భారత రాజ్యాంగం తిరగరాయాలనేదెవరు, ఎందుకు? (2)
x

భారత రాజ్యాంగం తిరగరాయాలనేదెవరు, ఎందుకు? (2)

దేశంలో ఎపుడూ లేనంతగా ఇపుడు భారత రాజ్యాంగం చర్చనీయాంశమయింది. ఈ చర్చను న్యాయశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ విశ్లేషిస్తూ రాస్తున్న వ్యాసాలు.


భారత రాజ్యాంగాన్ని మార్చుకోవాలని, తిరగరాయాలని , ప్రధాని, మరెవరో ముఖ్యమంత్రి, ఓ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి అన్నప్పుడు, రాజకీయ పరంగా కొందరు తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర అధికార రాజకీయ పార్టీ నేత రాజద్రోహ నేరం పెట్టాలన్నారు. అంతేకాదు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటే అది అంబేడ్కర్ ను అవమానించడమే అనీ అన్నారు.

రాజకీయ అవసరాలకోసం మాట్లాడే మాటలు వేరు. పార్టీలు ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడతారు, మిత్ర పార్టీలయితే ఒక రకంగా, ఓట్ల ఆకర్షణ లక్ష్యంగా మాట్లాడే వారు ఉంటారు. వాటి గురించి ఇక్కడ చర్చించనవసరం లేదు. రాజ్యాంగ పరమైన నియమాలేమిటి? రాజ్యాంగాన్ని ఎప్పడికీ మార్చకూడదా? పూర్తిగా మార్చడం అసలు సాధ్యమే కాదా? రాజ్యాంగ ఛీఫ్ ఆర్కిటెక్ట్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చకూడదు అని అన్నారా? ఈ విషయం గురించి చర్చించడం అవసరం.


భారత రాజ్యాంగ నిర్మాతలు

మొత్తం రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు- అంబేడ్కర్

ఈ రాజ్యాంగాన్ని 368వఅధికారణం ద్వారా పూర్తిగా మార్చుకునే అధికారాన్ని ఇచ్చింది. అంబేడ్కర్ నవంబర్ 25, 1949నాటి చివరి ప్రసంగంలో రాజ్యాంగం తుది ప్రతి సారాంశాన్ని వివరించారు. కొన్ని విమర్శలకు కూడా ఆయన సమాధానంలో చెప్పారు. ఆ సందర్భంలో ఏ సవరణ పూర్తి మార్పు గురించి ఈ విధంగా వివరించారు.

‘‘ఈ రాజ్యాంగంలో సమకూర్చిన ఈ సూత్రాలన్నీ ఈ తరం అభిప్రాయాలు, ఈ మాట అతిశయోక్తి అంటారా, అయితే ఈనాటి రాజ్యాంగసభలో సభ్యుల అభిప్రాయాలు అందాం. అమెరికా రాజనీతివేత్త థామస్ జెఫర్సన్ మనం విస్మరించడానికి వీల్లేని ఒక మాట చెప్పారు. ‘‘ప్రతితరాన్ని ఒక విభిన్నమైన జాతి (నేషన్ = దేశం)గా పరిగణించాలి. ఆ జాతి మెజారిటీ ద్వారా తమఅధికారాలను పరిమితం చేయవచ్చు. ఏ విధంగానైతే మరో దేశంలో నివసించేవారిపైన అధికారం చలాయించే వీల్లేదో ఆ విధంగానే తరువాత తరాన్నినిబంధనలతో బంధించే అధికారం లేదు’’.

మరో సందర్భంలో అంబేడ్కర్ మరో రాజ్యాంగ నిపుణుడు జెఫర్సన్ మాటను కోట్ చేశారు. జెఫర్సన్ ఇలా అన్నారు.

‘‘ఒక జాతి (దేశం నేషన్) కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు (రాజ్యాంగ వ్యవస్థ), లక్ష్యాలు నెరవేర్చడం కోసమైనా అసలు ముట్టుకోవడానికి, మార్చుకోవడానికి వీల్లేదనే నియమం, అది నియంతల దుర్మార్గాలను ఆపగలుగుతాయేమోగాని, ఒక జాతికి వ్యతిరేకమయిన నిరర్థకమైన నియమం. ఈ భూమిని ఏలిన మన ముందు తరాలు మనకన్న ఎక్కువ స్వేచ్ఛ మనకు ఇచ్చారనేది మన న్యాయవేత్తలు, మతాచార్యులు మనకు నేర్పిన సిద్ధాంతం. అదే ధోరణిలో మనం భావితరాల తలలపైన మార్చడానికి వీల్లేని భారమైన చట్టాలను పెట్టి, ఎవరూ మార్చడానికి వీల్లేదనడం బాగానే ఉంటుంది, ఎప్పుడంటే భూమిమీద అందరూ నిర్జీవంగా ఉన్నపుడు, అంతేకాని బతికున్నభూమి కోసం కాదు’’ అని జెఫర్సన్ అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చకూడదనే నియమాన్ని విమర్శిస్తూ, తరువాత వచ్చే తరాలు తమ అవసరాలకు ఆలోచనలకు అనుగుణంగా మార్చుకోవచ్చు అనే నియమాన్ని సమర్థిస్తూ అంబేడ్కర్ ఇలా అన్నారు.


అమెరికన్ రాజ్యాంగానికి నిర్మాతలు

‘‘ఇది (జెఫర్సన్ చెప్పింది) కేవలం నిజం కాదు. పరమసత్యం. నిస్సందేహం. ఒకవేళ ఈ జెఫర్సన్ సూత్రాన్ని విస్మరించి ఉంటే రాజ్యాంగ రచనా సభను నిందించడమే కాదు, ఖండించినా సమంజసమే’’ అని అన్నారు

కనుక రాజ్యాంగ రచనా కాలంనుంచే, అంటే తొలి సంవత్సరంలోనే 1950 జనవరి 26 రిపబ్లిక్ డే నుంచే అపరిమితమైన సవరణ అధికారాలను ఇచ్చుకున్నారు.

1973లో ‘కేశవానంద భారతి’ కేసు తీర్పు రాజ్యాంగం లౌకిక తత్వాన్ని ధ్రువీకరించింది. జస్టిస్ ఖన్నా వివరించినట్లుగా రాజ్యాంగం వ్యక్తులకు మౌలిక హక్కులుగా గ్యారంటీ ఇచ్చిన మౌలిక అంశాల్లో (బేసిక్ స్ట్రక్చర్) ఇదో ప్రధానమైన అంశం. ప్రభు త్వం మతపరమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని, అందుకోసం, ప్రభుత్వ నిధులను ఉపయోగించరాదని 1983లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.42వ రాజ్యాం గ సవరణ కారణంగా కానీ, అది లేకుండా కానీ రాజ్యాంగ పీఠికలో వివరించినట్లుగా లౌకికవాదం ప్రాధాన్యతను సుప్రీంకోర్టు 1994లో మరోసారి నిర్ద్వంద్వంగా స్పష్టం చేసింది.

మత ఉల్లంఘన, సుప్రీం తీర్పులు

అదే సంవత్సరం ‘ఎంఎస్ ఫరూకీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు తగినంత పరిహారం చెల్లించిన పక్షంలో మాత్రమే ప్రభుత్వం మతపరమైన ప్రార్థనా మందిరాలను స్వాధీనం చేసుకోవడం మతపరమైన భావ ప్రకటనా స్వేచ్ఛ కిందికి రాదని సుస్పష్టం చేసింది. తాజాగా 2006 లో ‘కమ్యూనలిజం కంబాట్ (మతతత్వం పై పోరాటం) వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు రాజకీయ నేతలు, మత పెద్దలు చేసే విద్వేష ప్రసంగాలు, మతహింసకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయడంతోపాటు మతహింస కు సంబంధించిన కేసులను విచారించడానికి సత్వర నిర్ణయ (ఫాస్ట్ ట్రాక్) కోర్టులను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. మూలస్వరూప వ్యవస్థను వ్యతిరేకించడం ఆ తర్వాత అంగీకరించడం జరిగింది. సిద్ధాంత మూలవ్యవస్థను సింగపూర్ హైకోర్టు, అలాగే మలేసియా ఫెడరల్ కోర్టు తిరస్కరించినా ఆ తర్వాత అంగీకరించాయి. బెలిజీలో సుప్రీంకోర్టు మొదట్లో సిద్ధాంతాన్ని అంగీకరించినా ఆ తర్వాత బెలిజీ కోర్ట్ ఆఫ్ అపీల్ తిరగరాసింది.

ఫెడరలిజం, వ్యవస్థ మూల స్వరూపం ఏమిటి?

సుప్రీంకోర్టు ప్రకటించిన ముఖ్యమైన నిర్ణయాలు రెండు ఉన్నాయి. ‘ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్‌నారాయణ్’ కేసులో, అదేవిధంగా ‘మినర్వా మిల్స్’ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి సంబంధించిన ఏదైన ఒక అంశానికి సంబంధించిన క్లెయిమ్ తన ముందుకు వచ్చిన ప్రతి కేసులో కోర్టు నిర్ణయించిన మౌలిక అంశమై ఉండాలని వివరించింది. అన్నిటికన్నా మించి రాజ్యాంగ పీఠికలో నిర్దేశించిన లక్ష్యాలు (రాష్ట్రాల సమాఖ్య) ఫెడరలిజం (ఆర్టికల్స్ 282, 293 కింద వచ్చే రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ సహా), సెక్యులరిజం అయి ఉండాలని స్పష్టం చేసింది. వాటిలో నిష్పక్షపాత ఎన్నికల సూత్రం కూడా ఉంది. కనుక రాజ్యాంగంలో ఎక్కడాకూడా అపరిమిత సవరణాధికారాలను ఇవ్వడం లేదు.

భావ ప్రకటనాస్వేచ్ఛ విమర్శించే శక్తి

అన్నిటికన్నా మించింది భావ ప్రకటనా స్వేచ్ఛ. ప్రెస్ ఫ్రీడం, లేదా విమర్శించే బలం ఉండాలి. దాంతోపాటు సెక్యులరిజం ఒక గొప్ప లక్షణం. స్వేచ్ఛలో 2022లో ఉన్న 161 స్థానం నుంచి 2023లో 159 స్థానానికి భారత్ చేరుకున్నదని ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే, మిగతా దేశాలు తమ ర్యాంకింగ్ నుంచి దిగజారడం వల్లనే ఇది సాధ్యమయింది. గతంలో స్వేచ్ఛలకు సంబంధించిన అంతర్జాతీయ ర్యాంకింగ్‌లను ప్రచారంగా ప్రభుత్వం ఒప్పుకోలేదు. గత ఏడాది కాలంలో ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ సూచీలో భారత్ 36.62 నుంచి 31.28 కి పడిపోయిందని ‘రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్’(ఆర్‌ఎస్‌ఎఫ్) నివేదికను వివరిస్తున్నారు. ఈ సంస్థ 180 ప్రదేశాల్లో జర్నలిస్టులు అనుభవిస్తున్న స్వేచ్ఛ సూచీని ప్రతి ఏటా రూపొందిస్తుంది.

‘అనధికారిక ఎమర్జెన్సీ’

2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశ మీడియా ‘అనధికారిక ఎమర్జెన్సీ’లోకి జారుకుంది. మాట్లాడే అధికారం వదులుకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. నియంతలు పరిపాలిస్తూ ఉంటారు. ‘అంతేకాదు. ఫలానా పార్టీ బీజేపీకి, మీడియాపై ఆధిపత్యం కలిగిన బడా వ్యాపారవేత్తల కుటుంబాలకు మధ్య అద్భుతమైన అనుబంధాన్ని సాధించింది’ అని ఆ సంస్థ పేర్కొంది. ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే జర్నలిస్టులు బీజేపీ మద్దతుతో సాగే ట్రోల్స్ ప్రచారం ద్వారా వేధింపులకు గురవుతున్నారని ఇండియాకు సంబంధించిన నివేదిక పేర్కొంది. ‘అవును, భారత్‌లో ఎన్నికలు అత్యంత ప్రధానమైనవి. పెద్ద ఎత్తున తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంలో అధికారులు పాలు పంచుకుంటున్నారన్న భావన ఉన్న దేశాల్లో ఇది ఒకటి అని నేను అనుకొంటున్నాను’ అని సూచీని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎఫ్ డైరెక్టర్ రెబెక్కా విన్సెంట్ వివరించారు.

మత + సమత + సమానత + మానవత్వం = లౌకికవాదన

మత, సమత, సమానత, మానవత్వం కలిస్తే లౌకికవాదన, 1950లో రాజ్యాంగం నుంచి ఈపదాన్ని తొలగించినప్పటికీ భారత రాజ్యాంగం ఈ భావనను నిలబెట్టింది. హమేఁ సంవిధాన్ కో బచ్ నా మైఁ అని నమ్మాలి. ద్వేషించినా లేదా ట్రోలింగ్ చేసినా (హేళన చేస్తూ నిందిస్తూ ఉన్నా) లౌకికవాదం అనేది శాస్త్రీయమైంది, మానవ సంబంధమైంది, సమంజసమైంది అని తెలుసుకోవాలి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అధికారికంగా చేర్చడంతో రాజ్యాంగ పీఠిక భారత్‌ను లౌకిక రాజ్యంగా ప్రకటించింది. భారతదేశంలో లౌకికతత్వం భావన ప్రభుత్వం చర్చితో ఘర్షణ పడే పాశ్చాత్యదేశాల భావనకు భిన్నమైంది. మన దేశం లో లౌకికవాదాన్ని ప్రవేశపెట్టడానికి మన రాజ్యాంగ నిర్మాతలకు కారణాలున్నాయి. అవేమిటంటే ప్రమాదకర తీవ్రవాద హిందూ జాతీయవాదం, ముస్లిం వేర్పాటువాదంతో ముడిపడిన విచ్ఛిన్న రాజకీయ ఉద్యమాల కారణంగా ఆందోళనలు తలెత్తవచ్చన్న భయం, హిందూ- ముస్లిం మతత త్వాలు వంటి వాటివి.

న్యూటన్ మూడో సిద్ధాంతం

లౌకికవాదం ప్రతి చర్యకూ దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ మూడో సిద్ధాంతంపై ఆధారపడింది. ద్వేషం, మతతత్వం వల్ల విద్వేషం మాత్రమే పుడుతుంది. అది ఉగ్రవాదానికి కూడా కారణమవుతుంది. ఉగ్ర వాదం అల్లర్లను రెచ్చగొట్టాలనుకునే మతతత్వ శక్తులకు ప్రోత్సాహకాలను అంది స్తుంది. అదే సమయంలో మతతత్వ శక్తు లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదా సమాజాన్ని విధ్వంసం చేయడాన్ని సహించాలని అర్థం కాదు. ప్రజలకు రక్షణ ఉంటే దాన్ని శాంతిభద్రతల సమస్యగా, అధికార పార్టీ రాజకీయాల జోక్యం లేకుండా పరిష్కరించాలి. రాజ్యాగం పీఠిక హృదయం అయిన బహుళత్వాన్ని అది అనుమతించదు. ప్రతి మతం కూడా మనుషుల పట్ల కరుణ, ప్రేమతో మెలగాలని, అందరినీ సోదరులుగా చూడాలని, కపటత్వం పట్ల కఠినంగా వ్యవహరించాలని బోధిస్తుంది. ఏ మతం కూడా మనుషుల మధ్య ద్వేషాన్ని బోధించదు. అదే సమగ్ర జాతీయవాద భావన.

సమగ్ర జాతీయవాద భావన

మీరు దేవుడ్ని నమ్మడం, నమ్మకపోవడం అనేది భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన మౌలిక అంశం. మత ఛాందసవాద సిద్ధాంతానికి అది ప్రత్యామ్నాయం. లౌకికవాద ఆలోచనలు మానవ నాగరికతతో సమ్మిళితమైనవి. ఒక మతానికి చెందిన సభ్యులు వేరే మతానికి చెంది న వారిని పీడించవచ్చు లేదా వివక్ష చూపవచ్చు. ప్రభుత్వం ఒక మతానికి అధికారిక గుర్తింపు ఇచ్చినప్పుడు ఇటువంటి వివక్షాపూరిత చర్యలు సులభంగా చోటు చేసుకుం టాయి. మతానికి సంబంధించిన అన్ని రకాల ఆధిపత్యాలకు ముగింపు పలకాలి. లౌకికవాదం సారాంశం ఇదే. అన్నిటికన్నా ముఖ్యంగా అది వ్యక్తులు తమ మతం నుంచి వైదొలగి వేరే మతాన్ని స్వీకరించే స్వేచ్ఛను ఇస్తుంది.

మత బోధనలకు భిన్నంగా భాష్యం చెప్పే స్వేచ్ఛను ఇస్తుంది. వారసత్వ హక్కులను చట్టాలు గౌరవించేలా ప్రభుత్వం చూడాలి. వివిధ కులాలకు సంబంధించిన వివాహ చట్టాల్లో ప్రభు త్వం జోక్యం చేసుకోవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా హక్కునకు అసలైన అర్థం ఇదే. రాజ్యాంగానికి ప్రాణం కూడా అక్కడే ఉంటుంది.


Read More
Next Story