ఇథనాల్ మాయ, ఇండస్ట్రీ లాభదాయకం కాదంటున్నారు...
x
చిత్తనూర్, దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమల బాధితుల సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్

ఇథనాల్ మాయ, ఇండస్ట్రీ లాభదాయకం కాదంటున్నారు...

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ క్షేత్ర పర్య టన చేసి ఇథనాల్ పరిశ్రమ నిజం నిగ్గు తేల్చాలి


తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 30 ఇథనాల్ పరిశ్రమల విషయంలో అంతర్జాతీయంగా వస్తున్న నివేదికలను కూడా అధ్యయనం చర్చించి,క్షేత్ర స్థాయిలో పర్యటించి, గ్రామీణ ప్రజల అభిప్రాయాలు,అనుభవాలు కూడా విని, రైతు సంఘాల, రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సిఫారసులు చేయాలని నవంబర్ 7 న తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిషన్ సమావేశం నిర్ణయించింది.

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక చేసిన విజ్ఞప్తి మేరకు జరిగిన ఈ సమావేశంలో కమిషన్ సభ్యులతో పాటు, చిత్తనూరు, దిలావర్ పూర్ లాంటి గ్రామాల బాధిత రైతులు, శాసన మండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ రామ్, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ నాయకులు డాక్టర్ బాబూరావు , వెంకటరెడ్డి, తెలంగాణ పపీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి. కొండల్ రెడ్డి, కన్నెగంటి రవి, బండారి లక్ష్మయ్య, ఆరేపల్లి విజయ్ కుమార్ , రామారావు, విస్సా కిరణ్ కుమార్ , ఇండస్ట్రీ ప్రతినిధులు మాజీ శాసన సభ్యులు KLR, డాక్టర్ శివరాం, రేమండ్ పీటర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులు క్షేత్ర స్థాయి అనుభవాలతో తమ ఆవేదన వినిపించారు. పరిశ్రమల యాజమాన్యాలు తాము ఇథనాల్ ఇండస్ట్రీ ని నడుపు తున్నప్పటికీ, అందులో లాభాలు లేవని ప్రకటించారు. ఈ నేపధ్యంలో అసలు ఇథనాల్ ఇండస్ట్రీ ఏమిటి? ఎందుకు గ్రామీణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, కమిషన్ ముందుకు ఎందుకు ఈ కేసు వచ్చింది,భవిష్యత్తులో ఏమి జరగాల్సి ఉండే అనే విషయలను సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది.



పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కాలపాలనే కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ పాలసీ 2021 కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలలో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు 30 కంపనీలు అనుమతులు పొందాయి. ప్రధానంగా ఈ పరిశ్రమలు బియ్యం, నూకలు, మొక్క జొన్న , జొన్న లాంటి ఆహార ధాన్యాలతో ఇథనాల్ ఉత్పత్తిని చేస్తాయి.

ఇందులో నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు కేంద్రంగా ఏర్పాటైన ఇథనాల్ కంపనీ 2022 నుండీ ఇథనాల్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మిగిలిన కంపనీలు, నిర్మాణ దశలో ఉన్నాయి . వివిధ రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు, గ్రామాలు, వ్యవసాయ పొలాల మధ్యలో 25-30 ఎకరాలలో ఈ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పరిశ్రమల వల్ల స్థానిక రైతులకు లాభసాటి ధరలు లభిస్తాయనీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వల్ల, ఈ పరిశ్రమ కారణంగా ఎటువంటి కాలుష్యం ఉండదనీ , స్థానిక యువతకు ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తాయనీ, గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పరిశ్రమ యాజమాన్యం కృషి చేస్తుందనీ ఆయా పరిశ్రమల యాజమాన్యాలు గ్రామాలలో ప్రచారం సాగిస్తున్నాయి. కానీ ఈ ప్రచారం కోసం వినియోగిస్తున్న కరపత్రాలు, పోస్టర్స్ లో కంపనీ పేరు కానీ, యజమాని పేరు కానీ ఉండడం లేదు. వాటి కాపీలు మీకు అందిస్తున్నాము.
కానీ పరిశ్రమ యాజమాన్యాలు చెప్పిన దానికి భిన్నంగా , నారాయణ పేట జిల్లా చిత్తనూరు లో ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపనీ పక్కనే పారుతున్న మన్నేవాగు ను పూర్తిగా కలుషితం చేసింది. అలాగే ఈ కంపనీ నుండి వెలువడుతున్న వాయు కాలుష్యం, మూడు గ్రామాలతో మొదలై , ప్రస్తుతం 52 గ్రామాల వరకూ విస్తరించింది . ప్రజలు రాత్రి పూట నిద్ర పోలేని స్థితి ఏర్పడింది. ప్రజలలో అనారోగ్యాలు పెరుగుతున్నాయి. నదిలో కలుషిత జలాలు తాగి జింకలు చనిపోయాయి. ఆ నీళ్ళలో దిగిన పిల్లల చర్మం పై మచ్చలు ఏర్పడ్డాయి. స్థానికంగా ఆ గ్రామాలలో కూలీలు పని చేయడానికి రావాలంటే వెనకడుతున్నారు. పొలాల ధరలు కూడా పడిపోతున్నాయి.


ఈ పరిశ్రమ సృష్టిస్తున్న కాలుష్యానికి వ్యతిరేకంగా స్థానికంగా మూడు గ్రామాల ప్రజలు సంవత్సర కాలం పాటు, అనేక రూపాలలో పోరాడారు. వేలాది మందితో సభలు జరిపారు. NGT లో కేసులు వేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కు పదే పదే ఫిర్యాదులు చేశారు. స్థానిక మండల స్థాయి నుండీ, రాష్ట్ర స్థాయి వరకూ అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. కానీ, అప్పటి BRS ప్రభుత్వం ప్రజల గొడును పట్టించుకోకుండా, నిర్బంధంతో ప్రజల ఆందోళనలను అణచివేయడానికి ప్రయత్నం చేసింది . కేసులు పెట్టింది. ఆందోళన కు నాయకత్వం వహిస్తున్న వారిని జైలుకు పంపింది.

స్థానిక ఏకలాస్ పూర్ గ్రామస్థుడు, ఈ ఉద్యమంలో ప్రజలకు సంఘీభావం ప్రకటించిన బండారి లక్ష్మయ్య అనే జూనియర్ కాలేజీ లెక్చరర్ ను కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టారు. ఉద్యోగం నుండీ సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక, ఈ ప్రభుత్వ హయాంలో కూడా , పోలీసు అధికారులు ఒత్తిడి తెచ్చి. ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం విషాదం. అలాగే సస్పెన్షన్ ఎత్తేసినా , ఆయనను కక్ష సాధింపుగా, హైదరాబాద్ నుండీ దూర ప్రాంతానికి బదిలీ చేశారు. ప్రజల ఉద్యమాన్ని బలవంతంగా ఆపగలిగారు కానీ, అక్కడి ప్రజల మనసులను గెలుచుకోలేక పోయారు. ఇప్పటికీ కాలుష్య సమస్యను అక్కడి ప్రజలు భరించాల్సి వస్తున్నది.
చిత్తనూరు ప్రజల అనుభవాలను తెలుసుకున్న నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం, దిలావర్పూర్, గుండం పల్లి గ్రామాల ప్రజలు , తమ గ్రామాల మధ్య పంట పొలాలలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపనీని 2023 డిసెంబర్ నుండీ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారు. పోరాడుతున్న ప్రజలపై ఇప్పటి ప్రభుత్వం కూడా కేసులు బనాయిస్తూనే ఉంది. గత 100 రోజులకు పైగా దిలావర్ పూర్, గుండం పల్లి గ్రామాల ప్రజలు దీక్షలు చేస్తున్నారు.
స్థానికంగా పోరాడుతున్న ప్రజలకు సంఘీభావం ప్రకటించిన ఆరేపల్లి విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడిని ఉద్యోగం నుండీ నవమబర్ 2 న సస్పెండ్ చేసింది అక్కడి విద్యా శాఖ . ఇది ప్రజలను మరింత అశాంతికి గురిచేసింది.
అలాగే స్థానికంగా ప్రజలు బహిరంగ సభ పెట్టుకోవడానికి కూడా అనుమతించక పోవడంతో, రాష్ట్ర హై కోర్టు నుండీ అనుమతి తీసుకుని అక్టోబర్ 18 న సభ పెట్టుకోవాల్సివచ్చింది. 10,000 మందితో బహిరంగ సభ ప్రశాంతంగా జరిగింది.
రాష్ట్ర వ్యాపితంగా వివిధ జిల్లాలలో స్థానిక ప్రజలు, తమ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ కంపనీలకు వ్యతిరేకంగా .గ్రామాలలో తీర్మానాలు చేస్తున్నారు. గ్రామాలలో ఆందోళనలకు సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా ఈ క్రింది డిమాండ్లను కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళాము. .
1. ఇథనాల్ పరిశ్రమ –సమస్యలపై సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థ సభ్యులు , శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు , సామాజిక కార్యకర్తలు చెబుతున్న విషయాలను కమిషన్ సభ్యులు లోతుగా అధ్యయనం చేయాలని కోరుతున్నాము.
2. పారిశ్రామికీకరణ పేరుతో మన రాష్ట్రానికి ఏ మాత్రం ఉపయోగపడని, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను రాష్టంలో ఏర్పాటు చేయకుండా విచక్షణతో వ్యవహరించాలని కోరుతున్నాము.
3. సరైన ధ్యాయానం లేకుండానే, అన్ని అంశాలను లోతుగా పరిశీలించకుండానే, ఇథనాల్ పరిశ్రమలకు రాష్ట్రంలో విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేయడం కోసం అధికారులు చూపిస్తున్న ఆతృత అనేక అనుమానాలకు తావిస్తున్నది. పైగా ప్రజలకు నిజాలు చెప్పి, అలర్ట్ చేయాల్సిన ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా కంపనీల పక్షాన జవాబులు చెబుతూ , ప్రజలను మోసం చేయడాన్ని కమిషన్ సీరియస్ గా పరిగణించాలని కోరుతున్నాము.
4. నారాయణ పేట జిల్లా చిత్తనూరు ఇథనాల్ పరిశ్రమ, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో ఉన్న ఇథనాల్ పరిశ్రమ వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని పరిశీలించడానికి , ఒక స్వతంత్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఈ బృందంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిష సభ్యులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, రాష్ట్ర స్థాయి అధికారులు, సామాజిక కార్యకర్తలు భాగంగా ఉండేలా చూడాలి. ఈ బృందం ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడాలి. వారి అనుభవాలను తెలుసుకోవాలి. కంపనీని లోతుగా పరిశీలించాలి. వాళ్ళు వెదజల్లుతున్న కాలుష్యం గురించి వివరణలు తీసుకోవాలి.
5. స్థానిక రైతులకు ఈ కంపనీల వల్ల లాభం జరిగిందో లేదో తెలుసుకోవాలి. స్థానిక యవతకు ఈ కంపనీలో ఉద్యోగాలు వచ్చాయో లేదో తెలుసుకోవాలి . అధికారులు, కంపనీ యాజమాన్యాలు చెప్పే అబద్ధాలకు చెక్ పెట్టేలా, ప్రజలను విశ్వాసం లోకి తీసుకుని చేసే ఈ విచారణ ప్రజలకు నమ్మకం కలిగించేలా స్వతంత్రం గా సాగాలి. నిర్ధిష్ట గడువులోపు ఈ అధ్యయనం పూర్తి చేయాలి.
6. ఈ క్షేత్ర స్థాయి అధ్యయనం పూర్తి చేసి , నివేదిక వచ్చే వరకూ, రాష్ట వ్యాపితంగా అన్ని జిల్లాలలో ఆయా కంపెనీలు సాగిస్తున్న ఇథనాల్ ఉత్పత్తిని , నిర్మాణ కార్యకలాపాలను ఆపేసేలా కమిషన్ ఆదేశించాలి.
7. ఆయా జిల్లాలలో ప్రజలు ఇథనాల్ కంపనీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినప్పుడు ప్రజలపై పోలీసులు పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించు కునేలా కమిషన్ ఆదేశమివ్వాలి. చిత్తనూరు కంపనీ పరిధిలో బండారి లక్ష్మయ్య సహా, ఇతర కార్యకర్తలపై పెట్టిన రౌడీషీట్ ను తొలగించాలి. బండారి లక్ష్మయ్య గారిని లెక్చరర్ గా తిరిగి ఆయన పూర్వ స్థలానికి బదిలీ చేయాలి.
8. ఇథనాల్ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం తెలియ చేశాడనే కారణంగా నిర్మల్ పట్టణ ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆరేపల్లి విజయ్ కుమార్ గారి పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేలా కమిషన్ ఆ జిల్లా విద్యా శాఖకు సూచించాలి.
9. ఇథనాల్ పరిశ్రమలు ఏర్పడుతున్న గ్రామాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తొలగించడానికి వీటిని తక్షణ చర్యలుగా చేపట్టాలని కోరుతున్నాము.


Read More
Next Story