
వలస కార్మికులనూ దోచుకుంటారా?
వలస కార్మికుల కోసం సమగ్ర విధానం తీసుకు రావాలి
తెలంగాణా నుండీ నిరక్షరాస్య శ్రామికులు ,లేదా పనుల్లో కొంత నిపుణత ఉన్నవాళ్ళు సూరత్ కో, ముంబాయి కో, దుబాయి కో వెళితే, ఉన్నత విద్యలు చదువుకున్న వాళ్ళు సింగపూర్ కో, బ్రిటన్ కో, ఆస్ట్రేలియా కో, న్యూజిలాండ్ కో, జర్మనీ కో, అమెరికా కో వలస పోతుంటారు. ఈ వలసలు ఇప్పుడు మొదలైనవి కావు.
పైగా ఇవన్నీ కేవలం పొట్ట చేత బట్టుకుని వెళ్ళిన ఆకలి వలసలు మాత్రమే కావు. సాధారణ ఉపాధి కోసం, మంచి వేతనాల కోసం, మెరుగైన జీవితాల కోసం వెళ్ళిన వాళ్ళు అనేకమంది ఉన్నారు. మరి కొందరు ఆయా దేశాలలో వ్యాపారం చేయడానికి కూడా వెళ్ళారు.. తెలంగాణా నుండీ ఇప్పటి వరకూ అలా వలస జీవులు బయట ప్రాంతాలకు లక్షలాది మంది వెళ్ళారు. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వెతుక్కున్నారు. కొందరు అక్కడే ఆస్తులు కొనుక్కున్నారు. అక్కడి నుండీ ఇక్కడికి డబ్బులు పంపి, ఈ ప్రాంతంలో కూడా మరి కొందరు ఆస్తులు కొనుక్కున్నారు. కొందరు అక్కడి రాజకీయాలలో పాల్గొంటున్నారు. కొన్ని సార్లు ఆ దేశ పౌరసత్వం పొంది, అక్కడి ఎన్నికలలో కూడా పోటీ చేస్తున్నారు. అలాంటి వార్తలను, ఇక్కడ మనం ఘనంగా చెప్పుకుంటున్నాం.
కానీ, ఆయా దేశాలలో ఇక్కడి నుండీ వెళ్ళిన వాళ్ళను,ముఖ్యంగా శారీరక శ్రమ కోసం వెళ్ళే వారిని, మన సమాజంలో అణచి వేతకు గురయ్యే కులాల ప్రజలను, కనీసం మనుషులుగా కూడా చూడని విషయమై ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. అనేక మంది అక్కడే పని స్థలంలో, లేదా ప్రమాదాలలో, లేదా స్థానికుల దౌర్జన్యంతో చనిపోయిన విషయం, ఆయా కుటుంబాలు, కనీసం తమ బంధువుల మృత దేహాలు కూడా చూడలేని దుస్థితి మనం కళ్ళారా చూశాం, విన్నాం.
మన దేశం నుండీ ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్లకు అక్కడి సంస్థలు, కంపనీలు పనులు కల్పించి, స్థానికులకు పనులు ఇవ్వని విషయం పై కూడా చర్చ ఇప్పుడు అన్నిదేశాలలో జరుగుతున్నది. మన వాళ్ళకు అక్కడ తక్కువ వేతనాలు చెల్లిస్తారు. స్తానుఇకులను పెట్టుకుంటే ఆయా కంపనీలకు ఎక్కువ ఖర్చు అవుతుందనేది ఇందుకు ప్రధాన కారణం.
దీనివల్ల ఆయా దేశాలలో స్థానికులలో నిరుద్యోగం పెరుగుతున్నది. ఫలితంగా బయట నుండీ వచ్చిన వాళ్ళ పట్ల తీవ్ర వ్యతిరేకత, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల నుండీ తమ దేశానికి వచ్చిన వాళ్ళు, తమ దేశం విడిచి వెళ్ళి పోవాలనే డిమాండ్లు కూడా మనం వింటున్నాం. మన వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడి దేశాలలో జరుగుతున్న ఆందోళనల పట్ల మనకు సహజంగానే కోపం వస్తున్నది.వారి భవిష్యత్తు, రక్షణ గురించి ఆందోళన ఉంటుంది.
అక్రమంగా తమ దేశంలోకి వచ్చారనే పేరుతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులకు బేడీలు వేసి, విమానంలో వెనక్కు పంపిన ఘటన కూడా మనం చూశాం. తాజాగా అమెరికా రావాలంటే వీసా ఫీజు 1,00,000 డాలర్లు చెల్లించాలని ట్రంప్ సర్కార్ చేసిన నిర్ణయాన్ని కూడా విన్నాం. దీనిపై ఇంత దుర్మార్గమా అని మనం వాపోతున్నాం. మనం ఈ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాం. అన్యాయమని రోజూ ఘోషిస్తున్నాం.
కానీ అకస్మాత్తుగా ఇవన్నీ మరిచిపోయి, మనం మాత్రం బయట రాష్ట్రాల నుండీ వలస వచ్చిన కార్మికులపై, వ్యాపారులపై విరుచుకుపడి మాట్లాడుతుంటాం. నిజానికి బయట నుండీ వచ్చిన వ్యాపారులు అడ్డగోలు దోపిడీ చేస్తే, స్థానిక ప్రజలపై దౌర్జన్యం చేస్తే అడ్డుకోవాలి. వారి దుర్మార్గాలకు వ్యతిరేకంగా అన్ని రూపాలలో పోరాడాలి. అలాగే బయట రాష్ట్రాల నుండీ వచ్చిన కార్మికులు తప్పు చేస్తే కూడా వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయొచ్చు.
కానీ తాజాగా తెలంగాణా లో కొంతమందికి ఏ విషయాలపై, ఏ మాత్రం కోపం వచ్చినా, స్థానిక సమస్యలకు సవ్యమైన పరిష్కారాలు చూపకుండా, ప్రభుత్వం పై వాటి సాధన కోసం ఐక్యంగా పోరాడకుండా, “గో బ్యాక్” నినాదాలు ఇవ్వడం అలవాటుగా మారింది. మన రాష్రం వాళ్ళు కూడా బయట రాష్ట్రాలలో ఉన్నారనీ, వాళ్ళు కూడా అక్కడ బతకడానికి వెళ్ళారనీ మర్చిపోయి ఈ డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా సూర్యాపేట లో నిన్న జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని, ఉత్తరాది నుండీ పొట్ట చేతబట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన కార్మికులపై సోషల్ మీడియాలో, మీడియాలో విషం చిమ్మడం చూస్తున్నాం. ఆ కార్మికుల జీవన పరిస్థితులు ఏమిటి? వాళ్ళు ఎందుకు అంత ఆవేశానికి గురయ్యారు ? వాళ్ళకు జరిగిన అన్యాయమేమిటి ? అనే విషయాలు పట్టించుకోకుండా, బీహార్ కార్మికులనే తప్పు పట్టే వైఖరి అన్యాయమైనది.
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుడు ( బీహార్) ఇటీవల మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 22 న వలస కార్మికులు నిరసనకు దిగారు. కార్మిక ఉద్యమ అణచివేతకు యాజమాన్యం పోలీస్ బలగాల్ని దింపింది.
సాటి మనిషిని కోల్పోయిన దుఃఖంలో, తీవ్ర అభద్రతా మానసిక స్థితిలో యాజమాన్యం మీదికే కాకుండా, పోలీసుల మీదకు కూడా కార్మికులు వెళ్ళారు. కానీ ఈ ప్రతీకార చర్య తెలంగాణా లో కొందరికి పెద్ద నేరమై పోయింది. దాన్ని భూతద్దంలో చూపించే కంపెనీ కుట్రకి బలాన్నిచ్చే విధంగా పోలీసుల మీద బీహార్ లేబర్ అరాచక దాడి శీర్షికలతో కొన్ని మాధ్యమాలు ప్రచారం చేస్తున్నాయి.
నిజానికి ఆ కార్మికులు చేసిన తప్పేమిటి ? సాటి వలస కార్మికుడి మృతి పట్ల మానవతతో తల్ల డిల్లి నష్టపరిహారం కోరారు. నిరసనకు దిగారు. సమస్యను పరిష్కరించకుండా, కార్మికుల నిరసనను అణిచివేయడానికి యాజమాన్యం పోలీసుల్ని దించడం నేరం. నిరసన వ్యక్తం చేసిన వారినే నేరస్తులుగా చిత్రించడం మరో ఘోరం.
తమ స్వంత కుటుంబాలను వదిలి కంపెనీ ప్రయోజనాలే సర్వస్వంగా భావించిన వలస కార్మికుల్ని కంపెనీ యాజమాన్యాలు కాంట్రాక్టర్ల దళారీ వ్యవస్థ సాయంతో తెచ్చుకుంటున్నాయి. వారికి ఈ రాష్ట్రంలో బయట కుటుంబ, సామాజిక జీవితం లేదు. ఇలాంటి కార్మికులకు కనీస చట్టబద్ద సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కంపెనీలదే . కానీ యాజమ్న్యాలు వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. వాళ్ళతో రోజూ అతి తక్కువ దినసరి కూలీ ఇచ్చి 12 గంటలు పని చేయించుకుంటున్నాయి. ఇలా నిస్సహాయ పరిస్థితుల్లో బ్రతికే వలస కార్మికుల సహనం వారి శాశ్వత లక్షణం కాదు. మనిషి సహజంగా అన్యాయంపై, దోపిడీ పై వివిధ రూపాలలో నిరసన చూపిస్తాడు. ఈ ఘటన అందులో భాగమే.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో సిగాచీ కంపనీలో జరిగిన పేలుడు ఘటనలో 54 మంది కార్మికులు మరణించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. వారికి పరిహారంగా ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. కానీ 80 రోజులు దాటినా, ఇప్పటి వరకూ కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. రాష్ట్ర హై కోర్టులో పౌర సమాజ ప్రతినిధులు కేసు వేశారు కనుక, ఆయా కుటుంబాలకు ఈ మాత్రమైనా పరిహారం అందింది.
అసలు మన రాష్ట్రంలో కార్మిక సంఘాలు వలస కార్మికుల హక్కుల కోసం పని చేయడమే లేదు. ఇలాంటి స్థితిలో ఆ కార్మికులకు బద్రత మాటేమిటి ? వారికి కార్మిక చట్టాలు వర్తించవా ? దాని గురించి లోతుగా మాట్లాడాల్సిన తెలంగాణా సమాజం, ఆవేశంతో బీహార్ కార్మికులు పోలీసుల మీద దాడి చేశారనే నెపంతో, కార్మికులను తప్పు పట్టడం ఎక్కడి న్యాయం ?
వికారాబాద్ జిల్లా లగచర్ల లో మరి మన రైతులే అన్యాయంగా భూ సేకరణ కోసం వెళ్ళిన కలెక్టర్, ఇతర అధికారుల మీద దాడి చేసి పార దోలారు. ఇది న్యాయం అయినప్పుడు, తమకు జరిగిన అన్యాయం పట్ల బీహార్ కార్మికులు చేసింది మాత్రం అన్యాయమెలా అవుతుంది? ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోదు, కార్మిక శాఖ పట్టించుకోదు . జిల్లా అధికారులు పట్టించుకోరు, స్థానిక రాజకీయ పార్టీలు పట్టించుకోవు. స్థానిక కార్మిక సంఘాలు పట్టించుకోవు. ఇంకా ఎవరు వాళ్ళ గురించి మాట్లాడాలి ? అందుకే ఒక నిస్సహాయ స్థితిలో కార్మికులు ఆవేశానికి గురై ఇలాంటి ఘటనలకు పాల్పడతారు. దానిని నేరంగా చూడడమే మంచిది కాదు.
బడా వాణిజ్య, వడ్డీ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు రాజ్యం గొడుగు పట్టి స్వాగతం పలుకుతుంది. కానీ వలస కార్మికులను మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వాన్ని తప్పు పట్టే ధైర్యం లేని కొందరు మాత్రం అత్యుత్సాహంగా ఈ వలస కార్మికులపై రోహింగ్యా ముద్ర వేసి, ఉగ్రవాద మూకలుగా చిత్రించే వరకూ వెళ్లారు. ఇదొక తప్పుడు ధోరణి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే , తెలంగాణా రాష్ట్రం సమగ్ర వలస కార్మికుల విధానం తక్షణమే తేవాలి. వారి ఉనికిని ,హక్కులను గుర్తించాలి. వారిని సమాజం మనుషులుగా చూడాలి. ఏ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో వస్తున్న పరిశ్రమలు, సంస్థలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త చట్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు హామీ ఇచ్చింది కూడా. దానిని అమలు చేయాలి.