ఆర్బీకేలకు అంత సీన్ ఉందా?
యూరియాకోసంవేకువనుంచేఅల్లంతదూరంకనిపించే ’చీమలదండులు’ కనుమరుగయ్యాయా!? రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయా?
(టి.నరసింహారావు, విజయవాడ)
ఏటికి ఎదురీదిన రైతు బతుకులు ఇప్పుడు సేదతీరుతున్నాయి. విత్తనాల కోసం, యూరియా కోసం వేకువ నుంచే అల్లంత దూరం కనిపించే ’చీమల దండులు’ కనుమరుగయ్యాయి. దళారుల దందాకు అరదండాలు పడ్డాయి. సాగుబడికి స్వేచ్ఛ, అన్నదాతకు విముక్తి దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరదృష్టితో చేసిన రైతు భరోసా కేంద్రాల ప్రయోగం స్వల్పకాలంలోనే సత్ఫలితాలను ఇచ్చింది. అన్నదాతను సిద్ధం చేసి అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు యావత్ దేశాన్నీ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వైపు చూసేలా చేసింది.
ఊరికో రైతు భరోసా కేంద్రం..
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఒకటి చొప్పున 10,778 డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నవరత్నాలలో భాగంగా ఏర్పాటైన ఈ కేంద్రాల లక్ష్యం పంట ఉత్పాదకతను మెరుగుపర్చడం, సాగు ఖర్చును తగ్గించడం. ఇందుకు అవసరమైన అన్ని రకాల ఉత్పదకాలు– విత్తనం మొదలు విక్రయం– వరకు రైతు ఇంటి ముంగిటే అందించడం లక్ష్యం. నాణ్యతలో రాజీ లేకుండా సరఫరాలో జాప్యం లేకుండా రైతు సేవలన్నీ ఒకే చోట అందించడమే ఆర్బీకేల ఉద్దేశం.
నెరవేరిన ప్రభుత్వ లక్ష్యం..
హబ్, స్పోక్స్ నమూనాలో ఏర్పాటైన ఆర్బీకేలు అద్భుత ఫలితాను ఇస్తున్నాయి. వ్యవసాయ విస్తరణలో భాగంగా శాస్త్రవేత్తలు ఆవిష్కరించే కొత్త విషయాలు రైతులకు చేరుతున్నాయి. నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర సామాగ్రి రైతుల ముంగిటే అందుతున్నాయి.
ఇ–పంట నమోదు పెద్ద ముందడుగు...
ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏ కొందరికో పరిమితం కాకుండా వాస్తవ సాగుదార్లకు అందుతున్నాయంటే దానికి కారణం ఎలక్ట్రానిక్ పంట నమోదే. ఆయా గ్రామ పరిధిలోని అన్నదాతలు తాము సాగు చేసే పంటను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి లబ్ధీ పొందుతున్నారు. ఆర్బీకేలు రైతుకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా పని చేస్తున్నాయనడంలో సందేహమే లేదని రైతు సంఘాల నాయకులే చెప్పడం విశేషం.
ఆర్బీకేలలో అందుతున్న సేవలపై సంతృప్తి..
పంటల బీమా మొదలు ఉత్పత్తుల విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలలో అందుతున్న సేవలపై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూ రికార్డుల్లో తప్పులుంటే తప్ప నిర్దేశించిన ప్రతిదీ సమయానికి అందుతోంది. రైతుకు ఏదన్నా జరిగితే చెప్పుకోవడానికి ఇప్పుడో కేంద్రం ఉందన్న భరోసా ఉంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. మూగ జీవాలు చచ్చిపోతే వాటి బీమా కోసం కాలి గిట్టల్నో, చెవి పోగుల్లో గోతాల్లో వేసుకుని పోవాల్సి వచ్చేది, ఈవేళ ఆర్బీకేకి వెళ్లి పశుసంవర్ధక శాఖ సహాయకునికి చెబితే సరిపోతుంది. నాసిరకం ఉత్పత్తుల్ని రైతులకు అంటగట్టేందుకు ప్రైవేటు డీలర్లు భయపడుతున్నారంటే ఆర్బీకేల వల్లేనని రైతు నాయకుడు వంగల భరత్ రెడ్డి చెప్పారు.
కనీస మద్దతు ధర కల్పించంలో కీలక పాత్ర– హెచ్.అరుణ్ కుమార్, ఐఎఎస్ అధికారి
పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిలాషకు నిలువెత్తు నిదర్శనం ఆర్బీకేలు. ఇవి సీఎం మానసపుత్రికలు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, అపరాలు, నూనె గింజలు, ఇతర వాణిజ్య పంటలకు కనీస మద్దతు ధరలు తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు కూడా ఆర్బీకేలు తోడ్పడుతున్నాయి. ఆర్బీకేలు ఉండబట్టే ప్రైవేటు వ్యాపారుల ఆగడాలు ఆగాయి. త్వరలో గిడ్డంగులు కూడా వస్తాయి. అవి వస్తే రైతులకు ఇంకా మేలు జరుగుతుంది.
ఆర్బీకేల ప్రయోగం దేశానికే ఆదర్శం.. కన్నబాబు, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి
ఆర్బీకేలు వచ్చిన తర్వాత విత్తనాల కోసం క్యూలు లేవు. ధరల్లో తేడాలు లేవు. ఎంఎస్‌పీ ప్రకారం కొనకపోతే ఫిర్యాదు చేసే వ్యవస్థ ఒకటి ఈవేళ ఏర్పాటైంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికీ ఒక వ్యవస్థ ఏర్పాటైంది. పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతుంది.
ఆర్బీకేలతో అద్భుతాలు– డాక్టర్ జీఆర్ చింతల, నాబార్డ్ మాజీ ఛైర్మన్
రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న ఆర్బీకేలను ప్రత్యక్షంగా చూశా. రైతులకు తలలో నాలుకలా ఉన్నాయి. సమగ్ర రైతు సేవలకు ఇవి సాక్షాత్తు కేంద్రాలు. ఆర్బీకేలను గ్రామీణ సహకార సంఘాలతో అనుసంధానం చేసే ఆలోచన చేస్తున్నాం. రైతుల సాధికారతలో గ్రామీణ పరపతి సంఘాలను ఆర్బీకేలతో అనుసంధానం చేస్తే అద్భుత ఫలితాలు రావొచ్చునని భావిస్తున్నాం.
(నోట్-రచయిత అభిప్రాయంతో ది ఫెడరల్. కామ్ ఏకీభవించాల్సిన అవసరం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాలని మనవి)