తెలంగాణకు వచ్చి పేరు మార్చి కొత్త హోదా కోరుతున్న కులాలు
x

తెలంగాణకు వచ్చి పేరు మార్చి కొత్త హోదా కోరుతున్న కులాలు

నార్త్ ఇండియా యాదవుల సంగతేమిటి? ఉత్తరాంధ్ర వెలమల హోదా ఏమిటి? విశ్వబ్రాహ్మణుల కులం పేరు మారుతుందా? తెలంగాణ కులగణన ఈ కులాల ముడి ఎలా విప్పుతుంది?


నాంచారయ్య మెరుగుమాల

ఉత్తరాదిన బిహార్‌ తర్వాత సమగ్ర కులగణన కార్యక్రమం ఈ నెల ఆరున తెలంగాణలో మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా మొదట రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిబ్బంది ప్రస్తుతానికి ఇంటింటికి వచ్చి కుటుంబ పెద్ద పేరు, ఇంటి నంబరు తీసుకుని ఆ వివరాలతో ఆయా గృహాల గోడలపై స్టిక్కర్లు అంటించి వెళుతున్నారు. కులం, ఇతర ఆర్థిక, సామాజిక ప్రగతి వివరాలను మూడు నాలుగు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి తీసుకుంటారని చెబుతున్నారు. కులగణన అవసరమేగాని ఇది ఎంతో శ్రద్ధతో, మందస్తు కసరత్తు, ఒక మోస్తరు పరిశోధనతో చేయాల్సిన ఎంతో విలువైన ప్రక్రియ. అత్యంత కీలకమైన ప్రజల కులం పేర్లు, ఇతర విషయాల నమోదు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జరగాలనేది అందరూ నొక్కిచెప్పే విషయం. 2004–2014 మధ్య కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వంలో అధికారంలో ఉన్న ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వం 2011 జనగణను కులం ప్రస్తావన లేకుండా చేయాలని నిర్ణయించి దాదాపు ఆ ప్రక్రియ పూర్తిచేసింది. అయితే, ఇప్పుడు జనతా పరివార్‌ పార్టీలు లేదా పూర్వపు లోహియా సోషలిస్టుల నాయకత్వంలో నడిచే సామాజిక న్యాయ పార్టీలు (బీఎస్పీ, ఇంకా యూపీలోని ఎస్పీ, బిహార్‌లోని ఆర్జేడీ, జేడీయూ, లోక్‌జన్‌ శక్తి) గట్టిగా ఒత్తిడి చేయడంతో బాగా ఆలస్యంగా కులగణన చేయడానికి డా.మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఎట్టకేలకు అయిష్టంగానే అంగీకరించింది. అసలు జనాభా లెక్కల సేకరణతోపాటే జరగాల్సిన కులగణన తర్వాత తూతూ మంత్రంగా జరిపించింది. దేశంలో అక్కడక్కడా ప్రభుత్వ శిబిరాలు ఏర్పాటు చేసి, జనమే అక్కడికి వచ్చి తమ కులం, ఇతర వివరాలు చెప్పాలని ప్రకటనలు జారీ చేసింది. వీధి చివరి కేంపుల రూపంలో కంటితుడుపుగా జరిగిన ఈ తంతుకు కాంగ్రెస్‌ పెత్తనం కింద నడిచిన కేంద్ర సర్కారు ‘సోషియో ఇకనామిక్‌ అండ్‌ కాస్ట్‌ సెన్సస్‌’ (ఎస్‌ఈసీఎస్‌–సామాజిక, ఆర్థిక కులగణన) అనే పేరు పెట్టింది. హడావుడిగా కొద్ది వారాల్లో పూర్తిచేసిన ఈ ప్రక్రియ ఫలితాలను యూపీఏ సర్కారు తాను అధికారంలో ఉండగా సెన్సస్‌ వివరాలతోపాటు ప్రకటించలేదు. ఎస్‌పీ వంటి తన కొత్త మిత్రపక్షాలు, ఆర్జేడీ వంటి కొత్త మిత్రుల డిమాండ్‌గా కొనసాగిన కులగణను ఇప్పుడు తన ఒరిజినల్‌ ఐడియా అనే తీరులో చెప్పుకుంటూ వస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ కూడా ఏదో తప్పదన్నట్టు తమ సర్కారు చేయించిన 2011 నాటి సామాజిక, ఆర్థిక కుల సర్వే వివరాలు బయటపెట్టాలని గతంలో డిమాండ్‌ చేయడం కూడా ఒక తంతుగా మారింది. అలాగే, ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇదివరకు అధికారంలో ఉండగా నిర్వహించిన కర్ణాటక కులగణ నివేదికను ఎందుకనో ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. మొదటి ఆలిండియా సర్వే, తర్వాతి కర్ణాటక సర్వేలు పకడ్బందీగా, సంపూర్ణంగా, లోపరహితంగా జరగకపోవడం వల్లే ఆ సర్వేల నివేదికలు ప్రజల ముందుకు రావడం లే దనే భావన అంతటా వ్యాపించింది. 2023లో మహాగఠబంధన్‌ సర్కారుగా ఉండగా ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం బిహార్‌లో కట్టుదిట్టంగా, అంకితభావంతో జరిపించిన కులగణన లేదా సామాజిక ఆర్థిక సర్వే వివరాలను వెంటనే విడుల చేసింది. ఏఏ కులాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో ఎంత ప్రగతి సాధించాయి? ఏఏ కులాలకు ఎనెన్ని ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి? సాగు భూమి ఎంతెంత జనాభా ఉన్న కులాల చేతుల్లో ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ ఉంది? వంటి వివరాలు బిహార్‌ కులగణనలో బయటికొచ్చాయి. ఇప్పుడు రాహుల్‌ ఆదేశానుసారం తెలంగాణలో మొదలైన కులగణన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమత్రి మల్లు భట్టి విక్రమార్క ఇటీవల చెప్పిన విధంగా దేశంలోనే మోడల్‌గా నిలవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు. వివక్ష రూపుమాపడానికి, ప్రజల అభివృద్దికి కులగణన ఉకరణంగా నిలుస్తుందన్న రాహుల్‌ ఆకాంక్ష నిజమైతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అయితే, కాస్త హడావుడిగా ప్రారంభించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వేలో విడివిడిగా కొన్ని కులాల పేర్లు, వాటి జనాభా లెక్కలు దీయడంలో కొన్ని ఇబ్బందలు, చిక్కులు ఎదరయ్యే అవకాశాలు లేకపోలేదు. వాటిని అధిగమించి ప్రభుత్వ సిబ్బంది ఇక్కడ కులగణన ప్రక్రియ చక్కగా పూర్తి చేస్తే బిహార్‌ కులగణన మాదిరిగా తెలంగాణ సర్వేకు కూడా దేశంలో మంచి విలువ, గుర్తింపు లభిస్తుంది.

పేరులో సవరణ కోరుకుంటున్న కులాలు

ఉపవృత్తులతో ప్రధానంగా ఐదారు వర్గాలుగా ఉన్న విశ్వబ్రాహ్మణులు తెలంగాణ కులగణన సందర్భంగా తమ కులం పేరును విశ్వకర్మగా నమోదు చేయించుకోవాలనే నిర్ణయంతో ముందుకొచ్చారు. ఉత్తరాదిలో, తమిళనాడులో సైతం హస్తకళలపై ఆధారపడిన ఈ కులాలవారు విశ్వకర్మలుగానే చెలామణిలో ఉన్నారు. అందుకే సామాజిక, ఆర్థిక సర్వేలో ఈ సామాజికవర్గానికి చెందినవారు కులం పేరును గతంలో మాదిరిగా గాక ఈసారి ‘విశ్వకర్మ’గా రిజిస్టర్‌ చేయించుకోవాలని, ఉపకులం దగ్గర ఎవరికి వారు వడ్ల లేదా వడ్రంగి, కంచర, శిల్పకారులు, స్వర్ణకారులని నమోదు చేయించుకోవాలని రాష్ట్ర విశ్వకర్మ మనుమయ సంఘం ఇటీవల తమ సంఘీయులను ఒక ప్రకటన ద్వారా కోరింది. దేశంలోని 27 రాష్ట్రాల్లో తమ కులస్తులు విశ్వకర్మలనే పేరుతోనే ఉన్నారని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విశ్వబ్రాహ్మణ పేరు వాడతున్నారని ఇక నుంచి విశ్వకర్మలుగానే ఐదారు వృత్తులవారు ప్రాచుర్యంలో ఉండాలని ఈ సంఘం గౌరవాధ్యక్షుడు కుందారం గణేశ్‌చారి వారం క్రితం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. అయితే, కులగణన ప్రారంభానికి వారం ముందు ఇచ్చిన ఈ పిలుపు ఎంత మందికి చేరుతుందనేది అంచనావేయడం కష్టం. అయినా, ఇలాంటి విషయాల్లో కులగణన చేసే సిబ్బంది వివేకం, సమయస్ఫూర్తితో వ్యవహరించి మొత్తం కులం వివరాలు మదింపు చేసేటప్పుడు పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రస్తావించిన విశ్వకర్మలు వెనుకబడిన వర్గాల (ఓబీసీ) కిందికి వస్తారు. ప్రతి పదేళ్లకు జరిగే దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణలో మతాలవారీ వివరాలు, అలాగే అనుసూచిత కులాలు (ఎస్సీలు), అనుసూచిత జాతుల (ఎస్టీలు లేదా ఆదివాసీలు) సంఖ్యా వివరాలను ఎప్పటి నుంచో సేకరిస్తున్నారు. ఇప్పుడు బీసీలు, అగ్రవర్ణాలు, అగ్ర కులాలకు సంబంధించిన ప్రజల కులం నమోదు విషయంలో మాత్రమే ప్రధానంగా చిక్కులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఓబీసీ కులాలు తమ ఆత్మగౌరవం కోసం తమను తరాతరాలుగా కించపరిచేవిగా ఉన్నాయని భావిస్తున్న కొన్ని పేర్లను వద్దనుకుంటున్నాయి. వాటి స్థానంలో కొత్తవి రాయాలని వారు వాంఛిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ లిస్టులో కొత్త పేర్లను కొన్నింటిని జతచేశారు. కాని ప్రస్తుతం చేస్తున్న కులగణనలో ఈ పేర్ల విషయంలో గందరగోళానికి గురికాకుండా చూసుకోవడం అవసరం. పెరికను పురగిరి క్షత్రియలని కూడా నమోదు చేసే విధంగా జాబితాల్లో మార్పులు చేశారు.

తెలగ కాపు–మున్నూరు కాపు వివాదం

తెలంగాణ, పూర్వపు ఆంధ్ర రాష్ట్రాల విలీనంతో 1956 నవంబర్‌ 1 నుంచి కులం విషయంలో ఉత్పన్నమైన సమస్యల్లో ఒకటి తెలగ కాపు, మున్నూరు కాపు వివాదం. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ముఖ్యంగా రాజధాని నగరం, ఉత్తర ప్రాంతంలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు అనే బీసీ కులం ఆంధ్రా సరిహద్దు జిల్లా అయిన పూర్వపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర అవతరణ నాటికి అతి స్వల్ప సంఖ్యలో ఉన్నారని, తర్వాత ఇతర కులాల జాబితాలో (ఓసీ) ఉన్న అక్కడి తెలగ కాపులే నెమ్మది నెమ్మదిగా మున్నూరు కాపులమని ప్రకటించుకుని, కులధ్రువీకరణ పత్రాలు తీసుకోవడంతో వారి జనాభా జిల్లాలో గణనీయంగా పెరిగిందనే వివాదం ఎప్పటి నుంచో ఉంది. ఖమ్మం జిల్లాలో చెప్పుకోదగిన రీతిలో వందలాది ఎకరాల సాగుభూములు ఉన్న లక్కినేని వంటి తెలగ కాపు కుటుంబాలు వేల సంఖ్యలో ఈ నాలుగు దశాబ్దాల్లో మున్నూరు కాపులుగా మారారనే అభ్యంతరాలు అక్కడ వ్యక్తమౌతున్నాయి. పొరుగున ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా తెలగ కాపులు కాలక్రమంలో మున్నూరు కాపు సర్టిఫికెట్లు సంపాదించి ఓబీసీ జాబితాలో స్థానం సంపాదించుకుంటున్నారని ఇప్పుడు కులగణన నేపథ్యంలో అనేక చోట్ల వివాదాలు లేవనెత్తుతున్నారు. మున్నూరు కాపు కులానికి సంబంధించి మరో పెద్ద సమస్య ఉంది. కోస్తాంధ్ర జిల్లాలు. రాయలసీమకు చెందిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అనేక మంది జనం తెలంగాణలో స్థిరపడిన తర్వాత నెమ్మదిగా తాము మున్నూరు కాపులమని ప్రకటించుకుని కుల ధ్రువీకరణపత్రాలు సంపాదించి, ఓబీసీలకు లభించే ప్రయోజనాలు పొందుతున్నారనేది ఎన్నో దశాబ్దాలుగా వస్తున్న ఫిర్యాదు. మరి, నిరంతరం ఉపాధి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు వలసపోయి, స్థిరపడే పరిస్థితులున్న నేపథ్యంలో ఎవరు ఏ కులం? వలసొచ్చిన వారు చెబుతున్న విషయం వాస్తవమేనా? అని ప్రభుత్వ సిబ్బంది జాగ్రత్తగా ఆలోచించి కులగణనలో న్యాయబద్ధంగా ప్రజల కులాల పేర్లు నమోదు చేయకపోతే చిక్కులు తలెత్తే అవకాశం లేకపోలేదు. వలస వచ్చి స్థిరపడినవారి తెలివితేటల వల్ల స్థానికులకు కులపరంగా అంటే రిజర్వేషన్‌ సదుపాయాల పరంగా అన్యాయం జరిగిందనే భావన కలగకుండా చూసుకోవడం తెలంగాణ సర్కారు బాధ్యత. ఆంధ్రా కాపులు, రాయలసీమ బలిజలు వలస వచ్చి స్థిరపడిన తర్వాత వారిలో కొందరు మున్నూరు కాపులుగా నమోదయి సర్టిఫికెట్లు పొందుతున్నారనే వివాదం లేదా ప్రచారం రాజధాని హైదరాబాద్‌ సహా అనేక ఇతర జిల్లాల్లో ఉంది. మరి, ఇలాంటి వివాదాలు ముదరకుండా కులగణన పకడ్బందీగా నిర్వహిస్తే మంచిది. 2014 జూన్‌ 2న తెలంగాణ అవతరించాక కొన్ని కులాలకు సంబంధించి నాటి కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత వివాదాస్పదమైంది. హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొప్పు వెలమ, పొలినాటి వెలమ వంటి కొన్ని కులాలను, ఉభయ గోదావరి జిల్లాల్లో గణనీయ సంఖ్యలో నివసించే శెట్టి బలిజలను తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన రెండు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఇతర ఎన్నికల ముందు ఈ కులాల వారికి తిరిగి ఓబీసీ హోదా కల్పించే విషయం సానుకూలంగా పరిశీలిస్తామని నాటి పాలకపక్షం హామీ ఇచ్చింది. కాని, ఆ దిశగా ఏమీ జరగలేదు. హైదరాబాద్‌ నగరంలో తరతరాలుగా స్థిరపడిన ఉత్తరాది రాష్ట్రాల యాదవులను (మరో పేరు అహీర్లు) కూడా నాటి టీఆర్‌ఎస్‌ సర్కారు బీసీ జాబితా నుంచి తొలగించింది. దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీలో వారికి ఉన్న ఓబీసీ హోదాను రద్దుచేసింది. వారు కూడా గత ఏడెనిమిదేళ్లుగా ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ నుంచి బీఆర్‌ఎస్‌ నేత కేటీ రామారావు వరకూ కలుసుకుంటూ తమను మళ్లీ బీసీలుగా గుర్తించాలని కోరడం ఏటా జరిగేదే. గడచిన పది సంవత్సరాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన అనేక డయిరీ ఫారాల్లో ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన యాదవులు పనిచేస్తున్నారు. ఇలా బిహారీలు తమిళనాడు వరకూ వెళ్లి స్థిరపడి వివిధ రంగాల్లో శారీరక శ్రమతో జీవిస్తున్నారు. మరి ఇప్పుడు జరిగే తెలంగాణ కులగణనలోగాని, వచ్చే ఏడాది మొదలయ్యే జతీయ జనాభా లెక్కల సేకరణలోగాని ఇలాంటి హిందీ రాష్ట్రాల యాదవులు వంటి ఓబీసీలను ఏ జాబితా కింద నమోదు చేయాలనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. హైదరాబాద్‌కు 150 ఏళ్ల నుంచీ వచ్చి స్థిరపడిన గుజరాతీ, రాజస్థానీ ప్రజలు, పొరుగున ఉన్న మహారాష్ట్రియన్లు ఇప్పుడు తెలంగాణలో స్థానికతకు అర్హత సంపాదించినట్టే పది పదిహేనేళ్ల కిత్రం నుంచి వస్తున్న హిందీ రాష్ట్రాల యాదవులు వంటి బీసీలను రేపటి ఎన్యూమరేషన్‌లో ఎలా నమోదు చేయాలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పుడే ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే మేలు. చివరిగా చిన్నదిగా కనిపించే ఓ పెద్ద సమస్య కొన్ని ఎస్సీ కులాల నమోదు విషయంలో ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రైస్తవులుగా మారిన తెలుగు ప్రాంతాల ఎస్సీ కులాల జనాభా గణనీయంగా ఉంది. (కాని, మతం మరే ఆదివాసీల కోటా సౌకర్యాలకు రక్షణ ఉంది) అయితే, ఇలా మతం మారినట్టు వారు స్వయంగా ప్రకటిస్తే వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బీసీ–సీ జాబితాలో చేర్చుతారు. ఎస్సీ రిజర్వేషన్‌ సౌకర్యం పోకుండా ఈ దళితులు కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకునేటప్పుడు, జనగణన సమయంలో తమను తాము హిందువులుగానే ప్రకటించుకుంటున్నారు. మతం మారినట్టు ఎంత ప్రశ్నించినా వారు అంగీకరించరు. పేర్లు కైస్తవ మతానికి చెందినవి ఉంటాయి, మతం హిందూ అని రాసి ఉంటుంది. ఇలాంటి జనం ఎమ్మెల్యేలు, ఎంపీలైన సందర్భాలు తెలుగునాట కోకొల్లలు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. మతం మారిన ఎస్సీలకు కూడా ఎస్టీల మాదిరిగా పూర్వపు ఎస్సీ హోదా కొనసాగించేలా చట్ట సవరణ తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గంగా పలువురు సూచిస్తున్నారు. పై అంశాల నేపథ్యంలో తెలంగాణలో ‘‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’’ పేరుతో వేలాది మంది సిబ్బందితో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చేయిస్తున్న కీలక గణాంకాల సేకరణ అత్యంత పకడ్బందీగా నిర్వహించడం ఎంతైనా వాంఛనీయం.

Read More
Next Story