దళిత మహిళా సర్పంచ్‌లు రాణించలేరా?
దళిత గ్రామ సర్పంచ్‌లు వారి గ్రామాలను అభివృద్ధి చేయడంలో వెనకబడి ఉన్నారా? చివరకు వారు పదవులను సైతం ఎందుకు వదులుకుంటున్నారు?
దళిత గ్రామ సర్పంచ్‌లు వారి గ్రామాలను అభివృద్ధి చేయడంలో వెనకబడి ఉన్నారా? గ్రామ సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? చివరకు వారు పదవులను సైతం ఎందుకు వదులుకుంటున్నారు? ఈ విషయాలను కాస్త లోతుగా పరిశీలిస్తే.. కులం, లింగం వివక్ష అందుకు కారణమని తెలుస్తోంది.
రిజర్వేషన్ల ప్రాతిపదికన కొన్ని గ్రామాల్లో దళిత మహిళలే సర్పంచ్‌లు. అయితే కేవలం వీరు పేరుకు మాత్రమే సర్పంచ్‌లుగా కొనసాగుతున్నారు. వారికి అధికారులు ఉండవు. చెక్ పవర్ ఉండదు. ప్రొటోకాల్ ఉన్నా.. సభలో సమావేశాలకు వారిని ఆహ్వానించరు. ఆహ్వానించినా.. వేదికమీదకు పిలవరు. నేటికీ దళిత గ్రామ సర్పంచ్‌ల పట్ల వివక్ష కొనసాగుతుండడం దురదృష్టకరం.
గ్రామాల వెనకబాటుతనానికి కారణం ఎవరు?
గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్ తదితర అవసరాల కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. హరితహారం, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌సి (15వ ఆర్థిక సంఘం) నిధులను వాడేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిరది.
వారికెలా సాధ్యం?
అగ్రవర్ణాల సర్పంచ్‌లు నిధులను రాబట్టుకోవడంలో సఫలీకృతమవుతున్నాయి. ధనికులైన సర్పంచ్‌లు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా, వారి సొంత డబ్బును ఖర్చుచేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. ఆ డబ్బును ఇతర పనులకు కేటాయించిన నిధుల నుంచి తిరిగి పొందుతున్నారు. ఈ విధానాన్ని దళిత పేద సర్పంచులు అనుసరించలేకపోతున్నారు. పేదరికం, అక్షరాస్యత, చొచ్చుకుపోయే తనం కొరవడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు వారి పదవులను కూడా ఒదులుకుంటున్నారు
పదవులకు రాజీనామా..
జగిత్యాల (JAGITYALA) జిల్లా బుగ్గరం మండలం చిన్నపూర్ గ్రామ సర్పంచ్ దమ్మ లతాశ్రీ ఇలాంటి పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేశారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధుల మంజూరు విషయాలపై జిల్లా ఉన్నతాధికారులను కలిసినా వారి నుంచి సరైన స్పందక లేకపోవడంతో దళిత సర్పంచుల్లో నిత్సేజం అలుముకుంది.
దళిత సర్పంచ్‌లు స్వతంత్రంగా వ్యవహరించి గ్రామాల్లో అభివృద్ధి పనులు చకాచకా చేయిస్తే..ఇక తమను ఎవరు పట్టించుకుంటారన్న సందేహంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి పూర్తి అధికారాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
కొన్ని గ్రామాల్లో గ్రామస్థులు హేళనగా మాట్లాడడం భరించలేక, కొంతమంది సర్పంచ్ ధైర్యం చేసి..అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచిచూస్తున్నారు.
గ్రామాలకు కేటాయించిన నిధులు వాటికి మాత్రమే వినియోగించేలా మార్గదర్శకాలుంటే బాగుంటుందని సర్పంచులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఈ దిశగా రాష్ట్ర ఆర్థిక సంఘం కూడా సిఫార్సు చేస్తే సంతోషిస్తామంటున్నారు సర్పంచ్‌లు.
నిధులు దారి మళ్లించారు..
‘‘కేంద్రం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో పడతాయి. సర్పంచ్, ఉపసర్పంచ్ మాత్రమే డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఆ డబ్బును విత్‌డ్రా చేయగలరు. పంచాయతీ సెక్రటరీలు మా డిజిటల్ సిగ్నేచర్‌తో నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో దారి మళ్లించారు. దీన్ని సైబర్ ఆర్థిక నేరంగా పరిగణించాలి’’
- సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ప్రెసిడెంట్
కాగా పంచాయత్ రాజ్ యాక్టు ప్రకారం గ్రామాలకు కేంద్రం కేటాయించిన నిధులను వాడుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఆ నిధులను గ్రామపంచాయతీల విద్యుత్ బకాయిల చెల్లింపునకు వినియోగించామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు.