ప్రజల కోసం , ప్రజలవెంట నడిచిన గద్దర్
ఆగస్టు 6 న జరుగనున్న గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా...
ప్రజల కోసమే జీవించి , ప్రజల కోసమే తపించి , ప్రజలకే అంకితమై ప్రజలవెంట ప్రయాణించిన గద్దర్ అమరుడై యాడాదవుతోంది. చావు నీది పుట్టుక నీది బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటకు నిలువెత్తు నిదర్శనం గద్దర్
జీవితం. గద్దర్ ప్రయాణం విస్తారమైనది గద్దర్ జీవిత ప్రయాణం ప్రజల కనుకూలంగా ప్రజలను అంటిపెట్టుకొని సాగుతూ వచ్చింది. అవగాహన ఎదిగే క్రమంలో ప్రజల ఆశల వెంట , వారి ఉద్యమాల వెంట నడవడం ధ్యేయంగా పెట్టుకున్నారు.
ఆర్ట్ లవర్స్ (Art Lovers) తో మొదలై 'విశ్వం' దాకా... 1970 నుండి అయిదున్నర దశాబ్దాలుగా గద్దర్ చేసిన ప్రయాణం విశ్వం దాకా విస్తరించిన రంగాలు అనేకం. కుటుంబ సంక్షేమం పాటలనుండి విప్లవ పాటల వైపు మలుపు తిరగడంలో ఎదగడంలో బి. నర్సింగరావు పాత్ర తండ్రి నిర్వహించిన పాత్ర వంటిది. అది ఆర్ట్ లవర్స్ నుండి జన నాట్యమండలిగా సాంస్కృతిక ఉద్యమం సమాజంలో మహోన్నత పాత్ర నిర్వహించింది.
గద్దర్ టచ్ చేయని రంగం లేదు
సంఘ సంస్కరణ , మూఢ విశ్వాసాల నిర్మూలన , కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించడం , ప్రజలను నిరాశా నిస్పృహలనుండి మేల్కొలిపి తమ సమస్యలపై ఉద్యమాల బాట పట్టించడం , విద్యార్థులు , యువకులు , రైతుకూలీలు విద్యావంతులు మేధావులు , ఉద్యోగులు కార్మికులు , ఉపాధ్యాయులు , దళిత మహాసభ , తెలంగాణ ఉద్యమం, బీసీలు , ఎస్సీలు ఆదివాసులు , మైనారిటీలు గ్రామీణులు , నగర వాసులు ఇలా ఒకటి కాదు రెండు కాదు, సమస్త రంగాలను అక్రమించి ప్రజలను ముందుకు నడిపి ఉద్యమాల బాట పట్టించినవాడు గద్దర్.
గద్దర్ ప్రయాణం ఒక వ్యాసంలోనో ఒక పుస్తకంలోనో , ఒక పార్టీ చరిత్రలోనో , ఏదో ఒక ఉద్యమ చరిత్ర లోనో ఇమిడేది కాదు. ఏ పాత్రతో కొలిచినా గద్దర్ ముందు ఆ పాత్ర చిన్నదైపోతుంది. గద్దరన్ను కొలవడానికి కొలతలు లేవు. గద్దర్ ఒక మాస్ లీడర్. ప్రజా కళాకారుడు. గద్దర్ వస్తున్నాడంటే ఆయన పాట మాట వినడానికి లక్షలాది ప్రజలు స్వయంగా ఉత్తేజంతో వచ్చేవారు. గద్దర్ ఆకర్షణ శక్తి అలాంటిది. అందుకే ఎన్నో ఉద్యమాలు , ఎన్నో రంగాల వారు తమ మీటింగులకు గద్దర్ రావాలని కావాలని పిలుచుకునేవారు.
గద్దర్ ఏ పాట రాసినా
గద్దర్ ఏ పాట రాసినా ఆ సబ్జెక్టును అనేక కోణాల్లో అధ్యయనం చేస్తారు. రాసినాక ప్రజల భాషకనువుగా మార్పులు చేస్తారు. ఆ మార్పులు ఎలా జరిగేవో ‘తరగని గని’ అని ఒక పుస్తకమే రాసారు. తన భావాల సందర్భాల గురించి పాటకు ‘జీవకణం’ పుస్తకం రాసారు. ఈ రెండు పుస్తకాలను గద్దర్ మేనల్లుడు సత్యం సంకలించి ప్రచురించాడు. గద్దర్ పాటలు అనేక సంకలనాల్లో చేరి లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.
గద్దర్ అందరికి కావాలి
గద్దర్ ని బోనాల పండుగలకు రమ్మంటారు. జాతరలకు రమ్మంటారు. ఎక్కడికి వెళ్లినా వారిని ఉత్తేజ పరిచి తనవైపుకు తిప్పుకుని సామాజిక చైతన్యం నింపేవారు. ఇన్ని అవకాశాలు ఎవరికి రావు. ఆయన మాట పాటే ఆయనకీ అవకాశాలు తెచ్చి పెట్టాయి. చివరకు పోలీసు అధికారులు కూడా గద్దర్ అభిమానులే. దేశవ్యాప్త పర్యటనలతో ప్రదర్శనలతో గద్దరన్నను మించినవారు లేరని దేశమంతా ఒప్పేసుకుంది. దేశం ఎల్లలు దాటి ప్రపంచమే గద్దర్ ని ప్రపంచ మహా కళారుడు , మహాకవి అని ఒప్పేసుకుంది.
గద్దర్ నాడు అవును, సరే అనివుంటే...
గద్దర్ వద్దనుకున్నాడుగానీ ఆయన సరేనంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు , పద్మశ్రీ పద్మభూషన్ లు , నోబెల్ బహుమతులు , గవర్నర్ , ఉప రాష్ట్రపతి వంటి పదవులు వెతుక్కుంటూ వచ్చి గద్దర్ ఒడిలో వాలేవి. గద్దర్ ప్రభావితం చేయని రంగం లేదు. పరిశుభ్రత, సీజనల్ రోగాలు , జాగ్రత్తల గురించి కూడా ఎన్నో పాటలు రాసి పాడాడు.
గద్దర్ లేకుంటే...
గద్దర్ గురించి ఇపుడు నేను కొత్తగా చెప్పేదేమిటి ? గద్దర్ లేకుండా విప్లవ ఉ ద్యమాల కేడర్ లేదు. ఉద్యమాల విస్తృతి లేదు. ఉద్యమాలకు గద్దర్ నిట్టాడై నిలిచాడు. తన అభిప్రాయాలు మారినా ఉద్యమాలు దెబ్బదినకూడదని నిరంతరం మద్దతు ఇస్తూనే వచ్చాడు గద్దర్. గద్దర్ గనక ఎన్టీఆర్లా తిరిగి వుంటే తానే ముఖ్యమంత్రి అయ్యేవాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. గద్దర్ ను రాష్ట్రపతిగా చూడాలనుకున్నారు కొందరు. గద్దర్ కి అవంటే ఆసక్తి లేదు కళాకారుడిగానే వుండి పోవాలనుకున్నాడు.
గద్దర్ ప్రజలను ప్రేమించాడు
గద్దర్ ప్రజలను ప్రేమించాడు. ప్రజా ఉద్యమాలను ప్రేమించాడు. సమ సమాజ నిర్మాణంకోసం తపించాడు. ఉద్యమించాడు. అంటరానితనం , కుల వివక్ష , అసమానతలు లేని మనిషిని మనిషిగా చూసే వ్యవస్థకోసం జీవితాన్ని అంకితం చేశాడు. గద్దర్ ప్రపంచ ప్రసిద్ధ కళారుడు , మహాకవి , వాగ్గేయకారుడు. గద్దర్ తో పోల్చదగినవారు ప్రపంచంలో అరుదు. గద్దర్ అమెరికా నల్లజాతి వీరుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తో పోల్చుదామా ! ఆయన గొప్ప ఉపన్యాసకుడు తప్ప కళాకారుడు కాదు. గద్దర్ మనకాలపు యుగకర్త. తన సాహిత్యం , గానం , అభినయ సమన్వయంతో భావాలతో కోట్లాది ప్రజలను ప్రభావితం చేసినవాడు గద్దర్. లక్షలాది కళాకారులకు ఒక ఆదర్శ నమూనా నిలిచినవాడు గద్దర్.
గద్దర్ ఒక ట్రెండ్ , గద్దర్ ఒక లెజెండ్ గద్దర్ ఒక ట్రెండ్. గద్దర్ ఒక లెజెండ్. గద్దర్ ఆయా పార్టీలకు ఉద్యమాలకు కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టిన గద్దర్ , ఎన్నో శిఖరాలను అధిరోహించాడు. కోట్లాది ప్రజల గుండెల్లోకి విస్తరించిన వాడు గద్దర్. ప్రజల జీవితాల బాగు కోరినవాడు గద్దర్. నిరంతరం ప్రజ ల గురించి తపించినవాడు గద్దర్.
గద్దర్ ప్రజల మనిషి
గద్దర్ ప్రజల మనిషి. సాయుధ పోరాటం గురించి దశాబ్దాలుగా ప్రచారం చేసిన గద్దర్ కాలానుగుణంగా పరిణతి చెందారు. నూతన ఆలోచనలను విత్తనాల్లా వెదజల్లాడు. ఎన్నికల్లో పాల్గొనడం పై నక్సలైట్లు సానుకూలంగా పునరాలోచించాలని భావించాడు. సమ్రాట్ అశోకుడు భారతదేశాన్ని జయించే క్రమంలో కళింగ యుద్ధం చేసి బాధపడి బౌద్ధంతో శాంతి కాముకుడయ్యాడు. అలా విప్లవ పార్టీలు కూడా యుద్ధ భీభత్సాలు చూసి శాంతి వైపు మారాలని ప్రజలు అనుకున్నారు.. గద్దర్ కూడ అనుకున్నాడు. తన ఆటపాట మాటలతో కోట్లాది మందిని కదిలించిన గద్దర్ వేలాది మంది ప్రాణాలు కోల్పోయి అమరులయ్యాక పునరాలోచనలో పడ్డాడు. గద్దర్ పట్టించుకున్న కుల సమస్య మత సమస్య భారత దేశంలో కుల సమస్య , మత సమస్య , కారంచేడు , చుండూరు , సంఘటనలు , సత్యమూర్తి చర్చలు , సత్యమూర్తి పై వేటు , బహుజన సమాజ్ పార్టీ ప్రచారం క్రమంలో గద్దర్ , అంబేద్కర్ను బౌద్ధంను పునరధ్యయనం చేస్తూ పరివర్తన చెందాడు.
గమనించారో లేదో గాని గద్దర్ సైద్ధాంతికంగా తనదైన అనుభవాల కోణంలో ప్రత్యేకంగా ఆలోచించాడు. 1994 నుండి తన శాంతి కాముకతను వినిపించడం ప్రారంభించాడు. గద్దర్ తో నాలుగు దశాబ్దాల పాటు మేం కలిసి నడవడం చరిత్ర సృష్టించడమా ఒక గొప్ప అవకాశం. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య దాకా పెనవేసుకున్న బంధం.
పీపుల్స్ వార్ పార్టీ ఎన్నికలలో నిలబడి ఉంటే... పీపుల్స్ వార్ పార్టీ ఎన్నికల్లో నిలబడి ఉంటే బిజెపికి అధికారం ఎక్కడిది ? జనతా పార్టీ , జనతాదళ్ గ్రూపులతో ఒకవైపు , కాంగ్రెస్ యుపిఐ గ్రూపులతో ఒకవైపు కలిసి ముందుకు సాగే క్రమంలో పీపుల్స్ వార్ నిర్ణాయక పాత్ర నిర్వహించి ఉండేది. నేపాల్లో ప్రచండ అధికారంలోకి వచ్చినట్లుగా కీలకపాత్ర నిర్వహించి ఉండేది.
కాన్షీరామ్ వంటి నూతన శక్తుల బలం ఎన్నో రెట్లు పెరిగి దేశమే ఒక గొప్ప ప్రజాస్వామిక స్వామ్యవాద ప్రధాన భూమికగా మలుపు తిరిగి ఉండేది. కానీ అది జరగలేదు. పీపుల్స్ వార్ పార్టీ ఎన్నికల్లో నిలబడాలి అని నిర్ణయం తీసుకొని వుంటే దేశ చరిత్ర రాష్ట్ర చరిత్ర వేరుగా వుండేది. గద్దర్ ప్రభావం మరింత ఉత్తేజ పూరితంగా సాగి వుండేది. ప్రజలు అధికారంలో భాగస్వామ్యం పొంది వుండేవారు. అలాంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్ల లక్షలాది ప్రజలు చాలా నష్ట పోయారు. చాలా కష్టాల పాలయ్యారు. భరించలేని నిర్బంధాలతో బొంబాయి గల్ఫ్ దేశాల బాట పట్టారు.
కొన్ని పార్టీలు ఎన్నికల బహిష్కరణ ద్వారా పాలక వర్గాలకు పోటీ లేకుండా పువ్వుల్లో పెట్టి అధికారం అందించారు. వారు అధికారంలోకి వచ్చి అధికారికంగా దౌర్జన్యం , నిర్బంధం, అణిచి వేత కొనసాగించారు. ప్రజలు ఏ విధంగా సశక్తీ కరం కావడం ప్రజల పేరు పెట్టుకొని రాజకీయాలు చేసిన పార్టీ సహించ లేక పోయింది. దేశ చరిత్రలో ఇది ఒక దుష్ట సంప్రదాయం. ప్రజలు రాజకీయాల్లో తమ ప్రాధాన్యతను కోరుకున్నారు ప్రజలు తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం వుండాలని , కులాల వారీగా కోరుతూ వస్తున్నారు.
రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతున్నది. అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. ప్రజల కోరిక మేరకు. ఎన్నికలలో పాల్గొని వుంటే గద్దర్ తన ప్రచారంతో వేలాది మందిని గెలిపించి వుండే వాడు. నిర్బంధం ఇలా వుండేది కాదు. ఉద్యోగాలు చేస్తూ విప్లవ రాజకీయాలు చెప్పేవారికి ఎన్నికలలో పాల్గొనే పార్టీకి ప్రచారం చేయడం కుదరదు. అలాంటి మధ్యతరగతి మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయుల పరిమిత ప్రయోజనాలకు ఉద్యమం, రాజకీయ ప్రాతినిధ్యం అనే కోరిక బలి అయిపోయింది. లేదా పార్టీకి ప్రజలు అధికారంలో భాగస్వామ్యం పొందడం ఇష్టం లేదనుకోవాలి. ఏమైతేనేం చేతికి అంది వచ్చే అధికారాన్ని దూరం చేసారు.
పార్టీ ఊఁ అంటే...
పార్టీ ఊఁ అంటే ఎన్టీఆర్ ప్రభంజనం వలే 1983 లో వీరి ప్రభంజనం సాగి రాజకీయాలు మలుపు తిరిగేవి. 1983 లో మేనెలలో కరీంనగర్లో జరిగిన
రైతుకూలీ సంఘం మహాసభలతో ప్రజలు ఇలాగే భావించారు. విప్లవ పార్టీ చేసిన పొరపాటుకు ఎన్నికలలో పాల్గొనాలన్నవారు బలయ్యారు. పార్టీని నమ్మిన బహుజనులు చాలా నష్టపోయారు. గద్దర్ గొప్ప కళాకారుడు. వాగ్గేయ కారుడు. ఒక ప్రవక్తలా ప్రజలు గౌరవించారు. గద్దరన్ను ఎందుకు. యుద్ధ నౌక అని కుదించి పిలవడం ? ఆయన ప్రభావం పడని రంగం లేదు. ఆయన స్పూర్తి దేశమంతటా విస్తరించింది.
గద్దర్ మారాడు
కొన్ని దశాబ్దాల కాలం సాయుధ పోరాటాన్ని ప్రచారం చేసిన కళాకారుడు గద్దర్. ఆ తరువాత మనసు మార్చుకున్నాడు. మరో మార్గం వుందని గమనించాడు. అలా మలుపు తిరగడానికి ఎన్ని కారణాలైనా చెప్పవచ్చు. ద.ర.క.మే ఐక్య వేదిక అధ్యక్షుడిగా నేను , నాతో పాటు పాల్గొన్న బుద్దిస్టు కె ఎన్ రామదాస్ వెంకటా పురంలోని గద్దర్ ఇంటిలో 1993 లో ఏక ధాటిగా 14 గంటలు చర్చలు జరిపాము. మార్క్సిజం మీద , అంబేద్కర్ , బౌద్ధంల మీద , కార్మిక వర్గ నియంతృత్వం మీద , అదనపు విలువ , పరాయీకరణ మీద చర్చలు జరిగాయి. ఒకే పార్టీ లో కలిసి పని చేసిన అనుభవాలు చర్చించుకున్నాం.
యుద్ధానికి అంతులేదా... ?
మహా భారత యుద్ధం 20 రోజుల్లో ముగిసింది. ఇండో పాక్ యుద్ధం నెల రోజుల్లో ముగిసింది. ప్రపంచయుద్ధాలు కొన్ని సంవత్సరాల్లో ముగిసాయి. ఇదేమి యుద్ధం అంతు దరి లేకుండా దశాబ్దాలపాటు సాగడం? తమ జీవిత కాలంలో విప్లవ విజయం చూడలేం అని, రెండు ప్రపంచ యుద్ధాలతో ముడిపడి సాధ్యమైన రష్యా , చైనా విజయాల వంటి కాలం కాదని తేలి పోయింది. ఆ దేశాల్లో 35 ఏళ్లలో విప్లవాలు ముందుకు సాగి అధికారంలోకి వచ్చారు. మనదంతా పగటి కల , భ్రమల బతుకులు అని తేలి పోయింది. మేం ఉత్పత్తి సంబంధాలను , రక్త సంబంధాలను వర్గాలను సృష్టించే కులంను కులవ్యవస్థను , వదిలేసి చేసిన వర్గ వైరుధ్యాల విశ్లేషణలతోనే బొక్క బోర్లా పడ్డామని తేలి పోయింది. ఈ చర్చలను కాకినాడ నుండి వెలువడే గోదావరి కెరటాలు మాసపత్రికలో రికార్డు చేశారు.
గద్దర్ , నేను , కంచ ఐలయ్య , గద్దర్ కలిసి బౌద్ద స్వీకార ప్రకటన చేయాలనుకున్నాము. సరైనవారు ఆర్గనైజ్ చేసేవారు లేక లేక ఆదిలోనే అది కార్యరూపం దాల్చ లేదు. కాలంతోపాటు గద్దర్ పరిణామం చెందాడు. అయినా. తాను నమ్మిన పార్టీ మారడానికి సిద్ధంగా లేకపోయినా తాను ప్రజలవెంట , ప్రపంచ గమనంతోె పాటు మారడానికి నిశ్చయించుకున్నాడు. అలా శాంతియుత పంథాలో వీలైన వారందరిని కలుపుకొని ముందుకు సాగారు.
ఆరు తూటాలు తిని తిరిగి బతికారు గద్దర్. ఐనా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అనేక శాంతి యాత్రలు చేసారు. లక్షలాదిమందిని కదిలించారు. ప్రజల ఓటుతో ఎన్నికై ప్రజలనే అణిచివేసే పాలకుల దుర్మార్గాలను ఎప్పటికప్పడు విమర్శించాడు. ఎన్నో కేసుల పాలయ్యాడు.
గద్దర్ మాట పాట అవుతుంది. పాట నినాదం అవుతుంది. నినాదం సిద్దాంతం అవుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాత కాన్సీరాం ఓట్లు మావి సీట్లు మీవా ? అని ప్రశించడంతో దేశం ఉలిక్కి పడింది. బుద్దుడు , నాగార్జునుడు , భక్తి ఉద్యమాలు , కాన్సీరాంను , అంబేద్కర్ను మళ్ళీ మళ్ళీ అనేక కోణాల్లో అధ్యయనం చేశాడు గద్దర్. భారత రాజ్యాంగం విశిష్ఠత గుర్తించిన గద్దర్ గద్దర్ భారత రాజ్యాంగాన్ని పదే పదే గుర్తు చేసుకోవడానికి , కోట్ చేయడానికి బలమైన అనేక కారణాలున్నాయి. తమ సిద్ధాంతాలను ప్రచారం చేసినంతకాలం గద్దరన్నను గౌరవించారు. గద్దర్ ను మలుపు తిప్పిన భావాలను ప్రజలు కూడా గౌరవిస్తూ స్పూర్తి పొందారు. అభిమానించారు.
గద్దర్ సృష్టించిన సాహిత్యం , ఇచ్చి కార్యక్రమాలు వందలాది క్యాసెట్లలో , పుస్తకాల్లో యూట్యూబ్ లో రికార్డయ్యాయి. బి. నర్సింగరావు వంటి పెద్దలు వాటిని భద్రపరిచారు. సత్యం పుస్తకాలు వేసారు. గద్దర్ రాసిన అనుభవాలు భావాలు ప్రజలకు అందాలి. అందుకు వాటిని అంశాలవారీగా పుస్తకాలుగా ప్రచురించాలి. గద్దర్ ఫౌండేషన్ వాటిని భావితరాలకు అందించాలి. శాంతియుత పరివర్తన దిశగా భారత రాజ్యాంగ విశిష్టతను గుర్తించిన గద్దరున్నను ఇంకా యుద్ధానికి మద్దతుదారుగా చేసే ప్రచారాన్ని నిలువరించాలి. శాంతి పథాన , బుద్దుడి మార్గాన , రాజ్యాంగ విధానం ఎదగడం అవసరమని గద్దర్ గుర్తించాడు. చరిత్ర రూపుదిద్దిన మహాకవి , కళాకారుడు గద్దర్. ప్రజలున్నంత కాలం , ప్రజల ఆశలు పోరాటాలు ఉన్నంతకాలం గద్దరన్నను ప్రజలు గుర్తు చేసుకుంటూనే వుంటారు.