
తెలంగాణ సాయుధపోరాట కాలం నాటి ఫోటో
తెలంగాణను చేజిక్కించుకోడానికి 'విమోచన దినం'
బిజెపి పనంతా ప్రజలను విభజించే ద్వేష రాజకీయాలవ్యాప్తే. పటేల్ని ఆకాశాని కెత్తటం, నెహ్రూని తూలనాడటం వారి ఎత్తుగడల్లో భాగం.
-ఆదిత్య కృష్ణ
సెప్టెంబర్ 17 విమోచన దినం అని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తెలంగాణకు వస్తున్నారు.
బీజేపీ వారు అదే పనిగా ఊరే గుతున్నారు. ఈసారి ప్రధానిమోదీ జన్మదినాన్ని కూడా దీనికి జోడించి ఘనంగా ఉత్సవాలు చేయబోతున్నారు.
వీటికి మహారాష్ట్ర, కర్ణాటక బీజేపీ నేతల్ని కూడా సమీకరిస్తున్నారు; ఇవి గత నిజాం రాష్ట్రం లోని భాగాలు.
వారు చేస్తున్న హడావుడి అంతా విమోచన దినం పేరిట అసత్యకథనాలతో ప్రజలను తప్పుదారిపట్టించి తమకు వోట్లుగా మార్చుకోటానికే. దక్షిణాదినీ, అందులో భాగంగా తెలంగాణను- తక్షణం హైదరాబాదు కార్పోరేషన్ని – చేజిక్కించుకోటానికే నని ఇప్పటికే స్పష్టం అయ్యింది. అయినా వాస్తవాల ఆధారంగా కొన్ని విషయాలు తెల్సుకోటానికే ఈ చిరుప్రయత్నం.
చారిత్రకమైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం గురించి పాఠ్యపుస్తకాలలో ఏమాత్రం లేకుండా చేసి ఆరున్నర దశాబ్దాలు దొర్లి పోయాక, దశాబ్దం క్రితం స్కూలు సిలబసులో, ప్రభుత్వరంగ పోటీపరీక్షల్లో కూడా ప్రవేశపెట్టారు. నాటి రైతాంగసాయుధ పోరాటం 1948సెప్టెంబరుతో ఆగిపోలేదు. హైదరాబాదు సంస్థానం కేంద్రంలో విలీనమైనాక కూడా భూస్వామ్యవిధానానికి వ్యతిరేకంగా 1951 అక్టోబరుదాకా కొనసాగిందన్నది చరిత్ర పాఠం. కాబట్టి వారి అసత్య కథనాలు లోగడవలె పనిచేయవు. అయినా లోతైన అధ్యయనం లేకపొతే ఈ చరిత్ర లోతుపాతులు తెలియవు.
చరిత్ర వక్రీకరణలు
కేంద్ర పాలకులు చెప్పే వక్రీకరణల గొంతు పెద్దది కనుక అదే నిజమని నమ్మేవారూ ఉన్నారు. దానికి తోడు తెలంగాణా, హైదరాబాదుల చరిత్ర బొత్తిగా తెలియని ఉత్తరాది బిజెపి నాయకుల అజ్ఞానాన్ని, అబధ్ధాలను ప్రశ్నించకుండా ప్రచారంచేసే మీడియా కథనాలకు అడ్డులేకుండా పోతున్నది. నైజాము రాజు రజాకార్ల నేతృత్వంలో పనిచేసారనటం చారిత్రక అపరిపక్వత. హైదరాబాదు సంస్థానానికీ బ్రిటిషువారికీ మధ్య 1800 అక్టోబరు 12నాడు కుదిరిన ఒప్పందం (The Treaty of Subsidiary Alliance) ప్రకారం నైజాము బ్రిటిషువారికి సామంతరాజ్యంగా వుండేది.
“బ్రిటిషువారు నామినేటు చేసిన ఒక ప్రధాని వుండేవారు. ముఖ్య మైన రెవిన్యూ, పోలీసు, ఆర్థికమంత్రులను బ్రిటిషువారే నియమించేవారు. అన్నిటికన్నా మించినది బ్రిటిషువారి సైన్యం సికిందరాబాదులో మకాంవేసి వుండేది-” అని తెలంగాణ పోరాటనేత దేవులపల్లి వెంకటేశ్వరరావు సాధికారికమైన తన ‘తెలంగాణ ప్రజల సాయుధపోరాట చరిత్ర’లో వివరించారు.
సైన్యం తెలంగాణలో ప్రవేశించిన మూడు రోజుల్లో 17న లొంగుబాటుతో నిజాం ప్రతిఘటన ముగిసిపోయింది. అయినా సైన్యం ఇక్కడే తిష్ట వేసి 1948-51కాలంలో వేలాది రైతాంగ, కమ్యునిస్టు కార్యకర్తలను హతమార్చింది. లక్ష మందిని జైళ్లలో నిర్బంధించింది. అంతేకాక 25 నుంచి 40వేల మంది ముస్లింలను ఊచకోత కోసిందని, వందలాది మానభంగాలు జరిగాయని ప్రధాని నెహ్రూ నియమించిన సుందర్లాల్ కమిషన్ తేల్చింది.
దశాబ్దాల పాటు రహస్యంగా వుంచిన ఆ రిపోర్టు ఆలస్యంగా బైటపడింది. ఈ గాయాలన్నీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రస్ఫుటమైనాయి. అందుకే విమోచన దినం జరపాలన్న ఆలోచనను ఉమ్మడి రాష్ట్రనేతలంతా మానుకున్నారు.
నేడు ఆంధ్రలో కూటమిలో ఉన్న చంద్రబాబు పాలనలోనూ ఆ ఊసెత్తలేదు. కానీ మతద్వేషాగ్నిలో చలి కాచుకునే బీజేపీ రాజకీయాల దారివేరు. గత చరిత్రని నిజాం వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక కోణంలోనే అది ప్రచారం చేస్తూ ఉంటుంది. దానికి పటేల్ని ఆకాశానికెత్తి, తమ గుడ్డినెహ్రూ వ్యతిరేకతను జోడించి మీడియాలో స్వైరవిహారం చేస్తుంది. ప్రత్యేకించి యువతరం ఈ విషయాల్నివాస్తవాల ఆధారంగా తెల్సుకోటం అవసరం.
కమ్యూనిస్టుల కథనాల్ని అలా ఉంచి పాలకుల కథనాన్నే చూద్దాం: “భారతదేశ సంస్థానాల విలీన గాథ” (The Story Of The Integration Of The Indian States) పేరుతో ప్రసిధ్ధ గ్రంథ రచయిత విపి మీనన్ వివరిం చారు. 1917 నుంచి వరుసగా ముగ్గురు వైస్రాయిలకు, చివర మౌంట్ బాటనుకి కార్యదర్శిగా, రాజ్యాంగ సలహాదారుగా పనిచేసిన ఐసియస్ అధికారి ఆయన. సంస్థానాల విలీన వ్యవహారాల పరిష్కారానికై 1947జూన్ 27న ఏర్పడిన ‘కేంద్ర సంస్థానాల మంత్రిత్వశాఖ’ ముఖ్య కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఆ శాఖ మంత్రి సర్దార్ పటేలుకి కుడి భుజంగా వుండేవారు. పటేల్ కోరికపైనే ఈ గ్రంథాన్ని రచించానని ముందుమాటలో (1955 సెప్టెంబర్) ఆయన రాసారు.
ఈ పనిలో మౌంట్ బాటన్ కీలకపాత్ర అవసరమన్న మీనన్ సూచనను పటేల్ వెంటనే అంగీకరించారు. అలా ‘ఈ ముగ్గురు కృష్ణులతో రాయబారం నాటకంలా’ సాగింది విలీన ప్రక్రియంతా. ‘సంస్థానాల విలీనంలో పటేలు హీరో ఐతే, స్క్రీన్ ప్లే మౌంట్ బాటన్, డైలాగ్ మీనన్’.
హైదరాబాదు గురించి ఉత్తర ప్రత్యుత్తరాలే కాక, కనీసం పది కీలక సమావేశాల్లో వైస్రాయి మౌంట్ బాటన్ పాల్గొన్నారని మీనన్ రాసారు. ఆపుస్తకం నెట్లో ఉచితంగా లభిస్తుంది.
మోదీగారు నెలకొల్పిన భారీ పటేల్ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అనిపేరు పెట్టారు. కానీ తెలంగాణలో వారి పనంతా ప్రజలను విభజించే ద్వేష రాజకీయాలవ్యాప్తే. పటేల్ని ఆకాశాని కెత్తటం, నెహ్రూని తూలనాడటం వారి ఎత్తుగడల్లో భాగం. 565 సంస్థానాల విలీన గాథలో ఉక్కుమనిషిగా పటేలుని స్మరిస్తుంటారు; నెహ్రూని విస్మరిస్తుంటారు. మీనన్ చెప్పిన విలీన వివరాలు కొన్ని చూద్దాం.
‘రక్షణ, విదేశీ, కమ్యూనికేషన్లు మాత్రమే కేంద్రానివి’ అని చెప్పి 140 పెద్ద సంస్థానాలతో విలీన ఒప్పందం చేసుకున్నారు. కేంద్రస్కీముల పేరిట నానాటికీ రాష్ట్రాల అధికారాలు కుంచించుకు పోతున్నా యి. కేంద్ర ప్రభుత్వమే అన్నీ అధికారాల్నీ గుప్పెట పెట్టుకో జూస్తున్నది. 565 లో సుమారు వంద తప్ప మిగతా సంస్థానాలు నేటి గుజరాత్, రాజస్తాన్, ముంబయి ప్రాంతాలవే. 300 మరీ చిన్నవి, గుజరాతుకి చెందినవి; ఈ రాజులలో అత్యధికులు గుజరాతు నాయకుడైన పటేలుకి, గాంధీకీ పరిచయస్తులే.
565 లో సంస్థానాలలో “327 చిల్లర రాజ్యాలు (పెటీస్టేట్స్), వీటి సగటు విస్తీర్ణం 20 చ.మైళ్ళు, సగటు జనాభా 3000, వారివి పరిమిత అధికారాలే” అన్నారు రాజ్యాంగ సభ సలహాదారు బి. యన్. రావు. 450 సంస్థానాలకి అప్పటి సగటు వార్షిక ఆదాయం 15 లక్షల రూపాయలలోపే.
రాజుల్లో అత్యధికులు నెహ్రూప్రభుత్వంతో మంచి బేరాలాడుకొని, లాభంగా తేలిగ్గా ఇండియాలో అలా కలిసిపోయారు. ఆ వాస్తవాల్ని కప్పిపెట్టి, పటేల్ని హీరోగానూ, నెహ్రూజీరోగానూ నిరాధారంగా చిత్రిస్తున్నారు.
విలీనగాథలో ఎవరూ విలన్లే లేరు
నిజాముతో సహా వర్గపరంగా అంతా చాలా ఆప్తులు. “ఈ రాజులపట్ల పటేల్ వైఖరి విభిన్నమైనది. వారిని భారతదేశ సహ నిర్మాతలుగా (కోఆర్కిటెక్ట్స్) గౌరవించాలంటారు పటేల్. జాగీర్దారుల భవితవ్యం పట్లా అంతే ప్రగాడ సానుభూతి. వారి ఆస్తుల స్వాధీనాన్ని ఆయన ఎప్పుడూ చోరీ, డెకాయిటీ అనే అభివర్ణించేవారు,” అంటారు మీనన్.
విలీనం ద్వారా ‘మీరంతా గొప్ప త్యాగం చేస్తున్నారు’ అంటూ, వీరికి నచ్చచెప్పటానికి పటేలూ, నెహ్రూ ప్రభుత్వమూ చేసిన ముఖ్యవాదనలు రెండు: 1) కలిస్తేనే మీకు లాభం, భద్రత; మీ ఆస్తులు, రాజభరణాలు, లాంఛనాలు, అన్నీ కొనసాగుతాయి. (నిజాముతోపాటు వారిలో పెద్దవారంతా గవర్నరు(రాజ్ ప్రముఖ్) హోదాలో 1956దాకా కొనసాగారు కూడా.2)విలీనం కాకపోతే ప్రజల ఆగ్రహాగ్నికి బలైపోతారు, మీరు తట్టుకోలేరు. యూరపు రాజ వంశాల బంధువుగా, విప్లవాల స్వానుభవంతో చెప్తున్నాను, అని మౌంట్ బాటన్ కూడా వారికి నచ్చ చెప్పేవారు. నిజాంల స్థితి-గతీ కూడా అదే.
ఈ వాదనలతో అత్యధికులు ‘శాంతియుతంగా’ కలిసిపోయారు. హైదరాబాదులో ముస్లిం నిజామే కాక, కాశ్మీర్ హిందూ రాజు కూడా కాస్త మొండికేసారు. ఇవే జటిలమై, సైన్యానికి పనికల్పించాయి.
నిజానికి కేంద్రం సుదీర్ఘ బేరసారాలు సాగించి 1947 నవంబరు 27న యథాతథ ఒప్పందం చేసుకొని నిజాముని కొనసాగించింది. ఈ ఒప్పందంని పటేలు పూర్తిగా బలపరుస్తున్నారని; వెంటనే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని మౌంటుబాటెన్ 1948 మార్చి 2 సమావేశంలో చెప్పారు. ఆపని చేస్తే “నిజాము, ఆయన వారసులు రాజ్యాంగబధ్ధ పాలకులుగా శాశ్వతంగా కొనసాగుతారని” చెప్పారు. అలా కాని పక్షంలో నిజాము తన సింహాసనాన్నే కోల్పోవచ్చని చెప్పారు. పటేల్ గుండెపోటుతో, అనారోగ్యంతో 1948మార్చి తర్వాత రెస్టు తీసుకోవాల్సి వచ్చింది. కాసిం రజ్వితో మీనను, మౌంటుబాటెను ఎక్కువగా మాట్లాడారు. స్వయంగా ‘ఉక్కుమనిషి’ కూడా రజ్విని కలిసారు. పోలీసు యాక్షనుకి రెండు వారాల ముందు ఆగస్టు 28న తాము ఐరాసకు వెళ్తున్నామని, తమకు డిల్లీలో విమానఏర్పాట్లు చేయాలని నిజాము కేంద్రాన్ని, హోంశాఖని కోరారంటే ఆనాడు వారి సంబంధాలు ఎలా ఉండేవో అర్థమవుతుంది.
ఐక్యరాజ్యసమితికి వెళ్ళే ప్రతినిధి వర్గంలో ముస్లింలే కాదు, హిందూ కులీనులు (పింగ్లే దొరలు) కూడా ఉన్నారని గమనించాలి. అయితే తరువాత కేసుని ఉపసంహరించుకుంటున్నామని ఐరాసకు నిజామే రాసారు!
నిజాంతో రాజీధోరణి ఎందుకు?
“నిజాముతో ఘర్షణ 108గంటలలో ముగిసిందనీ, కమ్యూనిస్టుల అణచివేతకు మూడేళ్లు పైగా పట్టిందని” మీనన్ రాసారు . ప్రతిరోజూ వస్తున్న కమ్యూనిస్టు తిరుగుబాటు రిపోర్టులు చూసిన తనకు నిజాము విలీనంకన్నా అవే ఆందోళనకరంగా తోచాయని రాసారు. 1947నవంబర్లో యథాతథ ఒప్పందం కుదిరాక, సంస్థానం అదనపు బలగాలతో 28వేలసైన్యం కలిగి ఉండటానికి పటేలుసహా కేంద్రం అంగీకరించింది.
నిజాము వ్యతిరేక పోరాటంలో విజయం సాధిస్తున్న కమ్యునిస్టుల అణచివేతకై తమకు ఆయుధాలు కావాలని నిజాము కోరారని, పటేలు, కేంద్రం దానికి అంగీకరించినారనీ మీనన్ వెల్లడించారు. రజాకార్లను రద్దుచేయాలని, ఐతే “అది ఒకేసారి కాక, క్రమంగా చేయాలనీ” – నెహ్రూ, పటేలు, రాజాజీ అంతా -అంగీకరించారు.
రైతాంగాన్ని అణచడానికే ఈరాజీధోరణి. సంస్థానంలో ఆంతరంగిక కల్లోలంగురించి తమకు బాగా తెల్సునని, ఈ ఒప్పందం కుదిర్చినందుకు మౌంటుబాటెను కి కృతజ్ఞతలు చెపుతూ 1949 నవంబరు 29న రాజ్యాంగ సభలో పటేల్ మాట్లాడారు. అంతేకాక ఒప్పందం మేరకు కేంద్ర సైన్యాలను సంస్థానం నుంచి ఉపసంహరించు కున్నామనీ రాసారు. తనమరణానికి కొద్దివారాల ముందు 1950 లో పటేల్ నెహ్ర్రూకి రాసిన చివరిలేఖలోనూ తెలంగాణలో కమ్యూనిస్టుల తిరుగుబాటునీ, వారి చైనాదారినీ ప్రస్తావించారు. విమోచన నిజాము నుంచి కాదనటానికివన్నీ తిరుగులేని నిదర్శనాలు.
విలీనం తర్వాత కూడా మీనన్- రజ్వీని కలిసారు. తనని జైల్లో బాగానే చూస్తున్నారని, సమస్యలేమీ లేవనీ రజ్వి ఆయనకు చెప్పాడు. 1957లో అతన్ని పాకిస్తానుకి క్షేమంగా పంపారు. ఈ వివరాలన్నీ మీనన్ గ్రంథస్థం చేసారు. వేలమంది రైతాంగాన్ని కాల్చి చంపిన కేంద్ర ప్రభుత్వానికి ఎవరు అసలు శత్రువులు? ఎవరు మిత్రులు? తెలిసి పోతున్నదిగదా.
‘క్రూర నిజాముని’ సెప్టెంబరు 17న సైతం అణచివేయలేదు
లొంగుబాటు వెంటనే ఆయన భవిష్యత్తు గురించి పటేల్ని సంప్రదించానని, నిజాముని, ఆయన పేరిటే పాలననీ కొనసాగించాలని నిర్ణయించామని మీనన్ రాసారు . 1956లో సమైక్యరాష్ట్రం ఏర్పడేదాకా నిజామే రాజప్రముఖుగా (గవర్నర్ హోదాలో) కొనసాగారు. ఆయనతో పాటు రాజులందరికీ ప్రత్యేకహక్కులు, భరణాలు 1970 లో వాటిని ఇందిరాగాంధీ రద్దు చేసే వరకూ కొనసాగాయి. ఆ రద్దుని వాజపేయీ పార్లమెంటులో వ్యతిరేకించారని బీజేపీవారూ గమనించాలి.
నిజాం రాజ్యం భారత్ లో విలీనం కాకపోవడానికి రాజు ముస్లిం కావటం కారణం కాదు. హిందూ రాజుల పాలనలోని ఇండోర్, మణిపూర్ కూడా విలీనాన్ని తోసిపుచ్చాయి. తిరువనంతపురం 1947 జూలై14న కూడా స్వతంత్రంగా ఉంటాం అని ప్రకటించింది. మైసూరు ఆగస్టు 9 దాకా సంతకం చేయలేదు; 1949 జూన్ 1 న గానీ భారత డొమినియనులో కలవలేదు. ఇక కాశ్మీరు (రాజు) సంగతి తెలిసిందే. పైవన్నీ హిందూరాజుల పాలనలోనివే.
ఇక ఫ్రెంచి వలసలు పుదుచ్చేరి, యానాం 1954దాకా, పోర్చుగీసు వలసలు (గోవా)1961డిసెంబరు దాకా ఇండియాలో కలువలే దు. ఆ వలసపాలకులపై నెహ్రూ-పటేల్ ప్రభుత్వం సైనికచర్యకు పాల్పడలేదని గమనించాలి. కనుక విలీనంలో హిందూ-ముస్లిం అనే అంశమే లేదు. అంతేకాదు. కమ్యునిస్టుల రైతాంగ పోరాటం సాగుతున్న నిజాం రాజ్యంలో తప్ప మరెక్కడా ఆయా ప్రాంతాలను విలీనం చేయడానికి మిలిటరీని పంప లేదని గుర్తించాలి. కాశ్మీర్లో సైనికచర్య పాకిస్తాన్ కు వ్యతిరేకంగానేతప్ప, విలీనంకోసం కాదు.
నిజాం పట్ల ఈ మెతక వైఖరి ఎందుకు?
నిజాము ప్రభుత్వంలో హిందూ దొరలు ముఖ్య పాత్ర వహించి,రాజభక్తి పరాయణులుగా ఉంటూ, తమ ఫ్యూడలిజాన్ని కాపాడుకున్నారు. హిందూ ప్రముఖులు నిజాం ప్రభుత్వంలో ముఖ్యపాత్ర వహించి, రాజభక్తి పరాయణులుగా ఉన్నారు. వారిలో అత్యధికులు సంస్థానంలో కాంగ్రెస్ స్థాపన తర్వాత కూడా అందులో చేరలేదు.
హిందూ కులీనులు 8మంది నిజాం రాజ్యంలో ప్రధాని పదవి కూడా (ఉదాహరణకు మహరాజా కిషన్ ప్రసాద్ 22 ఏండ్ల పాటు) నిర్వహించారు. నిజాంకు అప్పులిచ్చిన వారిలో ముఖ్యులు ధన్‌రాజ్‌గిర్ వంటి హిందూ వ్యాపారులే.
నాటి పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. ఆ పోరాటంలో ముస్లిం రైతు షేక్ బందగీ, విప్లవ కవి మఖ్దూం, ఫతేవుల్లాఖాన్ వంటి కార్మిక నేతలూ, జవ్వాద్ రజ్వీ వంటి విద్యార్థి నాయకులు, బాఖరుల్లాఖాన్ వంటి ముస్లిం వకీళ్లు, షోయబుల్లాఖాన్ ఎడిటర్‌గా ఉండిన ఇమ్రోజ్, మీజాను వంటి ఉర్దూ పత్రికలు, నిజాంకు వ్యతిరేకంగా సాహసంతో చేసిన కృషిని గుర్తు చేసుకోవాలి. భద్రాచలంవంటి అనేక గుడులకే కాదు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 1939లో రూ.లక్ష, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి రూ.యాభై వేలు నిజాం విరాళం ఇచ్చారు. (టైమ్స్ ఆఫ్ ఇండియా, నవంబర్ 23, 2019). కాగా జన్‌సంఘ్ (నేటి బీజేపీ పూర్వరూపం) పితామహుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ముస్లింలీగ్‌తో చేతులు కలిపి బ్రిటిషు మంత్రివర్గాల్లో పనిచేశారు. 1925లో స్థాపించిన ఆర్ఎస్ఎస్‌పాత్ర 1940-51 నిజాము వ్యతిరేక పోరాటంలో శూన్యం అని వారి శతాబ్ది సందర్భంగా గుర్తుచేయాలి. 1915లో స్థాపిం చిన హిందూమహాసభ పాత్ర కూడా అంతే.
హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన ఆర్యసమాజుకి తెలంగాణాలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; పోరాటంలో కొంతమేర పాల్గొన్నది. హిందూమతాన్ని సంస్కరించాలన్నది వారివిధానం. వారు విగ్రహారాధనకు (ఇస్లాంవలెనే!) వ్యతిరేకం. ముస్లింలుగా మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. అది ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ కాదు: వారు కమ్యూనిస్టు ఉద్యమాలపట్ల సానుభూతి కలిగి వుండేవారు. వారికీ, ఆర్.యస్.యస్.కీ పడేది కాదు. హిందుత్వవాదులకు వారంటే పడదు.
ఆర్యసమాజి, కాషాయవేషధారి అయిన అగ్నివేశ్ హిందూవ్యతిరేకికాదు, హిందుత్వ విద్వేష రాజకీయాల వ్యతిరేకి. మతతత్వాన్ని, కులతత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పి, ఉత్తర భారత్ లో ఫ్యూడలిజాన్ని, వెట్టిచాకిరీ పద్ధతిని వ్యతిరేకించి, దళితులతోసహా వేలాదిమందిని విముక్తిచేసారు. అందువల్ల అగ్నివేశ్ పై 2018ఆగస్టు 17న ధిల్లీలో బిజేపీ ఆఫీసుముందే – ద్రోహిఅంటూ- తలపాగా లాగేసి, భౌతిక దాడికూడా చేసారని గుర్తుచేయాలి.
ఆయన వాజపేయీ మృతదేహానికి నివాళి అర్పించటానికి వస్తుండగా ఈ దాడి జరిగింది. కెమెరాలో చిత్రిం చిన ఆ వీడియో నేటికీ లభ్యమవుతున్నది. నేరస్తులపై చర్యలేదు. ఒకనెలలోపే అది రెండోదాడి (మొదటిది ఝార్ఖండ్లో జరిగింది).
స్వామి అగ్నివేష్ చేసిన ద్రోహం ఏమిటి? బీజీపీనీ, గుజరాత్లో, ఇతరచోట్లా హిందూమతోన్మాదాన్ని, మోదీవిధానాల్నీ వ్యతికించటమే.
1952 ఎన్నికల్లో జనసంఘీయులు తెలంగాణలో ఐదు సీట్లలో మాత్రం పోటీ చేశారు; మొత్తం ఐదున్నరవేల ఓట్లు తెచ్చుకున్నారు. ఆనాడు వారి సిద్దాంత బలంఅదే.
ప్రస్తుతం బీజేపీ నేతలు సెప్టెంబర్ 17పై చేస్తున్నది దేశభక్తితో కాదు, ఓట్లకోసం బరితెగించిన వైనమే ఇది. దానికోసం కాంగ్రెసు, బీ ఆర్ ఎస్ పార్టీలవారినీ చేర్చుకొంటున్నారు. కోట్లు ఖర్చుచేస్తూ, ఓట్లుకొంటున్నారు. తెలంగాణ ప్రజలపోరాటంతో గాని , ఆ ప్రజల ఆకాంక్షలతో గాని ఏ సంబంధం లేని హిందుత్వ సంస్థలు ఈనాడు తెలంగాణలోని ఆయా పోరాట స్థలాలను సందర్శించి, కమ్యూనిస్టులని చెప్పకుండా, అమరులకు నివాళులు అర్పిస్తూ వారి చరిత్రను తమకు అనువైన రీతిలో ప్రచారం చేసుకుంటూ ప్రజలను వంచన చేస్తున్నారు.
వారణాసిలో మోదీకి 2019 ఎన్నికల్లో పోలైన ఓట్లలో 63 శాతం కాగా, 2024లో 54 శాతం మాత్రమే. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చి, ఈఏడు మోదీభజనని జోడించి సాగిస్తున్న సెప్టెంబరు 17 కార్యక్రమాలు ఓట్లవేటలో భాగమే.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. వాటితో ‘ఫెడరల్ తెలంగాణ’ ఏకీభవించనవసరం లేదు)
Next Story