రేవంత్ రెడ్డి వ్యవసాయం చిక్కుల్లో ఎందుకు పడ్డారంటే?
x
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాష్ట్ర రైతులకు చాలా హామీలు ఇచ్చింది

రేవంత్ రెడ్డి 'వ్యవసాయం' చిక్కుల్లో ఎందుకు పడ్డారంటే?

ఒక్క వరి పంటకు మాత్రమే బోనస్ ప్రకటించడం అనర్ధాలకు దారి తీస్తుంది. వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోవాల్సిన సమయంలో ఇలాంటి హామీ అసలు మంచిది కాదంటున్నరు రవి కన్నెగంటి


తెలంగాణ జీవనోపాధిలో వ్యవసాయ రంగం అత్యంత కీలకమైనది. కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పించే రంగమే కాదు, రాష్ట్ర ఆహారభద్రత కూడా ఈ రంగంతోనే ముడిపడి ఉంది.

ఈ రంగం అత్యంత సంక్లిష్టమైనది కూడా. శ్రమజీవులైన రైతులు, కూలీలు, అన్ని పంటలు పండే సాగు భూములు ఉండడం రాష్ట్రానికి ఉన్న పాజిటివ్ అంశాలైతే , రెండు ప్రధాన జీవ నదులు, అనేక ఉప నదులు ఉన్నప్పటికీ, భౌగోళికంగా ఉన్న పరిమితుల దృష్ట్యా, సాగు నీటి కోసం విద్యుత్ ఖర్చు పెట్టి నదీ జలాలను ఎత్తి పోసుకోవాల్సిన స్థితి, సముద్ర రవాణా అందుబాటులో లేని కారణంగా, సరుకు రవాణాకు అయ్యే అదనపు ఖర్చులు – కొన్ని పరిమితులను సృష్టించే నెగెటివ్ అంశాలు.

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు, అడవి జంతువుల బెడద లాంటివి రాష్ట్రంలో మోనో క్రాపింగ్ పెరిగి, పంటల వైవిధ్యం తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కున్న ప్రత్యేక సమస్యలను పట్టించుకుని పరిష్కరించడానికి అప్పటి ప్రభుత్వాలు పూనుకోలేదు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో 25,000 మందికి పైగా రాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

2014 లో రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రైతుల జీవితాలు బాగుపడతాయని, ఆత్మహత్యలు ఆగిపోతాయని అందరూ భావించారు. కానీ అధికారం చేపట్టిన KCR ప్రభుత్వ పదేళ్ళ పాలన వ్యవసాయ రంగానికి సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించకపోగా, రాష్ట్ర రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టింది. రాష్ట్రానికి ఒక పంటల ప్రణాళిక చేయలేదు. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిన దశలో పంటల బీమా పథకం అమలు కాలేదు. ఋణమాఫీ హామీలు అమలు కాక సంస్థాగత ఋణ వ్యవస్థ కుప్ప కూలిపోయింది. వ్యవసాయ విద్య, వ్యవసాయ పరిశోధనలు మాయమై పోయాయి.

మొత్తం రైతులలో 35 శాతానికి పెరిగిన కౌలు రైతులకు గుర్తింపు దక్కలేదు. పోడు రైతులకు పూర్తి న్యాయం లభించలేదు. వ్యవసాయంలో 70 శాతం పనులు చేసే గ్రామీణ మహిళలకు రైతులుగా గుర్తింపు రాలేదు. రైతు సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తి దారుల కంపనీలకు ప్రోత్సాహం లభించలేదు. భూమి పట్టా దారులకు తప్ప ,కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. రైతు బీమా కూడా, భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు అమలు కాలేదు.

ఈ విషయాలన్నీ ప్రభుత్వంతో చర్చించడానికి రైతు సంఘాలకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా గత పదేళ్ళలో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు పెరగక పోగా, 92 శాతం రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకు పోయాయి. స్వంత రాష్ట్రం సాధించుకున్నాక కూడా 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి మరణాలకు గుర్తింపూ, ఆయా బాధిత కుటుంబాలకు పరిహారం కూడా దక్కలేదు.

ఈ నేపధ్యంలో కేసీఆర్ పదేళ్ళ నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనను లోతుగా అర్థం చేసుకుని ఆయా రంగాలలో జరిగిన విధ్వంసాన్ని కూడా అవగాహన చేసుకుని, ప్రజలకు విశ్వాసం ఇవ్వడానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొత్త అజెండాతో ప్రజల ముందుకు వెళ్ళాలి. ఎన్నికలలో గెలవడమే లక్ష్యంగా కాకుండా, ఎన్నికలలో ఇచ్చే హామీలను అమలు చేయడానికి కూడా తగిన ప్రణాళికను ఎన్నికల ముందే ఆయా పార్టీలు లోతుగా చర్చించాలి. పైగా ఆయా రంగాలలో కేంద్ర ప్రభుత్వ పాత్ర, జోక్యం దృష్ట్యా, విధాన నిర్ణయాలలో, ఆర్ధిక కేటాయింపులలో రాష్ట్రాలకు ఉండే పరిమితులను కూడా దృష్టిలో ఉంచుకుని హామీలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఎన్నికల మానిఫెస్టోలకు చట్టబద్ధత లేదు కనుక , అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా అలవి కాని హామీలను ప్రజలకు ఇవ్వడం చూస్తున్నాం. ఇచ్చిన హామీల అమలుకు రోడ్ మ్యాప్, కాల పరిమితి, లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు స్పష్టంగా ఉండాలి. అలాగే, హామీల అమలుకు బడ్జెట్ అవసరాలు, ఒక నిర్ధిష్ట హామీ లేదా పథకం అమలుకు ప్రతి సంవత్సరం నిధులు కేటాయించడానికి రాష్ట్ర బడ్జెట్ కు ఉండే పరిమితులు – ఇవన్నీ రాజకీయ పార్టీలు ముందుగానే ఆలోచించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి అప్పటికే ఉండే అప్పులు, ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన అసలు,వడ్డీలు, ప్రతినెలా తప్పకుండా చెల్లించాల్సిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ ల తో పాటు, రిజర్వ్ బ్యాంక్ FRBM నిబంధనల దృష్ట్యా కొత్త అప్పులు చేయడానికి ఉండే పరిమితులను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

ప్రజాస్వామ్యం పట్ల గౌరవం, ప్రజల పట్ల బాధ్యత, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే రాజకీయ నిబద్ధత కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా మొదటి నుండీ ఈ ప్రక్రియ అనుసరించాల్సి ఉంటుంది. కానీ సాధారణంగా ఏ రాజకీయ పార్టీ ఈ సూత్రాన్ని పాటించడం లేదు. ఒక రాజకీయ పార్టీ అధికారానికి రావడం కోసం ప్రణాళికలు రూపొందించి ఇచ్చే ఎన్నికల కన్సల్టెన్సీ లు కూడా, హామీల విషయంలో మాత్రం అవసరమైన ఎక్సర్సైజ్ చేయడం లేదు.

కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రాష్ట్ర రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ డిక్లరేషన్ లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి . ముఖ్యంగా

1. తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా,లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా రాష్ట్రానికి నూతన వ్యవసాయ విధానం , సరైన పంటల ప్రణాళిక రూపొందిస్తాం.

2. వ్యవసాయ రంగ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో ఒక రైతు కమిషన్ ను ఏర్పాటు చేస్తాం. .

3. సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం.

4. రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపు

5. మూతపడిన చక్కర కర్మాగారాలు తెరిపిస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు

6. భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000

7. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000

8. నకిలీ విత్తనాలు,పురుగు మందులపై ఉక్కు పాదం ,కారణ వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు, వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం.

ఈ హామీలు అవసరమైనవి. అమలు చేయగలిగినవి . కానీ ఇదే డిక్లరేషన్ లో ఇచ్చిన కొన్ని హామీలు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా, ఒక రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుని అమలు చేయలేనివి. పూర్తి స్థాయిలో ఆలోచించి ఇచ్చినవి ఎంత మాత్రం కావు.

ఉదాహరణకు :

1. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు ఋణ మాఫీ

2. అన్ని పంటలకు మెరుగైన మద్ధతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు

3. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం.

4. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్ధతు ధర వివరాలు అంటూ ప్రకటించిన ధరలు.

(ప్రతి సంవత్సరం కొన్ని పంటలకు కేంద్రం కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్నప్పుడు, రాష్ట్ర స్థాయిలో ధరల నిర్ణయానికి ఒక సూత్రం అంటూ లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం అవే పంటలకు మళ్ళీ ఎలా మద్దతు ధరలు ప్రకటించగలుగుతుంది ? )

పై నాలుగు అంశాలపై రైతు స్వరాజ్య వేదిక తన అభిప్రాయాన్ని ఎన్నికల ముందే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకు వచ్చింది. ఈ హామీల విషయంలో లోతుగా ఆలోచించాలని చెప్పింది. రాజకీయ కారణాలు ఏవైనా, ఈ హామీలు ప్రజల ముందుకు వెళ్ళాయి. పైగా ఆరు గ్యారంటీల పేరుతో వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలలో వరి పంటకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అనే అంశాన్ని కూడా చేర్చారు.

ఒక్క వరి పంటకు మాత్రమే బోనస్ ప్రకటించడం, అనేక అనర్ధాలకు దారి తీస్తుందని, రాష్ట్ర పంటల పొందికలో తీవ్ర మార్పులకు కారణమవుతుందని మా అభిప్రాయం. పైగా వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోవాల్సిన సమయంలో ఇలాంటి హామీ అసలు మంచిది కాదు.

ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని తొందర పాటు ప్రకటనలు కూడా కాంగ్రెస్ పార్టీ నుండీ, కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల నుండీ వెలువడ్డాయి. అవి కూడా సమగ్రంగా ఆలోచించి చేస్తున్న ప్రకటనలు కావు. మొత్తం వ్యవసాయ రంగ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు, విధాన నిర్ణయాలు తీసుకోకుండా, అటు వైపు కనీస చర్చలు మొదలు పెట్టకుండా, మరో వైపు ముక్కలు ముక్కలుగా వ్యవసాయ రంగంలో వివాదాలకు కారణమయ్యే ఒక్కో అంశం మీద విడి విడిగా ప్రకటనలు చేయడం సమస్యలను పరిష్కరించకపోగా, రాజకీయ కోణంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కాచుకుని కూర్చున్న BRS, BJP లాంటి ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాలను అందించడమే అవుతుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల విషయాలకు సంబంధించి రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడడానికి కారణం కూడా ఇదే. రోజులు గడించిన కొద్దీ మరింత ఒత్తిడికి గురై ఆయా పార్టీల ట్రాప్ లో ప్రభుత్వం పడుతుంది.

ఉదాహరణకు ఈ ప్రభుత్వ పెద్దలు, కొందరు మంత్రులు ఇచ్చిన కొన్ని ప్రకటనలు

1. డిసెంబర్ 9 న రైతు ఋణ మాఫీ చేస్తాం. ( డిసెంబర్ 7 న ప్రభుత్వం ఏర్పడితే, ఒక ఆర్ధిక సంవత్సరం మధ్యలో ఇది ఎలా సాధ్యమో ఆలోచించకుండా చేసిన ప్రకటన ఇది). కనీసం ఒకే విడతలో 30,000-35,000 కోట్ల బడ్జెట్ అవసరమున్న హామీ ఇది.

2. సమగ్రంగా పంటల బీమా పథకం తెస్తాం. ( కానీ దీనిపై లోతైన చర్చ లేకుండానే, కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం లో చేరుతామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు)

3. ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహిస్తాం (ఆయిల్ పామ్ మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనువైన పంట కాదు అని అనేక మంది శాస్త్ర వేత్తలు ప్రకటించి ఉన్న నేపధ్యంలో ఈ ప్రకటన చేశారు.)

4. 2024 ఖరీఫ్ నుండీ వరికి బోనస్ ఇస్తాం అని ప్రకటించారు (ఎన్నికల ముందు అలా చెప్పలేదు, కాబట్టి 2023-2024 రబీ సీజన్ లో కూడా ఈ హామీ అమలు చేయాలని రెండు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేశాయి)

5. తాజాగా సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించారు

(ఈ మాట కూడా ఎన్నికల ముందు చెప్పలేదు. నిజానికి ప్రస్తుత రబీ లో పండిన సన్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వడం లేదు కనుక , ఇది ఇప్పుడు చెప్పవలసిన మాట కూడా కాదు. అసలు వరికి బోనస్ ఇవ్వాలా? పప్పు ధాన్యాలు, నూనెగింజలు, లాంటి పంటల ప్రోత్సాహానికి బోనస్ ఇవ్వాలా ? బోనస్ ఇస్తే ఎకరానికి ఎన్ని క్వింటాళ్లకు ఇవ్వాలి? కేంద్రంలో INDIA కూటమి అధికారంలోకి వచ్చి స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తే అప్పుడు కూడా బోనస్ ఇవ్వాల్సి ఉంటుందా ? ఒకవేళ NDA కూటమి అధికారం లోకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారం లేకుండా ఈ హామీని అమలు చేయగలుగుతుందా? ఎకరానికి 15,000 రైతు భరోసా ఇచ్చి , ఎకరానికి మరో పది వేలు ధాన్యానికి బోనస్ ఇవ్వగలుగుతారా ?

నిధుల సమీకరణ అలా ప్రతి సీజన్ లో సాధ్యమేనా ? ఈ బోనస్ ప్రభుత్వం సేకరించిన ధాన్యానికే ఇస్తారా ? ప్రైవేట్ వ్యాపారులు కొన్నా ఇస్తారా ? ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటకు ఇస్తాం అంటే - ప్రభుత్వమే తమ పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేయరా ?

6. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కాలంలో 200 రైతు ఆత్మహత్యలు జరిగాయని KCR తప్పుడు ప్రచారం చేశారు. నిజంగా ఎన్ని జరిగాయో లెక్క తెప్పించుకుని ఆ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టవచ్చు. కానీ అసలు ఆత్మహత్యలే లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఎలా ప్రకటిస్తారు? రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థ అప్పటికే కొత్త ప్రభుత్వ పీరియడ్ లో 64 రైతు ఆత్మహత్యలు జరిగాయని ప్రకటించి ఉంది. నిజంగా ఈ ఆత్మహత్యలను గుర్తించి ఆ కుటుంబాలను ఆదుకుంటే, రైతులలో భరోసా వస్తుందా? KCR ప్రభుత్వం లాగే అసలు ఆత్మహత్యలు లేవని బుకాయిస్తే భరోసా వస్తుందా?

7. వడగండ్ల వానలకు నష్ట పోయిన రైతులకు ఎకరానికి 10,000 నష్ట పరిహారం అందించడం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది, కానీ రబీ సీజన్ చివరిలో కరువు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పటికి ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రాలేదు. ఆ సమయంలో కరువు మండలాలు ప్రకటించి ఉంటే రైతులకు భరోసా వచ్చేది. కేంద్ర సహాయం తీసుకుని పరిహారం ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వ పెద్దలు, ఎందువల్లనో కాలయాపన చేసి ఆ విషయంలో మౌనంగానే ఉండిపోయారు. రైతులకు భరోసా ఇచ్చే ఎలాంటి ప్రకటనా ప్రభుత్వం వైపు నుండీ రాలేదు.

8. డిసెంబర్ 7 కూ మార్చ్ 16 న ఎన్నికల కోడ్ రావడానికీ మధ్య మూడు నెలలు సమయం ఉండింది. కానీ రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండీ సరైన అడుగులు పడలేదు. రైతు కమిషన్ వేస్తామని ప్రకటించినా, అందుకు వేగంగా నిర్ణయం తీసుకోలేదు.

9. వచ్చే ఖరీఫ్ నుండీ పంటల ప్రణాళిక ఎలా ఉండాలి? నూతన వ్యవసాయ విధానం ఎలా ఉండాలి? రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు ఎలా? రైతు భరోసాకు అర్హులయ్యే వ్యవసాయ కూలీల గుర్తింపు ఎలా? పంటల బీమా పథకం ఎలా ఉండాలి? రైతు బీమా మార్గదర్శకాలలో రావలసిన మార్పులు ఏమిటి? లాంటివి రైతులలో, రైతు సంఘాలతో అప్పుడే చర్చకు తేవాల్సింది. నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకున్నా, చర్చలో మిగిలిన వారిని భాగస్వాములను చేయడం ఎక్కువ పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది.

10. అవసరమైన సమయానికి అవసరమైన నిర్ణయాలు చేయకపోవడం ఎంత తప్పో , అనవసర సమయాలలో అరకొర ప్రకటనలు చేయడం అంతే తప్పు. రెండూ ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడానికే దారి తీస్తాయి. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడానికి ఉపయోగ పడతాయి. ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి BRS,BJP కంకణం కట్టుకుని పని చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణ ప్రజలు ఇచ్చిన ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యవసాయం, రైతులు, కూలీలు, గ్రామీణాభివృద్ధి కేంద్రంగా సరిగా ఆలోచించి ప్రభుత్వం పని చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని గుర్తించాలి.

(కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్)

Read More
Next Story