రేవంత్ ని కెటిఆర్ ‘సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి’ అనొచ్చా?
కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రి కావాలని కలలు కంటారు. పోటీపడతారు. ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి కావాలని మరొక వ్యక్తి కలకనడమైనా సాధ్యమా!
గుమ్మడిదల రంగారావు
తెలంగాణా అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవసాదాలు తెలిపే తీర్మానం మీద జరిగిన చర్చ ఆద్యంతం అభ్యంతరకరంగా సాగింది. ఇది చాలా దురదృష్టం. ముఖ్యంగా ఎన్నికలో ఓడిన బీఆర్ఎస్ పార్టీ తీరు చాలా ఆక్షేపణీయంగా వుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి ని నియమించిన తీరు మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ కేటీఆర్ ప్రసంగించిన తీరు చూస్తుంటే ఓటమి వలన ఏమీ నేర్చుకున్నట్లు అనిపించడంలేదు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నుద్దేశించి ఆయన ఢిల్లీ నియమించిన ముఖ్య మంత్రి అనీ, సీల్డ్ కవరు సీఎం అని అన్నారు. ఈ మాటలు చూస్తుంటే గాజు గదిలో వున్నవారు ఇతరుల మీద రాళ్లు వెయ్యకూడదు అనే ఇంగ్లీష్ సామెత గుర్తుకొస్తుంది. అదే రాళ్లు అవతలి వాళ్ళు విసిరేస్తే పగిలేది మన గాజు గదే కదా!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వచ్చాక ముఖ్య మంత్రిని ఖరారు చెయ్యటంలో జరిగిన జాప్యం అందరినీ అసహనానికి, ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే, ప్రచారం మొత్తం తన భుజాలమీద వేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఒక్కడే గనుక. గోడపత్రాలమీద రేవంత్ భట్టి ల పేర్లు ఫోటోలు ఉన్నప్పటికీ, అందరూ రేవంత్ రెడ్డినే ముఖ్య మంత్రి అభ్యర్థిగా చూశారు. ఆ విషయం కాంగ్రెస్ ఎందుకు గుర్తించలేదూ అన్న అసహనం చాలా మందికి కలిగింది. ఈ విషయం మీద కేటీఆర్ అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా వుంది.
బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ నోటిదురుసు కూడా ఒక కారణమని చాలా మంది అన్నారు. అది మీడియాలో కూడా వచ్చింది. ఆ విషయాన్ని కేటీఆర్ గ్రహించి, చట్ట సభలో బాధ్యతాయుతంగా ప్రసంగించి ఉంటే బాగుండేది. కానీ రాజకీయ నాయకులు త్వరగా మారరు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులను ఎవరూ ఎత్తిచూపే సాహసం చెయ్య లేరు. అది పార్టీలకు నష్టం కలిగించేదే అయినా అది అంతే!
కాంగ్రెస్ పార్టీ తన ముఖ్య మంత్రి అభ్యర్థిని సీల్డ్ కవర్ ద్వారా చెబుతుందా లేక చెవిలో గుసగుసలాడుతూ చెబుతుందా అనేది ఆ పార్టీ అంతర్గత విషయం. ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ ని గెలిపించారు. బీఆర్ఎస్ ని ఓడించారు. ఇది ఎన్నికల్లో తేలిన సత్యం. ఓడిన పార్టీ ఓటమిని హుందాగా అంగీకరించి ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజలనుంచి కొన్ని మంచి మార్కులు, కూసింత సానుభూతి పొందవచ్చు. అది వదిలేసి, గెలిచిన పార్టీ మీద దాడి చెయ్యటం, ఆ పార్టీ నాయకుడిని గురించి అమర్యాదకరంగా మాట్లాడటంలో ఔచిత్యమేముంది? ఔచిత్యం గురించి తెలిస్తే మన నేతలు చాలా తక్కువగా మాట్లాడాలి. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్లు బీఆర్ఎస్ ఓడినందుకన్నా రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయినందుకు కేటీఆర్ బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఆయన భాష చూస్తుంటే!
ప్రాంతీయ పార్టీల శైలి
కెటీఆర్ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటి వుంది. ప్రాంతీయ పార్టీల వ్యవహారశైలి జాతీయ పార్టీల వ్యవహారశైలి చాలా వేరువేరుగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీ చిన్న పరిధిలో పని చేస్తుంది. వ్యవహారం అంతా ఒక్క నాయకుడి చుట్టూ తిరుగుతుంది. ఆ నాయకుడు ఏది చెబితే అదే పార్టీ విధానం. ఆ చెప్పేది నలుగురితో మాట్లాడి చెప్పాడా లేక తన సొంత నిర్ణయమా అనేది ఎవరూ అడగలేరు. ఒంట్లో ఓపిక వున్నంతకాలం ఆ నాయకుడే ముఖ్య మంత్రి అభ్యర్థి. మరెవరూ ఆ పదవి కలలో కూడా వూహించుకోలేరు ముఖ్య మంత్రి అవ్వాలని గానీ, పార్టీ అధ్యక్షుడు కావాలనిగానీ. ఎవరైనా ఊహించుకోవటం అంటూ జరిగితే అది నాయకుడి సంతానం మాత్రమే! ఎక్కడికో పోనవసరం లేదు. ఈ విషయం హరీష్ రావు బావని అడిగినా చెబుతాడు.
లుజాతీయ పార్టీలలో ఎవరికైనా ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్య మంత్రి పదవిని ఆశించవచ్చు. ప్రధాన మంత్రి పదవినీ ఆశించవచ్చు. కాంగ్రెస్ లో మన్మోహన్ సింగ్ ఏ ఆశ లేకుండానే పదేళ్లు ప్రధాన మంత్రిగా చేశారు. బీజేపీలో నరేంద్ర మోడీ కూడా అంతే. ఒక్క కాంగ్రెస్ లోనే దామోదరం సజీవయ్యలాంటి దళితుడు, టి. అంజయ్య లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదిగారు. అదే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలో సాధ్యమా? ఏ ప్రాంతీయ పార్టీలో అయినా అంతే.
కాంగ్రెస్ లో ఉన్న స్వేచ్ఛ అదే
నిజమే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య మంత్రి ఆశావహులు పలువురు వున్నారు. కేటీఆర్ చెప్పిన భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ లాంటివారందరూ పార్టీలో సీనియర్ నాయకులుగా ఆశావహులే. అందులో తప్పు లేదు. అలా ఆశపడే అవకాశం జాతీయ పార్టీలలోనే ఉంటుంది. ఇంతమంది ఆశావహులు వున్నప్పుడు వాళ్లందరినీ సమాధాన పరచాలి. పార్టీ అభిమతాన్ని విడమర్చి చెప్పాలి. పార్టీ సూచించిన పేరుకి అందరూ ఒప్పుకునేలా బుజ్జగించటానికి సమయం పడుతుంది. ఎవరికైనా ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వస్తుంది. ఈ సారి రేవంత్. తరవాత ఎన్నికల్లో మరికొందరు తెరమీదకు వస్తారు. ఆశావహులని ఒప్పించటం పార్టీ అధిష్టానం బాధ్యత. రాష్ట్ర పార్టీ శాఖలు, నేతలు, జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు. వారికి ఏమైనా ఇబ్బందులుంటే జాతీయ నాయకత్వం తో చెప్పుకునే వీలుంటుంది. పార్టీ జాతీయ నాయకత్వం ఒకసారి ఒక నాయకుడికి అవకాశం ఇస్తే అందరూ పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఆ నాయకుడి నేతృత్వంలోనే పనిచేస్తారు. అది క్రమశిక్షణ గల పార్టీ నేతల లక్షణం.
ఈటల రాజేందర్ ఎపిసోడ్ సందేశం
అంతే గానీ కేటీఆర్ కి నచ్చిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చెయ్యలేదని బాధపడటం అర్ధం పర్థంలేని ఆవేదన. బీఆర్ఎస్ లాంటి పార్టీలో అధినాయకుడి కుటుంబానికి తప్ప మరెవరికైనా ఆశపడే హక్కు ఉంటుందా? అధినాయకుడు ఎవరినైనా అణచివెయ్యాలంటే ఒక్క రోజుకూడా పట్టదు. ఈటెల రాజేంద్ర ఎపిసోడ్ ఎం చెబుతుంది? అధినేత ఆగ్రహానికి గురైతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది. అందువలన కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తుంది, ఏ ప్రాతిపదికన చేస్తుంది అనేది ఆ పార్టీకి వదిలేసి వీలుంటే బీఆర్ఎస్ లో కూసింత ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రవేశపెడితే పార్టీ కి మంచిది అన్న విషయం కేటీఆర్ తెలుసుకోవాలి. ఇక్కడ మరో ముఖ్య విషయం వుంది. అది ఏటంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గా రూపాంతరం చెందింది ఒక జాతీయ పార్టీగా ఎదగాలనే కదా! రేపు జాతీయ పార్టీగా ఎదిగి, ఏ హర్యానా లోనో, పంజాబ్ లోనో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, అక్కడ ముఖ్య మంత్రిని ఎంపిక చెయ్యటంలో పార్టీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోదా? మాకేం తెలియదు మీరే చూసుకోండి అంటుందా? రేపు జాతీయ పార్టీ స్థాయికి ఎదిగినాక, వీరేమైనా కొత్త పంధాని పాటిస్తారా?
సభలో కాంగ్రెస్ వైఫల్యం
అయితే ఈ వ్యవహారంలో విస్మయం కలిగించే విషయంలో ఏంటంటే కాంగ్రెస్ నేతలు కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలకు ధీటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోవటం. ఒక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేశాడు. మిగతా మంత్రులు స్పందించవలసిన రీతిలో స్పందించలేదు. మనసులో ఎలా ఉన్నాకూడా, పార్టీ ఒక నిర్ణయానికి వచ్చాక ఆ నిర్ణయాన్ని గౌరవించి తదనుగుణంగా పనిచేయాలి. సరైన సమయం వచ్చినప్పుడు వారి ఆశను కూడా పార్టీ నాయకుల ముందు ఉంచవచ్చు. అది అంతర్గత వ్యవహారం. అప్పటివరకు కలసికట్టుగానే ఉండాలి. ఉండటమేకాదు, వున్నామన్న నమ్మకాన్ని కూడా కలిగించాలి ముఖ్యంగా ప్రజలలో.
ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. ముందుగా ప్రతిపక్షం చెయ్యాల్సింది ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనే స్వవిమర్శ. ఆ తరువాతే ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియచేయాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలో ప్రజల మద్దతు పొందిన పార్టీకి ఆటంకం కలిగించటం, ప్రభుత్వం చేసే ప్రతి పనినీ వ్యతిరేకించటం ప్రతిపక్షం పని కాదు. అలా చెయ్యటమంటే ప్రజల నిర్ణయాన్ని ప్రశ్నించినట్లే. అది అధర్మం, అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధం. అధికార పక్షం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగేహక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. అయితే ప్రతిపక్షం అధికారంలో వున్నప్పుడు చేసిన నిర్వాకంకూడా బయట పడుతుంది. ఆ పరిస్థితిని ఎదుర్కొనటానికి కూడా సిద్ధంగా ఉండాలి.
అధికారంలో వున్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో వున్నప్పుడు మరోలా వ్యవహరిస్తామంటే ప్రజలకు నచ్చదన్న విషయం మర్చిపోకూడదు. 2018 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 చేస్తామని కాంగ్రెస్ చెబితే, టీఆరెఎస్ 62 కి పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఈ అంశం పరిశీలించటానికి ఒక కమిటీని వేసి కాలయాపన చేసింది. చివరకు రిటైర్మెంట్ వయసు 61కి పెంచింది. ఆ నిర్ణయం అమలులోకి వచ్చేలోపు రిటైర్ అయిన ఉద్యోగులు నష్టపోయినట్లేకదా! అలా నష్టపోయిన ఉద్యోగులకు టీఆరెఎస్ ఇచ్చే సమాధానమేంటి?
కాంగ్రెస్ ‘ఆరు గ్యారంటీ’లలో ఇరుక్కుపోరాదు
రేవంత్ రెడ్డి కూడా నిపుణులతో కమిటీలు వేసి ఎన్నికల్లో చెప్పిన ఆరు హామీలను ఈమేరకు అమలుచేయగలరో తేల్చాలి. భావోద్వేగంతో ఒక ప్రణాళిక అనేది లేకుండా అమలు చెయ్యటంకన్నా అన్నీ అలోచించి వ్యవహరించాలి. ఎన్నికల్లో విజయానికి అనేక కారణాలుంటాయి. కేవలం ఆరు హామీల వలెనే గెలిచారనుకోలేము. ఏది చేయగలము, ఏది చేయలేము అనేది విడమర్చి చెబితే ప్రజలు తప్పక అర్ధం చేసుకుంటారు. ప్రభుత్వం కూడా రఘురాం రాజన్ వంటి ఆర్ధిక నిపుణులతో ఓ కమిటీ వేసి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సమీక్షించి ఏది చేయగలము, ఏ మేరకు చేయగలము అనేది స్పష్టంగా చెబితే ప్రజలు కూడా అర్ధం చేసుకుంటారు. ప్రజలు విజ్ఞులు. ఆసాధ్యమైన మైన హామీలు అమలు చెయ్యమని కోరుకోరు.
ఈసారి గెలవకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న డెస్పరేషన్ తో అలవికాని హామీలను గుప్పించింది. ఈ హామీలన్నింటినీ ఉన్నఫలంగా అమలు చెయ్యమని ఎవరూ అడగటం లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాష్ట్రం త్వరలో అస్థిపంజరంలా మారటం మాత్రం ఖాయం. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు మరిచిపోకూడదు.
ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, కోరుకునేది ఉచితాలు పేరుతో ప్రభుత్వం నేరుగా డబ్బు వారి చేతుల్లో పెట్టమని కాదు. ప్రజలు కొరుకునేది అవినీతి రహిత పాలన. మనిషికి చేపలు పట్టి ఇవ్వటంగాకుండా చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పటం మేలు చేస్తుంది. సమాజానికీ అంతే!
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు)
(రచయిత రంగారావు విశ్రాంత పార్లమెంటు ఉన్నతోద్యోది)