తెలంగాణ గల్ఫ్ వర్కర్లను మర్చిపోతే ఎలా?
x

తెలంగాణ గల్ఫ్ వర్కర్లను మర్చిపోతే ఎలా?

ఎవరికీ పట్టని తెలంగాణ గల్ఫ్ వర్కర్ల భద్రత మీద బిఎస్ రాములు సూచనలు. తులం బంగారానికి తులంన్నర ఇచ్చే పద్దతిలో వడ్డీకి తీసుకొని యూత్ గల్ఫ్ వెళ్తారని మీకు తెలుసా?



అందరికి ఇల్లు, అందరికి విద్య, వైద్యం అందరికి ఉపాధి అనేది బతకడానికి అవసరం. ఒక సమాజం జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఇవే ప్రామాణికం. స్వంత ఇల్లు గురించి మధ్య తరగతి పడుతున్న కష్టాలు ఇన్నీ , అన్నీ కావు. భవన నిర్మాణ సామగ్రి , కూలీలు , భూముల ధరలు బాగా పెరగడం అందుకు కారణం. పేదల కష్టాలు ఇక చెప్పనవసరం లేదు. అందుకని ఆయా ప్రభుత్వాలు ప్రజలకు స్వంత ఇల్లు కోసం కృషి చేస్తున్నాయి.

ఇందిరమ్మ ఇండ్లు పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందికి గృహవసతి కల్పించాలని స్కీమును ముందుకు తెచ్చింది. 500 చదరపు అడుగుల ఇల్లు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎదిగే పిల్లల అవసరాల దృష్ట్యా 800 చదరపు అడుగుల ఇల్లు అవసరం అవుతుంది. అది అలా ఉండగా భవన నిర్మాణ రంగంలో రియల్ ఎస్టేట్ ఏ రంగంలో లేనన్ని ఉపాధి అవకాశాలు పెరిగాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తున్న తెలుగువాళ్లు లక్షలాదిమంది ఈ రంగంలోనే పని చేస్తున్నారు. బిహార్ , ఒరిస్సా , ఛత్తీస్గడ్ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు ప్రధానంగా భవన నిర్మాణం , రోడ్లు , తదితర రంగాల్లోనే పని చేస్తున్నారు. వారికి ఎలాంటి శిక్షణ ఇచ్చే సంస్థలు లేవు. శిక్షణ ఇచ్చే సంస్థలు విరివిగా స్థాపించడం అవసరం. వెనకట 1959 లో జిల్లా పరిషత్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగాన్ని విస్తరించినప్పుడు సరిపడా ఉపాధ్యాయుల కోసం ఎక్కడికక్కడ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను స్థాపించారు. అవి 1970 దాకా కొనసాగాయి. ఆ తర్వాత ఎత్తివేశారు.

డైట్ పేరిట జిల్లాకు ఒకటి శిక్షణ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఇప్పుడు అలా భవన నిర్మాణ తదితర రంగాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాలు ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం అవసరం. రెండేళ్ళ క్రితం నాకు రెండు స్టంట్లు వేసినందుకు ఎఐజి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అందులో పని చేస్తున్న నర్సింగ్ స్టాఫ్ అందరూ ఒకే వయస్సులో ఉండడం గమనించాను. చాలామంది ఒరిస్సా గిరిజన బాలబాలికలు ప్రత్యేక శిక్షణ పొంది వచ్చినవారు కనిపించారు. ఇలా తక్కువ విద్యార్హతలతో ఉపాధి పొందడానికి భవన నిర్మాణంలో అవకాశాలు ఉన్నాయి. భవన నిర్మాణంలో సుమారు 50 రకాల వృత్తి నిపుణులకు ఉపాధి ఉంటుంది. పునాది తీయడం మొదలుకొని , ఇంటీరియల్ డెకరేషన్ దాకా అతి పెద్ద ఉపాధి రంగం ఇది.

తెలంగాణ జిల్లాల నుండి లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు , ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. దీనికి అనేక సామాజిక , రాజకీయ కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలున్నాయి.

1977 నుండి విస్తరించిన విప్లవోధ్యమాలు భూస్వాముల , ధనిక రైతుల భూములను దున్నేది లేదు. అమ్మనిచ్చేది లేదు. కొనేది లేదు అని ఉద్యమకారులు నిషేధాలు విధించారు. భూస్వాములు, దొరలు, ఊర్లు వదిలి పట్టణాలలో , నగరాల్లో గ్రామాలలో కన్నా వందల రెట్లు సంపన్నులుగా సమస్థ రంగాల్లో ఎదిగారు.

నష్టపోయిందల్లా ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ తదితర కూలీలు , నిపుణులు కొన్ని సంవత్సరాలపాటు కోట్లాది పని దినాలు గ్రామీణ కూలీలు ముఖ్యంగా ఎస్సీలు , ఎస్టీలు , బీసీలు పని దొరకక పోవడం వల్ల ఇతర ప్రాంతాలకు , ఇతర దేశాలకు వలసబాట పట్టారు. గల్ఫ్ దేశాలలో అప్పుడే అనేక రంగాల్లో , భవన నిర్మాణంలో అవకాశాలు పెరిగాయి.

దానికి కారణం గల్ఫ్ దేశాలు ఒక్కటై తమ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించుకుంటూ పెంచుకుంటూ సంపద పెంచుకున్నారు. 35 లక్షల మంది ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. పాలమూరు లేబర్ గా ప్రసిద్ధులైన కూలీలు దేశ వ్యాప్తంగా వలసలు సాగించారు. ప్రాజెక్టులు , భవన నిర్మాణం , రోడ్ల నిర్మాణం తదితర రంగాల్లో వీరి సేవలు ఉపయోగపడుతున్నాయి. అయితే వీరు ఎవరికీ శిక్షణ ఇవ్వడం లేదు. దశాబ్దాల తరబడి ఏజెంట్లు, మధ్యవర్తులు , బ్రోకర్లు ఉపాధి చూపిస్తామని మోసాలు చేస్తూ వచ్చారు.

ఉత్తర తెలంగాణాలో తులం బంగారానికి తులంన్నర ఇవ్వాలి అనే పద్దతిలో వడ్డీకి తీసుకొని తొలి మూడేళ్ళ సంపాదన ఈ ఖర్చులకే పోయేది. సరియైన పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేవలం విమాన చార్జీలతో వెళ్లి ఉద్యోగ భద్రతతో జీవించే అవకాశం ఉ ౦ డేది. ఇప్పుడు చనిపోతే శవం రావడానికి కూడా సరైన ఏర్పాట్లు లేవు. ఈ గల్ఫ్ వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను, ట్రస్టును, శాఖను ఏర్పాటు చేసి కేరళతో పాటు, ఇతర దేశాల్లో ఉన్న చట్టాలను, సౌకర్యాలను అధ్యయనం చేసి సమగ్రంగా ఒక విధానాన్ని రూపొందించడం అవసరం.

ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి. కానీ వాటికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. అప్పుడే పేదవర్గాలకు నైపుణ్యాల రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక్క భవన నిర్మాణ రంగంలోనే 50 రకాల నైపుణ్యాల ఉపాధి లభిస్తుంది.

అమెరికాలో భవన నిర్మాణం చేయడంలో సరిహద్దు గీత దాటి అమెరికాలకి ఇల్లీగల్గా ప్రవేశించిన మెక్సికో ప్రజలు లక్షలాది మంది పని చేస్తున్నారు. రోజుకు ఐదు వేల మంది కంచె దాటి అమెరికాలో ప్రవేశిస్తున్నారు. అన్ని సేవా రంగాల్లో మెక్సికో కార్మికులే కనపడతారు. వారి సేవలు ఎంత అవసరమంటే భవన నిర్మాణం , రోడ్లు , వగైరా నిర్మాణరంగం వారు లేకపోతే అమెరికా కుప్పకూలిపోతుంది. అందువల్ల వారిని దేశంలోకి ప్రవేశించాక చూసీ చూడనట్టుగా ఉంటారు. ఆ తర్వాత అన్నీ సౌకర్యాలు కల్పిస్తారు.

మన దేశంలో ఒరిస్సా , బిహార్ , ఛత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్ , తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు , దేశాలకు వలస వెళ్ళేవారు కూడా ఇలా స్వదేశంలో కాందిశీకులుగా బతుకుతున్నారు. వారి గురించి స్వరాష్ట్రం పట్టించుకోదు. వలస వెళ్ళినచోట పట్టించుకోరు. ఈ సమస్య గమనించి రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా వర్తిస్తుంది అని కంప్యూటరీకరించారు. కానీ వారికి ప్రావిడెంట్ ఫండ్ , కనీస కూలీగానీ , కనీస వసతి గానీ , వారి పిల్లల ఆరోగ్యం , విద్య గురించిన సరైన చట్టాలు గానీ , వసతులు గానీ ఏర్పాటు చేయడం లేదు.

ఒక రాష్ట్రం మరో రాష్ట్రం మీద నెపం పెడుతుంటారు. అలా కాదు. భారతదేశంలోని అసంఘటిత కార్మికులు , కూలీలు అందరికి ఆధార్ కార్డ్ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను , ఉచిత విద్యను , ఉచిత వైద్యాన్ని అన్ని సంక్షేమ పథకాలు నగదు బదిలీని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకి తరలించి వారికంటూ ఒక నిర్దిష్ట మొత్తం జమ అయ్యేట్టు చూడ్డం అవసరం.

ఇది కోట్లాది మంది అసంఘటిత కార్మికులు , కూలీలు , పార్ట్ టైమ్ వర్కర్లకు అందరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయంలో కేంద్రం 2003 లో రూపొందించిన బిల్లు అలా ఉండిపోయింది. దాని మార్గదర్శకత్వంలో బెంగాల్లో అనేక మార్పులు , చేర్పులు చేసి ఆ బిల్లును చట్టంగా మార్చుకొని అమలు జరుపుతున్నారు. దాన్ని కూడా పరిశీలించడం అవసరం. ఇది 70 కోట్ల మంది ప్రజల సమస్య.

చేనేత , పవర్ లూమ్ , భవన నిర్మాణ కార్మికులతో పాటు విభిన్న రంగాల్లో పని చేసే అందరికి ఆధార్ కార్డ్వలే ప్రావిడెంట్ ఖాతా , ఆసరా పథకం అందుబాటులోకి తేవడం ఎంతో అవసరం. తమ స్తానిక జిల్లాను వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్ళిన వారి పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధతో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో , కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడం ఎంతో అవసరం. సామాజిక న్యాయం ద్వారా , సామాజిక మార్పు జరగడం అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి సమస్థ అవకాశాలను , నైపుణ్యాలను అందించడమే.


Read More
Next Story