
గగన గంధర్వునికి గౌరవ వందనం
మన మధ్య మామూలుగా గడిపిన ఆ మహానుభావుడికి నీరాజనం ఈ స్మృతి రచన...
-చైతన్య పిన్నమరాజు
భారతీయ కాలమానం ప్రకారం 2025 వ సంవత్సరం జూలై నెల 7 వ తేది .
రాత్రి సుమారు పది గంటల ప్రాం తంలో..హైదరాబాద్ నగరంలో, మణికొండ జాగీర్ నుంచి బంగారు కాంతులు చిమ్ముకుంటూ ఒక ప్రకాశవంతమైన తార గాంధర్వ లోకం వైపు ప్రశాంతంగా ప్రయాణం ప్రారంభించింది..నరులకు అగోచరమైన ఆ దృశ్యం యావత్ ఊర్ధ్వ లోకాలను ఉత్తేజితం చేసింది.
ఇహ గంధర్వ లోకపు సంబరాలు గురించి చెప్పేది ఏముంది. అంతటా ఆహ్లాదం వెల్లివిరుస్తోంది. వాద్యకారులు, నృత్యకారులు, సంగీత విద్వాంసులు, ఆనందపరవశులై వారి వారి ప్రతిభను ప్రదర్శిస్తూ, ఆనందాంతరంగులై ఒకానొక అలౌకిక స్థితి లోకి జారిపోయారు.
ఇది అంత అర్ధం కాని ఒక గంధర్వ లోకపు దివ్యకాంత తన చెలి ని అడిగింది, “ఈ కోలాహలం ఏమిటి మోహిని? ఈ అప్రకటిత ఆనందోత్సవానికి కారణం ఏమిటి?” అని “అదేంటే చిత్ర నువ్వు వినలేదా ఆయన ఆగమనం గురించి” అంది మోహిని ఆశ్చర్యంగా. “ఆయనా ? ఆయన ఎవరే?” అంది చిత్ర. మోహిని సమాధానం చెప్పేలోపే ఒక పెట్టున మంగళవాయిద్యాలు మారుమ్రోగాయి. ఒక క్షణం లో గంధర్వ లోకం ఆయనకి ఇష్టమైన ధవళ కాంతులతో మెరవడం ప్రారంభించింది వనాలు వంగి చూస్తున్నాయి, దేవకాoతలు పుష్ప మాలలతో సిద్ధం గా ఉన్నారు. కోయిలలు మంద్రం గా కూస్తున్నాయి నెమళ్లు పురివిప్పి ఆడ్తున్నాయి..గంధర్వ లోకపు బంగారు వాకిలి వద్ద పురప్రము¬లు ఆహ్వానం పలికేందుకు సిద్ధం గా ఉన్నారు.
ఇంతలో భూమి మీద నుంచి బయలుదేరిన తార గంధర్వాకృతి ధరించి అందరినీ చిరునవ్వుతో ఆనందంగా చూస్తుం ది అందరి కళ్లలో ఆనంద బాష్పాలు. అందరూ ఆయనకు ఆహ్వానం పలికారు ఆలింగనాలు చేసుకున్నారు నృత్య గానాలతో, మేళ తాళాలతో, నెమ్మదిగా నడిపిస్తూ ఆయనకి ఇష్టమైన శ్వేతవర్ణ మణిమయ సింహాసనం పైన ఆసీనుడిని చేశార..అప్పటికి మోహిని, చిత్ర అక్కడికి చేరుకున్నారు. మోహిని చిత్ర తో చెప్పింది “ఆయన మన గంధర్వుడే.. ఒకానొక మహర్షి శాపం వల్ల కొంత కాలం భూలోకవాసం చేయాల్సి వచ్చింది.. ఆ అంకం పూర్తి అయింది..తిరిగి వచ్చేసారు అందుకే ఈ హడావిడి అంతా అంది.
ఇంతలో ఒక్క పెట్టున గాలి దుమారం రేగింది..అంతా పైకి చూసారు రెక్కలు తపాతప్ప కొట్టుకుంటూ గరుత్మంతుడు ఒచ్చాడు..అంతా జయజయ ధ్వానాలు చేశారు..అతడు సూక్ష్మ రూపం ధరించి సింహాసనం పైన ఉన్న ఆయనకి గౌరవ వందనం చేశాడు. ఆయన గరుడుడికి సగౌరవంగా నమస్కారం చేశారు.. గరుడుడు ఆయనతో నా చరిత్రను అత్యద్భుత శైలితో మరొక్కసారి మానవులకు మీ “వైనతేయం” రచనతో పరిచయం
చేశారు. మీకు “నేను ఏం సత్కారం చేయగలను?” కేవలం కృతజ్ఞతలు చెప్పడం తప్ప అనగానే ఆయన సింహాసనం నుంచి లేచి గరుడుడిని ఆలింగనం చేసుకొని నువ్వంటే ఇష్టం , ప్రేమ అంతే అది చాలు నాకు” అన్నారు మంద్రం గా. గరుడుడు సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
అంతా గుసగుసలాడుకుంటున్నారు “ అంత గరుడుడూ మన వాడి ముందు చిన్న పిల్లవాడు అయిపోయాడు చూసావా “ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో మరోసారి కలకలం గంగమ్మ! గంగమ్మ! అంటున్నారు అందరూ అటు చూస్తే శ్వేతవస్త్రధారిణి అయ్యి పవిత్రమైన అందంతో, జలపాతపు యవ్వనంతో, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో గంగాదేవి ప్రత్యక్షం అయింది. వెంటనే తన సింహాసనం నుంచి తటాలున లేచి ఆమె పాదాలు మీద పడ్డాడు. తన గంగావతరణo లోని పంక్తులు అలవోకగా ఆయన నోటి వెంట వచ్చాయి.. “స్వాగతమో మందాకినీ, స్వాగతమో భోగవతీ, స్వాగతమో వేగవతీ..ప్రసన్నురాలు అయింది గంగ.
“గగన గంగావతరణం అనే కావ్యం నాకోసం ప్రత్యేకంగా రాశావు కదా నాయనా నీకు ఏమి ఇవ్వలేదు నేను” అంది నొచ్చుకుంటూ.. “ఇచ్చావు తల్లీ, అన్నీ ఇచ్చావు అందరూ దేవతలు ఇచ్చారు . నేను అదృష్టవంతుడిని నాకోసం వచ్చావు ఇది చాలద్దా నా జన్మకి” అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అర్గ్య పానాదులు అందుకున్నాక నాయనా మళ్లీ భూమికి వెళ్తావా అని వాత్సల్యంగా అడిగింది. అందరూ అనుమతిస్తే వెళ్తాను అమ్మా” అన్నాడు ఆయన. “వద్దు వద్దు” అన్నారు గంధర్వులు ఆందోళనగా.
“నాయనా అద్భుతమైన రంగుల చిత్రాలు గీసావు. ఎన్నో మంచి పాటలు రాసావు. నా మీద గరుడుడి మీద కాళీ మాత మీద పుస్తకాలు రాశావు. చలన చిత్రాలు తీశావు, పాటలకు వరసలు కట్టావు పాడావు..జీవితమంతా నీకు నచ్చినట్టు గడిపావు. పిల్లల వృద్ధిని చూసావు ఉన్నతినీ చూసావు సోదరుల అభిమాన పాత్రుడివి అయ్యావు . అనేక మంది శిష్యులని పొందావు ఎందరినో అభిమానించావు ఎందరి అభిమానాన్నో సంపాదించుకున్నావు. ఇంకా ఏమి కావాలి అని భూమి మీదకి వెళ్ళాలి అనుకుంటున్నావు?”
“అమ్మా కావాలి అనే ఇలా అడుగుతున్నావు కదూ. భూమి మీదకి వెళ్ళడానికి ఎన్నో కారణాలు చెప్పగలను నేను. అనుకున్న పనులు అన్నీ పూర్తి చేయాలి అంటే మళ్లీ వెళ్లాలి, అని చెప్పవచ్చు కానీ భూమి మీద నువ్వు ఉన్నావు. ఈ ఒక్క కారణం చాలదా అమ్మా నేను
మళ్లీ భూలోకం రావడానికి అన్నాడు” గంగమ్మ చాలగా నవ్వింది ఆయన తల నిమిరింది.
అంతర్ధానం అయిపోయింది.. ఇది అక్కడ ఉన్న గంధర్వులు అంతా మంత్ర ముగ్ధులు అయ్యి చూస్తున్నారు. అమృతోత్సవం ప్రారంభం అయింది అంతా ఆనంద సంబరంలో మునిగి తేలుతున్నారు చిత్ర అబ్బురంగా చూస్తోంది. అప్పటికే ఆమెకు ఆయన గురించి అంతా తెలిసింది. మన మధ్య శాపవశాన ఈ భూమి మీద నివసించిన ఆ మహా మనీషి పేరు “కోడూరి శివ శక్తి దత్త” ఆయన గొప్ప చిత్రాలు గీసారు. శ్రీ లక్ష్మి ని గీశారు..స్వామి వారిని గీసారు “పదివేల శేషుల పడగల మయము” అనే శేషాచలాన్ని తన కుంచె తో చిత్రీకరించారు. హనుమంతుణ్ణి గరుత్మంతుణ్ణి ఇంకా ఎన్నో పురాణ పాత్రుల్ని అద్భుతంగా చిత్రిం చారు. విలక్షణమైన ఆయన శైలి అసామాన్యం. ఆయన పుస్తకాలు రాశారు. ఆ భాష అపురూపం. భళి భళి రా భళి సాహో రే బాహుబలి”, “అమ్మ అవని” లాంటి గొప్ప పాటలు రాశారు.
కీరవాణి లాంటి సంగీత “మరకతమణి”ని సినిమా ప్రపంచానికి అందించారు.“విశ్రాంతి అనే పదాన్ని ఎడమ కాలితో తన్ని చివరి వరకు ఆనందంగా పని చేస్తూ రాస్తూ, బొమ్మలు గీస్తూ, కథలు చెప్తూ, తన ప్రియ సోదరుడు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారితో, DR. రామకృష్ణ గారితో చర్చిస్తూ నిరంతరం కళాత్మకంగా కనిపిస్తూ కళాకారుడిగా తనువు చాలించిన, మన మధ్య మామూలుగా గడిపిన ఆ మహానుభావుడికి నీరాజనం ఈ స్మృతి రచన”.
గురువర్యా!! మీతో గడిపిన సమయం, పంచుకున్న కథలు విందులు, మీ ఆప్యాయత, మీ కుటుంబ సభ్యులతో పాటు మమల్ని ఆదరించిన మీ అభిమానం, మీ ప్రేమ ఆజన్మాంతం మా జ్ఞాపకాల్లో సజీవంగా ఉంటాయి మీరు మళ్లీ ఈ భూమి మీదకి వస్తారు అని తెలుసు. గొప్ప కళా ప్రదర్శన కూడా చేస్తారు అని తెలుసు. అంత వరకు మీకు
సగౌరవ వందనాలు తెలుపుతూ,
వీడ్కోలు.