రేవంత్ ప్రారంభం బాగుంది, అయితే, ఈ జాగ్రత్తలు కూడా అవసరం
ముఖ్యమంత్రి, ఆయన కొడుకు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడి ప్రజా సంఘాల కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసే సాంప్రదాయం మొదలైంది. దానికి గుడ్ బై చెప్పండి
-కన్నెగంటి రవి
తెలంగాణ అసెంబ్లీ కి 2023 నవంబర్ 30 న ఎన్నికలు జరిగాయి. 2014 లో రాష్ట్ర ఆవిర్భావం జరిగాక, గత రెండు ఎన్నికలలో గెలిచి, తొమ్మిదేళ్ళకు పైగా అధికారం చెలాయించిన భారత రాష్ట్ర సమితి పార్టీ , ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిరంకుశంగా పాలన సాగించింది. ఈ నేపధ్యంలో ప్రజలు మార్పును కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
ముందస్తు అరెస్టులకు ముగింపు
నగరమంతా చాలా కాలంగా అమలులో ఉన్న సెక్షన్ 30, సెక్షన్ 144 లను రద్ధు చేయాలి. జిల్లాలలో ముఖ్యమంత్రి, ఆయన కొడుకు పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడి ప్రజా సంఘాల కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసే సాంప్రదాయం పోలీసులు ప్రారంభించారు. దీనిని కొత్త ప్రభుత్వం కొనసాగించ కూడదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో, రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తల పేరుతో పోలీసులు ముస్లిం యువకులను అరెస్టు చేయడం, వారి ఇళ్లపై దాడులు చేయడం, ముస్లిం ప్రజలు నివసించే బస్తీలలో కవాతులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం లాంటి అ ప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. వీటిని కొత్త ప్రభుత్వం మానుకోవాలి.
ఆదివాసీ ప్రాంతాలలో పోలీసులు ఆదివాసీలపై , వారికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులపై పోలీసులు అనేక అక్రమ కేసులు బనాయించారు. వాటిని పూర్తిగా ఎత్తేయాలి. TSPSC లీకేజీల పై విద్యార్ధుల ఉద్యమాల సందర్భంగా పోలీసులు బనాయించిన కేసులను కూడా కొత్త ప్రభుత్వం ఎత్తేయాలి. పోలీస్ లాకప్పులో మరణాలు,చిత్ర హింసలు ఆగిపోవాలి. వాటికి పాల్పడిన పోలీస్ అధికారులపై ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలన్నీ, ప్రజలకు ప్రభుత్వ పాలనపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం మెరుగు పడుతుంది.
దక్కాల్సిన వాళ్లకే దక్కాలి
హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకునే ముందు, కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా పథకం ఎవరిని ఉద్దేశించి ప్రకటించారో , వారికి మాత్రమే లబ్ధి జరిగేలా, సరైన మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. పథకం ప్రయోజనాలు పొందడానికి అవసరమైన ప్రభుత్వ పత్రాలు (రేషన్ కార్డు లాంటివి ) ఇతర గుర్తింపు కార్డులను, అవినీతికి తావు లేకుండా అర్హులకు అందించడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలి. పథకం అమలుకు అవసరమైన నిధులను వార్షిక బడ్జెట్ లో పూర్తి స్థాయిలో కేటాయించుకోవాలి. పథకం అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళిక కూడా ఉండాలి.
పథకాలను వివిధ కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో నిర్వహించేతప్పుడు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ లకు సకాలంలో నిధులు బదిలీ చేయడానికి ప్రణాళిక ఉండాలి. ప్రతి పథకం అమలు తీరును చట్టబద్ధంగా సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) పరిధి లోకి తీసుకు రావాలి. పథకం జీవో లను , మార్గ దర్శకాలను, సర్క్యులర్లను, లబ్ధి దారుల వివరాలను ప్రతి సంవత్సరం పబ్లిక్ డొమైన్ లో ( ఆయా శాఖల వెబ్ సైట్స్ , తెలుగు భాషలో వార్షిక నివేదికలు, గ్రామ పంచాయితీ నోటీస్ బోర్డు పై ప్రదర్శన ) ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి.
ఆశాజనకమయిన ప్రారంభం
కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు . ఇది అవసరమైన హామీ. ప్రజల పౌర , ప్రజాస్వామిక హక్కులను కాపాడడానికి ఆచరణలో తగిన చర్యలు వేగంగా తీసుకోవాలి. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ చుట్టూ కంచెలను కూలగొట్టి, జ్యోతీబా ఫూలే ప్రజా భవన్ గా మార్చి, అందులోకి ఆంక్షలు లేకుండా, ప్రజలకు ప్రవేశం కల్పించి, ప్రజా దర్భార్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇది స్వాగతించాల్సిన చర్య. ప్రజలు దరఖాస్తులతో వచ్చి , సంబంధిత అధికారికి తమ సమస్యను నివేదింప్పుడు, వారికి కూర్చుచేటప్పుడు కూర్చుని మాట్లాడే అవకాశం ఉండాలి. వృద్ధులకు, వికలాంగులకు ఇది సౌకర్యంగా ఉంటుంది.
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, వ్యయ ప్రయాసల కోర్చి,హైదరాబాద్ ప్రజా దర్బార్ కు వచ్చే ప్రజలపై రవాణా చార్జీల భారం తగ్గించడానికి స్థానిక పాలనా వ్యవస్థను మెరుగు పరచాలి .
వలంటీర్ల మీద గ్రామసచివాలయం పర్యవేక్షణ
ఆంధ్ర ప్రదేశ్ తరహాలో గ్రామ పంచాయితీ స్థాయిలో సచివాలయం ఏర్పాటు చేస్తే , ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది . ఎక్కువ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారం అవుతాయి. అన్నిప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు , కానీ ఈ వాలంటరీ వ్యవస్థ అర్హతలను నిర్ధిష్టంగా నిర్ణయించి, వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలి. ఎంపిక చేసిన వారికి , గౌరవ భృతి లాగా కాకుండా రాష్ట్ర కనీస వేతనాలను, సాంఘిక బధ్రతను అందించాలి . వీరి పర్యవేక్షణ గ్రామ సచివాలయం చేయాలి.
మండల రెవెన్యూ వ్యవస్థను మెరుగు పర్చడం ద్వారా , తగిన సిబ్బంది, నిధులు, మార్గదర్శకాలు రూపొందించి , ప్రజల సమస్యలు పరిష్కరించాలి. నియోజక వర్గ స్థాయి ప్రజా దర్బార్ లు కూడా మంచివే కానీ, వాటిని నిర్ధిష్ట కాలపరిమితిలో నిర్వహించాలి. వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం అన్నిటికంటే ముఖ్యం. లేకుంటే ప్రజలు మళ్ళీ ఆఫీసు ల చుట్టూ తిరిగి అలసి పోతారు. నష్టపోతారు.
పౌర సేవల చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు ఒక సమగ్రమైన పోర్టల్ ను ఏర్పాటు చేసి , ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. ఇది మొదటి అసెంబ్లీ సమావేశాలలోనే ఆమోదించాలి . ఇప్పటికే అటువంటి చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు ఆమోదించి, అమలు చేస్తున్నాయి. వాటి అనుభవాలను కూడా చూసి, తగిన మార్పులతో తెలంగాణ పౌర సేవల చట్టాన్ని తీసుకు రావాలి.
అలాగే రాష్ట్ర సచివాలయంలోకి ప్రజల ప్రవేశానికి అవకాశం కల్పించడం కూడా మంచి చర్య. మంత్రులు, శాసన సభ్యులు , అధికారులు, ఉద్యోగులు , ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించడం, ఆధిపత్య ధోరణులను, అహంభావాలను తగ్గించుకుని , ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం అవసరం. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు, పాలకుల లాగా కాకుండా, ప్రజలకు సేవకులుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది వ్యవహరించడం, ప్రజలకు మేలు చేస్తుంది.
ప్రజల నుండి లంచాలను ఆశించి , అవినీతికి పాల్పడే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కటినంగా వ్యవహరించాలి. ప్రజా ఫిర్యాదుల కొరకు , ఒక టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు కనుక , దానిని వెంటనే అమలులోకి తేవాలి. ఫిర్యాదుల పరిష్కారానికి కూడా తగిన సిబ్బందిని నియమించాలి. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ధిష్ట కాలపరిమితి నిర్ణయించాలి . అమలు చేయాలి. ఏదైనా దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పుడు, అప్పీల్ కు కావలసిన యంత్రాంగం పై కూడా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలకు, అవినీతికి ఇదే ప్రభుత్వ సిబ్బంది సహకరించారు అన్నది దృష్టిలో ఉంచుకుంటే, ఇది ఎంత కష్టమైన కర్తవ్యమో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజలపై అవినీతి భారం తగ్గాలంటే, ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. విజిల్ బ్లౌయర్స్ కు కూడా తగిన రక్షణ కల్పించాలి.
ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి , ఎదురు చూసి, సకాలంలో పరిష్కారం కాక , నిరసన వ్యక్తం చేయడానికి పూనుకుంటే, పోలీసులను ఉపయోగించి, అణచి వేయడం కాక , ఆయా ప్రజా సమూహాలతో , సంఘాలతో ఉన్నత స్థాయి అధికారులతో చర్చలకు ఏర్పాటు చేసి , పరిష్కరించాలి. హై కోర్టు ఆదేశాల మేరకు , ఎటువంతు అనుమతి లేకుండా, కేవలం సమాచారంతో, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ప్రజా నిరసనకు, భావాల వ్యక్తీకరణకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. ఆ ప్రాంతంలో జమకూడే ప్రజల సంఖ్యపై పోలీస్ ఆంక్షలను పూర్తిగా రద్ధు చేయాలి.
కార్మిక సంఘాలను అనుమతించాలి
ఆర్టీసీ ,సింగరేణి సహా, ఏ రంగంలో అయినా కార్మిక సంఘాలను, సమ్మెలను నిషేధించే వైఖరి గత ప్రభుత్వం చేపట్టింది.కొత్త ప్రభుత్వం ఆయా రంగాలలో కార్మిక , ఉద్యోగ సంఘాల కార్యకలాపాలకు అనుమతించాలి. ఆయా సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి.
తప్పుడు కేసులు ఎత్తేయాలి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఉద్యమ కారులపై, సాధారణ ప్రజలపై పెట్టిన పోలీసు కేసులను ఎత్తేయలని ప్రభుత్వం నిర్ణయించడం మంచిదే. కానీ 2014 జూన్ 2 నుండీ 2023 డిసెంబర్ 1 వరకూ కూడా అనేకమంది ప్రజా సంఘాల, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై గత ప్రభుత్వం అనేక అక్రమ కేసులను బనాయించింది. వాటిని కూడా కొత్త ప్రభుత్వం పూర్తిగా ఎత్తేయాలి. ముఖ్యంగా అనేకమందిపై యూఏపిఏ లాంటి చట్టాల క్రింద కేసులను బనాయించారు. వాటిని కూడా వెంటనే ఎత్తేయాలి. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో కొన్ని ప్రజా సంఘాలపై, పార్టీలపై నిషేధం విధించాయి. ప్రజాస్వామిక పాలనలో ఈ నిషేధాలు సబబు కాదు. ఆ నిషేధాలను కూడా ఎత్తేయాలి.
(కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక , హైదరాబాద్)