ఆంధ్రుల రాజధాని అగచాట్లు ఏజాతికీ ఎదురై ఉండవు...
x
అక్టోబర్ 22, 2015న ప్రధాని నరేంద్రమోదీ అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది రాయి వేశారు

ఆంధ్రుల రాజధాని అగచాట్లు ఏజాతికీ ఎదురై ఉండవు...

2023 గడిచింది. ఆంధ్రుల రాజధాని అమరావతేనా. మరి విశాఖ ఏమిటి? అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. 2024 ఎన్నికల్లో అటో ఇటో తేలిపోతుందేమో


బి. గోపాలకృష్ణమ్మ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని కోసం విశాఖకు దగ్గిరయ్యేకొద్దీ విశాఖ దూరంగా జరగుతూ ఉంది. అలా దూరం జరిగి జరిగి 2023లో ఆయనకు విశాఖ అందకుండా పోయింది. చివరకు పరిస్థితి అమరాతిని ఆయన వదలించుకోలేకపోయారు, విశాఖను దక్కించుకోలేకపోయారు అన్నట్లు మారింది. మొత్తానికి ఆంధ్రుల రాజధాని ఒక పెద్ద పజిల్ లాగా తయారయింది. ఆంధ్రుల రాజధాని అగచాట్లు ప్రపంచంలో ఏజాతికి ఎదురై ఉండి ఉండవేమో. 2023 ముగిసే రోజున ఆంధ్రుల రాజధాని ముళ్లబాటను వెనక్కు తిరిగే చూసుకోవడం అవసరం.

అంతా అమరావతే రాజధాని అన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని పునర్ వ్యవస్థీకరించాక విభజిత ఎపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిమాసాలలోనే చంద్రబాబునాయుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు అకస్మాత్తుగా వీడ్కోలు చెప్పి విజయవాడకు మకాం మార్చారు. రాజధాని నగరంగా అమరావతిని ప్రకటించారు. సింగపూర్, లండన్, దాదాపు 15 ప్రపంచ నగరాలలో చంద్రబాబునాయుడు, ఆయన బృందం పర్యటించి హడావుడి చేశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అమరావతిని విశాలమైన ప్రాంతంలో పెద్దగా నిర్మించాలని శాసనసభ సాక్షిగా అన్నారు. అమరావతి పరిధిలోనే తన నివాసం కూడా నిర్మించుకున్నారు.

తప్పుల మీద తప్పులు, బలైన రాజధాని

ఆంధ్రప్రదేశ్‌ని అయిదేళ్ళు పరిపాలించిన చంద్రబాబునాయుడు తాత్కాలిక కట్టడాలూ, శాశ్వత కట్టడాలూ అని పని విభజన చేయకుండా శాశ్వత ప్రాతిపదికపైనే రాజధానికి అవసరమైన ప్రాథమిక హంగులు సమకూర్చి ఉన్నట్లయితే జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం కష్టమయ్యేది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వచ్చి అమరావతికి వివిధ నదుల నుంచి సేకరించిన జలాలూ, పలు పవిత్రస్థలాల నుంచి సేకరించిన మట్టితో శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టి ఉంటే శాశ్వత సదుపాయాల కల్పనకు సమయం సరిపోయేది. అప్పుడు చంద్రబాబు తాత్సారం చేయడం, దేశాలు పట్టుకొని తిరగడంతో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక చట్టసభ అవసరం ఏర్పడింది.

అధికార మార్పిడి.. అమరావతి ఔట్

2019 ఎన్నికల్లో. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ ఆర్ సీపీకి కనీవినీ ఎరుగని మెజారిటీ వచ్చింది. తెలుగు దేశం పార్టీకి అనూహ్యంగా ఘోరపరాజయం ఎదురైంది. ఓట్ల శాతంలో వ్యత్యాసం అంతగా లేకపోయినా సీట్ల సంఖ్యలో తేడా కొట్టవచ్చినట్టు కనిపించింది.వైసీపీకి వచ్చిన 151 స్థానాలు ఎక్కడ, టీడీపీకి దక్కిన 23 స్థానాలు ఎక్కడ? అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకు జగన్ మోహన్ రెడ్డి అడ్డం తిరిగారు. అమరావతి ఒక్కటే రాజధాని కాదు. మొత్తం మూడు రాజధానులు ఉంటాయి. వాటిలో ఒకటిగా, శాసనరాజధానిగా (లేజిస్లేటివ్) అమరావతి ఉంటుంది, కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటీవ్) రాజధానిగా విశాఖపట్టణం ఉంటుంది. న్యాయరాజధానిగా (జుడీషియల్) కర్నూలు ఉంటుందని కొత్త పాట అందుకున్నారు. దీనిని వికేంద్రీకరణగా అభివర్ణించారు

కోర్టు కేసుల పాలైన రాజధాని

న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు అమరావతికి అనుకూలంగా ఇచ్చినప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం ఉండాలని జగన్ మోహన్ రెడ్డి విధానాన్నిబలపరిచేవారు వాదిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబునాయుడు చేసిన పొరపాటే జగన్ కూడా చేస్తున్నారు. కోర్టుల జోక్యం కారణంగా విశాఖపట్టణానికి ఇంతవరకూ తరలి వెళ్ళలేదు. ఇదిగో విశాఖ రాజధాని, అదిగో రుషికొండలో సీఎం కార్యాలయం అంటూ ప్రస్తుత ప్రభుత్వం ఊదర గొట్టిన ప్రతిసారీ రాజధాని అంశంపై గతంలోనే నమోదైన కేసులతోపాటు తాజా హైకోర్టు తీర్పు వరకు విశాఖ రాజధానికి న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘనంగా చెప్పుకుంటున్నట్లు వైకాపాకే 175 సీట్లు వచ్చినా, లేదా అంచనాలు తారుమారై చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వచ్చినా రాజధాని ఎక్కడ అనే అంశంపై వివాదం రేగుతూనే ఉంటుంది. చంద్రబాబునాయుడు మళ్ళీ అదికారంలోకి వస్తే అప్పుడు విశాఖ నుంచి తిరిగి చలో అమరావతి అనడం ఖాయం. అప్పుడు విశాఖపట్టణం చరిత్రలో మరో దౌలతాబాద్ అవుతుంది. ఈ క్రమంలో పదేళ్ళ విలువైన సమయం వృథా అవుతుంది.

ఆందని ద్రాక్ష పండు విశాఖ

అక్టోబర్ 24న వచ్చే విజయ దశమి రోజున రాష్ట్ర పరిపాలన విశాఖపట్నంకు మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ సహచరులకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21న తెలియచెప్పారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. త్వరలో విశాఖపట్నం రాష్ట్రానికి రాజధానిగా మారుతుందని సీఎం ప్రకటించారు. అంతకుముందు 2023 మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ డిప్లమాటిక్ అలయన్స్ మీట్‌లో పెట్టుబడిదారులను ఉద్దేశించి సీఎం హామీ కూడా ఇచ్చేశారు. రాబోయే నెలల్లో తానే అక్కడికి మారుతున్నాను కాబట్టి రానున్న రోజుల్లో మన రాజధానిగా మారనున్న విశాఖపట్నంకు మిమ్మల్ని ఆహ్వానించేందుకు వచ్చాను అని భరోసా కూడా ఇచ్చేశారు. విశాఖపట్నంలోని రుషికొండలో భవనాలు ముస్తాబయ్యాయి. ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయి, ఇంటీరియర్స్ మరియు ఫర్నిచర్‌పై అధికారులు పని చేస్తున్నారు. ఈలోగా యధావిధిగానే హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి బ్రేకులు వేసింది. కేసు నడుస్తుండగా విశాఖకు కార్యాలయాల మార్పు కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

జగనొకటి తలిస్తే కోర్టు మరొకటి తలిచే

ఏపీఆర్ఏ-2014 ప్రకారం అమరావతిని తీసుకున్నందున రాజధాని నగరాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇంత వరకు రాజధానిగురించి తీసుకున్న నిర్ణయాలన్నీ కోర్టులో చతికిలపడ్డాయి. రాజధానికి సంబంధించి ఏ నిర్ణయమైనా రాష్ట్ర శాసనసభ ద్వారా కాకుండా పార్లమెంట్‌లో తీసుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. జగన్‌కు కూడా వాస్తవాలు తెలుసని, అమరావతిని నాశనం చేయాలనే పగతో వ్యవహరించారని అన్నారు.

రైతుల పోరాటం కేసులుగా మారి...!

అమరావతి కోసం భూములిచ్చిన వేలాది మంది రైతులు రాష్ట్ర రాజధాని మీద తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉలంఘిస్తున్నదని కోర్టును ఆశ్రయించారు. సీఎం రాజధాని పాలసీని ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. లాంగ్ మార్చ్ లు చేశారు. అన్ని పార్టీల మద్దతు సంపాదించారు. సిఎం తీసుకువచ్చిన మూడు రాజధానుల వికేంద్రీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు, విచారణ పూర్తయ్యే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టుని ఉత్తర్వు సాధించారు. అమరావతిని రాజధాని కోసం ఏపీసీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా రాజధాని నగరంగా అభివృద్ధిని ప్రభుత్వానికి వదిలివేయలేమని 2022 మార్చి 5న హైకోర్టు తీర్పు చెప్పింది. పైగా ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఆరు నెలల్లో నగరాన్ని అభివృద్ధి చేయాలన్నఆదేశం మీద స్టే తెచ్చుకుంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. 2023 సంవత్సరం ముగిసిపోతున్నప్పటికీ రాజధాని అంశం కోర్టు కేసుల నుంచి బయటపడలేదు.

ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రికి ఇష్టం ఉన్న లేకున్నా అమరావతే రాష్ట్ర రాజధాని.

సుప్రీంకోర్టులో కేసు పెండింగులో లేకపోతే, విశాఖ రాజధానిగా జగన్ తన ప్లాన్‌ని అమలు చేసి ఉండేవారు.

మొత్తం మీద చూస్తే... రాజధాని నగరంగా అమరావతి పోలేదు.. విశాఖ రాలేదు అన్నది వాస్తవం.

2024లో ఈ సమస్య ఆంధ్రుల రాజధాని సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందేమోచూద్దాం.

Read More
Next Story