తెలంగాణ లో కమ్యూనిస్టు లేమయ్యారు? వాళ్ళ పోరాటాలు ఎక్కడ ?
x

తెలంగాణ లో కమ్యూనిస్టు లేమయ్యారు? వాళ్ళ పోరాటాలు ఎక్కడ ?

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయ్యా లేవా అనే దానిపై సామాజిక కార్యకర్త కన్నెగంటి రవి విశ్లేషణ

ఇటీవల ఒక మిత్రుడు ఫోన్ చేసి “ తెలంగాణ లో మీ కమ్యూనిస్టులు ఇంకా ఉన్నారా ? ఉంటే వాళ్ళ పోరాటాలు ఎక్కడున్నాయి ? అని నిష్టూరమాడాడు. అయినా మీరే చీలికలు పీలికలు అయిపోయారు. మీరు ప్రజల్ని ఎక్కడ ఐక్యం చేస్తారులే అని కూడా ముక్తాయించాడు. నన్ను కూడా కమ్యూనిస్టు శిబిరంలో ఒక వ్యక్తిగానే చూస్తూ చర్చించే మిత్రుడతను. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టడం, 22 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో పూర్తి కాలం కార్యకర్తగా పని చేయడం, ప్రస్తుతం ఏ పార్టీ నిర్మాణంలో లేకపోయినా, సైద్ధాంతికంగా ఇప్పటికీ మార్క్సిస్టు లెనినిస్టు గానే ఉండడం వల్ల నేను కూడా మిత్రుల ప్రశ్నలకు, విమర్శలకు నావైన జవాబులు ఇస్తూ ఉంటాను.

నాతో చర్చించే వాళ్ళలో మరి కొంతమంది ఎర్రజండా పార్టీలలో సామాజిక పొందికలపై తీవ్రమైన విమర్శలు చేసేవాళ్ళున్నారు. ఖమ్మం జిల్లా కమ్మోళ్ళు కమ్యూనిస్టు పార్టీలకు కార్యదర్శులుగా ఉంటే, మిగిలిన జిల్లాల రెడ్డోళ్ళు పార్టీలో కీలక స్థానాలలో ఉంటారు, మిగిలిన సామాజిక వర్గాలకు ఇంకా స్థానమెక్కడ? అనేది అంతిమంగా వాళ్ళ విమర్శల సారాంశం. కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల విశ్వాసం, శ్రామిక వర్గ చైతన్యం, ప్రజల కోసం పని చేయాలనే సంసిద్దత ఉంటే ఏ సామాజిక వర్గాల వాళ్లయినా కమ్యూనిస్టు పార్టీలలో పని చేయవచ్చు, గత వందేళ్లుగా వివిధ సామాజిక వర్గాల నుండీ వచ్చిన వాళ్ళు అలా పని చేస్తూ నాయకత్వ స్థానాలకు ఎదిగారు. త్యాగాలు కూడా చేశారు. ఇక్కడ కులానికి అంతా ప్రాధాన్యత ఇవ్వరు అని సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చే జవాబు పార్టీ నిర్మాణంలో సామాజిక పొందికల విషయంలో విమర్శకులను పూర్తిగా సంతృప్తి పరచలేదన్నది ఒక భౌతిక వాస్తవం.

దేశంలో కుల వ్యవస్థ ఉండడం, షెడ్యూల్డ్ కులాలపై , వెనుక బడిన వర్గాలపై , ఆదివాసీలపై, ముస్లిం మైనారిటీలపై, మహిళలపై వివక్ష ఇప్పటికీ కొనసాగడం, ఆయా కమ్యూనిస్టు పార్టీలలో, సంస్థలలో ఇప్పటికీ ఆధిపత్య కులాల వ్యక్తులే ప్రధానమైన నాయకులుగా ఉండడం, ఆచరణ పరంగా , నిర్మాణ చట్రం పరంగా ఆయా కమ్యూనిస్టు పార్టీలలో కూడా ఆధిపత్య, పురుషాధిక్య ధోరణులు వ్యక్తమవడం, ఇలాంటి విమర్శలకు తావిస్తున్నది. చైతన్య పూర్వకంగా , ప్రయత్న పూర్వకంగా కమ్యూనిస్టు పార్టీలు, లోతుగా చర్చించి, తమను తాము మార్చుకోవాల్సిన అంశాలు ఇవి.

ఆయా కమ్యూనిస్టు పార్టీలకు పార్టీ కార్యక్రమం, పంథా డాక్యుమెంట్లు, సమాజ దశకు, విముక్తికి సంబంధించి, పోరాట రూపాలకు సంబంధించి రాజకీయ భిన్నాభిప్రాయాలు తీవ్రంగా ఉండొచ్చు కానీ ఎర్ర జండాలు ధరించిన అన్ని రాజకీయ పార్టీలలో వ్యక్తమయ్యే కుల పరమైన ఆధిపత్య ధోరణుల పట్ల, పురుషాధిపత్య వ్యవహార శైలి పట్ల ఒకే రకమైన విమర్శ సమాజంలో ఉంది.

ఈ విషయాలపై నాయకత్వంలో సరైన ఆత్మ విమర్శ లేని యధాలాప వైఖరి, తమపై వచ్చే విమర్శలను మొండిగా తిరస్కరించే ధోరణి ఇక ఎంత మాత్రం చెల్లదు. దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడడానికి ఆటంకంగా ఉన్న ఇలాంటి అన్ని అంశాలను ఆయా పార్టీలు లోతుగా సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది.

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో పాజిటివ్ గా చూడవలసిన మూడు ఘటనలు జరిగాయి . విప్లవ శిబిరంలో ఉన్న రెండు న్యూ డెమొక్రసీ పార్టీలు ఒకే పార్టీగా విలీనం కావడం ఒక మంచి పరిణామం అయితే, CPM పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా మిత్రుడు జాన్ వెస్లీ ఎన్నిక కావడం స్వాగతించాల్సిన మరో పరిణామం. అలాగే సిపిఐ మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో, కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ మారణ కాండకు వ్యతిరేకంగా, రాష్ట్ర సిపిఐ పార్టీ హైదరాబాద్ లో సదస్సు నిర్వహించడం కూడా ఫాసిస్టు వ్యతిరేక ప్రజాతంత్ర ఉద్యమాలకు బలాన్నిచ్చే చర్య.

ఈ మూడు ఘటనలను ఈ వ్యాసంలో ప్రస్తావించడం ఒక సందర్భమే అయినా, నేను ఈ వ్యాసం రాయడానికి ప్రధాన కారణం ఇంతకు మించి లోతైనది. సిపిఐ, CPM, వివిధ ఎం-ఎల్ పార్టీలు,మావోయిస్టు పార్టీల మధ్య ఉండే సైద్ధాంతిక, రాజకీయ భిన్నాభిప్రాయాల పట్ల నాకు పూర్తి అంచనా ఉంది. కాకపోతే పార్టీ ఎత్తుగడలతో, వివిధ స్థాయిలలో జరిగే ఎన్నికల ఫలితాలతో, అధికారంలో ఏ పార్టీ, ఏ నాయకుడు అధికారంలో ఉన్నాడు అనే అంశంతో సంబంధం లేకుండా, పేద ప్రజల సమస్యలపై, వారిని సంఘటితం చేసి ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పుకునే ఈ అన్ని పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో ఆచరణలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా ? అన్న కీలక ప్రశ్న ఈ వ్యాసంలో వేయడం నా ప్రధాన ఉద్దేశ్యం.

తెలంగాణ ప్రజా ఉద్యమాల చరిత్రలో వివిధ కమ్యూనిస్టు పార్టీల స్థానాన్ని, అవి చేసిన ఉద్యమాలను, వాళ్ళు చేసిన త్యాగాలను, ఎవరూ చెరిపి వేయలేరు కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పార్టీలు శ్రామిక వర్గ దృక్పథానికి అనుగుణంగా ఆలోచిస్తున్నాయా? నిజమైన శ్రామిక వర్గ ప్రజలతో నిలబడుతున్నాయా ? సమాజంలో ముందుకు వస్తున్న కొత్త అంశాలను, పారిశ్రామికీకరణ, నగరీకరణ పేరుతో ముందుకు వస్తున్న అభివృద్ధి నమూనాలను , సామాజిక న్యాయ కోణంలో, సుస్థిర పర్యావరణ రక్షణ కోణంలో పరిశీలిస్తున్నాయా ? సమాజంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో, అట్టడుగున ఉన్న శ్రామిక కులాల ప్రత్యేక సమస్యలపై, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేయడానికి అవి ఆలోచిస్తున్నాయా ?

నిర్మాణ పరంగా, అత్యంత బలహీనపడిన కమ్యూనిస్టు పార్టీలను ఈ ప్రశ్నలు ఆడగాల్సి రావడం ఇబ్బంది కరమే అయినా, భవిష్యత్ తెలంగాణలో , పెరుగుతున్న ఫాసిస్టు ప్రమాదాన్ని నిలువరించడానికి, శ్రామిక ప్రజల నిజమైన సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత ఈ పార్టీలపై ప్రధానంగా ఉందనే అంశాన్ని గుర్తించిన స్పృహతో, ఈ ప్రశ్నలు వేయాల్సి వస్తున్నది.

సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచకీరణ విషయంలో పాలకవర్గ పార్టీలలో ఏకీభావం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడినా, అధికారం చేపట్టగానే, ఈ పార్టీలు, ఒకే రకమైన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలను ముందుకు తీసుకుపోవడం మనం గమనిస్తున్నదే,

కాకపోతే ఈ విధానాల ప్రభావం వివిధ పేర్లతో పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలపై కూడా ఉందని మనకు రోజు రోజుకూ ఋజువవుతున్నది. అందుకు సూచికగా ఆయా పార్టీల నాయకుల, కార్యకర్తల, మొత్తంగా పార్టీల ఆలోచనలలో, పని విధానంలో తీవ్రమైన మార్పులను మనం గమనించవచ్చు.

సరళీకృత ఆర్ధిక , పారిశ్రామిక విధానాలు ముందుకు తీసుకువచ్చిన అభివృద్ధి నమూనా, కొన్ని సందర్భాలలో ఆయా పార్టీలను, నాయకులను గందరగోళంలో పడేస్తున్నది. సమాజం నిజమైన అభివృద్ధి జరగడానికి ఇదే సరైన మార్గమని,ఈ పరిణామాలను మనం ఆపలేమని భావించేలా ఏ పార్టీలను భ్రమలలో ముంచెత్తుతున్నది.

ఈ దోపిడీ విధానాల అమలుపై పాలకులను ప్రశ్నించాల్సిన కమ్యూనిస్టులు, కొంత మందయినా, ఈ విధానాలు అభివృద్ధిలో భాగమని, ప్రజలకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయడం కూడా కనిపిస్తున్నది.

ఈ విధానాల దుష్ఫలితాలను అనుభవిస్తున్న ప్రజలు ముందుకు వచ్చి పోరాడుతుంటే, అనేక సందర్భాలలో కమ్యూనిస్టులు దూరంగా ఉండిపోతున్నారు. లేదా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించి ఊరుకుంటున్నారు. ఈ విధానాలపై, తాముగా ఉద్యమాల నిర్మాణానికి పూనుకోవడం లేదు. లేదా ఆయా ఉద్యమాలలో క్రియాశీల భాగస్వామ్యం తీసుకోవడం లేదు.

గత మూడు దశాబ్ధాలలో, తొలి దశలో ధనిక వర్గానికి ప్రధానంగా, మధ్య తరగతి ప్రజలకు ఒక మేరకు మేలు చేసిన ఈ అభివృద్ధి నమూనా, సమాజంలో మిగిలిన పేద వర్గాల ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలను చావు దెబ్బ తీసింది. సమాజంలో ఆర్ధిక, సామాజిక అంతరాలు విపరీతంగా పెరగిపోయాయి. గత మూడు దశాబ్ధాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విధానాలు, ప్రవేశ పెట్టిన పథకాలు ఈ అంతరాలను మరింత పెంచుతున్నాయి. పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా బలహీన పడిపోతూ, విద్యా, వైద్యం తో సహా అన్ని వ్యవస్థలూ ప్రైవేట్ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి పోతున్నాయి.

పైగా అనేక ప్రజా ఉద్యమాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన, పేద ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన వివిధ చట్టాలను, విధానాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ప్రస్తుతం పాలకులు కొనసాగిస్తున్న ఈ అభివృద్ధి నమూనా, కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలకు, శత కోటీశ్వరులకు తప్ప మధ్య తరగతిని కూడా ఆర్ధికంగా అతలాకుతలం చేస్తున్నది.

కమ్యూనిస్టు, విప్లవ పార్టీల పరిభాషలో చెప్పాలంటే, వర్గ దోపిడీ తీవ్రంగా ఉన్న ఈ స్థితిలో ఎక్కడైనా కమ్యూనిస్టులు చురుకైన పాత్ర పోషించాలి. ఊగిసలాటలకు తావు లేకుండా, దోపిడీకి, వివక్షకు గురవుతున్న ప్రజల పక్షాన నికరంగా నిలబడాలి. సమిష్టి తత్వాన్ని చంపేస్తూ, వ్యక్తి వాదం ప్రోత్సాహిస్తూ, ప్రపంచీకరణ నేర్పించిన మధ్యతరగతి భేషజాలను , అందరితో మంచి వాళ్ళు అనిపించుకోవాలనే మర్యాదస్తుల పోకడలను వదిలేసి, ఖచ్చితమైన శ్రామిక వర్గ స్పృహతో రంగంలోకి దిగాలి. రోజువారీ కార్యాచరణ చేపట్టాలి. ఉద్యమాలను నిర్మించాలి. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు ప్రస్తుతం ఈ పాత్ర పోషించడం లేదు. ఫలితంగా రోజు రోజుకూ తమను చుట్టుముడుతున్న సమస్యలతో శ్రామిక ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. దోపిడీ దారుల, పాలకుల దుర్మార్గాలకు బలవుతున్నారు.

ముఖ్యంగా కొన్ని అంశాలను ఈ సందర్భంగా ఆయా కమ్యూనిస్టు పార్టీల దృష్టికి తీసుకు రావాలని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర నిజమైన అభివృద్ధి , ఈ అంశాలపై మీరు తీసుకునే వైఖరిపై ఆధారపడి ఉంది.

తెలంగాణ లో గత 7 దశాబ్ధాలుగా భూమి సమస్యపై వివిధ దశలలో ఉద్యమాలు సాగాయి. కానీ ఇప్పటికీ భూమి సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 50 శాతం జనాభాకు సెంటు భూమి కూడా లేదని 2011 సామాజిక, ఆర్ధిక, కులగణన నివేదిక తేల్చింది. కానీ విషాదకరంగా ప్రభుత్వాలు 1973 భూ గరిస్ట పరిమితి చట్టం అమలును అటక ఎక్కించాయి. భూ సంస్కరణల గురించి మాట్లాడడమే మానేశాయి. కానీ ఆశ్చర్యకరంగా, కమ్యూనిస్టు పార్టీలు కూడా భూ పంపిణీ చేయాలనే డిమాండ్ ను తమ అజెండా నుండీ తొలగించాయి.

పేదలకు పంచడానికి భూమి ఎక్కడుందనే ప్రభుత్వ గడుసు ప్రకటనలను, కమ్యూనిస్టు పార్టీలు కూడా తలకెక్కించుకున్నాయి అనిపిస్తుంది. రోజురోజుకూ నిజమైన గ్రామీణ రైతుల చేతుల్లోంచి భూమి జారిపోతూ ఉంది. కొత్తగా ఒక్క ఎకరం భూమి కూడా గ్రామీణ పేద కుటుంబం కొనుగోలు చేయలేని పరిస్థితికి భూముల ధరలు చేరాయి. భూమి మార్కెట్ సరుకుగా మారింది. వ్యవసాయంతో, గ్రామాలతో ఏ సంబంధం లేని వారు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. మాగాణి, మెట్ట భూములను రెగ్యులర్ ప్రాతిపదికన విభజిస్తూ, భూ గరిష్ట పరిమితి చట్టం ప్రకారం మిగులు భూములను తేల్చి, భూమి లేని పేదలకు భూ పంపిణీ చేయాలనే డిమాండ్ చేయడం కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడో మానేశాయి. అలాగే వ్యవసాయేతరులు సాగు భూములు కొనకుండా నిషేధం విధించాలనే డిమాండ్ చేయడానికి కూడా కమ్యూనిస్టు పార్టీలు సిద్ధంగా లేవు. ఈ రెండు డిమాండ్లు తమ అజెండాలో చేర్చుకోకుండా, వాటిపై ఉద్యమాలు నిర్మించకుండా కమ్యూనిస్టు పార్టీలు, తమ డాక్యుమెంట్లలో మాత్రం భూమి సమస్య ఉంది అని రాసుకోవడం వల్ల పేదలకు వరిగేదేమీ ఉండదు.

అలాగే పేదల భూ పోరాటాల ఫలితంగా, ప్రభుత్వాల భూ పంపిణీ పథకాల వల్ల, గత 7 దశాబ్ధాలలో దళితులకు, కొద్దిమంది వెనుకబడిన వర్గాలకు దక్కిన అసైన్డ్ భూములను ప్రస్తుత ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక వాడలు, రీజనల్ రింగ్ రోడ్లు, స్మార్ట్ సిటీ లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, ప్రకృతి వనాలు, వైకుంట ధామాలు , రైతు వేదికలు, గృహ నిర్మాణ పథకాలకు భూమి పేరుతో పెద్ద ఎత్తున వెనక్కు తీసుకుంటున్నాయి. అభివృద్ధి పేరుతో, ప్రభుత్వాలు చేస్తున్న ఈ అన్యాయాన్ని, కమ్యూనిస్టు పార్టీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. దళితుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వెనక్కు తీసుకోకూడదనే వైఖరిని కమ్యూనిస్టు పార్టీలు తీసుకుని, దానిపై ఉద్యమాలు నిర్మించడం లేదు.

ఈ పార్టీల ఈ వైఖరి ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా పట్ల, వీరి సానుకూలతకు నిదర్శంగా భావించవచ్చా ? ఆధిపత్య కులాల చేతుల్లోని పట్టా భూముల జోలికి ప్రభుత్వాలు వస్తే మాత్రమే భూ సేకరణకు వ్యతిరేకంగా ఎంతో కొంత ఉద్యమాలు ముందుకు రావడం వెనుక కారణాలు స్పష్టమే.,

భూ సంస్కరణలు అమలు కాకపోవడం, వ్యవసాయేతరుల చేతుల్లోకి లక్షలాది ఎకరాలు వెళ్ళిపోవడం కారణంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో కౌలు రైతుల సంఖ్య పెరిగిపోతున్నది. రైతు స్వరాజ్య వేదిక అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో 36 శాతం కౌలు రైతులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పంటల సాగు వీరే చేస్తునారు. కానీ రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపు లేదు. కౌలు రైతులను గుర్తించడానికి 2011 లో వచ్చిన భూ అధీకృత సాగు దారుల చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. ఫలితంగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇంత తీవ్ర సంక్షోభ స్థితిలో కూడా రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలకు, ఇది ప్రధాన అజెండాగా మారలేదంటే, ఆయా పార్టీల వర్గ స్వభావంలో వచ్చిన మార్పుగా చూడాలా? నామ్ కే వాస్తే కౌలు రైతుల సంఘాలు పెట్టి, అప్పుడప్పుడూ ప్రకటనలు చేయడం వరకే పరిమితమయితే, ఈ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. కానీ, దశాబ్ధాలు గడుస్తున్నా, తెలంగాణ లో ఎందుకు కమ్యూనిస్టు పార్టీలు, దీనిని ప్రధాన ఉద్యమ నినాదంగా చేసుకోవడం లేదు? కమ్యూనిస్టు పార్టీలలో కూడా పరోక్ష భూస్వాములు ఉన్నారనీ, అందుకే కౌలు రైతుల సమస్యను పట్టించుకోవడం లేదనీ, కౌలు రైతుల పక్షాన గట్టిగా మాట్లాడితే, స్వంత పట్టా భూములు ఉన్న దనిక, మధ్యతరగతి రైతులు తమకు దూరం అవుతారనే భయం కూడా కొన్ని కమ్యూనిస్టు పార్టీలకు ఉందనే విమర్శలకు పార్టీలు ఏమి సమాధానం చెబుతాయి ? BRS పార్టీ పదేళ్ళ పాటు కౌలు రైతులకు అన్యాయం చేసినా, కమ్యూనిస్టు పార్టీలు పెద్దగా ఉద్యమాలు చేయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినా, కమ్యూనిస్టు పార్టీల నుండీ పెద్ద స్పందన లేదు. ఆయా పార్టీలు ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం లేదా?

ఆదివాసీ ప్రాంతాలలో కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు పూర్తి స్థాయిలో పట్టాలు దక్కలేదు. ఆదివాసీయేతరులు పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రాంతాలలోకి చొచ్చుకు వెళ్ళి , ఆదివాసీలకు దక్కాల్సిన ప్రయోజనాలను కొల్లగొడుతున్నారు.

మరో వైపు టైగర్ జోన్ పేరుతో, అడవిలో ఉంటున్న ఆదివాసీలను అడవి బయటకు పారదోలాలనే వైఖరితో ప్రభుత్వాలు ఉంటున్నాయి. కొంతమంది పోడు రైతులకు కొన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. నిజానికి అడవి పై హక్కు పూర్తిగా ఆదివాసీ ప్రజలకు దక్కాలంటే, కేవలం సాగు భూమి పై పట్టాహక్కులు మాత్రమే కాకుండా ఆదివాసీ ప్రజలకు ఆడవిపై మొత్తం సాముదాయక హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ కమ్యూనిస్టు పార్టీలు కూడా పోడు భూములకు పట్టాల గురించి పోరాడినంతగా, ఆదివాసీలకు దక్కాల్సిన సాముదాయక హక్కులపై ఉద్యమాలు చేయడం లేదు. ఆదివాసీయేతరులు అడవిలోకి చొచ్చుకు రావడం, డోజర్లు లాంటి వాటితో పెద్ద ఎత్తున అడవిని నరకడం చేస్తుంటే, కమ్యూనిస్టు పార్టీలు అడ్డుకోవడం లేదు. ఆయా జిల్లాలలో పెద్ద ఎత్తున అడవి నరికివేతకు ఆదివాసీలు కారణం కాదని, కొన్ని కమ్యూనిస్టు పార్టీల అనుమతితో, కొన్ని సార్లు మద్ధతుతో, ఇతరులు అడవిని పెద్ద ఎత్తున కొట్టేశారని క్షేత్ర స్థాయి నుండీ అనేక మంది చెబుతున్నారు. ఇది కమ్యూనిస్టు పార్టీలకు శోభనిచ్చే పరిణామం కాదు, ఆదివాసీల పక్షాన దృడంగా నిలబడడం కమ్యూనిస్టులకు ఎంత అవసరమో, పర్యావరణ హితం కోసం అడవి విధ్వంసం కాకుండా కాపాడుకోవడం కూడా అంతే అవసరం. ఈ స్పృహ కమ్యూనిస్టు పార్టీలకు అతి తక్కువగా ఉందని ప్రజా పక్ష పర్యావరణ వేత్తలు కూడా విమర్శిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పదుల కొద్దీ ఎకరాలపై పట్టా హక్కులు కలిగిన రైతులకు రైతు బీమా అమలవుతుంది. స్వంత భూమి లేని కౌలు రైతులకు, పోడు రైతులకు , వ్యవసాయ కూలీలకు ఈ సాంఘిక బధ్రత పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేయకపోయినా, కమ్యూనిస్టు పార్టీలకు కోపం రావడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కూడా ఇచ్చిన హామీని అమలు చేయకపోతే, కూడా కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడడం లేదు. వ్యవసాయక విప్లవానికి గ్రామీణ పేదలు , వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు ఇరుసుగా ఉంటారని ప్రకటించుకునే పార్టీలు కూడా, ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నాయి. వీటిపై సంఘటితంగా, సమరశీల ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో, పార్టీలు కనీస ఆందోళనలకు కూడా పూనుకోవడం లేదు. అసలు ఆయా పార్టీల అజెండాలో ఈ అంశాలే ఉండడం లేదన్నా ఆశ్చర్యం లేదు. భూ పంపిణీ ఎలాగూ లేదు, గ్రామీణ పేదలకు కనీసం సాంఘిక బధ్రత పథకాల అమలు గురించి కూడా పోరాడక పోతే, ఈ కమ్యూనిస్టు పార్టీల ఉనికికి అర్థమేమిటి?

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పేరుతో ప్రభుత్వాలు సృష్టిస్తున్న విధ్వంసంపై కూడా కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడడం లేదు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పేరుతో రైతులనుండీ భూములు గుంజుకుంటున్న ప్రభుత్వాలు ఆయా ప్రాంతాలలో కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాయి. ఆయా పరిశ్రమలు స్థానిక యువతకు ఉపాధి కల్పించకపోయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నిర్వాసితులవుతున్న గ్రామీణ పేద కుటుంబాలకు సరైన పరిహారం ప్రభుత్వాలు చెల్లించడం లేదు. ఈ అన్ని అంశాలపై స్థానిక ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 30 చోట్ల రానున్న కాలుష్య కారక ఇథనాల్ పరిశ్రమలకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాలలో ప్రజలు పోరాడుతున్నారు. కొన్ని చోట్ల ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో పారిశ్రామిక వాడల పేరుతో తమ భూములను గుంజుకోవడానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు.

కానీ ఈ ఉద్యమాలలో కమ్యూనిస్టు పార్టీల పాత్ర నామ మాత్రంగా ఉంటున్నది. కొన్ని సార్లు ఆయా ప్రాంతాలలో పార్టీలకు నిర్మాణం ఉండక పోవచ్చు. కానీ, ప్రజలు పోరాడుతున్న సమయంలో, ఆ ప్రాంతాలకు కార్యకర్తలను కేటాయించడం, మొత్తం పార్టీ ఆయా ఉద్యమాలను విజయవంతం చేయడానికి పూనుకోవడం చేయాల్సి ఉంటుంది. మిగిలిన పాలక వర్గ పార్టీలు ఎలాగూ ఆ పని చెయ్యవు. కానీ కమ్యూనిస్టు పార్టీలకు ప్రజల సమస్యల పరిష్కారం, ఉద్యమాల విజయవంతం లక్ష్యంగా ఉంటుంది కనుక , ఈ పని తప్పకుండా చేయాలని ప్రజలు ఆశిస్తారు.

కమ్యూనిస్టులు నిజాయితీగా ప్రజల వెంట నిలబడక పోతే, ప్రతిపక్ష పాలక వర్గ పార్టీలు ఉద్యమాలను పక్కదారీ పట్టిస్తాయి. ప్రభుత్వాలు ఉద్యమాలను నిర్బంధంతో అణచి వేయాలని చూస్తాయి. నిర్బంధాలను తట్టుకునే స్వభావం, ప్రతిఘటించే ధైర్యం కమ్యూనిస్టు పార్టీల స్వంతం అని ప్రకటించుకుంటారు కనుక, ఆ మేరకు పార్టీలు ఆచరణలో ప్రజల వెంట నిలబడాల్సి ఉంటుంది. కానీ అనేక సందర్భాలలో దీనికి భిన్నంగా పరిణామాలను మనం చూస్తున్నాం.

రాష్ట్ర వ్యవసాయ రంగానికి సమగ్ర వ్యవసాయ విధానం లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళిక లేదు. విష రసాయనాలు లేని సుస్థిర వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రభుత్వాలకు చిత్త శుద్ధి లేదు. అధిక సాగు నీరు, విష రసాయనాలు, మోనో క్రాపింగ్ వల్ల, ఇప్పటికే రాష్ట్రం తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నది. గ్రామీణ ప్రజల అకాల మరణాలే కాదు, రాష్ట్రమే అనారోగ్యంతో తీసుకుంటున్నది. కానీ ఈ విషయంలో కూడా కమ్యూనిస్టు పార్టీలలో ( కొద్ది మంది వ్యక్తులలో తప్ప) లోతైన చర్చ లేదు. సేంద్రీయ వ్యవసాయం అంటే, అదేదో ఎన్ . జి . వో సంస్థల కార్యక్రమంగా చూసే ధోరణి అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఉంది. తాము పని చేస్తున్న గ్రామాలలో కూడా ఈ సమస్యలన్నీ కనిపిస్తున్నా, ఆ సమస్యలకు మూలాలను వెదికే పనిలో కమ్యూనిస్టు పార్టీలు లేవు. వాటికి స్థానికంగా పరిష్కారాలను కనుక్కోవడానికి ప్రత్యేక ప్రయత్నాలూ లేవు.

ఈ సమస్యల పరిష్కారానికి సృజనాత్మకంగా, సానుకూల కార్యాచరణ కమ్యూనిస్టు పార్టీల అజెండాలో ఉండడం లేదు. పర్యావరణ విధ్వంసానికి కారణమైన హరిత విప్లవ నమూనా పట్ల ఈ పార్టీలకు పెద్ద అభ్యంతరం ఉండడం లేదు.

అసలు ఆ అంశాలు చర్చించి వాటిపై అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ప్రభుత్వం ముందు ఈ విషయంలో నిర్ధిష్ట డిమాండ్లు కూడా ఉంచడం లేదు.

వేటితో పాటు, ప్రభుత్వ రంగంలో విద్యా , వైద్య రంగాలు ఉండాలని, ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందాలని, రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న దశలో వారిని సంఘటితం చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు, పారిశ్రామిక ప్రాంతాలలో ప్రమాదాలు, కార్మికుల మరణాలు పెరగడం. దళితులపై పెరుగుతున్న వివక్షా పూరిత దాడులు, వారికి కేటాయించిన బడ్జెట్ లను సరిగా ఖర్చు చేయక పోవడం – లాంటి అంశాలు కూడా ఇంకా కమ్యూనిస్టు పార్టీల ప్రధాన అజెండా లోకి రాలేదనేది కూడా వాస్తవం., వీటి పట్ల కమ్యూనిస్టు పార్టీలు చాలా యాంత్రిక ధోరణితో వ్యవహరించడం పై ఆయా రంగాలలో పని చేస్తున్న మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశాలను ఇక్కడ రాయడానికి కారణం, కమ్యూనిస్టు పార్టీలను విమర్శించాలని కాదు. రాష్ట్ర ప్రజల పక్షాన కమ్యూనిస్టులు ఉద్యమాలు నిర్మించే ప్రయత్నంలో పేద , శ్రామిక వర్గాలకు కీలకమైన అంశాలను అజెండా మీదకు తీసుకోవాలని గుర్తు చేయడమే నా అసలు లక్ష్యం. మేము మా శక్తి మేరకు, మాకున్న అవగాహనతో పని చేస్తున్నాం, ఇతరుల సలహాలు, సూచనలు మాకు అవసరం లేదు అని ఆయా పార్టీలు ప్రకటించినా లేదా దీనిని ఆయా పార్టీల నిజాయితీని శంకిస్తూ, అవమానిస్తూ రాసిన వ్యాసంగా పరిగణించినా నేను చేయగలిగింది ఏమీ లేదు. నా ప్రతిపాదనలపై సానుకూల చర్చకు, ఆచరణకు సిద్దపడితే, రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కమ్యూనిస్టుల బలం పెరుగుతుంది. రాష్ట్రంలో ఫాసిస్టు శక్తులను ఎదగకుండా చేయడం, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవడం తేలిక అవుతుంది.

Read More
Next Story