
ఇథనాల్ ప్లాంట్స్ పై ఆడిట్ అవసరం
జీరో లిక్విడ్ డిశ్చార్జ్ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో 30 ఇథనాల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు అనుమతులు పొందాయి. సామాజిక, పర్యావరణ ప్రభావ అంచనా మదింపు ప్రక్రియ నుండీ మినహాయింపులు పొందిన ఈ కంపనీలు నిజానికి అత్యంత కాలుష్య కారక పరిశ్రమలని ఇప్పటికే అనేక నివేదికలు వచ్చాయి. వీటి వల్ల కలిగే హాని గురించి పర్యావరణ వేత్తలు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు.
నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామం లో ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపనీ వెదజల్లుతున్న కాలుష్యం గురించీ అక్కడి 50 గ్రామాల ప్రజలు చాలా కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. చిత్తనూరు ఇథనాల్ ప్లాంట్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను గురించి అక్కడి ప్రజల అనుభవాలను స్వయంగా చూసిన, విన్న ఇతర ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాలలో ఏర్పాటవుతున్న ఇథనాల్ ప్లాంట్ లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
గద్వాల జిల్లా పెదధన్వాడ, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ , సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ళ , సూర్యాపేట జిల్లా రావి పహాడ్ ప్రాంతాల ప్రజలు తమ గ్రామాల, పొలాల మధ్య ఏర్పాటవుతున్న ఇథనాల్ కంపనీలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజల పోరాటాలు, కోర్టు తీర్పు ఫలితంగా కొన్ని చోట్ల ఆయా ఇథనాల్ కంపనీల నిర్మాణ పనులు ఆగిపోయాయి. కానీ అన్ని చోట్లా , స్థానిక ఎన్నికల తరువాత మళ్ళీ ఆయా కంపెనీల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయనే ఆందోళన ప్రజలలో ఉంది.
ఇథనాల్ కంపనీలకు ముడి సరుకుగా 2026 మార్చ్ నాటికి కోటి టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) నుండీ కిలో 22.50 రూపాయల చొప్పున సబ్సిడీ ధరపై ( ప్రస్తుత FCI దగ్గర నిల్వ ఉన్న బియ్యం ధర కిలో 43 రూపాయలు ) సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, ఇథనాల్ కంపనీల లక్ష్య సాధనపై పార్ల మెంటులో ప్రధాని మోడీ ప్రశంశలు కురిపించడం, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు కూడా ప్రస్తుతం ఆగిన ఇథనాల్ కంపెనీల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని ప్రకటించడం ప్రజల ఆందోళనలకు కారణంగా ఉంది.
పెడ్డ ధన్వాడ గ్రామంలో ప్రతిపాదిత ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అణచివేయడానికి పోలీసుల దాడులు జరిగాయి. ప్రజలను కొట్టారు. అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారు. చాలా మంది ఇప్పటికీ కండిషన్ బెయిల్ పై ఉన్నారు.
ఈ నేపధ్యంలో ఇటీవల హైదరాబాద్ లో వివిధ అంశాలపై కేసులను విన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ కు రామారావు అనే న్యాయవాది పెద ధన్వాడ ఇథనాల్ ప్లాంట్ ను ప్రతిఘటించిన ప్రజలపై పెట్టిన కేసులను కూడా విచారించాలని వ్రాత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో NHRC జోక్యం చేసుకుని ప్రజలపై సాగిన హింస గురించి విచారణ చేయాలని కోరారు.
కాలుష్య కారక ఇథనాల్ ప్లాంట్ కు ఇచ్చిన అనుమతుల వల్లనే , ఈ ఘటనలు జరుగుతున్నాయి కనుక, ఇథనాల్ ప్లాంట్లకు ఇచ్చిన అనుమతులను సమీక్షించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, మానవ హక్కుల వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ సంస్థలు కూడా పిటిషన్ లు ఇచ్చాయి. ప్రజల ఆరోగ్యం, శుభ్రమైన పర్యావరణం వంటి ప్రజల ప్రాథమిక హక్కులపై నేరుగా ప్రభావం చూపే ఇథనాల్ కంపనీల కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి కమిషన్ జోక్యం చేసుకోవాలని ఈ సంస్థలు కోరాయి.
ఈ సంస్థలు లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు, ఆందోళనలు ఇలా ఉన్నాయి.
1. పర్యావరణ అనుమతిలో "శూన్య వాయు కాలుష్యం" అనే వాదన సరి కాదు
ప్రతిపాదిత ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్‌కు ఇవ్వబడిన పర్యావరణ అనుమతిలో సూచించిన "శూన్య ప్రక్రియ ఉద్గారాలు" అనే అంశం పై సంస్థలు తీవ్ర ఆందోళన, గట్టి అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇథనాల్ కంపెనీ లపై ఇప్పటికే ఉన్న సమాచారం, అవగాహన , అనుభవం ప్రకారం, ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే లోపభూయిష్టమైన సమాచారమని సంస్థలు భావించాయి.ఇథనాల్ పరిశ్రమ కార్యకలాపాల సంభావ్య పర్యావరణ ప్రభావాన్ని ఇది సరిగా ప్రతిబింబించడం లేదని సంస్థలు ప్రకటించాయి.
ఇథనాల్ ఉత్పత్తి స్వభావం: ధాన్యం ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి అనేది పులియబెట్టడం, స్వేదనం, ఎండబెట్టడం వంటి సంక్లిష్ట పారిశ్రామిక ప్రక్రియ. ఈ ప్రక్రియలో వివిధ వాయు కాలుష్య కారక ఉద్గారాలు తప్పనిసరిగా వస్తాయి. వీటిలో కొన్ని క్రింది విధంగా ఉన్నాయి.
వాయు సేంద్రీయ సమ్మేళనాలు (VOCs): పులియ బెట్టడం, స్వేదనం సమయంలో విడుదలయ్యే ఈ సమ్మేళనాలు, చాలా వరకు ప్రమాదకరమైన వాయు కాలుష్య కారకాలుగా ఉంటాయి.
పార్టిక్యులేట్ మ్యాటర్ (PM): ధాన్యం నిర్వహణలో ఎండబెట్టడం, మరియు దహన ప్రక్రియల (ఉదా: బాయిలర్లు) నుండి డిస్టిలర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సాల్యుబుల్స్ (DDGS) ఉత్పన్నమవుతాయి. సూక్ష్మ పార్టిక్యులేట్ మ్యాటర్ శ్వాస కోశ, గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
నైట్రోజన్ ఆక్సైడ్స్ (NOx) మరియు సల్ఫర్ డయాక్సైడ్ (SO2): ప్లాంట్ కోసం వేడిని , శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే దహన వనరుల నుండి ఇవి విడుదలవుతాయి. ఇవి ఆమ్ల వర్షం, పొగ మంచుకు ముందస్తు కారకాలు గా ఉంటాయి. ఇవన్నీ శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
కార్బన్ డయాక్సైడ్ (CO2), కార్బన్ మోనాక్సైడ్ (CO): CO2 ఒక గ్రీన్ హౌస్ వాయువు అయితే. CO అనేది అసంపూర్ణ దహనం నుండి విడుదలయ్యే విష పూరిత కాలుష్య కారకం.
ఆరోగ్య ప్రభావాలు: ఈ ఉద్గారాల సంచిత ప్రభావం, అనుమతించదగిన పరిమితుల్లో ఉన్నప్పటికీ (శూన్య కాలుష్యం అనే వాదనను ఈ సంస్థలు ప్రశ్నించాయి) పెద ధన్వాడ గ్రామం, దాని చుట్టు పక్కల గాలి నాణ్యతను తప్పనిసరిగా క్షీణింపజేస్తాయి. ఇవి గ్రామస్తుల ఆరోగ్యం, శ్రేయస్సుకు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాస కోశ సమస్యలు ఉన్న వారికి నేరుగా హాని చేస్తాయి. శ్వాస కోశ వ్యాధులు, అలెర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు భారీగా పెరగ వచ్చు.
పారదర్శకత మరియు ప్రజా సంప్రదింపుల లోపం: ఇథనాల్ కంపనీల వలన "శూన్య వాయు కాలుష్యం " అనే వాదన, పర్యావరణ ప్రభావ మదింపు (EIA) ప్రక్రియ పారదర్శకత, సమగ్రత పై తీవ్రమైన ప్రశ్నలను లేవ నెత్తుతుంది. గాలి నాణ్యతపై సంభావ్య ప్రతికూల ప్రభావాలు బాగా తక్కువగా అంచనా వేయబడ్డాయి, లేదా అసలు పట్టించుకోలేదు.
పెద ధన్వాడ లో ప్రతిపాదిత ఇథనాల్ ప్లాంట్ నుండీ విడుదలయ్యే వాయు కాలుష్య అంశాలను సమగ్రంగా, స్వతంత్రంగా పునః మూల్యాంకనం చేయమని , వాస్తవిక ఉద్గార ప్రొఫైల్ లను పరిగణనలోకి తీసుకోవాలని, వీటివల్ల స్థానిక జనాభాపై కాలుష్య కారకంగా పడే ఆరోగ్య ప్రభావాలను సముచితంగా అంచనా వేయాలని సంస్థలు కోరాయి.
ఇథనాల్ ఉత్పత్తి కోసం పెద్ద మొత్తంలో నీటి వనరుల మళ్లింపు
పెద ధన్వాడ ఒక వ్యవసాయ గ్రామం, వ్యవసాయం, రోజువారీ జీవనం కోసం నీటిపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇలాంటి స్థితిలో ఈ సంస్థలు వ్యక్తం చేసిన రెండవ ప్రధాన ఆందోళన, ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్ కు అవసరమైన గణనీయమైన నీటి అవసరాల గురించి. ఇథనాల్ ఉత్పత్తి కార్యకలాపాల కోసం పెద్ద మొత్తంలో నీటి వనరుల మళ్లింపు జరుగుతుంది.
అధిక నీటి వాడకాన్నికంపెనీలు దాస్తున్నాయి : ఇథనాల్ ఉత్పత్తి అనేది అత్యధిక స్థాయిలో నీరు అవసరమయ్యే ప్రక్రియ. శీతలీకరణ, ప్రాసెసింగ్, బాయిలర్ ఫీడ్ నీరు, శుభ్రపరచడం కోసం గణనీయమైన నీరు అవసరం. ఈ కంపనీలకు ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 4 లీటర్ల నీరు అవసరం. కానీ ఇథనాల్ ప్లాంట్లు ఈ స్థాయి లోనే నీటిని వినియోగిస్తున్నాయా లేదా అనేది పరిశీలించడానికి, స్వతంత్ర ఆడిట్ డేటా లేదా ధృవీకరించదగిన ఆధారాలు లేవని ఈ సంస్థలు ప్రకటించాయి. ఈ సంస్థల అధ్యయనం ప్రకారం లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి ప్రతిపాదించిన 4 లీటర్ల నీటి వినియోగం కంటే వాస్తవ నీటి వినియోగం రెట్టింపుగా ( 8 లీటర్లు) ఉంది .
శూన్య ద్రవ విడుదల (ZLD) - కాగితంపై చెప్పే అబద్ధం మాత్రమే : "శూన్య ద్రవ విడుదల (ZLD)" అనే దానిని తరచుగా ఒక ఉపశమన భావనగా కంపెనీలు ప్రకటిస్తుంటాయి. అయితే, ఇథనాల్ పరిశ్రమలో ZLD అమలు చాలావరకు సైద్ధాంతికమైనది, "కాగితంపై" మాత్రమే ఉంటుంది. ఇథనాల్ పరిశ్రమలో, ముఖ్యంగా ఇటువంటి ప్లాంట్ స్థాయిలో ZLD గురించి వివరించే ఒక్క శ్వేత పత్రం , సమగ్ర ఆడిట్ డేటా ఎక్కడా కనిపించడం లేదు. కంపనీలు పదే పదే ప్రకటించే ఈ ప్రతిపాదిత ఉపశమన చర్య నిజమైన సామర్థ్యం, శుద్ది చేసిన, శుద్ధి చేయని, లేదా పాక్షికంగా శుద్ధి చేసిన వ్యర్థ జల విడుదల పై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నది.
గ్రామ ఆర్థిక వ్యవస్థ, గ్రామంలో చాలా మంది నివాసితుల జీవనోపాధులు నేరుగా వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. పారిశ్రామిక ఉపయోగం కోసం పెద్ద మొత్తంలో నీటి మళ్లింపు, ముఖ్యంగా వాస్తవ వినియోగం, కంపనీకి అనుమతించిన పరిమితులను మించినప్పుడు, ZLD సమర్థవంతంగా అమలు చేయనప్పుడు, తప్పనిసరిగా సమస్యలు ఎదురవుతాయి.
ఇథనాల్ కంపనీల వల్ల పెరిగే తాగు, సాగు నీటి సమస్య :
ఈ కంపనీలు బోరు బావులు తవ్వి నీటిని వాడుకోవడానికి అనుమతి లేదు. కానీ కొన్ని చోట్ల అనుమతి లేకుండానే బోరు బావులు వేసి నీటిని బయటకు తీస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. ఇదే నిజమైతే ఆ ప్రాంతంలో భూగర్భ జల వనరులు క్షీణించి పోతాయి. ఆ ప్రాంతానికి ఉపరి తల జల లభ్యత తగ్గిపోతుంది. ఇది రైతుల పంటల సాగునీటి సరఫరా పై ప్రభావం చూపుతుంది. తగినంత సాగు నీరు అందక పోవడం వల్ల వ్యవసాయ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతుంది. వ్యవసాయ కుటుంబాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటాయి. ఆ కుటుంబాలకు ఆహార భద్రత సమస్య అవుతుంది.
సాగు నీరు అందుబాటులో లేక పోవడం వల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలివేయవలసి వస్తుంది. ఇది ఆయా కుటుంబాలను పేదరికంలోకి నెడుతుంది. ఆ కుటుంబాలు వలస పోవలసి వస్తుంది. ఇప్పటికే ఉన్న నీటి వనరులు - బోర్‌వెల్స్, గ్రామ చెరువులతో సహా, రోజు వారీ తాగునీరు, ఇతర గృహ అవసరాలకు కీలకం. ఈ వనరులను ప్రజలు కోల్పోవడం అంటే ప్రజల సురక్షిత తాగునీటి హక్కును, అంటే ప్రజలు తమ ప్రాథమిక మానవ హక్కును కోల్పోవడమే. ఇథనాల్ కంపనీల కోసం పెద్ద ఎత్తున నీటి వినియోగం స్థానిక జీవ వైవిధ్యం, చిత్తడి నేలలు, ఆ ప్రాంతపు మొత్తం పర్యావరణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి, పర్యావరణ అసమతుల్యతకు కారణమవుతుంది.
అందువల్ల ఇథనాల్ ప్లాంట్ ల కోసం ప్రతిపాదిత నీటి అవసరాలను పునః పరిశీలించమని, ఆ ప్రాంతంలో నీటి వనరుల లభ్యతను అంచనా వేయమని, ప్రధానంగా వ్యవసాయ సమాజం జీవించే ప్రాంతం నుండి పెద్ద మొత్తంలో నీటిని మళ్లించడం వల్ల సామాజిక-ఆర్థిక, పర్యావరణ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సంస్థలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేశాయి.
ఇథనాల్ కంపనీలు వచ్చే గ్రామాల మధ్య జీవించే గ్రామస్తుల జీవితం, జీవనోపాధి కోసం వారి నీటి హక్కును కాపాడాలి. ఇథనాల్ కంపనీలకు అవసరమయ్యే నీటి సామర్ధ్యం అంచనా వేయడం తో పాటు, కాలుష్య కారకమైన ZLD గురించిన వాదనలలో నిజానిజాలను కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరంఉంది.