖ్య మొత్తం 14,854 మంది.
51వ రోజు నుండి 60వ రోజు వరకు 1306 మంది మృతి చెందారు. రోజుకి 130 మంది. 60వ రోజుకి, అంటే రెండవ నెల నిండేసరికి మృతుల సంఖ్య 16,160 మంది.
61 నుండి 70వ రోజుకు మృతుల సంఖ్య 1710 మంది. రోజుకు 171 మంది. 70వ రోజుకు మృతుల సంఖ్య మొత్తం 18,870 మంది.
71 నుండి 80వ రోజు వరకు 1804 మంది. రోజుకు 180 మంది. 80వ రోజుకు మొత్తం మృతులు 20,674 మంది.
81 నుండి 90వ రోజు వరకు మృతుల సంఖ్య 1,754 మంది. రోజుకు సగటున 175 మంది. 90వ రోజుకు, అంటే మూడవ నెల నెండేసరికి మొత్తం మృతుల సంఖ్య 22,428 మంది.
91 నుండి 100వ రోజు వరకు మృతుల సంఖ్య 1540 మంది. రోజుకు సగటున 154 మంది. నూరవ రోజుకు మృతుల సంఖ్య 23,968 మందికి చేరడం గమనార్హం!
నూరవ రోజు నుండి 110వ రోజు వరకు మృతుల సంఖ్య 1,732 మంది. రోజుకు సగటు మృతుల సంఖ్య 173 మంది. 110వ రోజుకు మృతులు మొత్తం 25,700 మంది.
111వ రోజు నుండి 120వ రోజు వరకు మృతుల సంఖ్య 1538 మంది. రోజుకు సగటు మృతుల సంఖ్య 153 మంది. 120వ రోజుకు, అంటే నాల్గవ నెల నిండేసరికి మృతుల సంఖ్య 27,238 మంది.
121వ రోజు నుండి 130వ రోజు వరకు మృతుల సంఖ్య 1235 మంది. రోజుకు సగటు మృతుల సంఖ్య 123 మంది. 130వ రోజు వరకు మృతుల సంఖ్య 28,473 మంది.
131వ రోజు నుండి 140వ రోజు వరకు మృతుల సంఖ్య 1041 మంది. రోజుకు సగటు మృతులు 104 మంది. 140వ రోజుకు మొత్తం మృతుల సంఖ్య 29,514 మంది.
ఈరోజు 150వ రోజు. ఈరోజు మృతుల సంఖ్య ఈరోజే వెల్లడి కాదు. ఐతే ఫిబ్రవరి చివరి తేదీ 29 తేదీకి 30,000 సంఖ్య దాటింది.
గాజా జనాభాలో మృతుల శాతం 1.4 కి, క్షతగాత్రుల శాతం మూడున్నరకి చేరింది. ఈ రెండు కోవల సంఖ్య జనాభాలో దాదాపు ఐదు శాతానికి చేరనుంది.
మొత్తం గాజా మృతుల్లో పిల్లలు, స్ట్రీలే మూడింట రెండు వంతుల మంది. ఇది ప్రపంచ యుద్ధాల నుండి ప్రాంతీయ యుద్ధాల వరకూ గడిచిన యుద్ధాల చరిత్రలో మున్నెన్నడూ లేనిది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ యుద్దాల్లో మరణాల శాతాల్ని ఆక్స్ ఫామ్ అధ్యయనం చేసి 10-1-2023న ఓ నివేదిక విడుదల చేసింది. వివిధ యుద్ధాల్లో రోజుకు సగటు మృతుల శాతం (AVERAGE DAILY DEATH RATE) తో గాజా మృతుల శాతాన్ని పోల్చి విశ్లేషణ చేసింది. అది విశ్లేషించే నాటికి గాజాలో సగటున రోజుకు మృతుల సంఖ్య 250 మందిగా వుంది. కానీ ఇరాక్ యుద్ధంలో రోజుకి 51 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో 24 మంది, ఎమెన్ లో 16 మంది, సిరియాలో 97 మంది, సూడాన్ లో 52 మంది, ఉక్రెయిన్ లో 44 మందిగా 'ఆక్స్ ఫామ్' విశ్లేషించింది.

యుద్దానికి ఇజ్రాయెల్ సర్కారు చెప్పిన రెండు లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నేటికీ నెరవేరలేదు. 30 నుండి 35 వేల మంది హమాస్ గెరిల్లాల్లో ఒక్క శాతం మంది కూడా నేటికీ ఇజ్రాయెల్ సైన్యానికి చిక్కడం లేదా హతం కాలేదు. తమ బందీల్ని హమాస్ చెర నుండి విడిపించ లేదు. యుద్ధ గమనం కంటే ఫలితాలే అతి ముఖ్యమైనవి.

యుద్ధంతో ఇజ్రాయెల్ సహా అమెరికా, యూరోప్ దేశాల ఆర్ధిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎర్ర సముద్ర పరిణామం మరింత తీవ్రంగా దెబ్బతీసింది. వెస్ట్ ఆసియాలో అమెరికా సైనిక స్థావరాలపై మున్నెన్నడూ లేని సైనిక దాడులు జరుగుతున్నాయి. అక్కడ తిరుగుబాటు సంస్థలు అమెరికా సైనిక ఉనికినే సవాల్ చేస్తున్నాయి.


ఇజ్రాయెల్ లో యుద్ధ సంక్షోభ ఫలితాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలను ఇద్దాం.

ఇజ్రాయెల్ లో ఇళ్ల నిర్మాణ కూలీలు, పెయింటర్లు, రాడ్ బెండర్లు, ప్లంబర్లు, రోడ్ల స్వీపర్లు, హోటల్ వర్కర్లు, ఇంటి పనివారు పాలస్తీనాకు చెందిన శ్రామికులే! రోజుకు యాబై వేల మంది పాలస్తీనా శ్రామికులు ఇజ్రాయెల్ లోకి సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేసి అనుమతిస్తారు. వీరిలో మెజార్టీ గాజా నుండి వెళ్లారు. కొద్దిశాతం మంది వెస్ట్ బ్యాంక్ నుండి 'గ్రీన్ లైన్' దాటి వెళ్లారు. ఈ యుద్ధం తర్వాత వారిని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిషేధించింది. తమ ఇళ్ల నిర్మాణాల పనుల నుండి ఇంటిపనివారి వరకూ, తుదకు రోడ్లు ఊడ్చే వర్కర్ల వరకూ కొరత ఏర్పడింది. ఇజ్రాయెల్ పౌర సమాజం తమ సర్కారు పై వత్తిళ్ళు తెస్తోంది. మోడీ వంటి బ్రోకర్ సర్కార్ల అండతో కొన్ని విదేశాల నుండి వర్కర్లని ఇజ్రాయెల్ దిగుమతి చేస్తోంది. ఐతే సమస్య తీరుతుందా?

గాజా నుండి రోజూ పొద్దున వచ్చి తమ ఇళ్లల్లో లేదా ఇంటి నిర్మాణాల పనిచేసి తిరిగి సాయంత్రం గాజాకి వెళ్లిపోయే డైలీ వర్కర్లకి రోజుకు సగటున తలకు చెల్లించే కూలి తక్కువే. భారత్ వంటి విదేశాల నుండి వర్క్స్ కాంట్రాక్టు పై ఇజ్రాయెల్ చేరే వలస కూలీలకి దానికంటే నాలుగైదు రెట్ల కూలి ఇవ్వాలి. ఆ అదనపు ఖర్చు ఇజ్రాయెల్ ప్రభుత్వం భరించదు. గృహ నిర్మాణం, ఇంటి పనివారిని నియమించుకునే ఇజ్రాయెల్ పౌరులే భరించాలి. గతంలో గాజా కూలీల కోసం రోజుకు తలకు రెండు లేదా మూడు డాలర్ల కూలిని చెల్లించిన ఒక ఇంటి యజమాని పది డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. అసలే ఇజ్రాయెల్ దేశ ఆర్ధిక వ్యవస్థని సంక్షోభస్థితికి దిగజారిస్తే, అది రాజకీయ సంక్షోభంగా కూడా దిగజార్చుటకు దారి తీస్తుంది.

3-2-2024 నాటి వ్యాసంలో సొరంగాల విశిష్టత పేర్కొన్నా. రోజుకు 40 వేల 'ఆహార దినాలు' (FOOD DAYS) చొప్పున నాలుగు నెలలకు 50 లక్షల ఆహారదినాలు గడిచినా సొరంగ వ్యవస్థ సజీవంగా కొనసాగుతోందని నాటి రైటప్ లో ఉదహరించా. మరో నెల గడిచింది. హమాస్ గెరిల్లాలకి, సహాయకులకు కలిపి రోజుకు 40,000 చొప్పున 60 లక్షల 'ఆహార దినాలు' నిర్వహణ (MAINTAINANCE) అనేది అసాధారణమైనది.

మధ్యధరా సముద్ర నీటిని వారం రోజులు పంపింగ్ చేసి భూగర్భ సొరంగ వ్యవస్థను నింపినా, ఐదు నెలలు 40 వేల మంది నేల ఉపరితలం పైకి రాకుండా తల దాచుకోవడం ఎలా సాధ్యమైనది? ఇది వర్తమాన రాజకీయ భూగోళ వింతల్లోకెల్లా మహా వింత!

గత 150 రోజుల్లో గాజాపై ప్రయోగించిన బాంబులన్నింటి విస్పోటన సామర్ధ్యాన్ని కలిపి లెక్కిస్తే హీరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనం కన్న కూడా ఎక్కువే! ఐనా నేటికీ గాజా జీవిస్తూ ఎలా నిలబడుతోంది?

కనీసం ఇంటికొక మృతుడు లేదా వికలాంగుల చొప్పున ఛిద్రమైన గాజా పౌర సమాజం ఎలా బ్రతికి బట్టకడుతోంది?

సూర్యరశ్మిని చూడకుండా, భూ ఉపరితలంతో సంబంధం లేకుండా ఐదు నెలలుగా 30 నుండి 40 వేలమంది హమాస్ గెరిల్లాలు ప్రతిఘటనను నేటికీ ఎలా కొనసాగిస్తున్నారు?

ప్రపంచ వ్యాప్తంగా విప్లవాలు, తిరుగుబాట్లు ప్రధానంగా అజ్ఞాత పంథాలో సాగినవే. అదే 'అండర్ గ్రౌండ్' పోరాట రూపాలే! అవీవీ భౌగోళికంగా 'అండర్ గ్రౌండ్' (భూగర్భ) లో జరగవు. అవి భౌగోళికంగా భూఉపరితలం (ఓవర్ గ్రౌండ్) మీద జరిగేవే. ఎందుకంటే అడవులు, కొండలు, లోయల్ని మరుగు స్థలాల్ని చేసుకొని గెరిల్లా ప్రతిఘటన సాగించేవే! ఆ అడవులు, కొండలు కూడా భూ గర్భంలో లేవు. అవి భూ ఉపరితలం పై ఉన్నవే. వాటిని రాజకీయంగా అండర్ గ్రౌండ్ గా, భౌగోళికంగా ఓవర్ గ్రౌండ్ గా భావించాల్సి వుంది. కానీ ప్రపంచ చరిత్రలో మొదటిసారి రాజకీయంగానే కాకుండా భౌగోళికంగా కూడా నిజమైన భూగర్భ గెరిల్లా పోరాటంగా (అండర్ గ్రౌండ్) గాజా గెరిల్లా పోరాటాన్ని పేర్కొనవచ్చు. ఇది కేవలం 365 చదరపు కిలోమీటర్ల గాజా నేల క్రింద ఎలా సాధ్యమైనది?

ప్రస్తుతం భూగోళంలో ఉనికిలో వున్న క్రింది మూడు ప్రాథమిక వైరుధ్యాలను బుల్లి గాజా తీవ్రతరం చేస్తున్నది.

1-సామ్రాజ్యవాదానికీ వెనకబడ్డ దేశాల, పీడిత జాతుల ప్రజలకూ మధ్య వైరుధ్యం.

2-సామ్రాజ్యవాద శిబిరాల మధ్య వైరుధ్యం.

3-ప్రపంచవ్యాప్తంగా శ్రమశక్తికీ, పెట్టుబడికీ మధ్య వైరుధ్యం.

కేవలం 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ఇరుకైన గాజా నేల క్రింద 30 లేదా 40 వేల మంది గెరిల్లాల మరియు వారి తలలపై గల భూఉపరితలపు మృతులు పోగా ఇరవై రెండున్నర లక్షల మంది పాలస్తీనా జాతి జనుల జాతీయ విమోచనోద్యమ దీక్ష ఎదుట మహా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద రాజ్యాల లక్ష్యం విఫలమౌతూ ఉండడం నేటి నిజం. గాజాపై ఇజ్రాయెల్ 150 రోజులుగా సాగించే యుద్ధం నుండి గ్రహించే పాఠం యిదే! వర్తమాన రాజకీయ భూగోళంలో గాజా ప్రతిఘటన పోషిస్తోన్న కీలక పాత్ర యిదే!

(ఇందులో పొందుపరిచినవన్నీ రచయిత వ్యక్తి గత అభిప్రాయాలు. ఫెడరల్ తెలంగాణ వాటితో ఏకీభివించనవసరం లేదు)


Read More
Next Story