ఆంధ్రాలో అశ్చర్యం:  30 రోజుల మొక్కవోని మహిళల సమ్మె...
x
30వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

ఆంధ్రాలో అశ్చర్యం: 30 రోజుల మొక్కవోని మహిళల సమ్మె...

నికృష్ణపు లొంగుబాటుతో కొనుక్కున్న బ్రతుకెన్నడూ బ్రతుకే కాదంటున్నారు. నిశ్చిత గమ్యంవైపుసాగుతున్నారు అంగన్వాడీ మహిళలు.


(ఇఫ్టూ ప్రసాద్)

అంగన్వాడీల సమ్మె జనవరి 10వ తేదీకి 30వ రోజుకు చేరింది. ఎస్మా ప్రయోగించి ఇవాళ్టికి ఐదవ రోజు! సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిశితంగా పరిశీలిస్తే ఇరకాట పరిస్థితిలో వుందని అర్ధమౌతోంది. అదేమిటంటే... సహజంగా ప్రభుత్వాలు సమ్మెల అణచివేతకు చేపట్టే నిర్బంధకాండని గుణాత్మకంగా మలుపుత్రిప్పే లక్ష్యంతోనే ఎస్మా వంటి అసాధారణ ప్రయోగాలకు దిగుతాయి. వాటిని ప్రయోగించాక నిర్బంధ చర్యల్ని తీవ్రతరం చేయడం తప్ప సమాలోచన, చర్చలకు తావు ఇవ్వవు. భౌతికంగా ఉద్యమ శక్తుల్ని కదలకుండా చేస్తాయి. రాజకీయ భాషలో కార్మికవర్గం పై భౌతిక యుద్ధం అనవచ్చు. ఎస్మా ప్రయోగం అందుకొక సంకేతం.

ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదా...

లక్షమందికి పైగా మహిళా శ్రామికవర్గం పై భౌతికదాడికి దిగడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఊరూరూ తన దాడికి కేంద్రాలుగా మార్చడమే. లక్ష మందిపై భౌతికదాడికి దిగితే పోరాట కేంద్రాల్ని జిల్లా, డివిజన్, మండల సెంటర్ల నుంచి పల్లెటూళ్లకు బదిలీ చేయడమే. దానికి ప్రభుత్వం ఎంత రాజకీయ మూల్యం చెల్లించాలో అంగన్వాడీల కంటే ప్రభుత్వానికే బాగా తెలుసు. ఎన్నికవేళ ఊరూరూ రాజకీయ ప్రచార కేంద్రంగా మారడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు. అది ప్రభుత్వ రాజకీయ బలహీనత!

సమ్మె కొనసాగితే వచ్చే నష్టాలేమిటంటే...

పోనీ ప్రస్తుత ధర్నా శిబిరాల్ని ఇలాగే కొనసాగనిద్దామంటే, క్రింది రెండు రకాల నష్టాలు ప్రభుత్వానికి వున్నాయి. ఒకటి, ఒకవైపు అవి ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ ప్రచార కేంద్రాలుగా మారి ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయ నష్టం జరుగుతుంది. మరోవైపు ఎన్నికల లక్ష్యం పై దృష్టిని కేంద్రీకరించలేక పరోక్ష నష్టం జరుగుతుంది.

రెండు, 'ఎస్మా' ప్రయోగానికి అర్ధం లేకుండా పోతుంది. కొండను త్రవ్వి ఎలుకని సైతం పట్టుకోలేక పోయిన సర్కార్ గా చరిత్రలో మిగిలిపోతుంది. అది వివిధ పోరాట సంస్థలకూ ప్రతిఘటనా శక్తులకూ కొత్త బలాన్ని ఇస్తుంది.

ఏతా వాతా చెప్పాల్సి వస్తే...

ఇటు 'ఎస్మా' వెలుగులో లక్ష మంది మహిళా శ్రామికవర్గంపై దాడికి దిగితే రాజకీయ నష్టం అనూహ్యంగా భరించాల్సి వస్తుందేమోనన్న భయం. అటు రాజకీయ పరిష్కారం చేయకుండా ధర్నా కేంద్రాల్ని కొనసాగనిద్దామంటే, అవి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని ఎండగట్టే ప్రచార కేంద్రాలుగా స్లో పాయిజనస్ పాత్ర పోషిస్తాయనే భయం.

అటు రాజకీయ గొయ్యు. ఇటు రాజకీయ నుయ్యు. ఈ రెండింటి మధ్య దిక్కుతోచని స్థితిలో ఎంచుకున్న మూడో మార్గమే మానసిక యుద్ధం. అదే మైండ్ గేమ్! తన వాస్తవ బలహీనతల్ని దాచిపెట్టుకొని ఎదుటివాళ్ళ బలహీనతల మీద గురిపెట్టి దాడికి దిగే విధానాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంగన్వాడీ శ్రామికులు ప్రధానంగా నిరుపేద స్త్రీలు. ఆ చాలీచాలని జీతాలు సైతం ఓ నెల అందకపోతే తీవ్ర ఇబ్బంది పడతారు. నేటికి సమ్మెకు నెల గడిచింది. సమ్మెకు ముందున్న స్థితి యధావిధిగా వుండదు. పరిష్కారం చేసి త్వరలో సమ్మె ముగియాలని గణనీయశాతం మంది ఉండడం సహజమే. వారి బలహీనతల్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం మైండ్ గేమ్ కి దిగుతుంది. అదే మానసిక యుద్ధం. లక్షమందికి పైగా మహిళా కార్మికుల్ని లక్ష్యంగా చేసుకొని భౌతిక యుద్ధానికి దిగలేని రాజకీయ భయం ప్రభుత్వాన్ని వెన్నాడుతోంది. మౌనం వహిస్తే ప్రభుత్వ అసమర్థత ప్రజల్లో బహిర్గతమౌతుందనే భయం వెంటాడుతోంది. అటు యుద్ధం చేయలేని, ఇటు మౌనంగా ఉండలేని స్థితిలో చేపట్టిన మూడోదే మానసిక యుద్ధం.

ఫలానా తేదీకి విధులకు హాజరు కాకపోతే డిస్మిస్ చేస్తామని ఓవైపు CDPO వంటి వారితో బెదిరింపులు పంపడం తెల్సిందే. మరోవైపు మంత్రులే ట్రేడ్ యూనియన్లని పిలిచి ఎన్నికల తర్వాతే తప్ప ఇప్పుడు పరిష్కరించే ప్రసక్తే లేదని చెప్పడం తెల్సిందే. ఈ చర్యలన్నీ మానసిక యుద్ధంలో అంతర్భాగమే. మరో రెండు వారాలు, లేదా నెల రోజులు సమ్మె కొనసాగితే సంభవించే రాజకీయ నష్టాల్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతోంది. బయటకు మాత్రం ఆరు నెలలైనా వేతన ఒప్పందం చేసే ప్రసక్తే లేదని అంగన్వాడీల్ని మానసికంగా భయపెడుతోంది. నిజమైన భౌతిక యుద్ధం చేయడానికి తాను వెనకడుగు వేస్తూనే, ఉత్తుత్తి మానసిక యుద్ధంతో అంగన్వాడీల్ని వెనకడుగు వేయించే వ్యూహమిది.

ఎస్మా ద్వారా అణచివేత వ్యూహాన్ని అమలు చేసే ఉద్దేశ్యం నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, ట్రేడ్ యూనియన్ల నాయకుల్ని పిలిచి 'ఎన్ని నెలలు సమ్మె చేసినా మేం వేతనాలు పెంచే సమస్యే లేద'ని చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వ దౌత్య బలం కాదు. రాజకీయ బలహీనత మాత్రమే. అంగన్వాడీ శ్రామికవర్గం ఎదుటనున్న తక్షణ కర్తవ్యం ప్రభుత్వ మానసిక యుద్దాన్ని ఓడించడానికి తగిన తక్షణ వ్యూహరచన చేయడం!

'మా సమస్యల్ని ఎంతకాలం మీ సర్కార్ పరిష్కరించకపోతే అంతకాలం మేం పోరాడతాం' అనే సంకేతాన్ని ప్రభుత్వానికి పంపడం నేటి తక్షణ కర్తవ్యం. CDPO తదితరులకు ఫోన్ ద్వారా కనెక్ట్ కాకుండానే ఉండడం మంచిది. ఒకవేళ ముఖాముఖిగా లేదా మరో రూపంలో కనెక్ట్ ఐనట్లైతే, 'ఎంతకాలం మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే, అంతకాలం మీ కబుర్లు మేం వినేది లేదు' అని నిర్మొహమాటంగా తేల్చి చెప్పాల్సిన సమయమిది.

సమ్మెకాలంలో అంగన్వాడీల చుట్టూ నిఘా వ్యవస్థ బలంగా వుంటుంది. CDPO, పోలీసు వర్గాలే కాకుండా గ్రామాల్లో అభివృద్ధి నిరోధక, ప్రజా వ్యతిరేక శక్తులు సైతం అట్టి పాత్ర పోషిస్తాయి. నెల రోజుల సమ్మె తర్వాత అంగన్వాడీల మానసిక స్థితిపై ప్రభుత్వం విషయ సేకరణ చేస్తుంది. తన మానసిక యుద్ధ ప్రభావం వారి మీద ఎంత ఉందో అంచనా వేస్తుంది. ప్రభుత్వ భయం ప్రభుత్వానిది కదా!

మరో రెండు రోజుల్లో లేదా మరో వారంలో పరిష్కారం అవుతుందనే దింపుడు కళ్ళం ఆశతో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న వార్తలు ప్రభుత్వానికి అందితే మరో రెండు రోజులో వారమో ఇలా కాలయాపన చేస్తుంది. మరో నెలరోజులైనా వెనకగడుగు వేసేది లేదని అంగన్వాడీల నుండి వార్తలు ప్రభుత్వ దృష్టికి వెళ్తే, వెంటనే మానసిక యుద్ధ వ్యూహాన్ని ఉపసంహరిస్తుంది. మూడో అవకాశం మూసుకుపోతే ప్రభుత్వం ఎదుట క్రింది రెండే అవకాశాలు మిగులుతాయి.

మొదటిది, సామరస్యంగా చర్చలు జరిపి ఏదో మేరకు అంగన్వాడీ శ్రామికవర్గాన్ని సంతృప్తి పరుస్తూ ఒప్పందం చేయడానికి దిగిరావడం.

రెండవది, సమ్మె అణచివేతకి నగ్నంగా బరితెగించడం. నేటి సమ్మె ప్రధాన క్షేత్రాన్ని ధర్నా శిబిరాల నుండి గ్రామాలకు బదిలీ చేయడం! ఉద్యమ స్వరూపం మారడానికి అవకాశం కల్పించడం.

డిసెంబర్ 12 నుంచి ఆర్ధిక పోరాటంగా మారిన సమ్మె...

25 రోజుల తర్వాత ఎస్మా ప్రయోగంతో 6-1-2024న డిమాండ్ల పత్రంలో ఎస్మా రద్దు డిమాండ్ చేరింది. ఆరోజు నుండి సమ్మెకు రాజకీయ రూపం కూడా వచ్చింది. పైన పేర్కొన్న రెండవ ఆప్షన్ ని ప్రభుత్వం ఎంచుకుంటే మున్ముందు సమ్మె పోరాటం వేలాది గ్రామాలకు వెళ్లి ప్రజా ఉద్యమ రూపం ధరించడానికి పునాది పడుతుంది. దాని వల్ల అంగన్వాడీలకు జరిగే కష్టనష్టాల కంటే ప్రభుత్వం పొందే రాజకీయ నష్టం నూరు రెట్లు ఎక్కువే! జయలలిత సర్కార్ల వంటివి గత చరిత్రలో రుజువు చేశాయి. నిప్పుతో చెలగాటానికి సాధారణంగా ప్రభుత్వం దుస్సహాసానికి దిగకపోవచ్చు. మొదటి ఆప్షన్ కి ఎక్కువ అవకాశం ఉంది. ఐనా చరిత్ర నుండి గుణపాఠం తీసుకోకుండా ఒకవేళ అది కొరివితో తలపడితే సమ్మెకు సమాజంలో ఆదరణ పెరిగి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీసి విజయ సాధనకు దారితీస్తుంది.

హర్యానాలో అంగన్వాడీల సమ్మె రెండు నెలలకు పైగా చేసి విజయం సాధించిన చరిత్ర ఉంది. ఢిల్లీలో కూడా సుదీర్ఘ సమ్మె చేసిన నేపథ్యం ఉంది. పోరాట అనుభవాలు లేని రాష్ట్రాల్లో సైతం సుదీర్ఘ పోరాటాలు చేసి విజయాలు సాధిస్తుంటే, పోరాట చరిత్ర గల మన రాష్ట్ర అంగన్వాడీ శ్రామికవర్గ పాత్ర విశిష్ఠంగా ఉండాలేమో! వారిప్పుడు తమలో తామే ప్రశ్నించుకొని సరైనదారి ఎంచుకోవాలి.

సమ్మెలో తలకు నెల జీతం కోల్పోయి త్యాగం చేసిన లక్ష మంది అంగన్వాడీ శ్రామికుల ఎదుట క్రింది రెండే మార్గాలు వున్నాయనుకోవచ్చు.

మరో నెల రోజులు సమ్మెచేసి జీతాల పెంపు సహా విజయం సాధించే అవకాశం ఉందని ఒకవేళ భౌతిక పరిస్థితి కోరితే వెనకడుగు వేసి సర్కారు ఎదుట లొంగిపోవడమా?

లేదంటే, ఈనెల సమ్మె త్యాగానికి మరో నెల సమ్మెకి సైతం సిద్ధపడి తుదకు విజయ స్పూర్తితోనే విధుల్లో హాజరు కావడమా? అంగన్వాడీల ఎదుట పై రెండు ఆప్షన్లున్నాయి. మొదటిది కోరుకుంటే, జీతం పెరక్కపోగా, పనిభారాలు మరింత పెరుగుతాయి. పైగా పీడన, అవమానాలు సైతం పెరుగుతాయి. పొమ్మనలేక పొగపెట్టినట్లు ఉద్యోగాలు వదిలేసుకొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు లొంగి విధుల్లో చేరితే, రేపటి నుండి వంగి వుండడమో లేదంటే ఉద్యోగం వదిలేయడమో తమ వంతు అవుతుంది. రెండవ ఆప్షన్ ని కోరుకుంటే మరో నెల అప్పులు చేసుకొని ఆటుపోట్లు భరించి సమ్మెలో నిలబడి విజయం సాధించి తలెత్తుకొని విధుల్లో చేరితే ఆత్మగౌరవంతో ఉద్యోగ వృత్తి కొనసాగించగలరు.

సమ్మె విజయావకాశాలే ఎక్కువ...

ఏది ఏమైనా అంగన్వాడీల సమ్మెకు విజయావకాశాలు పెరిగాయి. సమ్మె పురుడు పోసుకునే దశ సమీపిస్తోంది. మంత్రసాని తగు సఫర్యల్ని సకాలంలో సముచితంగా చేపట్టాల్సిన సమయమిది. శిశోదయం కావాలంటే పురిటి నొప్పుల్ని భరించవల్సిందే. AP అంగన్వాడీ శ్రామికవర్గం CITU, AITUC, IFTU అనుబంధ అంగన్వాడీ కార్మిక సంఘాలతో ఏర్పడ్డ JAC నేతృత్వంలో విజయ పథంలో పురోగమిస్తుందని ఆశిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాతో గడ్డు పరిస్థితిని సృష్టించి దాడికి దిగే దశలో JAC తగు వ్యూహ రచన చేసుకుంటూ విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

Read More
Next Story