పౌరసమాజాన్ని కలవడం మానేసిన ముఖ్యమంత్రి రేవంత్
x
రాష్ట్రగీతం కోసం 2024 మే నెలలో మేధావులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్

పౌరసమాజాన్ని కలవడం మానేసిన ముఖ్యమంత్రి రేవంత్

'పౌర సమాజ ప్రతినిధులను ఎప్పుడైనా కలుస్తున్నా, వారి సూచనలకు విలువ ఇచ్చినట్లు కనపడడం లేదు.'



తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా ఉన్న రేవంత్ గారికి దేశానికీ, రాష్ట్రానికీ అవసరమైన కొన్ని విషయాలు గుర్తుచేయడానికి, ఈ వ్యాసం రాస్తున్నాను. సమయం ఇంకా మించిపోలేదు, మీ పాలనను వేగంగా సవరించుకోవలసిన సమయం వచ్చిందనీ, లేకపోతే, ఫాసిస్టు, నిరంకుశ శక్తుల చేతుల్లోకి రాష్ట్రం మరోసారి జారిపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరించడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
దశాబ్ధాలుగా పీడిత ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, సహజ వనరుల రక్షణ కోసం, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో , వివక్షకు గురైన తెలంగాణ భౌగోళిక ప్రాంత ప్రత్యేక అస్తిత్వం కోసం , ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూ వచ్చిన పౌర సమాజం, ప్రజా సంఘాల నాయకత్వం 2014 లో రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏదో ఒక మేరకు నెరవేరతాయని ఆశించింది.
కానీ పదేళ్ళ BRS పాలన ఆ ఆశలను, ఆశయాలను వమ్ము చేసింది. ఆ పాలన ప్రజల పౌర హక్కులపై దాడి చేసింది. రైతుల నుండీ భూమిని లాక్కుని కార్పొరేట్లకు , కంపనీలకు కట్టబెట్టింది. సౌగునీటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుండీ డబ్బులను దండుకున్నది. తప్పుడు మార్గదర్శకాలతో రూపొందించిన పథకాల పేరుతో వేల కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడింది. రాష్ట్రాల హక్కుల కోసం, అదనపు నిధుల కోసం కేంద్రంపై పోరాడడానికి బదులు, అనేక విషయాలలో కేంద్రంతో చేతులు కలిపి ప్రజల పైనే యుద్ధం చేసింది. విపరీతమైన పన్నుల భారాన్ని ప్రజలపై మోపింది.
ఈ నేపధ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ పౌర సమాజం తీవ్రంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ఓడించక పోతే, రాష్ట్రంలో విస్తరిస్తున్న బీజేపీ పార్టీని నిలువరించకపోతే, రాష్ట్రంలో సాధారణ ప్రజల జీవితాలు మరింత దుర్భరమవుతాయని, కోల్పోయిన ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ కష్టమనీ, విద్వేష భావజాలానికి గురి కాకుండా, ప్రజలలో మత సామరస్యాన్ని కాపాడుకోవడం అవసరమనీ భావించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో BRS నూ, బీజేపీనీ ఓడించమని ప్రత్యేకంగా పిలుపు ఇచ్చింది. కాంగ్రెస్ కు ఓటేయమని ఎక్కడా చెప్పలేదు. నిబద్ధత కలిగిన పౌర సమాజం గొంతుకు ప్రజలు గౌరవ మిచ్చారు. పిలుపును అమలు చేశారు. అప్పటికి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల తీర్పుతో ప్రయోజనం చేకూరింది.
కాంగ్రెస్ గెలుపులో పౌరసమాజం పాత్ర
2024 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కూడా ఫాసిస్టు స్వభావంతో వ్యవహరిస్తున్న బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఓటేయాలని ‘భారత్ జోడో అభియాన్’ లాంటి కొన్ని పౌర సమాజ సంస్థలు దేశ వ్యాపితంగా పిలుపు ఇచ్చాయి. ఈ పిలుపును కూడా తెలంగాణ పౌర సమాజంలో భాగంగా ఉన్న కొందరం ప్రజలలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళాం. TPJAC లాంటి కొన్ని సంస్థలు దేశంలో బీజేపీ కూటమిని ఓడించాలని ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాయి. రాష్ట్రంలో పాక్షిక ఫలితం సాధించాం. ఎంత మందిమి వ్యతిరేకించినా, బీజేపీ కూడా రాష్ట్రంలో 8 MP స్థానాలలో గెలుపొంది ప్రమాదకర స్థాయికి ఎదిగింది.
ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండీ పౌర సమాజంగా మేమేం ఆశిస్తాం.? ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం , మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తామని ప్రతి రోజూ ప్రకటించుకునే ముఖ్యమంత్రి రేవంత్, ప్రజల పట్ల బాధ్యతతో పరిపాలన సాగిస్తాడని, ఈ ప్రభుత్వం తాను అభయ హస్తం మానిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనీ ఆశిస్తాం. మరీ ముఖ్యంగా ప్రజలతో వ్యవహరించడంలో, BRS కూ, బీజేపీ కీ భిన్నమైన ఆచరణతో వ్యవహరిస్థారని ఆశిస్తాం.
కాంగ్రెస్ ఏడో గ్యారంటీని గాలికొదిలేశారు?
గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన దశలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను మొదటి సంవత్సరమే, ఒకే దఫా లో అమలు చేయడం కష్టమేనని కూడా పౌర సమాజానికి అవగాహన ఉంది. అందువల్ల ఇచ్చిన హామీలలో పేద ప్రజలకు, సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన హామీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం అమలు చేస్తుందనీ, అందువల్ల, నిరుపేదలకు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కొంత ఊరట లభిస్తుందనీ, పౌర సమాజంగా మా ఆశ ఉండింది. రాష్ట్ర అభివృద్ధి నమూనా రూపకల్పనలో, ప్రజలకూ, పౌర సమాజానికీ, ప్రజా సంఘాలకూ కూడా భాగస్వామ్యం ఏదో మేరకు లభిస్తుందనీ, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో వ్యహరించడంలో, అభివృద్ధి నమూనా తయారీలో తప్పుటడుగులు వేయకుండా ఉంటుందనీ మా అభిప్రాయంగా ఉండింది. మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక పాలన 7 వ గ్యారంటీగా మీరే ఇచ్చిన సందర్భంలో, ప్రజల ప్రజా స్వామిక హక్కుల రక్షణ విషయంలో, ప్రజల పైకి పోలీసులను ఉసిగొల్పడంలో గత ప్రభుత్వానికి భిన్నంగా వ్యవహరిస్తుందని మేము ఆశించడంలో తప్పు లేదు కదా ?
దేశంలో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లాంటి మూడు రాష్ట్రాల లోనే కాంగ్రెస్ పార్టీ స్వయంగా అధికారంలో ఉంది. ఈ నేపధ్యంలో ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజానుకూలంగా ఉంటే, ముఖ్యంగా బీజేపీ పాలనా పద్ధతులకు భిన్నంగా ఉంటే మాత్రమే బీజేపీ కూటమికి, RSS సైద్ధాంతిక భావజాలానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీకి క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఫాసిస్టు బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికలలో పోరాడడానికి ఇండియా కూటమికి నైతికత మిగులుతుంది. కానీ మీరు ఆ లక్ష్యానికి అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారా రేవంత్ ?
ఇక్కడ మీరు పద్దతిగా పరిపాలన సాగిస్తే, అప్పుడు పౌర సమాజానికి కూడా ఎజెండా భిన్నంగా ఉంటుంది. ముస్లింలపై ద్వేషాన్ని ప్రజలలో నింపుతూ, మతోన్మాద రాజకీయాలను రాష్ట్రంలో ప్రేరేపిస్తున్న RSS కూ, బీజేపీ కీ వ్యతిరేకంగా ప్రజలలో నిలబడి పోరాడడానికి, మత సామరస్యం కోసం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం, మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్ధిక విధానాలకు, వ్యతిరేకంగా పోరాడడానికి పౌర సమాజానికి ఆలోచించుకునే, కార్యాచరణ తీసుకునే సమయం మిగులుతుంది.
రైతులకూ, కార్మికులకూ, వెనుకబడిన వర్గాలకూ, మైనారిటీలకూ, సాధారణ, మధ్యతరగతి ప్రజలకూ, మొత్తంగా పర్యావరణానికీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రజలలో ఎండ గట్టడానికి పౌర సమాజానికి అవకాశం ఉండేది. దక్షిణాది రాష్ట్రాల నుండీ భారీగా పన్నులు వసూలు చేసుకుంటూ, ఈ రాష్ట్రాలకు తక్కువ నిధులను కేటాయిస్తున్న మోదీ ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి పౌర సమాజానికి సమయం మిగిలేది. ఆదివాసీలపై మోదీ - షా ద్వయం ప్రకటించిన అన్యాయ యుద్ధం ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోదీ విరచిత జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, వక్ఫ్ చట్టం సవరణలతో ముస్లిం మైనారిటీలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడ డానికి పౌర సమాజానికి వెసులు బాటు ఉండేది.
కానీ, మీరేం చేస్తున్నారు రేవంత్ , నిజానికి మీరు ఏమి చేసి ఉండాల్సిందో అది చేయడం లేదు. మెజారిటీ పేద ప్రజలకు అవసరమైన రేషన్ కార్డుల జారీ , ఆసరా పెన్షన్ లు మంజూరు, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది కార్మికుల సంక్షేమం, సంక్షోభంలో ఉన్న కౌలు రైతులకు గుర్తింపు, సహాయం, ఇంటి జాగా కూడా లేని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, దళితుల, మైనారిటీల, బీసీ వర్గాల సబ్ ప్లాన్ ల సక్రమ అమలు, ప్రభుత్వ విద్యా, వైద్య వ్యవస్థల మెరుగు లక్ష్యాలను మీరు పక్కన పారేశారు.
మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుద్ధరణ, విద్యారంగ నిజమైన సమస్యలను పరిష్కరించని , సమీకృత స్కూల్స్ నిర్మాణం కోసం వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు లాంటి ఎజెండాను ఎత్తుకున్నారు. నిజానికి ఇదంతా ప్రజలడిగిన అభివృద్ధి కాదు. ఇది 80 శాతం ప్రజలకు మేలు చేసే ఎజెండా కాదు. ఇది రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్ లకు, కార్పొరేట్ లకు ప్రయోజనం చేకూర్చే ఎజెండా.
అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో, ప్రభుత్వానికి అందుతున్న పన్నుల ఆదాయాన్ని ఎందు కోసం ఖర్చు పెట్టాలి ? ఎక్కడ ఖర్చు పెట్టాలి ? ఈ అంశాలలో మీరు స్వయంగా ప్రాధాన్యతలు నిర్ణయించు కోలేకపోతే, పౌర సమాజాన్ని, ప్రజా సంఘాలను చర్చకు ఆహ్వానించి ఉండాల్సింది. అప్పుడు హామీల అమలు సులువయ్యేది. రాష్ట్ర ఆర్ధిక, పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు పోవడానికి ఏదో ఒక మార్గం దొరికేది.
కానీ మీరు అధికారం చేపట్టిన మొదటి రెండు నెలల్లో కొద్ది మందితో ఒకటి, రెండు సమావేశాలు జరపడం తప్ప, మొత్తం పౌర సమాజాన్ని, ప్రజా సంఘాలను మీరు కలవడమే మానేశారు. మీతో చర్చించాలంటే ప్రజా సంఘాలకు, వాటి బాధ్యులకు నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా, మీరు సమయం ఇవ్వరు. KCR పాలనకు భిన్నంగా కొన్ని అంశాలలో మీరు కొద్ది మంది పౌర సమాజ ప్రతినిధులను ఎప్పుడైనా కలుస్తున్నా, వారి సూచనలకు విలువ ఇచ్చినట్లు, ఆ సూచనలను ప్రభుత్వ ఆచరణకు ప్రాతిపదికగా ఉంచుకున్నట్లు కనపడడం లేదు. గత ప్రభుత్వం ప్రజా సంఘాల కార్యకర్తలపై, పౌర సమాజ ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను సమీక్షిస్తామన్న మీ హామీని కూడా మీరు నిలబెట్టు కోలేదు. వ్యవసాయ, విద్యా రంగాలకు వేసిన కమిషన్ లు స్వతంత్రంగా పని చేసే అవకాశం ఇవ్వకుండా, మీ పార్టీ వారితో నింపేశారు.
పైగా మోదీ భక్తుడైన డాక్టర్ జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళను విద్యా రంగ చర్చలలో భాగస్వాములను చేసి , ఆయన సలహాలను తీసుకోమని విద్యా కమిషన్ కు సూచించినట్లు దినపత్రికలో వచ్చిన వార్త మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. RSS భావజాలం కలిగిన అక్షయ పాత్ర లాంటి సంస్థకు స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా అప్పగించడానికి వీలుగా మీ స్వంత నియోజకవర్గంలో పైలట్ చేయడాన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన టీవీ చర్చలో మీరు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, కొత్త శాసన సభ్యులకు ప్రజాస్వామ్యంపై క్లాసులు చెప్పాలని కోరారు. విచిత్రం ఏమిటంటే, ప్రజలతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ జిల్లా , మైలారం గ్రామానికి వెళుతున్న హరగోపాల్ సార్ ను మీ ప్రభుత్వం మధ్య లోనే అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ లో ఉంచింది. లగచర్ల నిజ నిర్ధారణకు వెళుతున్న మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల జేఏసీ నాయకులను మధ్యలోనే పోలీసులతో అడ్డుకుని, అభ్యంతరకరంగా వ్యవహరించారు.KCR పాలనా కాలం లాగే, మీరు కూడా జిల్లాల పర్యటనలకు వెళుతున్నప్పుడు, ప్రజా సంఘాల కార్యకర్తల ముందస్తు అరెస్టులు మొదలయ్యాయి. ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడించడానికి గ్రామాలలో సభలు ఏర్పాటు చేసుకుంటే, పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు.
మరీ ముఖ్యంగా మీరు కొన్ని ప్రాజెక్టులను కలకంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుద్ధరణ, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగంగా ఉన్నాయి. ఎవరి కోసం ఈ ప్రాజెక్టులు? నిజంగా రాష్ట్ర ప్రజలకు ఇవి అవసరమా? వేలాది ఎకరాల వ్యవసాయ భూములను మళ్లించి , ఈ ప్రాజెక్టులను నిర్మించాల్సిన అవసరముందా ? అసలు ఎన్ని కంపనీలు ఈ కొత్త నగరానికి వస్తాయి? మీరు కలలు కంటున్న కొత్త నగరంలో గోల్ఫ్ కోర్టు , రేస్ కోర్టు, క్రికెట్ స్టేడియం లాంటి వాటికి ప్రజలు తమ భూములను ఎందుకివ్వాలి ? వాటిలో ఏ ప్రజా ప్రయోజనం దాగి ఉంది ? అసలు ఈ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుండీ వస్తాయి ? అక్కడికి ప్రైవేట్ కంపనీలు వస్తాయనుకుంటే, వాళ్ళు లాభాల కోసమే వస్తారు కదా.. స్థానికులకు ఆయా కంపనీలు ఉద్యోగాలు ఇస్తాయనే గ్యారంటీ ఏముంది ? ఆయా ప్రాజెక్టులలో రిజర్వేషన్ లు అమలు కావు కదా ? స్థానిక ప్రజలకు జరిగే సామాజిక న్యాయం ఏముంటుంది ?
కాంగ్రెస్ ‘అభయ హస్తం’ ఎటుపోయింది?
పైగా దళితుల అసైన్డ్ భూములను, సన్న, చిన్నకారు రైతుల పట్టా భూములను బెదిరించి, పోలీసులతో దాడులు చేయించి, గుంజుకునే వైఖరి మీరు అభయ హస్తం మానిఫెస్టో లో ఇచ్చిన హామీలకు భిన్నమైనది కాదా ? కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 2013 చట్టాన్ని అమలు చేయకుండా, KCR తెచ్చిన 2017 చట్టాన్ని అమలు చేసి భూములు లాక్కోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా జరుగుతున్న అవమానం కాదా? మీరు రోజూ మాట్లాడే రాహుల్ ఆశయాలకు ఈ ప్రాజెక్టుల అమలు తీరు భిన్నమైనది కాదా ? ఫార్మా సిటీ ప్రాంతంలో కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి, రైతులతో మీరు గత వారం రోజులుగా వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతన వైఖరికి అడ్డం పట్టడం లేదూ?
పౌర సమాజ పెద్దగా, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాసినప్పుడో, లేదా మీ ప్రభుత్వంలో మంత్రులతో , స్వయంగా వద్దని చెప్పినప్పుడో ఆగకుండా, ఈ విషయాలపై ముందు గానే పౌరసమాజంతో లోతుగా చర్చించకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమితో , విద్యార్ధులతో, మూసీ పరీవాహక ప్రాంత ప్రజలతో మీరు వ్యవహరించిన తీరు, BRS, బీజేపీ ప్రభుత్వాల పని తీరుకు ఏ విధంగా భిన్నమైనది?
పౌర సమాజం మొత్తుకుంటున్నా, పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నా, వికారాబాద్ జిల్లా దామగుండం అడవిని, మీరూ, ప్రధాని మోదీ గారూ ఉమ్మడిగా పని గట్టుకుని కొట్టేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అడవిని మళ్లించే విషయంలో కూడా మీకూ, బీజేపీ కీ ఏకాభిప్రాయం ఉంది. అందుకే అక్కడ అది మౌనంగా ఉంటుంది. కానీ HCU ప్రాంగణంలో అడవిని కొట్టేసే విషయంలో మీతో బీజేపీకీ పేచీ ఉంది. ఆ పార్టీ ద్వంధ్వ వైఖరికి ఇది అడ్డం పడుతున్నది. మీరే తెలిసో, తెలియకో బీజేపీ వలలో చిక్కుకు పోతున్నారు. బీజేపీతో డిల్లీలో దోస్తీ , గల్లీ లో కుస్తీ చేద్దామని KCR ప్రయత్నించి, రాష్ట్రాన్ని ఇప్పటికే సగం వాళ్ళకు రాసిచ్చాడు. మీరూ అదే దారిలో నడిస్తే బీజేపీ భూతం మిమ్మల్ని కూడా మింగేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
అధికారం చేపట్టిన మొదటి 15 నెలల లోనే, మీరు ఇలా దారి తప్పి, మీ ఎజెండాను మార్చుకోవడం వల్ల, ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, ఎజెండా కోసం, అధికారం కోసం అర్రులు చాస్తున్న BRS, BJP లాంటి పార్టీలకు వరంగా మారింది.
పౌర సమాజానికి కూడా అనివార్యంగా ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాడాల్సిన అవసరం ఏర్పడుతున్నది. మీరు చేపట్టిన అభివృద్ధి నమూనా, మీ శాసన సభ్యుల పని తీరు, అన్ని జిల్లాలలో, ప్రజలలో అసంతృప్తి పెంచుతున్నది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ముస్లిం మైనారిటీ ప్రజలలో మీ పాలనా తీరు గందర గోళాన్ని సృష్టిస్తున్నది. మీ పాలనా కాలం లోనూ, ప్రభుత్వంలో, పాలనలో ముస్లిం ప్రజలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంలో మీరు బాగా వెనక బడి ఉన్నారు. ముస్లిం ప్రజలపై దాడులు జరిగినప్పుడు మీ ప్రభుత్వం మౌనంగా ఉంటున్న స్థితి వారిలో భయాందోళనలను కలిగిస్తున్నది.
RSS భావజాలానికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పాలన ఉండాలని వారు కోరుకోవడంలో తప్పేం ఉంది ?
పౌర సమాజం కోరుకుంటున్నది ఒక్కటే, మీ అజెండా మారాలి. మీ పని తీరు మారాలి . ప్రజలు కేంద్రంగా అభివృద్ధి నమూనా వైపు ప్రభుత్వ పాలన సాగాలి. ఇప్పటికే జరిగిన తప్పులను సమీక్షించుకుని మళ్ళీ తప్పులు చేయకుండా ఉండాలి. పౌర సమాజంతో, ప్రజా సంఘాలతో ప్రభుత్వం నిరంతరం చర్చలు జరపాలి. వాళ్ళు చెప్పే మాటలను ఆలకించాలి. వివిధ రంగాల విధాన నిర్ణయాలలో వాటిని పరిగణనలో ఉంచుకోవాలి.
యుద్ధం ప్రజలతోనా, బిజెపితోనా
మీ పాలనా తీరు మారకపోతే, మీకు ప్రజలు దూరమవుతారు, పౌర సమాజం దూర మవుతుంది. అంతిమంగా రాష్ట్రం మళ్ళీ ఫాసిస్టు, నియంతృత్వ శక్తుల చేతుల్లోకి వెళుతుంది. రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడం, ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవడం, రాష్ట్ర సహజ వనరులను కాపాడు కోవడం కన్నా పౌర సమాజానికి, ప్రజా సంఘాలకు ముఖ్యమైన దేమీ లేదు. అందుకోసం ఎవరితోనైనా పౌర సమాజ , ప్రజా సంఘాల యుద్ధం కొనసాగుతుంది.
ఇదే విధానాలను కొనసాగిస్తూ, మీరు మాతో యుద్ధం చేస్తారా ? మీ పరిపాలనను సవరించుకుని, రాజ్యాంగాన్ని, రాష్ట్రాల హక్కులను కబళిస్తున్న బీజేపీతో పోరాడతారా ? ఆ పోరాటంలో మమ్మల్ని కూడా కలుపుకుంటారా ? ఏం చేయాలన్నది మేరే ఆలోచించు కోండి, రేవంత్.


Read More
Next Story