కులగణన పూర్తయిందిగా, ఇక కులాల మేలుకు ప్రణాళిక వేయండి
x

కులగణన పూర్తయిందిగా, ఇక కులాల మేలుకు ప్రణాళిక వేయండి

తెలంగాణలో కుల గణన పై సామాజిక కార్యకర్త కన్నెగంటి రవి విశ్లేషణ

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కుల గణన పూర్తయింది. ఈ కుల గణనలో కొన్ని లోపాలున్నా, ఈ కీలకమైన ప్రక్రియను పూర్తి చేసిన రేవంత్ ప్రభుత్వానికి తప్పకుండా అభినందనలు చెప్పాలి. ఈ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బందికి కూడా అభినందనలు.

అయితే ఇంత కీలకమైన ఈ ప్రక్రియకు సరైన శిక్షణ, అవగాహన కల్పించకుండానే, మహిళా సంఘాల సభ్యులను ఎంపిక చేసి, సర్వే కోసం ఇళ్లకు పంపారు. నిజానికి మా ఇంటికి వచ్చిన సర్వేయర్ మహిళ, తొలి ప్రశ్నలకే తెల్ల మొఖం వేసింది. ముఖ్యంగా కులం పేరు రాయాల్సిన చోట ఏ కులమూ కాదు అని ఎంచుకునే ఆప్షన్ కూడా ఈ సార్ ఉండింది. మేము దానిని రాయించాలి అని అనుకున్నాము. కానీ అలా రాయడానికి లేదని ఆ సర్వేయర్ చెప్పింది. తాను తెచ్చుకున్న గైడ్ లైన్స్ లో కోర్టు తీర్పు వచ్చిన తరువాత చేర్చిన ఈ ఆప్షన్ ను అప్డేట్ చేయలేదు . వారికి ఇచ్చిన శిక్షణలో కూడా ఈ అంశాన్ని వాళ్ళకు ప్రత్యేకించి చెప్పినట్లు లేదు. కాబట్టి, తాను ఫారం లో ఉన్న ఆప్షన్ లలో నుండే ఏదైనా ఆప్షన్ ఎంచుకోవాలని కోరింది. మేము అందుకు అభ్యంతరం చెప్పాము.

తమ సూపర్ వైజర్ ను అడిగి మళ్ళీ వస్తాను అని ఆమె చెప్పి వెళ్ళింది. కానీ సర్వే జరిగిన రోజుల్లో తిరిగి మా ఇంటి ముఖం చూడలేదు. కాబట్టి ఈ సర్వే లో మా కుటుంబ సభ్యుల వివరాలు లేవు. మేము ఇందుకోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేదు. ఇలాంటి సమస్యలను మరి కొందరు కూడా మా దృష్టికి తీసుకు వచ్చారు. ప్రభుత్వం ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరి 5 న అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన ఈ కుల గణన నివేదిక పూర్తి ప్రతిని ప్రజల ముందు పెట్టే కంటే ముందే, సర్వే లో మిస్ అయిన కుటుంబాల కోసం ఒక తేదీని ప్రత్యేకించి అనౌన్స్ చేసి ఆయా కుటుంబాల సర్వే పూర్తి చేయించడానికి పూనుకోవాలని మా విజ్ఞప్తి. సర్వే లో పాల్గొనడం ఇష్టం లేని వాళ్ళు ఎలాగూ తమ వివరాలు చెప్పరు.

2015 లో అప్పుడు అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ఒకే రోజు రాష్ట్రమంతా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. కానీ, ఆ నివేదికలోని వివరాలను , ప్రభుత్వ పాలన కోసం ఉపయోగించుకుని ఉండొచ్చు కానీ, ప్రజల ముందు పూర్తి నివేదికను ఉంచలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సర్వే చేయించింది. ఈ సర్వే లో అనేక అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజల స్థితి గతులపై ఒక అంచనాకు రావడానికి, గత ప్రభుత్వం చేసిన సర్వే నివేదికను, ఇప్పటి తాజా నివేదికను పూర్తిగా ప్రజల ముందు ఉంచాలి. గత పదేళ్ళ కాలంలో రాష్ట్రంలో వివిధ సామాజిక బృందాల అభివృద్ధిలో ఎటువంటి మార్పులు వచ్చాయో అర్థం చేసుకోవడానికి ఈ రెండు నివేదికల విశ్లేషణ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రజా సంఘాలు ఒక అవగాహనకు వచ్చి, ప్రభుత్వం ముందు నిర్ధిష్ట డిమాండ్లు ఉంచడానికి వీలవుతుంది. దేశంలో కులగణన విషయంలో ముందడుగు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పూర్తి స్థాయి నివేదికలను ప్రజల ముందు ఉంచడానికి కూడా ముందడుగు వేయాలి.

అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన కులగణన వివరాల ప్రకారం నవంబర్ 6 నుండీ డిసెంబర్ 25 వరకూ 50 రోజుల పాటు జరిగిన సర్వే లో, రాష్ట్రంలో 3,54,77,554 మంది( 1,12,15,134 కుటుంబాలు) తమ వివరాలు అందించారు . సామాజిక, ఆర్ధిక , ఉపాధి , రాజకీయ ప్రాతినిధ్యం , కుల అంశాలపై ఈ సర్వే లో ప్రశ్నలు అడిగారు.

కులగణన లో బయట పడిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,64,09,170 మంది ( 46.25 శాతం) వెనుకబడిన వర్గాల ప్రజలున్నారు. మరో 61,84,319 మంది (17.43 శాతం)షెడ్యూల్డ్ కులాల ప్రజలున్నారు మరో 37,05,929 మంది (10.45 శాతం) షెడ్యూల్డ్ తెగల ప్రజలున్నారు. మరో 47,21,115 మంది ( 13.31 శాతం) ఇతర కులాల వారు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లిం జనాభా 44,57,012 మంది( 12.56 శాతం) . ముస్లిం ప్రజలలో 35,76,588 మంది ( 10.08 శాతం) వెనుక బడిన వర్గాల వారు కాగా, ఇతర కులాల వారు 8,80,424 ( 2.48 శాతం) మందిగా ఉన్నారు. . మొత్తంగా ఇతర కులాల వారు (OC) రాష్ట్రంలో ( 47,21,115+ 8,80,424) 15.79 శాతంగా తేలారు.

సాధారణంగా సామాజిక వర్గాల వారీగా వివరాలను పూర్తి స్థాయిలో బయట పెట్టడానికి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వెనకాడడానికి ప్రధాన కారణం, ఇప్పటి వరకూ జనాభా దామాషా తో సంబంధం లేకుండా కొన్ని ఆధిపత్య కులాలు ఆర్ధిక, రాజకీయ రంగాలలో అత్యధిక వాటా పొందుతున్నాయి. కులగణన జరిగి, సామాజిక, ఆర్ధిక, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలలో ఆయా సామాజిక వర్గాలు ఏ మేరకు లబ్ధి పొందుతున్నాయి, ఎవరు బాగా వెనుకబడి ఉన్నారు అనేది బయట పడితే, తమ ప్రయోజనాలకు ఎక్కడ దెబ్బ తగులుతుందో అనేది ఆధిపత్య కులాల భయం. కానీ రాజ్యాంగపు ప్రాధమిక హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం అన్ని వనరులలో సామాన్య అవకాశాలు , వాటా లు ప్రజలందరికీ అందాలి. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు. ఫలితంగా సమాజంలో సామాజిక, ఆర్ధిక అంతరాలు బాగా పెరిగిపోయాయి.

పైగా గత 5 దశాబ్ధాలుగా భూ సంస్కరణల చట్టాలు కూడా అమలు కాక , గ్రామీణ పేదలకు ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సాగు భూమి పై హక్కులు దక్కలేదు. ఎస్. సి, ఎస్. టి వర్గాలకు ఇప్పటి వరకూ బడ్జెట్ కేటాయింపులలో నిర్ధిష్ట వాటా చట్టప్రకారం చూపిస్తున్నప్పటికీ, ఆచరణలో దానికి అనుగుణంగా ఖర్చు చేయడం లేదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే, ఎస్. సి , ఎస్. టి ప్రజలకు బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కేటాయించే నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలి. ఆ నిధుల దారి మళ్లింపును ఆపాలి. అలాగే భూ సంస్కరణలను అమలు చేసి, 1973 భూ గరిష్ట చట్టం ప్రకారం, మిగులు భూములను తేల్చి, భూమిలేని పేదలకు పంచాలి.

వెనుకబడిన వర్గాల ప్రజలకు జనాభా దామాషా ప్రకారం ఇప్పటికీ బడ్జెట్ లో నిధులు దక్కడం లేదు. ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఇందుకోసం బీసీ సబ్ ప్లాన్ చట్ట బద్ధంగా రూపొందించి, వారికి కూడా జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని స్థాయిలలో రాజకీయ ప్రాతినిధ్య వ్యవస్థలో వారికి స్థానాలు కల్పించాలి. రాజకీయ పార్టీలలో కూడా ఆయా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆయా వర్గాల ప్రజల గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ అప్పుడే బలపడుతుంది.

కులగణన లో ముస్లిం ప్రజల జనాభాను కూడా ప్రత్యేకించి లెక్కించడం మంచి పరిణామం. మొత్తం ముస్లిం ప్రజలు 12.56 శాతంలో 10.08 శాతం వెనుకబడిన వర్గాల వారేనని కూడా ఈ సందర్భంగా బయట పడింది. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 44,57,012 మంది ముస్లిం ప్రజల కోసం ప్రభుత్వాలు ఎంతో చేయాల్సి ఉందని స్పష్టంగా అర్థమవుతుంది.

గతంలో అమలయినట్లుగా వెనుకబడిన ముస్లిం ప్రజలకు వారి జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్ లను నిర్ధిష్టంగా అమలు చేయడంతో పాటు, ముస్లిం ప్రజల వెనుకబాటు తనం పోగొట్టడానికి సచార్ కమిటీ, సుధీర్ కమిటీ సిఫారసులను అమలు చేయడానికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలి.

ముస్లిం జనాభాకు అనుగుణంగా ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో తగిన స్థానాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి. కార్పొరేషన్ లు, కమిషన్ లు , స్థానిక సంస్థలు – అన్ని చోట్లా ముస్లిం లకు ప్రాతినిధ్యం కల్పించాలి. బీజేపీ హిందుత్వ ఫాసిస్టు ఎజెండాతో, ముస్లిం ప్రజలను ఒక కార్నర్ కు నెడుతున్నది. మిగిలిన పార్టీలు కూడా ఈ ట్రాప్ లో పడి , ముస్లిం ప్రజలకు అన్యాయమే చేస్తున్నాయి. ముస్లిం ప్రజలకు తగిన ప్రాతినిధ్యం , బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించడం ద్వారానే సమాజంలో సరైన వాతావరణం ఏర్పడుతుంది. ముస్లిం ప్రజల గొంతు వినడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నం చేయకపోతే, ముస్లిం సమాజంలో పెరుగుతున్న అసహనానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించాలి. హైదరాబాద్ కు బయట అసెంబ్లీ లాంటి చట్ట సభలకు ఎన్నిక కావడానికి, ఆయా రాజకీయ పార్టీలు ముస్లిం అభ్యర్ధులను ప్రోత్సహించి ఎంపిక చేయడం కూడా అవసరం.

మొత్తం రాష్ట్ర జనాభాలో ( ముస్లిం జనాభాను మినహాయిస్తే) ఆధిపత్య కులాల ప్రజలు ( ఇతర కులాల పేరుతో) కేవలం 13.31 శాతమే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా వెనకబడిన వర్గాల పేరుతో ( EBC) ఈ సమూహానికి 10 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తూ చట్టం చేసింది. అది దేశమంతా అమలవుతున్నది. దీని దుష్ఫలితాలు ఇప్పటికే వివిధ విద్యా సంస్థలలో ప్రవేశాల సమయంలో స్పష్టంగా బయట పడుతున్నాయి. సాధారణంగా ఆధిపత్య కులాల వారికి, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాలు, ముస్లిం ప్రజలలో వెనుకబడిన వర్గాల వారికి ఇచ్చే రిజర్వేషన్ ల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. అవకాశం దొరకినప్పుడల్లా ఈ రిజర్వేషన్ ల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, ప్రతిభకు స్థానం లేకుండా పోతుందని వాపోవడం చూస్తుంటాం. కానీ ఈ కులగణన తరువాత జనాభాలో 13. 31 మాత్రమే ఉన్న ఆధిపత్య కులాలు, ఆర్ధికంగా వెనుకబడి ఉన్నాం అనే పేరుతో ( దీనికి నిర్ణయించిన ఆర్ధిక కొలమానం కూడా అన్యాయమే ) 10 శాతం రిజర్వేషన్ లు పొందడం అంటే, నిజమైన అన్యాయం ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ల పేరుతో మోడీ ప్రభుత్వం చేసిన ఈ దురన్యాయాన్ని, సామాజిక న్యాయం కోరుకునే అందరూ వ్యతిరేకించాలి.

Read More
Next Story