బీజేపీ‘ఐక్యత’ పిలుపు కుల గణనకు వ్యతిరేకమా?
x

బీజేపీ‘ఐక్యత’ పిలుపు కుల గణనకు వ్యతిరేకమా?

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బహిరంగ సభకు 'ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే! అని ఎందుకు అన్నారు?


మహారాష్ట్రలో నవంబర్ 11న జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరైన వారందరినుద్దేశించి 'ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే! (మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం)' అని అన్నారు.

అసలు నినాదంలోని భాషను ఓ సారి చూద్దాం. 'ఏక్' అనేది ఐక్యతకు సూచించే హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం సురక్షితం అని మనందరికి తెలుసు.

మోదీ మహారాష్ట్రలో 'సేఫ్' అనే పదం ఎందుకు ఉపయోగించారు? సహజంగానే ఆ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే కావొచ్చు. అదే ఉత్తరప్రదేశ్‌ అయి ఉంటే ఆయన తన నినాదంలో ఆంగ్ల పదాన్ని ఉపయోగించరు. అది కూడా బహిరంగ సభలలో.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడాన్ని ఆయన, ఆయన పార్టీ వ్యతిరేకిస్తోంది. అయితే హిందూత్వ మద్దతుదారులు నడిపే కార్పొరేట్ పాఠశాలలు.. ఆంగ్ల భాషను ధనికులకు విక్రయించి వ్యాపారం చేస్తున్నప్పుడు మాత్రం వారు మౌనంగా ఉంటారు.

వాస్తవిక లక్ష్యం..

నినాద లక్ష్యాన్ని చూస్తే.. ఇంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ - ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఆమోదించింది. ఇప్పుడు అదే నినాదాన్ని మోదీ మిక్స్‌డ్ లాంగ్వేజ్‌తో వాడుతున్నారు. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకమని భావించిన మీడియా దానిని మతపరమైనదిగా వ్యాఖ్యానించింది. ఈ నినాదం రాహుల్ గాంధీ కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించడం, సుప్రీంకోర్టు ద్వారా చెల్లుబాటు అయ్యే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా ఉంది.

2014 ఎన్నికల నుంచి బీజేపీ ఇతర వెనుకబడిన తరగతుల ఓట్ల సమీకరణను చాలా తెలివిగా ప్రారంభించింది. అప్పటి నుంచి RSS/BJP కుల సమీకరణకు అంగీకారం తెలపడం ద్వారా గుజరాత్ నుంచి OBC అయిన మోదీని ప్రధాని అభ్యర్థిగా తీసుకురావడంతో వారు చదరంగంలోలాగా చాలా తెలివిగా ‘కులం’ ఆట ఆడటం ప్రారంభించారు.

కుల సంబంధాలు..

ఉత్తరప్రదేశ్‌లో యాదవుల్లాంటి శూద్ర అగ్రవర్ణ సమాజం కొంతకాలం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో.. వారు కుల నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న దిగువ OBCలను సమీకరించారు. ఆ రాష్ట్రంలో రెండుసార్లు మెజారిటీ ఎంపీ సీట్లు, అధికారాన్ని గెలుచుకోగలిగారు.

తెలంగాణను వెలమలు, రెడ్లు పాలిస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కాపులు, ముదిరాజులపై బీజేపీ దృష్టి సారించింది. తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్‌లో, వెలమలు బీఆర్‌ఎస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దళితుల్లో మాలలు కాంగ్రెస్‌తో ఉన్నందున, వారు మాదిగలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగ ఓట్లను రాబట్టేందుకు మోదీ స్వయంగా మాదిగ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సమావేశంలోనే మోదీ మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందుకే రిజర్వేషన్లలో విభజనల కోసం ఉపకులాల డిమాండ్లు రాజ్యాంగ విరుద్ధం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు ప్రతిపాదించింది. చివరగా రిజర్వేషన్ కోసం ఉపకులాల వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదిగా కోర్టు సమర్థించింది. ఇలాంటి విభజన రాజకీయాలన్నీ ప్రమాదకరమని RSS/BJP శక్తులు భావించడం లేదు.

అయితే ఆ తీర్పును అమలు చేయడానికి దేశంలోని ప్రతి ఉప కులానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ ధృవీకరించిన డేటా తప్పనిసరి. అందువల్ల రాజ్యాంగబద్ధ సంస్థ - రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.

ఐక్యతకు వ్యతిరేకంగా కుల గణన?

త్వరలో జరగనున్న జాతీయ జనాభా గణనలో భాగమైన కుల డేటాను సేకరించాలని మోదీ ప్రభుత్వం కోరుకోవడం లేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు ఎస్సీ తీర్పును అమలు చేయాలని కోరుతున్నాయి. అయితే విశ్వసనీయ కుల డేటాను సేకరించడానికి కేంద్రం సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు.

కుల గణనకు కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారు. అయితే అగ్రవర్ణాలు ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, క్షత్రియులు, కాయస్థలు ఖత్రీలు వ్యతిరేకిస్తున్నారు. RSS/BJP ప్రయోజనాలు ఈ ఐదు కులాలతో ముడిపడి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఈ వర్గాల వారే ఎక్కువగా ఉన్నాయి.

కొత్త నినాదం.. కొత్త వ్యూహం..

ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ' ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే ' అనే ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే 2024 ఎన్నికల నుంచి మోదీ, అమిత్ షాలు.. కాంగ్రెస్ అధికారం చేపడితే ఓబీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తాయని, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతాయని చెప్పి ఓబీసీ ఓట్లను నిలుపుకునే పనిలో పడ్డారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్నీ ఇచ్చేస్తారని ఇప్పుడు బాహాటంగానే చెప్పడం మొదలుపెట్టారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలు తమ ప్రయోజనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు.

భారతీయ ముస్లింలు, మిగిలిన జనాభా మధ్య స్పష్టమైన గీత గీయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్‌తో జతకట్టారు.

ముస్లింల దృక్కోణం..

భారతీయ ముస్లిం సమాజం చాలా కాలంగా రిజర్వేషన్ భావజాలాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కానీ కాలం గడిచేకొద్దీ వారిలో కులం, పేదరికం, విద్యాపర వెనుకబాటుతనం పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని గ్రహించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక వెలువడగానే ముస్లింలు తమ విద్యాపర వెనుకబాటుతనం తీవ్రమైన సమస్య అని గ్రహించారు. వారి వెనుకబాటుతనం కూడా వారి మత కోశానికి సంబంధించినది. మతపర సంప్రదాయవాద రాజకీయాల కోసం RSS, ముస్లిం సంప్రదాయవాదులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో దేశాభివృద్ధి దెబ్బతింది. ఇప్పుడు రిజర్వేషన్ల కోసం పోటీగా మారింది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

ముస్లింల విభజన..

తమ సామాజిక స్థాయి కంటే తక్కువ అని భావించిన శూద్ర అగ్రవర్ణాలు ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నారు. దాంతో జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల మాట ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు వంటి కులాలు కుల గణనకు విముఖత చూపడం లేదు. కుల గణన భారతీయ ముస్లింలలో ఉన్న కులాలతో సహా ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది.

మొఘల్, పోస్ట్-మొఘల్ ఫ్యూడలిజం సాంప్రదాయిక ఇస్లామిజం నుంచి ప్రయోజనం పొందిన ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. ఉదాహరణకు పేద అట్టడుగు కులాల ముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్టబడ్డారు. అయితే ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ బంధాన్ని కూడా ఛేదించాలి.

కుల గణన అవసరం

కుల గణన, సంక్షేమ పథకాల పంపిణీ, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల డిమాండ్ నేపథ్యంలో RSS/BJP తెలివిగా ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే నినాదం ద్వారా కొత్త ఆట మొదలుపెట్టింది.

Read More
Next Story