దుబాయ్ జైల్ నుంచి అమీనాబేగం ఎలా బ‌య‌ట‌ప‌డింది!
x

దుబాయ్ జైల్ నుంచి అమీనాబేగం ఎలా బ‌య‌ట‌ప‌డింది!

బ్యాంకాక్ బేస్ డ్రగ్ మాఫియా వలలో హైదరాబాదీలు!


జీవితం........కొన్నిసార్లు ఆశగా మొదలై, తెలియకుండానే అగాధంలోకి నెట్టేస్తుంది. అమీనాబేగం, దిలావర్ అహ్మద్ ఖాన్ కథ కూడా అలాంటిదే. హైదరాబాద్‌లో సాధారణ జీవితం గడిపే అమీనాబేగం బ్యూటీ పార్లర్‌లో పని చేసే ఓ సాదాసీదా మహిళ. మరో వ్య‌క్తి దిలావర్ అహ్మద్ ఖాన్ స్విగ్గీ, జొమాటోలో బైక్ రైడర్‌గా కుటుంబాన్ని పోషించే కష్టజీవి. వీరి జీవితాల‌తో డ్ర‌గ్స్ మాఫియా ఆడుకుంది.

తన కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ఆశతో ఓ తల్లి వేసిన ఒక్క అడుగు ఆమె జీవితాన్ని క‌ట‌క‌టాల వెన‌క్కి నెట్టేసింది! హైదరాబాద్‌కు చెందిన అమీనా బేగం ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లింది. కానీ ఆమె కలలు ఎయిర్‌పోర్ట్‌ దగ్గరే ఛిద్రమయ్యాయి! విమానం నుంచి దిగిన క్షణాల్లోనే ఆమెకు ఎదురైన షాక్ ఆమె జీవితాన్నే తారుమారు చేసింది! ఒక్క నిమిషంలో ఆశలన్నీ కూలిపోయాయి. జీవితం అంతా చీకటిగా మారిపోయింది!

కిషన్‌బాగ్‌లోని చిన్న ఇంట్లో, స‌మ‌స్య‌ల సుడిగుండంలో జీవ‌న పోరాటం చేస్తోంది అమీనా బేగం. భర్త వదిలేసిన జీవితం…ఐదేళ్ళ చిన్న కొడుకు… వృద్ధ తల్లిదండ్రులు…అందరి భారం ఆమె భుజాల మీదే. “ఏదైనా చేసి నా పిల్లాడికి మంచి జీవితం ఇవ్వాలి…” అనే ఆలోచనతో దుబాయి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఓ ఏజెంట్ “బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం ఇప్పిస్తాను” అన్న మాటతో ఆమెలో ఆశ పుట్టింది. దుబాయిలో మంచి జీతంతో ఉద్యోగం. ఫ్రీ టికెట్, ఫ్రీ వీసా అంటూ జీవితంలో కొత్త ఆశలు నింపాడు ఏజెంట్. అంతే కాదు వీరిద్ద‌రికీ వీసాతో పాటు ఎమిరేట్స్ ఫ్లైట్ టికెట్స్ ఇచ్చాడు. అయితే డైరెక్ట్ ఫ్లైట్ టికెట్స్ ఇవ్వ‌లేదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ. ఢిల్లీ నుంచి బ్యాంకాక్. బ్యాంకాక్‌లో రెండు రోజుల హాల్ట్.

ఆ రెండు రోజులు వారి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. కేరళ, హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్ మ‌నుషులు బ్యాంకాక్‌లో వారిని కలిశారు. “ఇవి కేవలం బుర్ఖాలు. దుబాయిలో ఇవ్వాలి” అంటూ రెండు సూట్‌కేసులు ఇచ్చారు. ఫ్రీగా సహాయం చేసిన వాళ్లకు కృతజ్ఞతగా, ఏమాత్రం అనుమానం లేకుండా ఆ సూట్‌కేసులు తీసుకున్నారు. అలా వారి వ‌ద్ద వున్న రెండు సూట్ కేసుల‌కు అదనంగా ఇంకో రెండు సూట్‌కేసులు చేరాయి. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక‌దానిపై దిలావ‌ర్‌పేరుతో వున్న టికెట్ ట్యాగ్ అంటించారు. మ‌రో సూట్‌కేస్‌పై విత్ అవుట్ ట్యాగ్ వుంది. బ్యాంకాక్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్‌లో దుబాయ్ ప్రయాణం అయ్యారు.

మొత్తం నాలుగు సూట్‌కేసులు ఒకే ట్రాలీలో తీసుకుని దిలావర్ ఖాన్ దుబాయి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా, అతని వెనుక అమీనాబేగం నడుస్తోంది.అప్పుడే దుబాయ్ కస్టమ్స్ అధికారులు వారిని ఆపారు. ల‌గేజ్ చెక్ చేశారు. తెరిచి చూస్తే ఓ సూట్‌కేసులో 3 కేజీలు, మరొ సూట్‌కేస్‌లో 3.5 కేజీల గంజాయి. ఒక్క క్షణంలోనే వారి కలలు కూలిపోయాయి. “పేరు లోని ఈ సూట్‌కేస్ ఎవరిది?” అని అడిగినప్పుడు, పరిస్థితి అర్థం కాక దిలావర్ చెప్పిన సమాధానం వారిద్దరి జీవితాన్ని చీకటిలోకి నెట్టింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.

అమీనా బేగం జైలు గోడల మధ్య క్షయవ్యాధితో పోరాడుతూ ఒంటరిగా కూర్చుని, త‌న బిడ్డ‌ను, వృద్ధ త‌ల్లిదండ్రుల్ని త‌ల‌చుకుంటూ త‌ల్ల‌డిల్లుపోయేది. త‌న‌కు తెలియని దేశంలో ఒంటరిగా రోదిస్తూ గ‌డిపింది. అయితే ఆమె కథ అక్కడితో ముగియలేదు.

అమీనాబేగం కుటుంబం ఎంబీటీ ప్ర‌తినిధి అంజ‌దుల్లాఖాన్‌ను క‌లిసి స‌హాయం కోరింది. వెంట‌నే అత‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించి, ఆమె పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లారు. దాతల సహకారంతో నిధులు సేకరించి ఆమెకు న్యాయ సహాయం అందించారు. ఒక్కో రూపాయి, ఒక్కో ప్రయత్నం, ఆమె స్వేచ్ఛ కోసం, కోర్టు ఖ‌ర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా 25 వేల దిర్హామ్‌లు సేకరించారు. ఆమెకు న్యాయ సహాయం అందించారు.

అక్టోబర్ 6, 2025న భారత ఎంబసీ ఎంప్యానల్ లాయర్ మహమ్మద్ ఇఫ్తేకారుద్దీన్ దుబాయిలోని డిటెన్షన్ సెంటర్‌కు వెళ్ళి అమీనాబేగంను క‌లిసి ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నారు. కేసును పూర్తిగా అధ్యయనం చేశారు. 95 పేజీల పోలీసు రిపోర్ట్, అనేక డాక్యుమెంట్లు, ప్రతి చిన్న వివరాన్ని పరిశీలించారు.

అయితే అక్టోబర్ 8, 2025న వచ్చిన తీర్పు గుండె పగిలేలా చేసింది. 25 ఏళ్ల జీవిత ఖైదు, 5 లక్షల దిర్హమ్‌ల జరిమానా. ఆమెను అల్ అవీర్ ఉమెన్ జైలుకు త‌ర‌లించారు.

దుబాయి చ‌ట్టాల ప్ర‌కారం 14 రోజుల లోపు ఫ‌స్ట్ అపీల్ చేయాల్సి వుంటుందని ఇఫ్తేకారుద్దీన్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. "అక్టోబర్ 18, 2025 ఫ‌స్ట్ అపీల్ చేశాం. అయితే న‌వంబ‌ర్ 18వ తేదీన‌ కోర్టు, అపీల్‌ను తిర‌స్క‌రించింది.

ఆ త‌రువాత నెల స‌మ‌యంలో సెకెండ్ అపీల్ చేయాలి. డ్రగ్స్ కేసుల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ సంఘటన అద్దం ప‌డుతోందని", ఇఫ్తేకారుద్దీన్ చెప్పారు. అమీనా బేగం తరఫున న్యాయ పోరాటం కొనసాగింది. మొదటి అప్పీల్‌లో కోర్టు ఆమె వాదనను తిరస్కరించినప్పటికీ, దుబాయిలోని అత్యున్న‌త న్యాయ‌స్థానంలో రెండ‌వ అప్పీల్ దాఖలు చేసి మానవతా దృక్పథంతో క్షమాభిక్ష కోరారు.

డిశంబ‌ర్ 17, 2025 సెకెండ్ అపీల్ తో పాటు క్ష‌మాభిక్ష కోరం. ఆమె ఆరోగ్యం క్షీణించింది. క్ష‌య వ్యాధితో బాధ‌ప‌డుతోంది. ఐదేళ్ల చిన్న కుమారుడు జీషాన్, భర్త విడిచిపెట్టిన జీవితం, వృద్ధ తల్లిదండ్రులు, కుటుంబం మొత్తం ఆమెపై ఆధార‌ప‌డి వుంది. మాన‌వ‌తా దృక్ఫ‌థంతో క్ష‌మాబిక్ష పెట్ట‌మ‌ని ఆ అపీల్‌లో కోరారు.

"ఆ సూట్‌కేస్‌లపై అమీనాబేగం ఫింగర్ ప్రింట్స్ లేవు. ఆమె పేరుతో ట్యాగ్ కూడా లేదంటూ" లోకల్ లాయర్ సల్మా సయీద్ చేసిన వాదనలు ప్రాసిక్యూషన్ హృదయాన్ని తాకాయి. చివరకు ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్ క్షమాభిక్షకు సిఫారసు చేసింది. దుబాయ్ ప్రభుత్వం ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించింది.

"ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో ఆమెను విడుద‌ల చేస్తున్నాం టికెట్ పంప‌మ‌ని" అల్ అవీర్ జైల్ అధికారులు మెయిల్ చేశారు. మార్చి 3వ తేదీ ఇండిగో టికెట్ పంపాం. అయితే ఫిబ్ర‌వ‌రి 28 త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఇండిగో విమానాలు ర‌ద్దు అయ్యాయి. మ‌ళ్ళీ మార్చి 24 వ తేదీ ఎమిరేట్స్ ఫ్లైట్ టికెట్ పంపాం. మార్చి 24వ తేదీ రాత్రి బయలుదేరిన అమీనాబేగం మార్చి 25 ఉదయం హైదరాబాద్ నేలపై అడుగుపెట్టింది. అమీనా బేగంకు విముక్తి లభించిందని దుబాయ్‌లో న్యాయ సహకారం అందించిన న్యాయ సలహాదారు మహమ్మద్ ఇఫ్తేకారుద్దీన్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె అడుగుపెట్టిన క్షణం. అది కేవలం ఒక రాక కాదు. ఒక తల్లి తన బిడ్డను మళ్లీ చేరుకున్న క్షణం. తన చిన్న కుమారుడిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఆమె దృశ్యం... అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసును కదిలించింది.

అమీనాబేగంను జైలు నుంచి విడిపించ‌డానికి సహకరించిన దాతలు, మద్దతుదారులకు ఎంబీటీ నేత అంజ‌దుల్లా ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. "విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్న వారు మోసపూరిత ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన" అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. హైద‌రాబాద్‌లో చీటింగ్ చేసిన ఏజెంట్‌ను ప‌ట్టుకుంటే బ్యాంకాక్ ముఠ గుట్టుర‌ట్టు అవుతుంద‌ని, ఆదిశ‌గా ఎందుకు పోలీసులు ప్ర‌య‌త్నించ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ చేసిన ఆర్థిక సహాయం, దుబాయిలో భార‌త ఎంబ‌సీ ఎంప్యాన‌ల్ లాయ‌ర్ ఇఫ్తేకారుద్దీన్ డాక్యుమెంటేష‌న్, లోక‌ల్ లాయ‌ర్‌ సల్మా సయీద్ వాదనల బలం ఇవన్నీ కలిసే ఒక జీవితాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చాయి. డ్ర‌గ్స్ కేసులో జైలుకు వెళ్ళి కేవ‌లం 10 నెల‌ల్లో బ‌య‌టికి వ‌చ్చిన అరుదైన కేసు ఇది.

దిలావర్ అహ్మద్ ఖాన్ అల్ అవీర్ జైల్‌లోనే వున్నాడు. అత‌ను కూడా డ్ర‌గ్స్ మాఫియా ఉచ్చులో చిక్కుకున్న అమాయ‌కుడే. అయితే అత‌న్ని కాపాడ‌డానికి ఎవ‌రు ముందుకు వ‌స్తారో ?

విదేశానికి వెళుతున్నామ‌నే ఉత్సాహం, ఆ సంతోషంలో గుడ్డిగా ఏజెంట్లను నమ్మడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన అద్దం ప‌డుతోంది. ఇత‌ర వ్యక్తులు ఇచ్చే బ్యాగులు, పార్శిల్స్‌ను వాటిలో ఏం ఉందో చూడ‌కుండా తీసుకెళ్లడం జీవితాన్ని ప‌ణంగా పెట్ట‌ట‌డ‌మే న‌ని ఈ సంఘ‌ట‌న మ‌రోసారి హెచ్చ‌రిస్తోంది.

Read More
Next Story