‘కుల గణన’ బీసీ జాతి సమిష్టి పోరాట ఫలితమే...
x

‘కుల గణన’ బీసీ జాతి సమిష్టి పోరాట ఫలితమే...

‘ఏ ఒక పార్టీ, ఒకరిద్దరి కృషి కాదు. దాని వెనక దశాబ్దాల బిసిల పోరాటం ఉంది’


కె. కొండలరావు


నిన్నటి కేంద్ర ప్రభుత్వ "కుల గణనకు" అనుకూల ప్రకటన, అనేక దశాబ్దాల, బీసీ జాతి సమిష్టి పోరా ఫలితమే, ఒకరిద్దరి కృషి కాదు.


1. కుల గణన పోరాటం నిన్న మొన్నటి పోరాటం మాత్రమే కాదు. ఈ పోరాట చరిత్రను కుదించకండి. ఈ పోరాటం అనేక దశాబ్దాలుగా నడిచింది. 1960 దశకం నుండే ఈ పోరాటం మొదలైంది. నేటికీ కొనసాగుతూ వచ్చింది. దీన్ని అనేక, రాష్ట్ర, కేంద్ర బీసీ కమిషన్ లు గుర్తిస్తూ, ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తూ వచ్చాయి.

2. దేశ వ్యాప్తంగా అనేక కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు, మేధావులు, పరిశోధకులు, ఆలోచనా పరులు, ఉద్యమకారులు, క్లుప్తంగా చెప్పాలంటే, బీసీ జాతి మొత్తం సమగ్ర కుల గణన జరపాలనే పోరాటం లో భాగస్వాములు గా ఉన్నారు. ఈ కుల గణన ఉద్యమం గురించి, సమగ్ర అవగాహన అంచనాతో మాట్లాడ వలసి ఉంటుంది. ఈ ప్రయత్నం నిన్న మొన్నటి బీసీ ఇంటలెక్యువల్స్ ఫోరం తోనే ప్రారంభం కాలేదు, అనే వాస్తవాన్ని మనమందరం గుర్తు ఉంచుకొందాము.

3. కుల గణన కావాలని దశాబ్దాలుగా, దేశ వ్యాప్తంగా ఎంత బలమైన పోరాటం జరిగిందో, కుల గణనను వ్యతిరేకిస్తూ, ఆధిపత్య శక్తులూ, కుల వ్యవస్థ లబ్దిదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఈ వాస్తవం చరిత్ర లో నమోదు అయి ఉంది. 2010 వరకు ఎంతో బలంగా నడిచిన, బీసీ ఉద్యమం కారణంగానే నాటి, UPA - 2 ప్రభుత్వం, ఆనాడు కుల గణనకు అనుకూలంగా, పార్లమెంటులో ప్రకటన చేయడం, దాన్ని దరిమిలా నీరు గార్చడం కూడా జరిగింది.

4. మొదటి నుండి, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఏనాడూ కుల గణనకు అనుకూలంగా వ్యవహరించ లేదు. అయితే మోడీ ప్రభుత్వం, కుల గణన కు, వ్యతిరేకంగా ఒక విధాన వైఖరిని తీసుకొని, ఆమేరకు సుప్రీంకోర్టులో, సెప్టెంబరు 2021 లో, అఫిడవిట్ దాఖలు చేసిన దరిమిలా, రాహుల్ గాంధీ, దానికి దీటుగా, దేశ స్థితి గతుల అసలు రూపానికి ఒక "కుల గణన ఎక్సరే" అవసరం అనే "భావనను" చాలా బలంగా దేశ వ్యాప్తంగా, దఫాలుగా పంపిన తరువాత, బీసీల మధ్య ఒక పెను ఉప్పెనలా "ఊపు‌" అందుకుంది. జన బాహుళ్యం మధ్య అనేక నెలల నుండి ఈ భావన నలుగుతూ వచ్చింది. గణనీయ సంఖ్యలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ వచ్చిన బీసీ ఓటర్లు, కాంగ్రెస్ వైపు తిరిగి, ఎలక్షన్ ఫలితాలను 2024లో, కొంత వరకు తారుమారు చేయడం జరిగింది. ఆ వివరాలు ప్రస్తుతం అవసరం లేదు.

5. దీంతో, మొదటి నుండి కుల గణన కు నిత్యం వ్యతిరేకతతో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ, తన రాజకీయ భవిష్యత్ కోసం, కళ్ళు తెరవ వలసి వచ్చింది. వాస్తవాన్ని గుర్తించ వలసి వచ్చింది. నిన్న బీజేపీ ప్రభుత్వం, రాబోయే దశాబ్ది గణాంకాల సేకరణ సందర్భంగా, కుల గణన జరిపిస్తామని ప్రకటించ వలసిన పరిస్థితి ఏర్పడింది.

6. అయితే అసలు పండుగ ముందు ఉంది. కుల గణన సజావుగా, సంపూర్ణంగా జరిగే విధంగా, దేశ వ్యాప్తంగా బీసీ శక్తులు అప్రమత్తంగా వ్యవహరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏడున్నర దశాబ్దాలుగా నెలకొన్న, అసమానతలను సరిచేయడానికి అవసరమైన విధంగా, Census format లో మార్పు జరగాలి. Caste Census ను మరోసారి నీరు గార్చకుండా, బీసీ సమాజం, ఎంతైనా అప్రమత్తంగా ఉండడం అవసరం.

7. ఏ నాయకుడు కాని, సంఘం కాని ఇది నావల్ల, మావల్ల మాత్రమే జరిగింది అనే ధోరణిలో ప్రకటనలు చేయడం బీసీ వర్గాలకు మంచిది కాదు. ఎవరెవరు, ఎప్పుడు ఎటువంటి కృషి చేసారో మనకు గుర్తు ఉన్నా, లేకున్నా, చరిత్ర లో నమోదు అయి ఉంది. బీజేపీ లో నేటి మార్పు కు, ఏడున్నర దశాబ్దాల "బీసీ సమాజం సమిష్టి కృషే" కారణం అని అందరూ గుర్తు ఉంచు కొందాము. ఆవిధంగా వ్యవహరిద్దాము. నేటి పరిస్థితిని కాపాడు కొందాము.

(కె. కొండలరావు. తెలంగాణ బి సి ఉద్యమకారుడు)


Read More
Next Story