కాంగ్రెస్ వాళ్లు కుమ్ములాడుకుంటే... ఓటేసిన వారిని అవమానించడమే!
x
తెలంగాణ మ్యాప్

కాంగ్రెస్ వాళ్లు కుమ్ములాడుకుంటే... ఓటేసిన వారిని అవమానించడమే!

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి ఓడిపోయినందుకు భారత రాష్ట్ర సమితి, గెలిచినందుకు కాంగ్రెస్ పార్టీలు చాల ఖంగుతిన్నట్లు కనిపిస్తుంది విశ్లేషకులకు.



గుమ్మడిదల రంగారావు

తెలంగాణాలో ఓటు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు కూడా ఆతృతగా ఎదురుచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సూచించిన విధంగానే వున్నాయి. అందువలన ప్రజలు ఏమీ ఆశ్చర్యపోలేదు ఫలితాలు చూసి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఫలితాలు చూసి ఓడిపోయినందుకు భారత రాష్ట్ర సమితి, గెలిచినందుకు కాంగ్రెస్ పార్టీలు చాల ఖంగుతిన్నట్లు కనిపిస్తుంది విశ్లేషకులకు. గెలుస్తాం అన్న ధీమాతో అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు దూసుకెళ్లింది భారాస. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పెద్దగా లేకపోయినాకూడా టిక్కెట్ల పంపిణీలో చివరి నిమిషందాకా గందరగోళంలో వుండి పోయింది. ముందు ఒకరి పేరు ప్రకటించి ఆ తరువాత మరొకరి పేరు ఖరారు చెయ్యటంతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో, నామినేషన్లు ఉపసంహరణ ముగిసి పోటీలో వున్న అభ్యర్థుల పేర్లలో స్పష్టత వచ్చిన తరువాతనే, ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. బయటి నాయకుల మద్దతు పెద్దగా లేకుండానే స్థానిక నాయకుల సొంత బలంతోనే ప్రచారం సాగించింది కాంగ్రెస్ పార్టీ.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి, భట్టీ విక్రమార్క ల ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం సాగించింది. పార్టీ పోస్టర్లలో కూడా ఈ ఇద్దరి ఫొటోలే ప్రస్ఫుటంగా కనిపించాయి. అందువలన నాయకత్వం ఈ ఇద్దరిలో ఒకరిని వరిస్తుంది అనుకున్నారు ఓటు వేసిన ప్రజలు. పీసీసీ అధ్యక్షుడు, వాగ్ధాటి, చురుకుదనంలో ముందుండే రేవంత రెడ్డి వైపే ఎక్కువ మంది ప్రజలు మొగ్గుచూపారు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని గమనించలేకపోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అప్పటికే విలువైన సమయం వృధా చేసుకుంది అన్న అభిప్రాయం కలిగింది విశ్లేషకుల్లో. అయితే విశ్లేషకులు వేరు, ఓటర్లు వేరు. ఇది అందరికీ తెలిసిందే. ఇది తెలియంది విశ్లేషకులకే! అందుకే ‘ఎన్నికల తరువాత జరగబోయేది ఇదే రాసిపెట్టుకోండి’ అని అహంభావంతో చెబుతుంటారు విశ్లేషకులు. జ్యోతిష్యులకు కూడా ఉండదు అంతటి అహంభావం. అందుకే విశ్లేషకులు వాస్తవానికి దూరంగా వుంటారు.

మెరుపులాగా దూసుకొచ్చిన బిజెపి!

ఎన్నికలకు చాలా ముందుగానే బిజెపి చేతులెత్తేసింది అని చాలామంది అనుకున్నట్లే వారి ఎన్నికల ప్రచారం ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సాదా సీదాగా సాగింది. కేంద్ర నాయకులు చుట్టం చూపుగా వచ్చారు. ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి వున్న నాయకులు బీజేపీలో లేరు అనేది కాదనలేని నిజం. రాజనాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్, అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి నాయకుల ప్రసంగాలు విని ప్రభావితమయ్యే తటస్థ ఓటర్లు దక్షిణాదిలో లేరు. పార్టీ అభిమానులు ప్రచారం వున్నా లేకున్నా పార్టీకే ఓటు వేస్తారు, అది పెద్ద విషయం కాదు. అయినా అనూహ్యంగా ఎనిమిది సీట్లు గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచింది బిజెపి. బీజేపీలో పేరున్న నాయకులు ఓడిపోయారు, ఊరు పేరు లేని నాయకులు గెలిచారు. తప్పక గెలుస్తాడు అనుకున్న ఈటెల రాజేందర్, అధికార పార్టీ మీద అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు గా గుర్తింపు పొందిన బండి సంజయ్, క్రితంసారి లోక్ సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితనే ఓడించిన ధర్మపురి అరవింద్ ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ముఖ్య మంత్రి కేసీఆర్ నీ ముఖ్య మంత్రి స్థాయి నాయకుడుగా గుర్తింపు పొందిన రేవంత్ ని కామారెడ్డిలో ఓడించిన వెంకటరమణా రెడ్డి విజయం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి 7 సీట్లు గెలిచినప్పటికీ, 2018లో బిజెపి ఒకే ఒక్క సీటు గెలిచింది. ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్ గెలిచిన పిదప బిజెపి బలం ఒకటి నుంచి మూడుకు చేరిందితెలంగాణ అసెంబ్లీలో. ఆ ముగ్గురిలో ఇద్దరు ఈసారి ఓడిపోయారు. మాపార్టీ గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్య మంత్రిని చేస్తాం అని బిజెపి ప్రకటించటం మొదులు లేదు మొగుడా అంటే పెసరపప్పే పెళ్ళామా అన్న సామెతను గుర్తుకు తెస్తుంది. 20218లో ఒక్క సీటు గెలిచిన పార్టీ 2023లో అధికారంలోకి వస్తాం అనుకోవటాన్ని ఎలా అభివర్ణించాలో అర్ధంగాక విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. కేరళ ఎన్నికల్లో కూడా మేము గెలిస్తే మా ముఖ్య మంత్రి అభ్యర్థి మెట్రోమాన్ శ్రీధరన్ అని బిజెపి ప్రకటించింది. కానీ వున్న ఒక్క సీటును కూడా నిలబెట్టుకోలేకపోయింది!

ఉత్తర కుమార ప్రగల్బాలు అంటే ఇదే. తెలంగాణాలో వున్న 119 సీట్లలో ఒక్క 19 సీట్లలోనైనా గట్టి కృషి చేసి ఉంటే కనీసం తొమ్మిదో పదో గెలిచే అవకాశం ఉండేది బిజెపికి. వాస్తవాన్ని గ్రహించటం రాజకీయ పార్టీలకున్న అతి పెద్ద సవాల్. అంటే దీనినిబట్టి నేతలు ప్రజలకు ఎంత దూరంగా ఉంటున్నారో అర్ధం అవుతుంది. హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కనిపించిన హవా అసెంబ్లీ ఎన్నికలప్పటికీ ఎటువెళ్లిందో అర్ధంగావటం లేదు. ఎప్పుడూ లేనిది చేరికల కమిటీ అమీ ఒకటి పెట్టి ఎవరు వచ్చి చేరతారా అని ఎదురుచూసిందిగానీ ప్రజల స్పందనను గురించి పట్టించుకోలేదు. వలస వచ్చిన నేతలు ఒక్కొక్కరూ బయటకు వెళ్లారు: కోమటి రాజగోపాల్ గానీ, గడ్డం వివేక్ గానీ, విజయశాంతిగానీ. ప్రజల్లో పలుకుబడి వున్నా డీకే అరుణ అసలు పోటీకే దూరంగా వున్నారు. వేములవాడలో ముందు ప్రకటించిన ఉమను పక్కనపెట్టి, మరొకరికి టికెట్ ఇచ్చారు. సంగారెడ్డిలో కూడా అదే జరిగింది. ఇన్ని కుప్పిగంతులు వేస్తున్న పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారు? ఎందుకు ఆదరించాలి?

కాంగ్రెస్ కుమ్ములాట సంస్కృతి వదలిపెట్టదా!

ఇప్పడు అసలు విషయానికి వద్దాం. చింత చచ్చినా పులుపు చావలేదు అనేది కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్ధం అవుతుంది. ఒక వైపు దేశంలో తన ఉనికికే ప్రమాదం ఏర్పడిన పరిస్థితిలో కూడా తన పోకడను కాంగ్రెస్ పార్టీ మార్చుకోకపోవటం ప్రజలకు విస్మయం కలిగిస్తుంది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డు పడ్డట్లు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంకట్టినా, పార్టీ నాయకత్వం మాత్రం ఆ పట్టాన్ని ఎవరి నెత్తిన పెట్టాలో తేల్చుకోలేక పోతున్నది. ఫలితాలు వెలువడి మూడు రోజులు గడుస్తున్నా, ముఖ్య మంత్రి ఎవరు అనేది నిర్ణయించలేక పోతుంది ఆపార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో భాగమే అయినప్పటికీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేక పోవటం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని తెలియజేస్తుంది.

1980 తరువాత కాంగ్రెస్ పార్టీ విధానంలో పెద్ద మార్పు వచ్చింది. ప్రజల బాధ్యత ఓటు వేసేవరకే, పదవులు ఎవరికీ ఇవ్వాలో పార్టీ తెలుస్త్తుంది అనే విధానం ఆచరణలోకి వచ్చింది. పర్యవసానంగా ప్రజల్లో బలంలేని నాయకులను పార్టీ బాగా ప్రోత్సహించింది దేశవ్యాప్తంగా. ప్రజాభిమానం కన్నా పార్టీ నాయకత్వం పట్ల విశ్వం ముఖ్యం అనేది పార్టీలో ఎదగటానికి ప్రధాన సూత్రం. ఈ సంస్కృతివల్లనే బలమైన నాయకత్వం రాష్ట్రాల్లో ఎదగలేదు. అధిష్టానం ఆశీసులు ముఖ్యం ప్రజల అభిమానంకన్నా. ఎవరైనా స్వతంత్రిస్తే వారికి వ్యతిరేకంగా అసమ్మతిని తయారు చేసి వారిలో అభద్రతను పెంచి తద్వారా వారిని తన దారికి తెచ్చుకునేది. అధినాయకత్వాన్ని చూసే ప్రజలు ఓటు వేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రచారం పొందిన ఆలోచన. అట్టి పరిస్థితుల్లో ప్రజల మధ్య వుండటంకన్నా ఢిల్లీ నేతల ప్రాబల్యంకోసం ప్రాకులాడటమే పెద్ద పని అయ్యింది రెండో తరం నేతలకు.

అందువలన ప్రజా బలం వున్నా నేతలు ఎవరూ ఎదగలేకపోయారు. ఎన్నికల్లో కస్టపడి పోరాడిన వాళ్ళుకాదు ముఖ్య మంత్రులు అయ్యేది, కాంగ్రెస్ హై కంమాండు ఆశీసులున్నవారే. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదా తమ నాయకుడిని ఎన్నుకునేది. మాకు నాయకుడు ఎవరో చెప్పండి అని హై కమాండ్ కి అర్జీ పెట్టుకోవాలి. హై కమాండు సీల్డు కవరులో పంపిన పేరుకే పదవి. ఎన్నికల్లో పోరాడిన వారికి కాదు. మొన్న కర్ణాటకలో ఇదే జరిగింది. నేడు తెలంగాణాలో కూడా ఇదే తంతు నడుస్తున్నది. ఎమ్మెల్యే లు ఏక వాక్యంతో ఏకగ్రీవ తీర్మానం చేసి హైద్రాబాద్ లో నాయకుడు ఎవరో ఢిల్లీ పెద్దలను తేల్చమని అడగటం ఏ విధమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం? నాయకుడి ఎన్నిక ఎమ్మెల్యే లకే వదిలేస్తే అట్టి నాయకుడు హై కమాండుకి అణిగి మణిగి వుండడుకదా! హై కామాండుకు ఆర్ధికంగా ఇబ్బంది! బిజెపి అధికారంలో వున్న రాష్ట్రాలనుంచి ఆర్ధిక వనరులు సేకరించదు. కేంద్ర నాయకత్వం కొద్దిమంది పారిశ్రామిక వేత్తలతో వ్యవహారం చక్కబెట్టేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను అధికారంలో వున్న రాష్ట్రాలనుంచే ఆర్ధిక వనరులను సేకరిస్తుంది. అందుకే కాంగ్రెస్ పాలనలో అవినీతా అంతగా ఉంటుంది. ఢిల్లీదాకా పోవాలిగదా మూటలు! నేత ఎదురు తిరిగితే, అసమ్మతి సెగను హై కంమాండే రాజేస్తోంది. పొమ్మనలేక పొగబెట్టినట్లు.

తెలంగాణ లో ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలమీద వేసుకొని నడిపించింది రేవంత్ రెడ్డి. ప్రజలు ఆయన్నే ముఖ్య మంత్రిగా చూశారు. ఓటుకూడా ఆయనకే వేశారు. ఢిల్లీ పెద్దలు చెబితే వెయ్యలేదు ఓటు. స్థానిక నేతల పోరాట పటిమతోనే ఓటు వేశారు. రేవంత్ ముఖ్య మంత్రి అవ్వాలని సామాన్య ప్రజలు కోరుకున్నారు. అయితే ఆయన సీనియర్ కాదన్న వాదన తెరమీదకు వచ్చింది. సీనియర్ కాకపోయినా పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడైనప్పుడు ముఖ్య మంత్రి పదవికి ఎందుకు అర్హుడు కాదు? 64 మంది ఎమ్మెల్యేలు గా గెలిస్తే, 64 మందీ ముఖ్య మంత్రి రేసులో ఉన్నారన్న వాదనగూడా తెరమీదకు వచ్చింది. నెలకు ఒకరిని ముఖ్య మంత్రిని చేసినా, ఐదు ఏళ్లలో ఇంకా నలుగురు మిగిలిపోతారు! ఈ 64 మందిలో ఎందరు తమ నియోజకవరం బయటకు వచ్చి ప్రచారం చేశారు? మేమందరం ముఖ్య మంత్రి పదవికి అర్హులమే అంటున్నప్పుడు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చెయ్యాలికదా! అలా చేసిన నేతలు ఎవరు? ఎన్నికలకు ముందు భట్టి పాదయాత్ర చేసినా, ఎన్నికల్లో ప్రచార భారాన్ని తన భుజాలమీద వేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డే కదా! అందులో ఏముంది సందేహం.

ఇటువంటి పరిస్థితుల్లో పరిపాలన సజావుగా సాగుతుందా? ఆదిలోనే అసమ్మతి రాగమా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రాల్లో హై కమాండు ప్రాబల్యం కొంత ఉండాలి. అది అవసరం కూడా. ప్రాంతీయ పార్టీ నాయకులకు ఇదే సమస్య. వారిని అదుపు చేసేవారు వుండరు కనుక ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తారు. క్రమ శిక్షణ, కట్టుబాటు మంచి అంశాలే. కానీ అంతా మా చెప్పుచేతల్లో ఉండాలి అనుకోవటం తెలివితక్కువ తనం. ఆనాడు ఇందిరమ్మ తన బొమ్మ చూసి ఓట్లు వేశారు అనుకొని తన మాటే నెగ్గించుకున్నది. నాడు ఇందిరమ్మకున్న ఆదరణ నేడు కాంగ్రెస్ పార్టీలో ఎవరికుంది? ఒక్కో రాష్ట్రం దాని చేతుల్లోనుంచి జారిపోతున్నాకూడా పార్టీ వైఖరిలో మార్పులేదు. ఇది ఓటు వేసిన ప్రజలను అవమానించటమే. ఈ పరిస్థితిలో ఆ పార్టీని ప్రజలు ఎందుకు ఆదరించాలి? ఇది అంతర్గత ప్రజాస్వామ్యం కాదు. పదవి కోసం కుమ్ములాట. ఎన్నికల్లో చెప్పలేదు మేము గెలిచాక కుమ్ములాడుకుంటాం అని. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడిన పక్షాలుకూడా ఈ అంశాన్ని పెద్దగా లేవనెత్తలేదు. భవిషత్తు ఎన్నికల్లో ఇది ఒక ప్రచార అస్త్రం అవుతుంది. అవ్వాలి కూడా.

Read More
Next Story