ఈ దేశాన్ని ఫిరాయింపు దారుణాల నుంచి రక్షించేదెవరు?
x
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (ఫెేస్ బుక్ నుంచి)

ఈ దేశాన్ని ఫిరాయింపు దారుణాల నుంచి రక్షించేదెవరు?

రాజ్యాంగం సాక్షిగా ‘ప్రమాణం’ చేసిన MLAలకు దేవుడు అంతరాత్మ అంటే ఏమిటో తెలుసా?


తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన 10 మంది భారత రాష్ట్ర సమితి(BRS) ఎంఎల్యేల పై అనర్హతవేటు వేయాలని ఆ పార్టీ పెట్టిన కేసు ఎపుడు తేలుతుందో.

"ఆ కేసును ఎప్పుడు తేల్చుతారు, ఇంత ఆలస్యమా, ఆలస్యంపై వివరణ ఇవ్వాలి," అని ప్రశ్నిస్తూ ఫిరాయింపుల మీద నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ ను ఆదేశించింది. ఆదేశాలు బాగుంటాయి, కాని ఈ దేశాన్ని ఫిరాయింపు దారుణాల నుంచి రక్షించేదెవరు?

మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేం తీసుకోవాలా? అంటూ ధర్మాసనం సూటిగానే ప్రశ్నించింది. దీనితో, ‘ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం వల్ల ఈ వ్యవహారం మళ్లీ వేడెక్కింది’ అని పేపర్ వాళ్లు రాసేశారు, గాని, వేడి లేదు ఉష్ణం లేదు. అంతా బాగా చల్లారిపోయింది. సుప్రీంకోర్టు ‘అసంతృప్తి’ చెందిందని పత్రికల్లో మరో మాట రాశారు. ఇది జనానికి మాత్రం ఏమీ పట్టదు. అసంతృప్తి, సంతృప్తి... ఈ పదాల అర్థాలు ఎవరికీ అర్థమయి చావవు.

బీఆర్ఎస్ కోర్టు కేసు నీతి నియమాల మూట కాదు. ఏ పార్టీ నుంచయినా మరో పార్టీకి ఫిరాయించే వారికి, ప్రోత్సహించే వారికి సంబంధించిన రొటీన్ కథ ఇది. స్పీకర్ ఏం చేస్తాడో, ఎమ్మెల్యేలు ఏమి చేస్తారో నని ఆయా నియోజకవర్గాల వారు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తారు? అయితే, కథ నిండా పెండింగ్‌ అండ్ పెండింగ్ అండ్ పెండింగ్. వాయిదా వాయిదా అండ్ వాయిదా. లాయర్లకు వాయిదాలే ఫాయిదా.

ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ పూర్తి చేయడానికి స్పీకర్ తరపు న్యాయవాదులకు 8 వారాల సమయం కావాలట. దీనికి నిజంగానే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. సరే పోనీ ఇంకో నాలుగు వారాలు తీసుకోండి అని ఒకో అవకాశం ఇచ్చింది. కాని స్పీకర్ గారు ఏ డేట్ ని ఎంచుకుంటారో చెప్పగలరా? ఈ నాలుగు వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణను తప్పనిసరిగా పూర్తి చేసి తగిన నిర్ణయం తీసుకుని, ఆ నివేదిక ఇవ్వండి అని ఆదేశించింది. ఆదేశం పాటించకపోతే, మళ్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెడతారా. పెడితే ఏమవుతుంది? దానికి కూడా విచారణ అంటూ ఒకటి అంటుంది. అంటే మరొక వాయిదా, అంటే మరి కొన్ని నెలలు పెండింగ్. కొసమెరుపు ఏమంటే అప్పటికి ఈ ఎమ్మెల్యేల టర్మ్ ముగిస్తుంది.

చర్యలు తీసుకోకపోవడమే అదే చర్య.

మన మీడియా ‘‘స్పీకర్ కార్యాలయం దీర్ఘకాలంగా జాప్యం చేసింది’’ అని రాస్తుంది. దీని ప్రకారం స్పీకర్ జాప్యం చేయలేదట. ఆహా? స్పీకర్ గారి చేయికాదు, మేధస్సు కాదు, ముఖ్యమంత్రి కాదు, శ్రీ మనిషి గారు కాకుండా ఒక కార్యాలయం కూడా ప్రాణంమున్న మనిషిలాగా ఆలస్యం చేస్తున్నదట. స్పీకర్ కాదు. మన అసెంబ్లీకు అయిదేళ్ల కాలధర్మం చెందడానికి ఇంక ఎన్నినెలలు అవుతుంది అని క్యాలెండర్ చూసుకుంటూ ఉంటాడు శ్రీ ‘కార్యాలయం’ గారు. అధికార పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు రాసిన ప్రెస్ నోట్ ప్రకారం మీడియా మిత్రులు వారి వారి పార్టీకి సంబంధించిన పొగడ్తలతో, ప్రతిపక్షం వారు విమర్శలతో ఓ నాలుగు వాక్యాలు తగిలించి ప్రింట్ చేస్తారు.

విచారణ అంటే ఏమిటి?

ఈ అవకాశవాద పదిమంది ఎంఎల్యేలు ఒకపుడు బిఆర్ ఎస్ అధికార పార్టీవారు. కనుక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు. చేరారు. చేరారు అంటే సరిపోదు. ప్రకటనలు సరిపోవు. పత్రికల వార్తలు సరిపోవు. ప్రతి వారు ఏ విధంగా ఫిరాయించారు అని వివరణ చెప్పవలసిందే. పదిమందిలో ప్రతి ఒకరు ఏదో కారణం చెబుతారు. ఇంకొకాయన నేను రాజీనామా ఇచ్చానా, ఎక్కడ చూపించండి అంటే ఏం చేస్తారు.

అందరికీ తెలుసు, ఏ మొహమాటం పడకుండా ఫిరాయించారని. ఆ పది మహానుభావులే ప్రకటించి కూర్చున్నారు. రాజీనామా చేసే అవకాశం ఇప్పుడు లేదు, ఒక సారి కేసు స్పీకర్ కోర్టులోకి వచ్చిన తరువాత హైకోర్టు సుప్రీంకోర్టు దాకా ఒకటి రెండు సార్లు చక్కర్లు వేసిన తరువాత, ఫిరాయించిన మహానుభావుల గురించి ప్రతి పేపర్, వీడియో కూడా చెప్పాక. వారి సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు ఉన్నాయి. కాని స్పీకర్ గారు వినాలి కదా. ఇంత జరిగాకా ఫిరాయింపు ఎమ్మెల్యే తరఫున లాయర్లు అది ఫిరాయింపే కాదని వాదిస్తారు. అలా కొన్ని రోజులు విచారణ చేస్తూ ఉంటారు. తప్పదు మరి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను విచారించారు కదా, అదే ప్రగతి. ఏదో గడువు ఉంటుంది. ఆ గడువు పూర్తయినా ఇంకా విచారణ పూర్తి కాలేదని కొందరంటారు. గడువు అంటే ఏమిటి? అది పూర్తికావడం అంటే ఏమిటి? దాని మీద వాదోపవాదాలు చేసుకోవచ్చు.

ఫిరాయించు, ఫిర్యాదు

ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెేటీ రామారావు నియమించుకున్న లాయర్లు ఢిల్లీ ప్రయాణాలతో బోలెడంత బిజీ గా ఉన్నారు. ఇదొక్కటే కేసు కాదు కదా. ఇక సమయం దొరికితేనే జడ్జిలు కేసులు వింటారు. స్పీకర్ గారికి ఉన్న ఈ ఒక్క కేసునైనా తొందరగా వినాలి కదా. అదీ చేయరా?

ఈ పది మంది ఎంఎల్యేల ఫిరాయింపు కేసు కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే అయిదేళ్ల లో సగం ఆయుష్సు పోయింది. ఇక సగమే ఉంది. ఇప్పుడైనా ఫిరాయింపు కేసులు తేలుస్తారా లేక ఏదోరకంగా కాలక్షేపం చేసుకుంటుంటారా? ఈ మధ్య ‘ఫిరాయించిన ఎంఎల్యేగార్లు’ అధికారాలు, డబ్బు తీసుకుంటూ ఉంటారు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది అని అనుకుంటుంటారు.

ఇక్కడ అంతా రాజ్యంగం మీద ప్రమాణం చేసిన వాళ్లే ఉన్నారు. రాజ్యాంగం చెప్పిన విధంగా మేము వ్యవహరిస్తామని ప్రమాణం చేసుకున్నారు. అంతేకాదు పది మంది ఎంఎల్యేలు కూడా ప్రమాణం చేసారు. దేవుడిముందు లేదా అంతరాత్మ అనుసరించి ప్రమాణం చేస్తారు. అలాగే స్పీకరూను. అసలు ఆ ప్రమాణం అర్థం తెలుసా? దేవుడెవరు, అంతరాత్మ ఎక్కడుంటుంది అంటే ఏమి చెప్పాలి. ఈ వివాదంలో ఉన్న వాళ్లంతా ఆంతరాత్మ, దేవుడు అంటే నమ్ముతున్నారా? చివరగా చెప్పొచ్చే దేమంటే, ప్రమాణం ఎలా చేసినా ఆ తర్వాత రాజ్యాంగ సంవిధానం గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు.



Read More
Next Story