
లాటరీల నిషేధం ఉన్న తెలంగాణలో కొత్త రకం లాటరీ వచ్చేసింది...
లక్కీ డ్రాతో లాభాలు గడిస్తున్న యజమానులు. లాటరీ జూదం, చట్టం వ్యతిరేకం, నేరం అని పోలీసులు చెబుతున్నారు
రియల్ ఎస్టేట్ ఆస్తుల అమ్మకాలకు డిమాండ్ తగ్గడంతో, కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తమ ఇళ్ళు , ప్లాట్ల విక్రయించేందుకు లక్కీ డ్రా ఎరవేస్తూ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమ్మిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని పొందడానికి వారికి సహాయపడుతూ ఉంది. లాభాసాటిగా మారింది.
యదాద్రి-భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన ఒక ఇంటి యజమాని తన 66 చదరపు గజాల ఇంటికి లక్కీ లాటరీ నిర్వహించి బాగా లాభం పొందాడు. ఇది వైరల్ కావడంతో మిగతావారు ఈ మోడల్ ను స్వీకరిస్తున్నారు.
ఇంటి యజమానులైన కచెర్ల రామ్ బ్రహ్మం, ఏడాదిన్నర పాటు ఇంటిని అమ్మకానికి "హౌస్ ఫర్ సేల్" బోర్డును ప్రదర్శించారు. కానీ దానిని అమ్మలేక పోయాడు. దీనితో సెప్టెంబర్‌లో లక్కీ డిప్ ప్రవేశపెట్టాడు. కూపన్ ధర రూ. 500గా నిర్ణయించి మార్కెట్ లోకి ప్రవేశించాడు. అతను 3,599 టిక్కెట్లను విక్రయించి రూ. 17,99,500 పొందాడు. 500కే రూ. 16 లక్షల విలువైన ఇంటి స్థలం దక్కుతుందనే ఆశ జనంలోకి దూసుకుపోయింది. పోతే పోయేది రు. 500 మాత్రమే. వస్తే రు. 16 లక్ష ఇల్లు. ఇది అక్షరాల లాటరీ కొన్నట్లు, లాటరీ తగిలినట్లు లేదూ. చివరకు అలాగే జరిగింది.
సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి నివాసి శంకర్ కూపన్ ధర ఐదు వందలే కదా అని కుటుంబంలోఉన్న నలుగురి పేర్ల మీద కూపన్ తీసుకున్నారు. తన పేరు, భార్య, ఇద్దరు పిల్లల మీద కూపన్ కొని వివరాలు రాశారు. నవంబర్ 2న ఆదివారం నాడు యజమాని రామబ్రహ్మం ఓ ఫంక్షన్ హాలులో లక్కీ డ్రా తీశారు. శంకర్ 10 నెలల కుమార్తె హన్సిక పేరు మీద కూపన్ కు లాటరీ తగిలింది. లక్కు రూ.16 లక్షల విలువైన ఇంటిని ఆమె డ్రాలో గెలుచుకోవడం పాప అదృష్టలక్ష్మిగా సోషల్ హల్ చేసింది. ఇది వేలాది మందికి ప్రేరణ లయింది. దీనితో లాటరీలకు అనుమతి లేని తెలంగాణలో మరొక కొత్త రకం లాటరీ ఉద్భవించింది.
నార్మల్ పద్ధతిలో ఇల్లు కొనుగోలు జరిగితే అతనికి వచ్చే మొత్తం కంటే రూ. 3 లక్షలు ఎక్కువ సంపాదించాడు. దీనితో మరికొంత మంది ఓపెన్ ప్లాట్స్, ఇండ్లకు లక్ లాటరి నిర్వహించటం ప్రారంభించారు.
నల్గొండ పట్టణానికి చెందిన కె. రమేష్ కూడా జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయం వెనుక ఉన్న తన 147 చదరపు గజాల ఇంటి లక్కీ లాటరీ కి రూ 999 కూపన్ ధరగా లాటరీకి వెళ్లాలని నిర్ణయించారు. కూపన్ కొనుగోలు కోసం చెల్లింపు కోసం QR కోడ్‌తో కూడిన బ్రోచర్‌లను ఆయన పంపిణీ చేశారు.3,000 కూపన్‌లను విక్రయించి, ఈ కూపన్‌లను విక్రయించిన తర్వాత ఫిక్స్‌డ్ ధరపై లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు రమేష్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని శివ సాయి నగర్‌లో రియల్టర్ దొంతగాని గోపి తన 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్‌కు లక్కీ డ్రాను కూడా ప్రకటించారు. కూపన్‌కు రూ.2,500 ధరను ఆయన నిర్ణయించారు. ఓపెన్ ప్లాట్‌తో పాటు, ఐదు కన్సోలేషన్ బహుమతులను (ఎలక్ట్రిక్ స్కూటర్, ఫ్రిజ్, సోఫా సెట్, డైనింగ్ టేబుల్ సెట్ మరియు సింగిల్ కాట్ బెడ్) ఆయన ప్రకటించారు.
లక్కీ లాటరీలో విజేత ఆస్తి రిజిస్ట్రేషన్ మొత్తాన్ని వారే భరించాలి. ఆస్తి పత్రాలను లక్కీ లాటరీ మాదిరిగానే విజేతలకు అందజేయబడుతుంది.
ఈ ట్రెండ్ క్రమంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలు విస్తరిస్తున్నది. పెద్దపల్లి జిల్లా జూపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కూడా తన అర ఎకరం స్థలంకు లక్కీ లోటరీని ప్రకటించాడు. కూపన్ ధరను 2,000 రూపాయలుగా ప్రకటించి 1500 కూపన్ లు అమ్మాక లాటరి నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు కు చెందిన వ్యక్తి తన ఇంటికి ఇలాగే లక్కీ లాటరిని ప్రకటించాడు. అయితే చట్టబద్ధం కాదని పోలీసులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ లక్కీ లాటరి ట్రెండ్ పై స్పందించారు. లాటరీ నిర్వాహికులకు హెచ్చరికలు జారీచేసారు. జిల్లాలో కొంతమంది రియల్టర్లు ఆకర్షణీయమైన నినాదాలతో లక్కీ లాటరీలను నిర్వహిస్తున్నారని, ఇది చట్ట ప్రకారం నేరమని నరసింహ చెప్పారు.
“కూపన్లను విక్రయించడానికి వారు సోషల్ మీడియాలో UPI స్కాన్ కోడ్‌ను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇది ఆర్థిక మోసానికి అవకాశం కల్పిస్తుంది.లాటరీ అనేది ఒక రకమైన జూదం కిందికి వస్తుంది,’ అని ఆయన చెప్పారు.
ప్రముఖ న్యాయవాది నోముల సైదులు మాట్లాడుతూ లక్కీ డ్రా, లక్కీ లాటరి మధ్య చాల తేడావుందని అన్నారు. ‘లక్కీ డ్రా లో ప్రజలు కూపన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేయరు. దీనికి చట్ట ప్రకారం అనుమతి ఉంది. లాటరీ ఆలా కాదు, ప్రజలు డబ్బులు పెట్టి లాటరీ టికెట్ లాగా కూపన్ కొనుగోలు చేస్తారు. లాటరీల మీద నిషేధం ఉంది. లాటరీ అనేది ఒక రకమైన జూదం. ఇది చట్టప్రకారం నేరం,” అని అయన అన్నారు.

