సంఘ సంస్కర్త, యుగకర్త డా. కత్తి పద్మారావు
x

సంఘ సంస్కర్త, యుగకర్త డా. కత్తి పద్మారావు

డాక్టర్ కత్తి పద్మారావు 72వ పుట్టినరోజు సందర్భంగా బిఎస్ రాములు ప్రత్యేక వ్యాసం


మహాకవి డా॥ కత్తి పద్మారావు తొలిదశలో హేతువాది. కుల నిర్మూలన వారి జీవిత లక్ష్యం. హేతువాదులు వందేళ్ళుగా కుల నిర్మూలన గురించి, కుల వివక్ష గురించి పట్టించుకోలేదు. పైగా 1985లో ముందుకు వచ్చిన దళిత ఉద్యమాన్ని వ్యతిరేకించారు. హేతువాదంలో భాగంగా కుల నిర్మూలన ఎంత ఆవశ్యకమో డా. బి.ఆర్‌. అంబేద్కర్‌, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, కత్తి పద్మారావు అనేక సిద్ధాంత చర్చలు చేశారు. 1985 జులై 17న కారంచేడులో మాదిగలపై కమ్మవారి దౌర్జన్యం, హత్యాకాండకు వ్యతిరేకంగా రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభమైంది. అది ఒక ఉద్యమంగా రూపిదిద్దుకున్నది. దళిత మహాసభ ఏర్పడిరది. దళిత మహాసభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కత్తి పద్మారావు మలుపు తీసుకున్నారు.

చార్వాకం నుండి బౌద్ధం వైపు మలుపు తిరిగిన అవగాహన

ఇక అప్పటినుండి చార్వాకం, హేతువాదం నుండి మలుపు తిరిగి బౌద్ధం మానవతావాదం, స్త్రీవాదం అన్నీ దళితవాదంలో భాగంగా సంశ్లేషించి, విశ్లేషించి వందల, వేల ప్రసంగాలు, వ్యాసాలు వెలువరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కుల వ్యవస్థ భారతదేశ సామాజిక వ్యవస్థలో మౌలిక అంశమని, సమానత్వం సాధించాలంటే, సమసమాజం రావాలంటే, మొట్టమొదట కుల వివక్ష, కుల అణచివేత, కుల అంతరాలు తొలిగిపోవాలని ప్రబోధిస్తూ, విశ్లేషిస్తూ వస్తున్నారు. 90 దాకా విభిన్న రంగాల గురించిన గ్రంథాలను వెలువరించారు. నాలుగు దశాబ్దాల్లో డా॥ కత్తి పద్మారావు జాతీయ స్థాయిలో ఒక లెజెండ్‌గా, మార్గదర్శిగా, యుగకర్తగా, మహాకవిగా ఎదుగుతూ వచ్చారు. కోట్లాది ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. వేలాది కార్యకర్తలకు, విద్యావంతులకు, బుద్ధి జీవులకు, సాహితీవేత్తలకు, మార్గదర్శనం చేశారు. రాష్ట్రంలో తెలుగు సాహిత్యంలో, సామాజిక ఉద్యమాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా ఒక ఐకాన్‌గా నిలిచిపోయారు.

27 జులై 1953లో జన్మించిన కత్తి పద్మారావుగారికి ఇప్పుడు 72 ఏండ్లు. జీవితంలో, ఉద్యమాల్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. శత్రు భయంకర తీవ్రవాద దళితవాదం నుండి క్రమంగా బుద్దిస్ట్‌ శాంతియుత పరివర్తన శత్రువును కూడా ఒప్పించి, మెప్పించే తాత్విక సంపదను, సామాజిక విశ్లేషణను అందిస్తూ, భారతీయ చరిత్ర మూలాలను, తాత్విక మూలాలను, చరిత్ర పరిణామాన్ని విశ్లేషిస్తూ, వామపక్ష చరిత్రకారులకు, సాహితీవేత్తలకు, సిద్ధాంత కర్తలకు కండ్లు తెరిపించారు. మార్గదర్శనం చేశారు. అంతదాకా వర్గదృక్పథంతో, ధనిక, బేద వ్యత్యాసాలు తొలగిస్తే కులం పోతుంది అని వాదించేవాళ్ళకు కనువిప్పు కలిగించారు. పెట్టుబడిదారి సమాజం పోయి, మరో సమాజం వచ్చినా, పురుషాధిపత్యం, పితృస్వామిక వ్యవస్థ, అందుకు పునాదిగా కొనసాగుతున్న కుల వ్యవస్థ, కుల వివక్ష పోదని, మహత్మా జ్యోతిబా ఫూలే, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, కబీర్‌దాస్‌, గురు రవిదాస్‌ వేసిన మార్గంలో ముందుకు సాగి కత్తి పద్మారావు సమాజాన్ని మలుపు తిప్పారు. ఇప్పుడు అన్ని ఉద్యమాలు, పార్టీలు, అన్నిరకాల సాహిత్య సంఘాలవాళ్ళు స్త్రీ, పురుష సమానత్వాన్ని, అన్ని కులాలు సమానమే అని, అందుకు ప్రత్యేకంగా అసమానతల నిర్మూలన కోసం కృషి చేయాలని, తమ కార్యక్రమాలను విస్తృతం చేసుకున్నారు.

దశాబ్దాలుగా నాయకత్వం...

అలా రాష్ట్రంలో దళిత మహాసభ, కత్తి పద్మారావు సంఘసంస్కరణను, సామాజిక విప్లవాన్ని ముందుకు తెచ్చారు. నాయకత్వం వహించారు. అందులో భాగంగా ఆయన జన్మదినాన్ని కుల నిర్మూలన దినోత్సవంగా ప్రకటించి ప్రతియేటా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్రమంలో 1984లో దేశ వ్యాప్తంగా ప్రారంభమైన కాన్షీరామ్‌ బహుజన సమాజ్‌వాది పార్టీ, బామ్సెఫ్‌ ఉద్యమం, 1988`89లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఒకవైపు రాజకీయాలు, బిఎస్పీ చేస్తున్న సైద్ధాంతిక పోరాటం, మరోవైపు దళిత ఉద్యమం రెండూ కలిసి సామాజిక, రాజకీయ చైతన్యంగా మలుపు తిరిగాయి. కారంచేడు ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ అట్రాసిటీ నిరోధక చట్టం తీసుకువచ్చింది. అంటరానివారిగా ఎవరిని కించపరిచినా, సంబోధించినా నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌వారెంట్‌తో డైరెక్టుగా జైలుకే పంపిస్తారు. ఇది దేశవ్యాప్తంగా దళితుల ఆత్మగౌరవాన్ని మహోన్నతంగా పెంచింది. ఈ చట్టం దుర్వినియోగం అయిందని, కొన్ని కులాలవాళ్ళు వాదిస్తుంటారు. చట్టం ద్వారా వచ్చిన అధికారం ఎంతో కొంత పక్కదారి పట్టడం ఈ ఒక్క విషయంలోనే కాదు. అన్నింటికి వర్తిస్తుంది. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో, రాజకీయాల్లో వర్ణాధిక్య, కులాధిక్యవాదులే అధికారంలో ఉంటున్నారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందని చేసే వాదన సరిjైునది కాదు. 1991 ఆగస్టు 6వ తేదీన చుండూరు హత్యాకాండ జరిగింది. దళిత మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమించింది. ఎన్నో ధర్నాలు చేశారు. రాష్ట్రపతిని కలవడానికి దేశంలోని ఎస్సీ పార్లమెంటు సభ్యులు అన్నీ పార్టీలవాళ్ళు కలిసి బయలుదేరారు. రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ కలవడానికి నిరాకరించారు. అప్పుడు దళితుడే రాష్ట్రపతి కావాలి. అనే నినాదం ఇవ్వడం జరిగింది. అలా కె.ఆర్‌. నారాయణ్‌ రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. ఇలా సామాజిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పులకు కత్తి పద్మారావు, దళితమహాసభ కృషి కారణమైంది.

సాహిత్యంలో పెను మార్పులు

సాహిత్య రంగంలో, తాత్విక రంగంలో దళిత మహాసభలు, బహుజన సమాజ్‌వాది పార్టీ తెచ్చిన చైతన్యం ఇంతా అంతా కాదు. అదే సమయంలో వామపక్ష పార్టీల్లో 1985 నుండి కుల సమస్యపై చర్చలు కొనసాగుతూ వస్తున్నాయి. కారంచేడు ఉద్యమం ఈ చర్చలను వేగవంతం చేసింది. దాంతో ఆయా వామపక్ష కమ్యూనిస్టు, నక్సలైట్‌ ఉద్యమాల్లో పొలరైజేషన్‌ పెరిగింది. వర్గ దృక్పథం ఒక్కటే చాలదు. ఫెమినిస్టు దృక్పథం, దళిత బహుజన దృక్పథం కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళాలి అనేవాళ్ళు తీవ్రమైన చర్చలు చేశారు. అట్లా కంచ ఐలయ్య, ఉ. సాంబశివరావు, కె.జి. సత్యమూర్తి, గద్దర్‌, బి.ఎస్‌. రాములు, మాస్టార్జీ, వి.జి.ఆర్‌. నారగోని, గూడ అంజయ్య ఉషా. ఎస్‌. డానీ అనేక చర్చలు చేశారు. 1989 నాటికి అన్ని ఉద్యమాల్లో రెండు శిబిరాలుగా, వర్గాలుగా చీలిపోయారు. అలా దళిత మహాసభ, బహుజన సమాజ్‌వాది పార్టీ ఉద్యమాల నేపథ్యంలో వందల, వేల రచయితలు, కళాకారులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మేల్కొన్నారు. 1990 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. వామపక్ష నక్సలైట్ల ఉద్యమాల్లోని లోపాలను అవగాహన రాహిత్యాన్ని, ఆధిపత్య కులాల అధికారాన్ని ప్రశ్నించారు. రచయితలారా, కళాకారులారా మీరు ఎటువైపు అని ప్రశ్నించి 1991 నుండి ఉట్నూరులో, 1982 డిసెంబర్‌ 6వ తేదీన కరీంనగర్‌లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించారు. 1993 ఫిబ్రవరి రెండవ వారంలో హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ కింద గల అంబేద్కర్‌ భవన్‌లో దళిత రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలు 2000 మందితో విజయవంతమయ్యాయి. ఇది దళిత బహుజన ఉద్యమాల్లో సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప మలుపు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా బి.ఎస్‌. రాములు, ప్రధాన కార్యదర్శిగా మాస్టార్జీ, కార్యదర్శిగా నారగోని, ఉపాధ్యక్షులుగా ఇంగిలాల, గూడ అంజయ్య తదితరులతో ఉద్యమ నిర్మాణం విస్తృతంగా ముందుకు సాగింది. 230 గ్రంథాలు వెలువడ్డాయి. అఖిలభారత స్థాయిలో సదస్సులు నిర్వహించారు. ఇలా కత్తి పద్మారావు, బొజ్జా తారకం, కాన్షీరామ్‌, కె.జి. సత్యమూర్తి, గద్దర్‌, కంచ ఐలయ్య, బి.ఎస్‌. రాములు,

ఉ. సాంబశివరావు, గూడ అంజయ్య, కె.ఎస్‌. చలం, ఖాదర్‌ మొహియుద్దీన్‌, బి.ఎం. లీలాకుమారి, దుర్గం సుబ్బారావు, ఇంగిలాల బోధి తదితరులు అనేక సంస్థలను నిర్మిస్తూ, కలిసి పనిచేస్తూ ముందుకు సాగారు. ఈ చైతన్యాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ, స్త్రీవాద ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, వర్గీకరణ ఉద్యమాలు, మైనారిటీ సాహిత్య ఉద్యమాలు ముందుకు వచ్చాయి.

కారంచేడుతో మొదలై

ఇవన్నీ ఒక సామాజిక పరిణామం క్రమంలో ముందుకు సాగడానికి కారంచేడు, చుండూరు, బహుజన సమాజ్‌పార్టీకి వాటికి నేతృత్వం వహించిన కత్తి పద్మారావు పాత్ర ప్రధానమైనది. నేటికీ ఆ బ్యానర్‌ని మోసుకొని, తీసుకొని దక్షిణ ఆఫ్రికాలో 2001లో డర్బన్‌లో, లండన్‌ పార్లమెంట్‌లో, ఢల్లీిలో ఇలా అనేక పార్లమెంటరీ పార్టీలలో, ఉద్యమాలలో కీలకపాత్ర నిర్వహించారు.

ఉత్తరాదిలో రాంవిలాస్‌ పాశ్వాన్‌ మొదలుకొని కాన్షీరామ్‌, మాయావతితో సహా అనేక పార్టీలలోని దళిత ప్రజాప్రతినిధులను, సాహితీవేత్తలను కదిలించడంలో కత్తి పద్మారావు ప్రసంగాలు, చర్చలు, సైద్ధాంతిక గ్రంథాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

నోబుల్‌ పురస్కారానికి అన్నివిధాల అర్హులు

కత్తి పద్మారావుగారిని అనేక పురస్కారాలు, సత్కారాలు, అవార్డులు వరించాయి. 1992లో అంబేద్కర్‌ అవార్డు. 2003లో సినారె సాహిత్య పురస్కారం, 2006లో తెలుగు యూనివర్శిటీ పురస్కారం, అలాగే భోయ భీమన్న ట్రస్ట్‌ పురస్కారం, 2008లో ఆచార్య నాగార్జన యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌, 2010లో మహాకవి బిరుదు ప్రధానం, 2021లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేతుల మీదుగా వై.ఎస్‌.ఆర్‌. జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. కె. బాలగోపాల్‌ పౌరహక్కుల సంఘం ఉద్యమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుప్రసిద్ధులు. అంతకన్నా ఎన్నోరెట్లు కృషి చేస్తూ ఉద్యమ నిర్మాణాలు, గ్రంథ రచన, సాహిత్య రచన చేస్తూ నేటికీ స్ఫూర్తినిస్తున్న డా॥ కత్తి పద్మారావు గారికి ఎ. అవార్డు ఇచ్చినా తక్కువే. నోబుల్‌ శాంతి బహుమతికి, నోబుల్‌ సాహిత్య పురస్కారానికి అన్నివిధాలుగా అర్హులు డా॥ కత్తి పద్మారావుగారు.

యుగకర్తగా కత్తి పద్మారావు

ఐదు దశాబ్దాలుగా సాహితీవేత్తగా, సిద్ధాంతకర్తగా కత్తి పద్మారావు చేసిన కృషి ఆయనని ఒక యుగకర్తగా నిలిపింది. నేను రాసిన అనేక పీఠికలను, వ్యాసాలను కలిపి ‘యుగకర్త కత్తి పద్మారావు’ అనే గ్రంథాన్ని వెలువరించాను. విప్లవోద్యమం నుండి నేను 1990లో బహిరంగ జీవితంలోకి వచ్చిన్నుండి దళిత మహాసభ, బహుజన సమాజ్‌వాది పార్టీ, కత్తి పద్మారావు, బొజ్జా తారకం, ఉ. సాంబశివరావు, కంచ ఐలయ్య, గద్దర్‌ తదితరులతో కలిసి పని చేస్తున్నాం. ఇది అంతా ఒక సమిష్ఠి భావజాల చైతన్యం. సంస్థాగత నిర్మాణాలు ఎన్ని ఉన్నప్పటికీ, బౌద్ధం, చార్వాకం, గురు రవిదాస్‌, భక్త కబీర్‌దాస్‌, మహాత్మా జ్యోతిరావు ఫూలే, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ భావజాల వారసత్వాన్ని, చారిత్రక వారసత్వాన్ని స్వీకరించి, ముందుకు సాగుతున్న సమాంతర, ప్రత్యామ్నాయ బహుజన ఉద్యమ వ్యాప్తిని తెలియజేస్తుంది. ఇలా సమస్థ, వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, భాష, దేశ, ప్రాంత, విచక్షణలకు, అసమానతలకు వ్యతిరేకంగా మనుషులందరూ సమానమే. ఏ కులమూ గొప్పది కాదు, ఏ కులమూ చిన్నది కాదు అనే సమగ్ర సామాజిక దృక్పథంతో, సమగ్ర సామాజిక వికాసం కోసం కృషి చేయడం జరుగుతున్నది. కుల నిర్మూలన అంటే చాలామంది అదేదో పెద్ద భూతం అన్నట్టుగా భయపడుతుంటారు. కుల నిర్మూలన అంటే మరేమిటో కాదు. అన్ని కులాలు కలిసిపోవడమే. కుల వివక్ష తొలిగిపోవడమే కుల నిర్మూలనకు తొలిమెట్టు. ఇటీవల ముందుకు వచ్చిన తెలంగాణ సామెత కంచం పొత్తు, మంచం పొత్తు అన్ని కులాల మధ్యన ఏర్పడి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో కలిసిపోయి ఒకే సమాజంగా మారడమే కుల నిర్మూలన. ఈ దేశానికి సమస్థ కులాలు కలిసిపోయి ఒక్కటి కావడం అనేది ఒక చారిత్రక అవసరం. వేల యేళ్ళుగా కుల, మతాలవారీగా చీలిపోయిన సమాజం ఒక్కటిగా మారి అన్ని రంగాల్లో ప్రపంచంలో మహోన్నతంగా ఎదగడానికి కుల నిర్మూలన అత్యవసరం. డా॥ కత్తి పద్మారావుగారి జన్మదినాన్ని ఇలా కులనిర్మూలన దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సమంజసం.

Read More
Next Story