అవకాశం చేజార్చుకున్న జగన్: మరి బాబు ముందుకు దూసుకెళ్తాడా?
x

అవకాశం చేజార్చుకున్న జగన్: మరి బాబు ముందుకు దూసుకెళ్తాడా?

ఏవీవీ ప్రసాద్ విశ్లేషణ: పోలవరం పూర్తి చేసే గొప్ప అవకాశాన్ని జగన్ చేజేతులా పోగొట్టుకున్నారా? ఈ సమస్య ఈ ఐదేళ్లలో తీరుతుందా, సతాయిస్తుందా. చంద్రబాబు ముందున్న సవాల్


పోల ' వర్రీ ' మరి కొన్నాళ్ళు తప్పేటట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 17న సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ప్రాజెక్ట్ పూర్తికి తాజాగా విధించిన గడువు ఇంకా నాలుగేళ్ళు. అంటే 2028 నాటికి పూర్తి చేయాలని. నవ్యాంధ్రలో బాబు-2 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేసిన మొదటి పర్యటన ఇదే. దాదాపు రెండు గంటల పాటు ప్రాజెక్టు పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైందో వివరించి తానిప్పుడు ఏంచేయదలిచారో తెలిపారు.

నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని అంటూనే, పూర్తి స్థాయి నిర్మాణానికి ఎంతకాలం పడుతుందో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే తప్ప చెప్పలేమని కూడా అన్నారు. దీనిని బట్టి ప్రాజెక్టు భవిష్యత్తును మనం తేలికగానే అంచనా వేసుకోవచ్చు. నాలుగేళ్లలో పూర్తవుతుందంటే ' పర్వాలేదు ' అని మనసును సరిపెట్టుకోవచ్చు. కానీ ఎంత కాలం పడుతుందో చెప్పలేమంటే.. ఈ ' వర్రీ ' అనంత మా! అనే సందేహం కూడా కలుగుతుంది.

నిజానికి, ప్రాజెక్టు ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఆయన చెప్పిన రెండో మాటే నిజమవుతుందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు ఒకటి, రెండు కావు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పూర్తయితే తీరే నీటి సమస్యలు అటుంచితే, పూర్తి కావడానికి అవరోధాలుగా మారిన సమస్యలు మాత్రం అంత త్వరగా పరిష్కారమయ్యేవి కాదనే అనిపిస్తుంది. ప్రాజెక్టు క్షేత్రంలో చంద్రబాబు చేసిన సమీక్ష సందర్భంగా ఆ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానిలో వారు చెప్పిన ప్రకారం ప్రాజెక్టులోని డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది.

దాని మరమ్మతులకు రూ. 447 కోట్ల వ్యయమవుతుందనీ, 288 రోజుల సమయం పడుతుందనీ చెప్పారు. ఇది ఒక ప్రధాన సమస్య. ఆలస్యమైతే ఆ వ్యయం మొత్తం పెరగవచ్చు, ఆ గడువు కూడా దాటవచ్చు. చెప్పలేం. దానికి సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలంటే రూ. 990 కోట్ల ఖర్చు, 457 రోజుల సమయం అవసరమవుతాయట. అంటే తిరిగి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే ఏడాదిన్నర దాకా పట్టే అవకాశం ఉంది. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజిని నివారించవలసి ఉందనీ, కుంగిన గైడ్ బండ్‌ను కూడా మరమ్మతు చేయాలనీ చెప్పారు. ఇవి అత్యవసర సమస్యలు.

ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి. ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూరులో 115 టిఎంసిల నీటి నిల్వకు రూ.7,792.33 కోట్లు కావాలనీ, అదే విధంగా 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టిఎంసిల గరిష్ట నీటి నిల్వకు రూ.29,949.42 కోట్లు అవసరమనీ వివరించారు. ఇలాంటి సమస్యలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న ఇంజినీర్లు చెప్పే విషయాలు వింటుంటే నాలుగేళ్లలోనో, అయిదేళ్లలోనో నిజంగా ప్రాజెక్టు పూర్తవుతుందా? అనే సందేహం తప్పక కలుగుతుంది.

రాజధాని మార్చాలనే ఆలోచన వచ్చినట్లే, గత ప్రభుత్వానికి పోలవరం నిర్మాణాన్ని మార్చివేయాలనే ఆలోచన కూడా వచ్చింది. అయితే ఆ ప్రాజెక్టు స్థలాన్ని అక్కడినుంచి తరలించాలనే ఆలోచన రాకపోవడం తెలుగు ప్రజల అదృష్టమనే అనుకోవాలి. నిజానికి 2020 నాటికే ప్రాజెక్టు పూర్తి కావలసి ఉండగా, జగన్ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు సంస్థను మార్చేశారు. కొత్త సంస్థకు పనులు అప్పగించారు. ప్రాజెక్టు లోని కొన్ని నిర్మాణాలను అధికారులు ఎందుకు మార్చేశారో తెలియదు. వాటికి ఒక నివేదిక అంటూ ఏదీ లేదు.

రివర్స్ టెండరింగ్‌తో పనులు సాగక పోగా, కొన్నిచోట్ల మొదటికి వచ్చాయి. వాటికి మళ్లీ నిధుల కొరత. దానితో పనులు స్తంభించాయి. ప్రాజెక్టులో చాలా చోట్ల మొండి గోడలు దర్శనమివ్వడానికి అదే కారణం. 2019లో వచ్చిన భారీ వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల దెబ్బ తిన్నా, దాని మరమ్మతులను పట్టించుకొన్నవారే లేరు. తర్వాత నాలుగేళ్లు గడచినా ఆ లోపం అలాగే ఉండిపోవడంతో ఇప్పుడు దాని మరమ్మతులకే రూ.500 కోట్ల నుండి రూ.1000 కోట్ల వ్యయం కనిపిస్తోంది.

ప్రాజెక్టుపై బాబు -1 హయాంలో ఏటా సగటున రూ. 13, 683 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ మొత్తం ఏడాదికి చేసిన ఖర్చు రూ.7, 100 కోట్లకు తగ్గిపోయింది. ఆ మొత్తంలో అధిక శాతం కాంట్రాక్టర్లకు చెల్లించడానికే సరిపోయింది గానీ కొత్తగా ఏ పనులు చేపట్టలేదని సంబంధిత అధికారులే అంగీకరిస్తున్నారు. నవ్యాంధ్ర ఏర్పడడానికి ముందు వైఎస్ ప్రభుత్వ హయాంలో ఏటా సగటున రూ. 4,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

కీలకమైన నిర్మాణాలు జరుగుతున్న సమయంలో కాంట్రాక్టు ఏజెన్సీలను మార్చడం, అనుభవజ్ఞులైన సిబ్బందిని బదిలీ చేయడం వల్ల ప్రాజెక్టు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించడం వల్ల తగినంత ప్రయోజనం ఉంటుందా, ఉండదా అనే అంశంపై నిపుణులే సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. 2014-19 మధ్య తాను 30 సార్లు ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షించాననీ, తర్వాత ఆ పరిస్థితే మారిపోయిందనీ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడం సబబే అనిపిస్తుంది.

ఎవరు ఎవరిమీద ఎలాంటి ఆరోపణలు చేసినా, ప్రాజెక్టు ఆలస్యానికి అవి జవాబులు కావు. నిర్వాసితుల పునరావాస సమస్య కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉంది. కేంద్రం నుంచి సకాలంలో నిధులు అందకపోవడం మరో ప్రధాన సమస్య. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రం నుంచి నిధులు విడుదల చేయించుకోవడంలో ఆలస్యం చేస్తే అది పోలవరం ప్రాజెక్టు లాగే తయారవుతుంది. చంద్రబాబు తన ' పెట్ ప్రాజెక్టు ' గా పోలవరాన్ని చెబుతున్నారు గనుక ఈ టెర్మ్ లోనైనా అది పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగులుతుంది.

నిజానికి ఈ అపూర్వ అవకాశం జగన్‌కే తొలుత దక్కింది. భేషజాలు, వైమనస్యాలు పక్కన పెట్టి, అభివృద్ధి లక్ష్యంగా ప్రాజెక్టును తన హయాంలో పూర్తి చేసి ఉంటే ఆ ప్రతిష్ట ఆయనకే దక్కేది. అప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి కూడా. మిగిలిన 30 శాతం పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం వచ్చేది కాదు. జగన్ కూడా ఇంత విచారించాల్సిన అవసరం ఉండేది కాదు. బాబు- 2 లో ఇది ఆయనకు వచ్చిన మహత్తర అవకాశం. తగిన విధంగా ఉపయోగించుకోగలరనే భావించాలి.

Read More
Next Story