
గ్రామ పంచాయతీ ఎన్నికలలో బిజెపి కి ఎదురు దెబ్బ
గ్రామీణ ప్రాంతాలలో బలపడకుండా బిజెపి తెలంగాణలో ఎదగగలదా?
కేంద్ర మంత్రుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల విస్తృత ప్రచారంలతో తెలంగాణాలో పార్టీ బలోపేతం కోసం ప్రణాళిక ప్రకారం బి.జె. పి. పనిచేస్తున్నా ఫలితం మాత్రం నామమాత్రమే అని గ్రామ పంచాయతీ ఎన్నికలలో రుజువు అయ్యింది. మొదటి విడతలో 3,834 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా బి. జె. పి. కేవలం 189 సర్పంచ్ లను మాత్రమే గెలుచుకుంది. ఇది మొత్తం గ్రామ పంచాయతీ లలో కేవలం 4 శాతం మాత్రమే.
గ్రామీణ ప్రాంతాలలో కనీస ఉనికిని చాటుకోవటంలో విఫలం అయిన బి. జె. పి. తెలంగాణాలో బలపడటం సాధ్యం ఆయువుతుందా అనేది రాష్ట్ర రాజకీయాలలో ప్రశ్నగా మారింది.
పంచాయతీ ఎన్నికలలో రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకే తరచుగా అనుకూలత ఉంటుంది. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఆ ట్రెండ్ ను కొనసాగించడంలో విజయం సాధించింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బి. జె. పి మాత్రం తనకు ఉన్న సానుకూల పరిస్థితులను సైతం ఓట్లు గా మార్చుకోలేక గ్రామ పంచాయతీ ఎన్నికలలో మట్టి కరిచింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పార్టీని తెలంగాణాలో పటిష్ఠపర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా బి. జె. పి. కేంద్ర నాయకత్వంను నిరుత్సహపరిచిందనే చెప్పవచ్చు.
నిజానికి బి.జె.పి బలం పట్టణాలకు, కొన్ని లోక్ సభ నియోజకవర్గాలకే పరిమితం అయ్యింది. గతంలో బి.జె.పి చేసిన రాజకీయ తప్పిదాల మూలంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూడటంలేదు. పార్టీ గ్రామీణ ప్రణతాలలో బలపడుతున్న క్రమంలోనే బి.జె.పి నాయకత్వం 1999 శాసన సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవటం పెద్ద రాజకీయ తప్పిదంగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తారు. గత ఎన్నికలలో బి.జె.పి గెలుపొందిన ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ తన బలం ను చాటలేక పోయింది. సిర్పూర్, నిజామాబాదు, ఆదిలాబాద్, ముధోల్, ఆర్మూర్, నిజామాబాదు, కామారెడ్డి శాసన సభ నియోజకవర్గాలలో సైతం బి. జె. పి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి మెరుగుదలను చూపించలేక పోయింది. ఇది బి జె పి గ్రామీణ ప్రజలలో విశ్వాసం పొందేదుకు చేయాల్సిన కృషిని నొక్కి చెపుతుంది.
2023 సంవత్సరంలో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బి. జె. పి. 14 శాతం ఓట్లను పొందింది. 2024 లో నిర్వహించిన లోక్ సభ ఎన్నికలలో బి. జె. పి. 35 శాతం ఓట్లను పొందింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో ఓట్లు పొందనిదే బి. జె. పి అంత శాతం ఓట్లు పొందలేదు. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బి. జె. పి అదే స్థాయిలో ఓట్లు పొందటంలో ఎందుకు పొందలేక పోయిందో భేతాళ ప్రశ్నగా మారింది.
గ్రామీణ ప్రాంతాలలో గెలుపు అవకాశాలు గల అభ్యర్థులు దొరకటం కూడా బి.జె.పి. కి కష్టంగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణ గ్రామ స్థాయి రాజకీయాలలో శక్తివంతమైన ఉనికిని నెలకొల్పడంలో బీజేపీకి చారిత్రకంగా ఉన్న ఇబ్బందులే కారణమని చెప్పవచ్చు.కేంద్రలో అధికారంలో ఉన్నా బి.జె.పి నామినేటెడ్ పదవులలో అవకాశం కేవలం పట్టణ ప్రాంత నాయకులకు మాత్రమే కల్పించింది. గ్రామీణ ప్రాంత పార్టీ నాయకులను ప్రోత్సహించింది లేదు.
గత లోక్ సభ, శాసన సభ ఎన్నికలలో బి.జె.పి పొందిన ఓట్ల శాతానికి, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పొందిన ఓట్ల శాతానికి పొంతన లేదనే చెప్పవచ్చు. దీనిపై బి.జె.పి "చింతన్ బైఠక్' లు చేసి గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పటిష్ఠతకు చర్యలను నిర్ణయించాల్సి అవసరం ఉంది.
బి.జె.పి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు ది డెఫెరల్ తెలంగాణ తో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బి. జె. పి. ఎక్కువ గ్రామాలలో గెలవలేక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలలో జాతీయ అంశాలు ప్రభావం చూపుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్థానిక అంశాలు ప్రభావం చూపుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నిలక ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇంకా పూర్తి స్థాయి వ్యతిరేకత రాలేదని, భారత రాష్ట్ర సమితి ఇంకా బలంగానే ఉందని అర్ధం అవుతుంది. ఓట్ల శాతం పెంచుకోవాలంటే బి.జె.పి. ఈ రెండు ప్రధాన పార్టీల ఓట్లను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బి.జె.పి కి సహకరించలేదని అయన తెలిపారు.

