బీహార్ ఫ్యామిలీ పాలిటిక్స్- ఒక ఏపీ మోడల్
x

బీహార్ ఫ్యామిలీ పాలిటిక్స్- ఒక ఏపీ మోడల్

ఏపీలో, తెలంగాణల ప్రధాన రాజకీయ కుటుంబాల్లోని కుమార్తెలు ఇంట్లో పెత్తనం విభేదించి బయటకు వెళ్ళడంతో, బీహార్ సందర్భం కొత్త ‘ట్రెండ్’గా పరిశీలనాంశం అయింది.

‘ఎప్పటికీ చేయకుండా ఉండడం కంటే, అదేదో ఆలస్యంగా అయినా చెయ్యి’ అనడానికి ఆంగ్లంలో ‘బెటర్ లేట్, ద్యాన్ నెవర్’ అనే నానుడి ఉంది. అయితే, సందర్భాలు వేరైనా మనం తెలుగులో అనుకునే- ‘అంత్య నిష్టూరం కంటే, ఆది నిష్టూరం మేలు’ ఇంగ్లీష్ దానికంటే ‘బెటర్ వెర్షన్’. ఇంగ్లీష్ లో లేదుగాని, మన నానుడిలో పర్యవసానాలు చూశాక సర్ధుబాటు కాదు, ఆదేదో ‘ముందే’ మేల్కోవడం మేలు అనేది స్పష్టంగా ఉంది. బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి నుంచి మొదట ఒకరు, ఆ తర్వాత మరో ముగ్గురు కుమార్తెలు కుటుంబంతో విభేదించి, పాట్నా నుంచి డిల్లీ వెళ్లిపోయినట్టుగా 17 నవంబర్ నాటికి పత్రికల్లో వార్తలుగా వచ్చాయి. ఇప్పుడవి జాతీయ రాజకీయాల్లో చర్చ అవుతాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, ముందు ఏపీలోనూ, ఇటీవల తెలంగాణలోనూ ప్రధాన రాజకీయ కుటుంబాల్లోని కుమార్తెలు ఇంటితో విభేదించి బయటకు వెళ్ళడంతో, బీహార్ సందర్భం కొత్త ‘ట్రెండ్’గా పరిశీలనకు అంశం అయింది.

కొడుకులు సంగతి సరే, కానీ కుమార్తెలు కూడా రాజకీయ వంశవృక్షాలకు కొమ్మలుగా విస్తరించడం తొంభై దశకం తర్వాత చూస్తున్నాం. తమిళనాడులో కరుణానిధి, మహారాష్ట్రలో శరద్ పవార్, రాజస్థాన్ లో సింధియాలు, కాశ్మీర్ లో ముఫ్తీ సయ్యద్ ఇలా కొన్ని కనిపిస్తాయి. అయితే, ఏవో కారణాలతో ప్రధాన కుటుంబంతో విభేదించి మరీ ఇంటినుంచి బయటకు వచ్చి కూతుళ్ళు వాళ్ళ స్వంత రాజకీయాలు చేయడం కొత్త ధోరణి. అలా చూసినప్పుడు, తెలుగు నాట ‘ఆమె’ కేంద్రిత రాజకీయాలు చివరికది షర్మిల ‘ఫ్యాక్టర్’ గా మనవద్ద సంభవించింది. దీన్నొక కౌటుంబిక స్పృహ దృష్టితో చూసినప్పుడు, వొక ‘కంఫర్ట్ జోన్’ ను బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినప్పటికీ, షర్మిలది తొలి విజయం కాలేదు. అది అవుతుందో లేదో కూడా తెలియదు. ఉన్నట్టుండి స్వంత రాజకీయ పార్టీతో షర్మిల వార్తల్లో వ్యక్తి అయ్యేసరికి, అందరం అటు వైపుకు చూసాము కానీ, అటువంటివి మన ఇళ్ళల్లో మాత్రం లేవా?

ఏపీలో అన్న జగన్మోహన్ రెడ్డితో విబేధించి 2021లో ఆమె తెలంగాణలో స్వంత పార్టీ పెట్టింది. ఈ ధిక్కార ధోరణికి అది మొదలు అయినా అది ముందు కెళ్ళే క్రమంలో ‘ఆమె’ ప్రాతినిధ్యం వహించే పలు వేర్వేరు పాయలు వచ్చి ఇందులో చేరి దేశమంతా అది విశాల ప్రవాహంగా మారడం ఇప్పటి బీహార్ అనుభవం చెబుతున్నది. దీంతో ఇకముందు జరిగేది మేలా కీడా అనేది కాదు చర్చ. వొకసారి అటువంటివి మొదలయితే ‘ఆమె’ ప్రవేశానికి అడ్డుగా ఉండే చాలా తెరలు పక్కకు తొలుగుతాయి అనేది మాత్రమే ఇక్కడ పాయింట్. తెరలు పొరలు తొలుగుతూ ఉన్నప్పుడే, కొత్త చిగురులు పుడుతుంటాయి, విస్తరిస్తూ ఉంటాయి, కొత్తగా అవకాశాలు కోసం కనిపెడుతున్న వారికి వారి ‘టర్న్’ కూడా వస్తుంది.

అయితే ఇదంతా ‘టైం టేకింగ్ ప్రాసెస్’. మనకున్న‘తూనికలు-కొలతలు’ పురుషాధిక్య సమాజం ‘డిజైన్’ చేసినవి కనుక, వొకటిగా ఉన్న తెలుగు ప్రజలు రెండుగా విడిపోతే కానీ, ఇక్కడి ప్రధాన రాజకీయ కుటుంబాల్లో బీటలు బయట పడటం సాధ్యం కాలేదు. అస్సలు సరళీకరణ మౌలిక లక్షణం అంతేనేమో తెలియదు గానీ, ఒక్క రాజకీయ కుటుంబాలే కాదు ‘కార్పొరేట్ బిజినెస్’ కుటుంబాలు విడిపోవడం కొత్తవాటితో ‘రీ గ్రూపింగ్’ కావడం చూస్తున్నదే. మన దేశంలో ఆర్ధిక సంస్కరణలతో పాటుగా అస్థిత్వ ఉద్యమ చింతన, అది విడివిడిగా పోల్చి చూడలేనంత ద్రవాధునికతగా కలిసి ప్రవహిస్తున్నది. దాన్ని ఇక్కడ వేగంగా అమలైన ఆర్ధిక సంస్కరణలకు పాతికేళ్ళు ముగిసాక గాని, దాన్ని మనం కూడా గుర్తించలేదు.

కేసీఆర్ కుటుంబం నుంచి ఆయన కుమార్తె కవిత బయటకు వచ్చి ఇప్పటికే ఆమె తన స్వంత రాజకీయ జీవితం మొదలు పెట్టింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రసిడెంట్ హోదాతో ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఇక ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ తోబుట్టువులు అతనితో విభేదించి బయటకు వెళ్లిపోయారు. ఇది తాత్కాలికమా శాశ్వితమా అనేది తెలియదు. అది ఏదైనా కావొచ్చు. గతంలో ఇటువంటి స్పర్ధల్ని పాత్రికేయ భాషలో ‘టీ కప్పులో తుఫాను’ అనేవారు. దీనర్ధం అదేదో ఇంట్లో వాళ్ళ మధ్య వచ్చి అది అక్కడే సమసిపోయేది అని. అయితే ఇప్పుడలా లేదు రాజకీయాల్లో ఈ ‘రీ గ్రూపింగ్’ సంస్కృతి వచ్చాక, ఎవరు ఎవరితోనైనా కలిస్తున్నారు.

అయితే, దేశంలో మొదటిసారి ఈ ధోరణికి ‘చెక్’ పెట్టినవాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిగా 2014-19 మధ్య తన ‘హోం వర్క్’ ఎటువంటిదో అర్ధం కావడానికి, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయిన ఎన్ని రోజుల్లో వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థను ప్రకటించింది చూస్తే, జగన్ ‘విజన్’ వేగం తెలుస్తుంది. కొత్త పార్టీకి కొత్త రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ప్రజలు ఇచ్చాక, ఎటువైపు నుంచి అవరోధాలు వస్తే, దాన్ని ఎలా ‘హ్యాండిల్’ చేయాలి అనే విషయంలో మొదటి నుంచి సిద్దమైతే తప్ప, కుటుంబ వివాదాల విషయంలో ఒక స్పష్టమైన ‘లైన్’ తీసుకోవడం సాధ్యం కాదు.

అయినా దక్షణాది రాష్ట్రాలలో సంపన్న రాజకీయ కుటుంబ సంబంధాలు అంటే, అదీ ప్రాంతీయపార్టీ అధినేత ‘పొలిటికల్ ఫ్యామిలీ’లో కెరటాలు అంటే, అవి బయటకు రావు ఆవేవో నాలుగు గోడల మధ్య సర్దుకుంటాయి అనుకోవడం సహజం. కానీ, వై. ఎస్. రాజారెడ్డి కుటుంబం అంతా కూడా దాన్ని- ‘పబ్లిక్ ఆడిట్’ కోసం బయట పెట్టడానికే సిద్దపడింది. అలా లాగడం తెగడం రెండూ పూర్తి అయ్యాక, వివాదాలు చుట్టూ పోగుపడిన తప్పతాలు గాలికి కొట్టుకుపోయాక, కడాన కోర్టుల్లో సివిల్ కేసు ‘సెక్షన్స్’గా మిగిలాయి. ఈ లోపు దాన్నుంచి ‘సీజనల్ బెనిఫిట్’ పొందినవాళ్ళు పొందగా, నికరం ఏమిటి అనేది ‘పబ్లిక్ ఆడిట్’లో అదెటూ తేలింది.

ఈ మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఒక ఎన్నారైల సభలో- ‘బాబాయ్ హత్య’ అనడం ద్వారా, వైఎస్ కుటుంబం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నట్టు అర్ధమవుతూనే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి విషయమైతే, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేని ఎన్నికల ఓటమి, అనుమానాలతో దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ విధానం చర్చ కావడం, పొత్తుల రాజకీయం వద్దు అని తానే గిరి అనుకోవడం, ఇటువంటి స్వీయ ఆంక్షల మధ్య ఏ కొంత మేర అయినా ‘లగేజి’ తగ్గించునే అంశమైన సోదరితో ‘న్యూట్రాలిటీ’కి ఆస్కారం ఉన్నప్పటికీ- ‘కమ్ వాట్ మే... ’ అనుకొని సవాళ్ళు ఎదుర్కోవడానికే జగన్ సిద్దం కావడం చూస్తున్నప్పుడు, ఇండియాలో ‘ఫ్యామిలీ పాలిటిక్స్’ను కూడా తదుపరి దశ (‘నెక్స్ట్ లెవల్’) కు చేర్చిన వాడు జగన్ అని అనుకోవలసి వస్తున్నది.

Read More
Next Story