
ఎన్నికల్లో వోడినోళ్ల కొత్త వేషమే నేటి ‘తెలంగాణ అస్తిత్వం’ వాదం
2014 కు ముందున్న తెలంగాణ అస్తిత్వం కాదు ఇది. ఇది పవర్ కోసం దూసిన పాత నామవాచకం
భారతదేశం బహుళ సంస్కృతుల, బహు భాషల నిలయం. బహుళ నైసర్గిక బౌగోళిక ప్రాంతాల వైవిధ్యం వల్ల అనేక ఆచారాలు, సంస్కృతులు, శరీర ఆకృతులు, రంగులు కొనసాగుతున్నాయి. దీన్నే ఒక మాటలో భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పేర్కొంటారు. ఒకచోట మంచు కురుస్తుంది. ఒjకచోట వరదలు, ఒకచోట ఎండలు మండిపోతాయి. ఒకచోట వర్షాలు ఎక్కువ రావు. ఒకచోట జూన్‌లో వర్షాలు, ఒకచోట అక్టోబర్‌లో వర్షాలు. ఇలా దేశమంతటా రకరకాల శీతోష్ణస్థితులు భారత ఉపఖండం విశిష్ఠతను, ప్రత్యేకతను తెలుపుతాయి.
భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని గమనించారు. ఫెడరల్ రాజ్యాంగ నిర్మాణాన్ని అంతర్గతంగా కొనసాగించాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే 565 సంస్థానాలు, బ్రిటీష్ పాలిత ప్రాంతాలు అన్నీ కలిపి ఒక దేశంగా ఏర్పరుస్తున్నప్పుడు ఫెడరల్ స్వభావం పైకి కనపడితే దేశం శతాబ్దాలుగా అనేక రాజ్యాలుగా విడిపోయినట్లుగా విడిపోతే కష్టమని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటూ ఫెడరల్ నినాదాన్ని కేంద్రీకృత కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఉమ్మడి రంగాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను, పరిధులను నిర్ణయించడం జరిగింది. కానీ, ప్రజలు ఎక్కడికక్కడ రాజకీయంగా, సాంస్కృతికంగా స్థానిక సంస్కృతితో, స్థానిక రాజకీయాలతో కొనసాగుతూ వస్తున్నారు.
రాజకీయూలు, సంస్కృతి నిర్మాణాలు, సామాజిక వ్యవస్థలు వేటికవి ప్రత్యేక ప్రవాహాలు, పరిణామాలు కలిగి ఉంటాయి. ఎన్ని రాజకీయాలు వచ్చినా, కుటుంబ వ్యవస్థలో, స్త్రీ, పురుష సంబంధాల్లో, కుల వ్యవస్థ అంతరాల్లో, వివక్షల్లో అసమానతల్లో, వివక్షల్లో పెద్దగా మార్పులు రావు. ఇవన్నీ సంస్కృతి నిర్మాణంలో భాగంగా, సామాజిక పునర్నిర్మాణంలో భాగంగా సాధ్యపడుతాయి.
రాజకీయాలు ఒక నిరంతర పరుగు పందెం. ప్రవహించే జీవనదిలో నిరంతరం ఈదుతూ సాగడం. ప్రజలమధ్య, కార్యకర్తల మధ్య, పార్టీ కార్యకలాపాల మధ్య నిరంతరం చలనంతో సజీవ సంబంధాలతో కొనసాగడం. కానికాలంలో కొంతకాలం కదలని రాయిలా ప్రవాహంలో కొట్టుకు పోకుండా పడి ఉండడం కూడా రాజకీయ నాయకులకు ఈ విషయాలు బాగానే తెలుసు. ఇవి బాగా తెలిసినవారే రాజకీయాల్లో నెగ్గుకు వస్తారు.
సంస్కృతి వికాసం నిరంతర పరిణామం. నిరంతరం సాగే జీవనది. కొత్తనీరు ఎప్పుడూ వస్తూ ఉంటుంది. పాత నీరు పోతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ ప్రవాహానికి ఒక నది పేరు, ఒక వాగు పేరు అలాగే కొనసాగుతుంది. సంస్కృతి కూడా అంతే. భారతీయ సంస్కృతి, దేశీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, ఉత్తరాది సంస్కృతి, దక్షిణాది సంస్కృతి అనేది కూడా నదుల పేర్ల వంటివే. నదిలో నిరంతరం కొత్త నీరు ప్రవహిస్తుంది. ఒకే నదిలో ఒకే ప్రవాహంలో రెండుసార్లు స్నానం చేయలేరు. సంస్కృతి కూడా ఈ ప్రవాహ శీలతను కలిగి ఉంటూ, పాత పేర్లతో ప్రాచీన సంప్రదాయాల పేర్లతో, సనాతన ధర్మం, సనాతన సంస్కృతి పేరుతో కొనసాగుతుంటాయి. అవి నిజానికి పాత నీళ్ళు కావు. కొత్త నీళ్ళే పాత పేర్లతో, పాత నామవాచకాలతో పిలువబడుతుంటాయి.
కొత్త అవసరాల్లో భాగంగా, నూతన మానవ సంబంధాల్లో భాగంగా వాటిని వర్తమాన అవసరాలకు అనుకూలంగా మలుచుకుంటూ, మలుపులు తిప్పుతూ ముందుకు సాగుతుంటారు. రాజకీయాల్లో భారతీయ సంస్కృతి, దేశీయ సంస్కృతి, సనాతన ధర్మం పేరిట కొనసాగే భావజాలాన్ని ఆధునిక రాజకీయ ఆధిపత్యం కోసం, ఆయ సామాజిక వర్గాల, కులాల, ప్రాంతాల వర్తమాన ఆధిపత్యం కోసం మాత్రమే. అందువల్ల ఇదంతా పాత సీసాల్లో కొత్త సారా!. కొందరు కొత్త సీసాలో పాత సారా పోస్తుంటారు. దానికి కొత్త సారా, కొత్త సారం అని నామ వాచకాలు తగిలిస్తుంటారు. ఇది ఎడంచెయ్యి తీసి పుర్ర చెయ్యి పెట్టు అన్నట్టుగా ఉంటుంది.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా పదేళ్ళు కేసిఆర్, టిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ రాజకీయ అధికారం చెలాయించిన తర్వాత ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ తెలంగాణ అస్థిత్వవాదం, భావజాలం చర్చను, సంస్కృతిని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ అస్థిత్వవాదం పేరిట వస్తున్న చర్చ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చేసిన చర్చవంటిది కాదు. ఇది పాత చర్చ కాదు. పాత నామవాచకాలతో సాగుతున్న కొత్త చర్చ.
తిరిగి పాత ఆధిపత్యవాదులు అధికారంలోకి రావడానికి టిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్, కెసిఆర్ పరివారానికి అనుకూలంగా సాగుతున్న ప్రచారం. ఎలాగైతే భారతీయ హిందూ, దేశీయ సంస్కృతి, జీవన విధానం పేరిట వర్ణాధిక్య, కులాధిక్య, ఉత్తరాది సంస్కృతి, ఆధిపత్యవాదాలు కొనసాగడానికి రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రచారం సాగుతున్నదో అలాంటిదే నేటి తెలంగాణ అస్థిత్వం కోల్పోతున్నది. మంట కలుస్తున్నది అనే మోసపూరిత ప్రచారం.
ఇపుడు రాజకీయ తెలంగాణ నినాదాలు కాదు. ఇప్పుడు కావాల్సింది, జరగవలసింది తెలంగాణ సాంస్కృతిక వికాసం. తెలంగాణ సంస్కృతి వికాసం సమస్థ రంగాల్లో కొనసాగాలి. సాంస్కకఋతిక పునర్నిర్మాణం, పునర్వికాసం, రినైజాన్స్ ద్వారా అది సాగుతుండాలి. తమిళనాడు ఈ మౌలిక అంశాన్ని గ్రహించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తమిళ సంస్కృతిని, ద్రవిడ సంస్కృతిని ముందుకు తెస్తూ ఉత్తరాది సంస్కృతి, భావజాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, స్వీయ సంస్కృతిని సాధికారికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ తన సంస్కృతిని మరిచిపోయింది. తెలంగాణ సంస్కృతి తొలి దశలో మాతృస్వామిక సంస్కృతి. మహారాష్ట్రలో, తెలంగాణాలో, తమిళనాడులో, కేరళలో, థాయిలాండ్‌లో నేటికీ మాతృస్వామిక సంస్కృతి వివిధ రూపాల్లో కొనసాగుతూ వస్తున్నది. ఉత్తరాది సంస్కృతిలో పురుషాధిపత్య, పితృస్వామిక ఆధిపత్యం స్పష్ఠంగా ముందుకు వస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని పాఠ్య పుస్తకాలను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఎకాఎకిన సీమాంధ్ర పత్రికా భాష స్థానంలో తెలంగాణ పత్రికా భాష ప్రవేశపెడితే విద్యార్థులకు, టీచర్లకు కష్టంగా ఉంటుందని, కొన్ని అట్లా, కొన్ని ఇట్లా పాఠాలు రాయడం జరిగింది. ఇప్పుడు 11 ఏండ్లు గడిచాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా కొత్త పాఠ్య పుస్తకాలే చదువుకున్న తరం వచ్చేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పత్రికా భాషలో బాలశిక్ష నుండి పీజి దాకా పాఠ్యపుస్తకాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తెలంగాణ సాహితీవేత్తలు, సామాజిక ఉద్యమకారులు చర్చను ముందుకు తేవాలి. ప్రభుత్వాన్ని కదిలించాలి. వాటి నిర్మాణంలో పాల్గొనాలి. తెలంగాణ ప్రత్యేకతను నిలబెట్టాలి.
అలా తెలంగాణ భాష, తెలంగాణ పాఠ్య పుస్తకాలు, తెలంగాణ కథలు, తెలంగాణ నవలలు, తెలంగాణ నాటకాలు, తెలంగాణ సినిమాలు. తెలంగాణ జీవితాల టీవీ సీరియల్లు, తెలంగాణ ఆటలు, తెలంగాణ వంటలు, తెలంగాణ పండుగలు, తెలంగాణ పెండ్లిల్ల సంస్కృతి, తెలంగాణ రక్త సంబంధాలు, బంధుత్వాల వరుసలు, వాటి ప్రోటో కాల్స్. తెలంగాణ కట్టు బొట్టు , తెలంగాణ కులాలు, కంచం పెత్తు మంచం పొత్తు. ఇవన్నీ పునర్జీవింప జేయడమే తెలంగాణ సంస్కృతి వికాసం. ఆధునిక వర్తమాన, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వంలో భాగంగా, సమస్థ, వర్ణ, వర్గ, కుల, లింగ, జాతి, మత, ప్రాంత, దేశ, భాష వివక్షతలను, అసమానతలను నిర్మూలించే దిశగా తెలంగాణ రినైజాన్సు ముందుకు సాగడమే తెలంగాణ సాంస్కృతిక వికాసం. కులాతీతంగా కులాంతర వివాహాలు జరగడం... ఇవన్నీ కలిసి సాగితేనే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి వికాసం... నిర్మాణం అంటారు. అందుకు కృషి చేయని, ఉపయోగ పడని తెలంగాణ అస్తిత్వ నినాదం రాజకీయంగా ఓట్లు కొల్ల గొట్టడానికి, రాజకీయంగా మోసం చేయడానికే!! ఈ విషయం గుర్తుంచుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వమైనా, టిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్, బిజెపి, తెలుగుదేశం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీటన్నిటిని అమలు జరపడానికి బాట వేయడం, మౌలిక ప్రాతిపదికలు వేయడం, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య ఉద్యమకారుల కర్తవ్యం. సినిమా, టీవీ సీరియళ్ళ నిర్వాహకులు, నిర్మాతలు, దర్శకులు టీవీ ఛానళ్ళు కూడా ఈ విషయంలో తెలంగాణ సంస్కృతి, అస్థిత్వం కోసం కృషి చేసినప్పుడే తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పునర్వికాసం కొనసాగుతుంది.
ఈ పని చేయకుండా కేవలం రాజకీయ నినాదంగా తెలంగాణ అస్థిత్వ వాదాన్ని, తెలంగాణ అస్థిత్వాన్ని కుదించి మాట్లాడ్డం సరిది కాదు. ఆ మాటకు వస్తే టిఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ పరిపాలనలో తెలంగాణ సంస్కృతి, పునర్వికాసం ఏపాటి జరిగిందో అంచనా వేయడం అవసరం. అసలు ఆ దృష్ఠి కోణాన్ని ఎంతమేరకు కలిగి ఉందో, 2014 నుండి 2024 దాకా సాగిన క్రమాన్ని విశ్లేషించడం అవసరం.
కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అయినప్పటికీ, తెలంగాణ సంస్కృతి, అస్థిత్వ పునర్వికాసం కోసం కృషి చేసినప్పుడే ఫెడరల్ తెలంగాణ, ఫెడరల్ భారతీయ సంస్కృతి నిర్మాణానికి ఒక నమూన అవుతుంది. కులగణన ద్వారా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన సమస్థ రంగాలలో సమస్థ వర్గాల, కులాల, లింగాల సాధికారికత, ప్రాతినిధ్యం ద్వారానే జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఒక నూతన నమూనాను ముందుకు తీసుకురావడం సాధ్యపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతదాకా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలోని కేంద్రీకృత అధికారానికి అనువుగా సాగింది. ఇప్పుడు భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి పేరిట బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ పరివారం కేంద్రీకృత అధికారాన్ని, కేంద్రీకృత సంస్కృతిని స్థిరపరుస్తున్నది.
ఫెడరల్ భారత రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను, మౌలిక అంశాలను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, కాంగ్రెస్ మొదట్నుండి నిర్లక్ష్యం చేస్తూ, అణగదొక్కుతూ, అణచివేస్తూ వచ్చాయి. అయినప్పటికీ బౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక పరిణామాల రీత్యా ఎక్కడికక్కడ ఫెడరల్ పార్టీలు ఏర్పడుతూ వచ్చాయి. సోషలిస్టు పార్టీ, జనతా పార్టీ, జనతాదళ్, వాటి చీలికల పార్టీలు బిహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటకలో స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఫెడరల్ పార్టీలుగా తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, శివసేన బహుళ పార్టీల కేరళ ప్రభుత్వాలు కొనసాగుతున్న విషయం గమనించవచ్చు.
ఇలా చీలిపోయి స్థానిక పార్టీలుగా, రాష్ట్ర పార్టీలుగా, ఫెడరల్ పార్టీలుగా కొనసాగుతున్న పార్టీలతో 1977 నుండి ఐక్య సంఘటనలు కొనసాగుతూ, విడిపోతూ, యుపిఎ, ఎన్‌డిఏ తదితర కూటములు ఏర్పడుతూ, ఇప్పుడు ఇండియా కూటమిగా కాంగ్రెస్ నాయకత్వంలో కొత్తరూపు తీసుకున్నది. జనతా పార్టీ, జనతాదళ్, యుపిఎ, ఎన్‌డిఎ ఐక్య సంఘటనలలోని లోటుపాట్లను సవరించుకుని ఇండియా కూటమి ఒక నిజమైన ఫెడరల్ వ్యవస్థగా ఏర్పడ్డం అవసరం. అప్పుడే ఆ ఫెడరల్ నిర్మాణంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తిరిగి జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడం సాధ్యపడుతుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడులో వలె తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, అస్థిత్వం ఫెడరల్ నిర్మాణాన్ని వేగవంతం చేసి దేశానికి ఒక నమూనాగా చూపినప్పుడే ఒక స్థిరమైన కాంగ్రెస్ ఇండియా కూటమి నిలదొక్కుకుంటుంది. అంతేగాని టిఆర్‌ఎస్‌కో, బిఆర్‌ఎస్‌కో, టిడిపికో, బిజెపికో ఉపయోగపడే రాజకీయ నినాదంగా తెలంగాణ అస్థిత్వ నినాదం మారకూడదు. అని మర్చిపోకూడదు.
ఇటీవల భారతీయ సంస్కృతి, దేశీయ సంస్కృతి, ఉత్తరాది దక్షిణాది సంస్కృతి అంటూ ప్రత్యేకంగా భావజాల సంస్కృతి వికాసాలు ముందుకు వచ్చాయి. హిందూ భారతీయ సంస్కృతి పేరిట బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వంటి శక్తులు ఆధునిక కాలంలో కూడా వర్ణాధిక్య, కులాధిక్య సంస్కృతి, నాయకత్వాన్ని నిరంతరం కొనసాగుతుంది. ప్రచారం చేస్తున్నది. ఆచరిస్తున్నది. దక్షిణాది సంస్కృతి ప్రత్యేకంగా చరిత్ర పరిణామంలో ఎలా సాగిందో తన అస్తిత్వాన్ని నిరూపిస్తున్నది.
అలాగే బౌద్ధ మానవీయ సంస్కృతి, జీవన విధానం శతాబ్దాలుగా ఎలా కొనసాగుతూ వచ్చిందో, కప్పబడిన చరిత్రను మట్టి తొలగించి వెలికి తీస్తూ, బౌద్ధ పునర్వికాస కృషి కొనసాగుతున్నది. మరోవైపు పురుషాధిపత్య, పితృస్వామిక ఆధిపత్య పునాది అయిన కుటుంబ వ్యవస్థ నిర్మాణాన్ని మాతృస్వామిక ఆధునిక ఫెమినిస్టు, స్వామ్యవాద, సమానత్వవాద సంస్కృతి పునర్వికాసం కోసం కొత్త నామవాచకాలతో, కొత్త నిర్వచనాలతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ రకరకాల పేర్లు తగిలించుకొని, ముందుకు వస్తుంటాయి. సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి అనే చర్చ చూస్తున్నాం. సోషలిజం, సెక్యులరిజం పదాలను తొలగించడం అంటే ఫెడరలిజం అనే పదాన్ని, భావాలను, సంస్కృతిని కూడా తొలగించడం అని మరిచిపోకూడదు.