రేవంత్ సర్కార్ తప్పుచేస్తున్నదా?, నిరుద్యోగుల్లో ఆగ్రహం
x
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఆర్థరాత్రి ఆందోళన

రేవంత్ సర్కార్ తప్పుచేస్తున్నదా?, నిరుద్యోగుల్లో ఆగ్రహం

తెలంగాణలో ఏం జరుగుతోంది. ఒకే సారి నోటిఫికేషన్ లు విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఊపిరాడని పరిస్థితి. అందుకే సర్వత్రా అసంతృప్తి. దాని మీద ప్రతిపక్ష ముద్ర తప్పు



నిరుద్యోగుల ఆందోళనలతో, నిరసన కార్యక్రమాలతో తెలంగాణ యువతలో పెరుగుతున్న అసహనం, అసంతృప్తి మరోసారి వ్యక్తమవుతున్నది. ప్రజలలో, ముఖ్యంగా యువతలో వ్యక్తమయ్యే అసంతృప్తి, అందులో నుండీ పుట్టే నిరసన కార్యక్రమాలతో వ్యవహరించడంలో ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకూ తప్పుటడుగులే వేస్తూ వచ్చాయి.

పోలీసుబలగాలపై, నిర్బంధం పై ఆధార పడకుండా ఉన్నతాధికారులు, మంత్రులతో సబ్ కమిటీలను వేసి, ఆందోళన చేస్తున్న వారితో చర్చించడం , వారి డిమాండ్లను సావధానంగా వినడం , ఆ డిమాండ్లు సరైనవి కావనుకుంటే, వారికి ఓపికగా నచ్చ చెప్పడం జరగాలి.
సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, న్యాయమైన డిమాండ్లను బలపరచడం , తప్పు అనుకునే డిమాండ్లను తిరస్కరించడం, అవి ఎలా తప్పో , ఆందోళన చేస్తున్న వారికి కూడా వివరించి, వాటిని వదులుకునేలా ఒప్పించడం ప్రతిపక్ష పార్టీలు పాటించాల్సిన సరైన పద్ధతి. కానీ ఈ పద్ధతిని పాటించకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళనలు కనుక, వాటి నుండీ రాజకీయ ప్రయోజనం పొందే లక్ష్యంతో, వాటిని బలపరచడం ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న పద్ధతి.

ఆందోళనాకారుల మీద ప్రతిపక్షం ముద్ర తప్పు

ఫలితంగా ప్రభుత్వం కూడా సంయమనం కోల్పోయి, ఆందోళనలన్నీ ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్న ఆందోళనలుగా ప్రకటించడం, ఆందోళన చేస్తున్నవారిపై తప్పుడు ముద్రలు వేయడం, అవహేళన చేయడం, అవమానించడం చేస్తుంటాయి. నిరుద్యోగుల ఆందోళన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్న ధోరణి, ఉస్మానియాలో విద్యార్ధులపై పోలీసులు సాగించిన దౌర్జన్యం ఏ మాత్రమూ సరైనవి కావు. తప్పకుండా ఖండించాల్సినవి. ఈ రెండు ధోరణులూ ఇప్పుడు తెలంగాణ లో జరుగుతున్న నిరుద్యోగుల ఆందోళనలో వ్యక్తమవుతున్నాయి. ఇది సరైంది కాదు.
సైద్ధాంతిక భావజాలంతో, సమస్య పై విస్తృత అవగాహనతో, ఒక నిర్మాణ క్రమశిక్షణతో ఉద్యమాలు సాగించే, విద్యార్ధి,యువజన సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ పరంగా బలహీనపడ్డాయి. ప్రస్తుతం ముందుకు వచ్చిన నిరుద్యోగ యువజనుల ఆందోళనలో ఆయా సంఘాలు నాయకత్వ పాత్రలో లేవనే విషయం కనపడుతూనే ఉంది.
ప్రస్తుత నిరుద్యోగుల ఉద్యమాన్ని బలపరిచే BJP, BRS లాంటి ప్రతిపక్ష పార్టీల గత చరిత్ర పట్ల,వాళ్ళ పాలనా కాలంలో వ్యవహరించిన తీరు పట్ల ఒక అంచనా లేకుండా, ఉద్యమానికి వారి మద్ధతును తీసుకుంటూ, మొత్తం సమస్య పరిష్కారం పట్ల, సమిష్టి తత్వాన్ని కోల్పోయి, వ్యక్తి వాద ధోరణితో, తక్షణ, తాత్కాలిక డిమాండ్లతో ముందుకు వచ్చే ఇలాంటి ఆందోళనల పట్ల ప్రజాస్వామిక దృక్పధం కలిగిన పౌరసమాజం ఎలాంటి వైఖరి తీసుకోవాలన్నది కూడా పౌర సమాజం ముందుకు కొన్ని ప్రశ్నలను ఈ యువజనుల ఆందోళన ముందుకు తెచ్చింది.
సమస్య నిజమే, పరిష్కారం అవసరమే. కానీ ఉద్యమం లేవనెత్తిన కొన్ని న్యాయమైన డిమాండ్లను బలపరుస్తూనే, కొన్ని డిమాండ్లకు ఉన్న పరిమితులను చెప్పి, సమస్య కున్న లోతును, చారిత్రక దృష్టితో, భవిష్యత్ పరిణామాలను బేరీజు వేసుకుని సమస్యను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసే మేధావుల పట్ల కూడా అవమానకరంగా మాట్లాడే ధోరణి, తాత్కాలిక , తక్షణ దృష్టితో ముందుకు వచ్చే ఉద్యమ నాయకత్వాలకు ఉంటుందని మనం గమనిస్తున్నాం.
తెలంగాణలో ప్రజల పట్ల బాధ్యతతో, దశాబ్ధాలుగా గొంతు విప్పి మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండ రామ్, రిటైర్డ్ ఐఎఎస్ ఆకునూరి మురళి, పౌరహక్కుల ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ మీద, సోషల్ మీడియా లో వాడుతున్న భాష, ఇటీవల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమస్య పై జరుగుతున్న ఒక సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ పట్ల, ఆ సమావేశ నిర్వాహకులలో ఒకరు అమర్యాదకరంగా వ్యక్తం చేసిన అసహనం ఈ ధోరణికి చిహ్నం.
సర్వత్రా పెరుగుతున్న నిరుద్యోగం, అసంతృప్తి
ప్రపంచ వ్యాపితం గానూ , భారత దేశ వ్యాపితంగానూ పెరుగుతున్న నిరుద్యోగం ఒక వాస్తవిక సమస్య. ముఖ్యంగా భారత దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. ఉన్నత విద్య చదువుకున్న వారిలో 45 శాతం మంది నిరుద్యోగులుగానే ఉన్నారంటే, సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 10 లక్షల ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్నాయి. గత పదేళ్ళ మోడీ పాలనలో అన్ని రంగాలలో 50 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయి. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే రైల్వే లాంటి సంస్థలలో పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. వివిధ పనులు ప్రైవేట్ పరమవుతున్నాయి. మిగిలిన పోస్టులలో కాంట్రాక్టు ఉద్యోగులతో పని చేయించుకుంటున్నారు. మోడీ తొలి పదేళ్ళ పాలనలో నోట్ల రద్ధు, GSTతో పాటు, కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ ల కారణంగా దేశ వ్యాపితంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పవడంతో, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి పోయింది.
సాపేక్షికంగా గతం కంటే, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరగడం ఒక కారణమైతే, దేశంలో విస్తరిస్తున్న పారిశ్రామిక, సేవా రంగాలలో ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, కొత్త సాఫ్ట్ వేర్ ప్రోగ్రాములు సహా, నూతనంగా వివిధ రంగాలలో రోబో లు ప్రవేశించి, మనుషులకు పని లేకుండా చేస్తున్నాయి. గత పదేళ్ళలో ముందుకు వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ను ఆసరా చేసుకుని, కంపెనీలు, సంస్థలు కూడా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్ మెంట్ ల పేరుతో, నూతన తరాన్ని అప్రెంటిస్ షిప్, ఇంటర్న్ షిప్ పేరుతో, పర్మినెంట్ స్వభావంతో కాకుండా, తాత్కాలిక పద్ధతిలో తక్కువ కాల పరిమితికి నియమించుకుని పని చేయించుకుంటున్నాయి. తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీ కూడా చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ దేశల నుండీ భారత దేశంలోకి వస్తున్న తరలి వస్తున్న బహుళ జాతి బడా కంపెనీల గురించి, లక్షల కోట్ల పెట్టుబడుల గురించీ గొప్పగా చెప్పుకుంటున్నాయి, కానీ, ఆయా కంపెనీలు ఇండియా లో యువతరానికి ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాయో స్పష్టంగా చెప్పడం లేదు. 1960 దశకంలో ఒక కోటి రూపాయల పెట్టుబడి పెడితే, కనీసం 50 మందికి ఉపాధి దొరికేది. 2020 దశకంలో అది కేవలం 3.5 మందికి తగ్గిపోయింది.
వెయ్యి కోట్ల పెట్టుబడితో సంస్థ పెట్టారని చెప్పినా, కొత్తగా వస్తున్న కంపెనీలు కనీసం 300 మందికైనా ఉపాధి చూపించలేక పోతున్నాయి. పైగా ఈ ఉపాధికి గ్యారంటీ లేదు. ఎప్పుడైనా తొలగించవచ్చు. పని గంటలు పెంచడం, ఉద్యోగులకు, కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకపోవడం, ESI , PF లాంటి సామాజిక బధ్రత పథకాలు అమలు చేయకపోవడం, సెలవుల సంఖ్యను తగ్గించడం లాంటి ధోరణులు పెరుగుతున్నాయి. పారిశ్రామికీకరణ పేరుతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి,నీళ్ళు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు తక్కువ మొత్తానికే కేటాయిస్తున్నా, పన్నుల మినహాయింపులు ఇస్తున్నా, కార్మిక చట్టాల నుండీ మినహాయింపులు ఇస్తున్నా, ఆయా కంపెనీలకు లాభాల దాహం తీరడం లేదు. కార్మిక హక్కుల అమలును పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది.

ఆందోళన వెనక పదేళ్ల ఆశ, నిరాశ

ఈ నేపధ్యంలో వివిధ శాఖలలో ప్రభుత్వాలు ప్రకటించే ఉద్యోగాల కోసం లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత పోటీ పడుతున్నది. పైగా తెలంగాణలో గత పదేళ్ళలో KCR పాలనలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనే లేదు. కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు వెలువడినా, పరీక్షలు జరగలేదు, పరీక్షలు జరిగినా ఫలితాలు వెలువడ లేదు. 2017 తరువాత రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం DSC వేయనే లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం పూర్తి స్థాయిలో పరీక్షలు కూడా జరగలేదు. జరిగిన కొన్ని పరీక్షల లో కూడా పేపర్లు లీక్ అయ్యాయి. ఆయా పరీక్షలు రద్దయ్యాయి.
ఇవన్నీ 35 లక్షలుగా ఉన్న ఉన్నత విద్యావంతులైన రాష్ట్ర నిరుద్యోగ యువతలో అసహనాన్ని పెంచాయి. అసంతృప్తిని పెంచాయి. గత పాలకులను గద్దె దించడానికి కారణమయ్యాయి. కొత్త ప్రభుత్వం విపరీతమైన ఆశలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో TSPSC సంస్థ ప్రక్షాళనకు కార్యాచరణ చేపట్టింది. సంస్థకు బోర్డును నియమించింది. గత ప్రభుత్వ కాలంలో పరీక్షలు పూర్తయిన పోస్టులకు ఫలితాలు వెలువరించి, కనీసం 30,000 పోస్టులను భర్తీ చేసింది.అనుకున్న స్థాయిలో కాకున్నా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలకు నోటిఫికేషన్ లు జారీ చేసింది.
అలాగే సుమారు 10,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి DSC ప్రకటించింది. నిజానికి రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అవి రోజు రోజుకూ పెరుగుతున్నాయి . పైగా రాష్ట్రంలో ఉన్న 15 ఏళ్లలోపు మొత్తం విద్యార్ధుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ స్కూల్స్ లో ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలను ప్రకటించకుండా, ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్ లో ఉన్న విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను ప్రకటించడం సరైంది కూడా కాదు. ప్రభుత్వ స్కూల్స్ లో పూర్తి స్థాయిలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నారని తెలిస్తేనే, తల్లితండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ కు పంపుతారు. ఆ పని చేయకపోగా, కనీసం ఇప్పటి వరకూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇది కూడా నిరుద్యోగ యువతలో అసంతృప్తిని నింపింది.
పైగా గత పదేళ్ళ BRS పాలనలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అసలు పరీక్షలు పెట్టకుండా, కాలయాపన చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా 7 నెలలు గడిచినా, పూర్తి స్థాయిలో జాబ్ క్యాలండర్ విడుదల చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపు ( అంటే ఈ డిసెంబర్ 7 లోపు) 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో హామీ ఇచ్చిన దరిమిలా, అటు వైపు అడుగులు వేస్తూ, రేవంత్ ప్రభుత్వం వేగంగా నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ వచ్చింది. ఈ మధ్య కాలంలోనే మార్చి 16 నుండీ జూన్ 6 వరకూ 80 రోజులు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం వల్ల, మధ్యలో నోటిఫికేషన్ లకు బ్రేక్ వచ్చింది.

యువతకు ఉపిరాడని పరిస్థితి

దీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఖాళీలను పాక్షికంగా అయినా భర్తీ చేయాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే అయినా, ఒకే సారి నోటిఫికేషన్ లు విడుదల కావడంతో, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నయువతకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా అనే ఆశతో, అన్ని రకాల పరీక్షలకు తయారయ్యే యువతకు చదువుకునే పనిలో ఊపిరి ఆడకుండా ఉంది.
గత పదేళ్ళ అనుభవాలను, యువతలో ఉన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయకుండా, వివిధ పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఉండేలా తేదీలను మార్చడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా మార్చాలి. అనుకున్న కాల పరిమితిలో పూర్తి చేసేలా వివిధ పరిక్షల అడ్జస్ట్ మెంట్ కు అవకాశం ఉంటే కూడా పరిశీలించాలి. యువత కోరుతున్నప్పటికీ ఒక్కో పోస్టుకు అర్హులు 1: 50 కాకుండా 1: 100 చేయడానికి, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి వ్యవహరించాలి. లేకపోతే, మొత్తం ప్రక్రియ కోర్టు వివాదాలలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చినట్లుగా తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలండర్ పూర్తి స్థాయిలో ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం యువతతో మరింత ఓపికగా వ్యవహరించాలి. వాళ్ళను కించపరిచే కామెంట్లు చేయడం ఏ మాత్రం సరైంది కాదు. పోలీసులతో యువతపై నిర్బంధాన్ని ప్రయోగించడం మానుకోవాలి, వాళ్ళతో నిరంతరం చర్చలతో ఉండేలా అధికారులు, మంత్రలతో ఒక కమిటీ వేయాలి. రాష్ట్రంలో కేవలం 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి మాత్రమే కాకుండా, ఉన్నత విద్యను అభ్యసించిన మొత్తం యువతకు, తగిన చదువు, నైపుణ్యాలు లేని ఇతర యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి ప్రణాళికా బద్ధంగా చర్చలు కొనసాగించాలి. చర్యలు చేపట్టాలి. ఇది ప్రభుత్వం ప్రధాన బాధ్యత.



Read More
Next Story