‘మార్కెట్’ క్రిస్మస్ మూలాలు ఎక్కడివి?
చార్లెస్ డార్విన్, రూసో, కార్ల్ మార్క్స్ ముగ్గురినీ కూడా బైబిల్ వాక్యాన్ని బోధించిన పాస్టర్ కుటుంబాల వారసత్వం నుంచే ‘చరిత్ర’ కన్నది.
ప్రపంచ దేశాలన్నీ కేవలం కొన్ని ‘విజువల్స్’ లేదా గుర్తులతో- ‘క్రిస్మస్ సీజన్’ను పండుగగా జరపడం చూస్తే, జీసస్ జన్మదినం చుట్టూ ఇంత కృతకం ఎలా చేరింది అనే అనుమానం మనకు కలుగుతుంది. ఆ దిశలో అస్సలు జరిగింది ఏమిటో చూద్దాం. మానవ చరిత్రలో ‘బైబిల్’ ప్రామాణికతకు ప్రాతిపదిక, అందులోని భవిష్యవాణి ప్రతికాలంలోను నిజం కావడం! జీసస్ జననానికి ఎంతో ముందుగా ఆయన మొదటి రాకడ, సిలువ మరణం -పునర్ధాన ప్రవచనాలు బైబిల్ ‘ఓల్డ్ టెస్ట్ మెంట్’ (పాతనిబంధన)లో 50 సార్లు పైగా చూస్తాం. బైబిల్ మొదటి భాగమైన ఆదికాండం నుండి చివరిదైన మలాకీ గ్రంథం మధ్య 2000 సంవత్సరాల వ్యవధి ఉంటే, పాత-కొత్త నిబంధనల మధ్య 400 ఏళ్ళ వ్యవధి ఉంది. మరి అంత ముందుగా ఎవరికైనా ఆ జననం విషయం ఎలా తెలిసింది?
ప్రవక్త మోజెస్ రాసిన బైబిల్ మొదటి ఐదు భాగాలలోని ఆదికాండంలో సృష్టికర్త అయిన ‘జెహోవా’ తొలి మానవ జంట ఆడం-ఈవ్ లను ‘ఈడెన్’ అనే వనంలో ఉంచితే, అందులోకి దుష్టాత్మ (శాటన్) సర్పరూపంలో ప్రవేశిస్తుంది. అది ‘ఆమె’ను మోసం చేసి ‘జెహోవా’ వారితో తినవద్దు, అని చెప్పిన చెట్టు ఫలం వారు తినేలా ప్రోత్సహించింది. దాంతో ‘జెహోవా’ తోటనుంచి ఆ జంటను బహిష్కరిస్తూ, ముందుగా సర్పాన్ని- ఇకముందు నువ్వు హీనప్రాణివి అవుతావు.. ‘ఆమె’ సంతానంతో నీకు నిత్యం వైరం... వారి కాలి మడెమను నువ్వు కరుస్తావు, నీ తలను వారు చితక కొడతారు’ అని శపిస్తాడు.
ఇందుకు దారి తీసిన పరిస్థితులు కూడా మనకు తెలియాలి. చీకటిలో నిశ్చల జలరాసుల మీద ఒంటరిగా వున్న దేవుని ఆత్మ, చీకటి నిరాకారము శూన్యంలో నుంచి మరో అందమైన సృష్టి చేయాలి, ప్రకృతి మీద మనిషిని యజమాని చేయాలి అనుకున్నాడు. కాని సృష్టికర్త ప్రణాళికను దుష్టాత్మ ఆదిలోనే వక్రమార్గం పట్టించాడు. ముందుగా “ఆ చెట్టు పండు మీరు తింటే మీరు దేవతలు అవుతారు, దాన్ని తినవచ్చు” అన్నాడు. ‘ఆమె’ కూడా వాటి ‘అందం’ అది కలిగించే ‘వివేకం’ పట్ల ఆకర్షించబడి సర్పం చెప్పినట్టు చేసింది.
అలా వాళ్ళు ఆయన సన్నిధి నుంచి బహిష్కృతులు అయితే, వారి వెంట పవిత్రాత్మ- దుష్టాత్మల మధ్య ఆధిపత్య పోరు, మరోసారి ‘ఈడెన్ గార్డెన్’ నుంచి ఈ లౌకిక ప్రపంచంలోకి ప్రవేశించింది. అందుకు బలమైన కారణముంది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చాక, వారి సంతానంలో మొదటివాడు అంటే ఆ ‘తోట’ బయట జరిగిన తొలి మానవ సృష్టి హంతకుడు అయ్యాడు. వాడు స్వంత తమ్ముణ్ణి పొలంలో ఈర్ష్యతో కొట్టి చంపాడు. ఇది చూసిన ‘జెహోవా’ - ‘బ్రతకమని నేను మీకు భూమిని అప్పగిస్తే, నేనిచ్చిన భూమి నెర్రల్లోకి నువ్వు నీ సోదరుని రక్తాన్ని ఇంకించావు, నీ కారణంగా నేను భూమిని శపిస్తున్నాను’ అన్నాడు.
అలా నూతన సృష్టిలోకూడా తను చేసిన తొలి మానవ జంటను స్వాధీనంలోకి తీసుకున్న దుష్టాత్మను చూసాక, ‘జెహోవా’ ప్రణాళిక మారింది. అలా భూమిపైకి ‘జీసస్’ రూపంలో సృష్టికర్త అయిన తండ్రి ‘జెహోవా’ ఆగమనం, ఆరంభంలోనే అనివార్యం అయింది. అలా ఆయనే స్వయంగా మానవ రూపంలో ఈ భూమిపైకి వచ్చి, మూడున్నర ఏళ్ళపాటు ఈ సమాజంలో సంచరించి, గతంలో ఇజ్రాయేలీయులకు తాను మోజెస్ ద్వారా ఇచ్చిన న్యాయ నిబంధనలను సరళీకరించి గతంలో తాను ఇచ్చిన ‘పది ఆజ్ఞ’లకు అదనంగా- ‘పొరుగువాని పట్ల ప్రేమ’ అనే పదకొండవ అజ్ఞ ఇచ్చి తిరిగి వెళ్ళిపోతూ, తన స్థానంలో మన దృష్టికి గోచరించని తన పరిశుద్ద ఆత్మను మనకిస్తూ, ‘గ్రేస్’ (కృప) అనే ఒక మానసిక భావనను మానవాళికి మనోనిబ్బరపు ‘గార్డు’గా చేసాడు. అందుకే వెళ్లేముందు- ‘నా కృప నీకు చాలును’ అంటాడు. కానీ అందుకు మన ‘ప్రార్ధన’ అనే ‘లైవ్ కనక్ట్’ తనతో నిత్యం ఉండాలి, అనే షరతు ఉంది. దానర్ధం- మరోసారి ఈ ఇద్దరి మధ్య దుష్టాత్మ (శాటన్) ప్రవేశం నిషిద్దం.
చిత్రం ఏమంటే, ఇవేవీ కంటికి కానరావు. కేవలం ఒక భావన. అయినప్పటికీ అది ప్రపంచ మతం అయింది. అయితే కావొచ్చు, కానీ అది నేటి ‘క్రిస్మస్’ను గ్లోబల్ మార్కెట్ అంశం ఎలా చేసింది? అనే సందేహం అలాగే వుంది. అందుకు ఇజ్రాయేలీయులు ఒక ‘రాజ్యం’గా ఏర్పడే క్రమంలో, వారు తమ వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునే ముందు జరిగింది ఏమిటో చూడాలి.
ప్రవక్త మోజెస్ ఇజ్రాయేలీయులు జోర్డాన్ నది దాటి కానానులోకి ప్రవేశించే ముందు ద్వితియోపదేశకాండము 4: 14-20 మధ్య “జెహోవా మాటల ధ్వని మాత్రమే మీరు విన్నారు కానీ, స్వరూపం మీరు చూడలేదు. కనుక ఆయన పేరుతో మీరు ఎటువంటి ప్రతిమ చేసి పూజించ వద్దు” అని స్పష్టంగా చెబుతాడు. ఆయన నోటి నుంచి వెలువడిన ధ్వని విని ఆ ఆజ్ఞలను నిక్షిప్తం చేసిన రెండు రాతి పలకలను మీరు పవిత్రంగా భద్రపరచమని చెబుతాడు. ‘వాక్యం’ మారేది ఒక భావనగానే కనుక, బైబిల్ రెండవ భాగంలో జాన్ ప్రవక్త తన గ్రంధాన్ని- ‘ఆదియందు వాక్యముండెను...’ అని ఆరంభిస్తాడు.
కనాను దేశంలో ఒక ‘రాజ్యం’గా ఏర్పడ్డాక వారి 12 వంశాలకు పాలకులుగా న్యాయాధిపతులు ఉండేవారు. వారు ‘మోజెస్ లా’ అమలు అయ్యేట్టుగా చూసేవారు. ఆ కాలంలో పొరుగు దేశాల్లో రాజులు ఉండేవారు, వారి దేవతలు వారి పూజలు వారికి వేరుగా ఉండేవి. ఆ దశలో ఇజ్రాయేలీయులు ప్రవక్త శామ్యూల్ వద్ద- ‘మాకు రాజు కావాలి’ అంటారు. రాజుతో ప్రజలకు ఉండే ఇబ్బంది ఆయన వారికీ చెబుతాడు. వారు వినరు. అప్పుడు ప్రవక్త పరిపాలన నియమావళి రాసి ఆ గ్రంథం దేవాలయంలో ఉంచి, రాజును ప్రతిష్టించాక అప్పుడు ఆ గ్రంధాన్ని అతని చేతికి ఇచ్చి, దీని ప్రకారం పాలన ఉండాలి అని చెబుతాడు.
మనకు తెలుసు ‘వాక్యం’ ఎక్కడైనా, ఎప్పుడైనా తుదకు అది రూపాంతరం చెందాల్సింది కార్యాచరణగానే. మనమూ ఎన్నికలు అంటే, ముందుగా ‘మేనిఫెస్టో’ కోసం వెతుకుతాం, అందులో ఏముందీ అని. బహుశా అందుకే కావొచ్చు- చార్లెస్ డార్విన్, రూసో, కార్ల్ మార్క్స్ ముగ్గురినీ కూడా బైబిల్ వాక్యాన్ని బోధించిన పాస్టర్ కుటుంబాల వారసత్వం నుంచే ‘చరిత్ర’ వారిని కన్నది. అలా ‘బైబిల్’కు బయట వాళ్ళు దాని స్పూర్తికి ఒక చారిత్రిక కొనసాగింపు అయ్యారు. ఆ తర్వాతి కాలంలో ఏర్పడిన ‘చర్చి’ అనే నిర్మాణానికి; ఆధిపత్యం - నాగరికత – పెట్టుబడి వంటి మనవైన కొత్త అవసరాలను అదనంగా మనం చేర్చాం. అలా ‘వాక్యం’ మనకు దూరం కావడానికి, ‘సర్పం’ నిత్యం మన అవసరాల జాబితాను కొత్త కొత్త ‘మార్కెట్’ గుర్తులతో ఎప్పుడూ ‘అప్డేట్’ చేస్తూ ఉంటుంది.