
‘భారత్ బంద్’ సందేశం ఏమిటి?
ఇండియా కూటమి ప్రభుత్వాలు కూడా బీజేపీ మార్గంలోనే పోతే ప్రత్యామ్నాయం ఎలా అవుతాయి?
సుదీర్ఘ కాలం తరువాత 2025 జులై 9 న హైదరాబాద్ నగరం మరోసారి కార్మికులు, రైతులు, రైతు కూలీలు ఎరుపు , ఆకు పచ్చ, నీలం జండాలతో చేసిన ప్రదర్శనతో ఎర్ర బారింది . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేసిన నినాదాలతో మారుమోగింది.
వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు,వ్యవసాయ కూలీ సంఘాలు, దళిత సంఘాలు ఉమ్మడిగా ఈ ప్రదర్శనకు ప్రజలను సమీకరించాయి. అసంఘటిత రంగ కార్మిక సంఘాల సభ్యులు, పెన్షనర్ లు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు కూడా భారీగా తరలి వచ్చారు. బాగ్ లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండీ ఇందిరా పార్క్ వరకూ జరిగిన ఈ ప్రదర్శన అందరిలో అత్యంత ఉత్తేజాన్ని నింపింది.
జులై 9 న భారత దేశ వ్యాపితంగా కార్మికుల సార్వత్రిక సమ్మె, రైతులు,కూలీలు గ్రామీణ, సడక్ బంద్ నిర్వహించాలని ప్రధాన కార్మిక సంఘాలతో కూడిన ఐక్య వేదిక , దేశ వ్యాపిత రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(SKM) లు ఉమ్మడిగా పిలుపు ఇచ్చాయి.
2020 లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా, దేశ వ్యాపితంగా రైతాంగం రోడ్ల మీదికి వచ్చింది. ఆఖల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ( AIKSCC) పంజాబ్,హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతులు ముందు వరసలో నిలబడి ఈ పోరాటాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగిలిన రాష్ట్రాల రైతాంగం వారిని అనుసరించింది. కరోనా సమయంలో సాగిన ఈ రైతు ఉద్యమం, దేశ ప్రజలను ఐక్యం చేసింది. కేంద్ర పాలకులను కదిలించింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, 700 మంది ప్రాణ త్యాగాలతో సాగిన ఈ ఉద్యమం అంతిమంగా మూడు కార్పొరేట్ చట్టాలను మోడీ ప్రభుత్వం వెనక్కు తీసుకునేలా చేసింది.
కానీ ఆ ఉద్యమం లేవ నెత్తిన ముఖ్యమైన మరో ఐదు డిమాండ్లను కేంద్రం ఇప్పటికీ పరిష్కరించలేదు. అందులో కీలకమైనది, కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత. దేశంలో పండే మొత్తం పంటలకు, పశు ఉత్పత్తులకు కూడా కనీస మద్ధతు ధరలను ప్రకటించడం, రెండవది, రైతాంగ ఉద్యమంలో అమరులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించడం, మూడవది, దేశ వ్యాపితంగా ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రైతులకు ఉన్న అప్పులను ఒకసారి మాఫీ చేయడం, నాలగవది రైతాంగ ఉద్యమం సందర్భంగా వివిధ రాష్ట్రాలలో ప్రజలపై, రైతులపై, నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, ఐదవది విద్యుత్ పంపిణీ, సరఫరాను ప్రైవేటీకరించే విద్యుత్ బిల్లు- 2020 ని పూర్తిగా ఉపసంహరించుకోవడం లాంటివి ఇందులో ఉన్నాయి.
ఇవే కాకుండా 2013 భూసేకరణ చట్టాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని నీరు కార్చేలా తీసుకువచ్చిన సవరణలను కూడా ఉపసంహరించుకోవాలని రైతాంగ ఉద్యమం డిమాండ్ చేసింది. వ్యవసాయ కూలీలకు సాంఘిక బధ్రత, వ్యవసాయ కుటుంబాల సభ్యులకు గౌరవప్రదమైన పెన్షన్ , ఉపాధి హామీ చట్టాన్ని చట్టం స్పూర్తితో పూర్తి స్థాయిలో అమలు చేయడం లాంటి అంశాలు కూడా ఈ ఉద్యమ డిమాండ్లలో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఇక్కడి రైతు సంఘాలు మరి కొన్ని డిమాండ్లను ముందుకు తెచ్చాయి. రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించాలని, వ్యవసాయ కూలీలకు కూడా రైతు బీమా పథకాన్ని విస్తరించాలని, రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, సమగ్ర వ్యవసాయ విధానం, శాస్త్రీయ పంటల ప్రణాళిక అమలు చేయాలని, రాష్ట్ర స్థాయిలో విత్తన చట్టాన్ని తెచ్చి, కల్తీ విత్తనాలను అరికట్టాలని, విత్తనోత్పత్తి చేసే రైతులకు కంపనీల నుండీ రక్షణ కల్పించాలని, నష్టపోయిన విత్తన వినియోగ రైతులకు నష్ట పరిహారం పెంచాలని, విత్తన ధరలను అదుపులో ఉంచాలని, 2017 భూ సేకరణ చట్టాన్ని కాకుండా, 2013 భూ సేకరణ చట్టాని అమలు చేయాలని, అభివృద్ధి పేరుతో అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కోవడం మానేయాలని కూడా డిమాండ్ చేశాయి.
మోడీ ప్రభుత్వం దేశంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో, కామరమికుల హక్కులను హరించడానికి ఇప్పటికే ఉనికిలో ఉన్న కార్మిక చట్టాలను రద్ధు చేసి, 2020 లో 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్ లు, కార్మికులను వెట్టి బానిసలుగా మారుస్తాయి. పని గంటల పెంపు , హైర్ అండ్ ఫైర్ లాంటివి ఈ లేబర్ కోడ్ లలో ఉన్నాయి. ఈ లేబర్ కోడ్ ల ప్రకారం అతి తక్కువ కనీస వేతనాలను నిర్ణయించారు. కార్మికులు కార్మిక సంఘాలను రిజిస్టర్ చేసుకునే ప్రక్రియను కష్ట తరంగా మార్చారు.
ఈ లేబర్ కోడ్ లను రద్ధు చేసి , పాత కార్మిక చట్టాలను మరింత బలోపేతం చేసి అమలు చేయాలని కార్మిక సంఘాలు జులై 9 సమ్మెలో ప్రధాన డిమాండ్ గా ముందుకు తెచ్చాయి. అలాగే 8 వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. రెండు రకాల పెన్షన్ పద్ధతులను రద్ధు చేయాలని , ఒకే పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని, పెన్షనర్ లకు కూడా వేతన సవరణల సమయంలో పెంపు వర్తింపు చేయాలని, దేశ వ్యాపితంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దేశ వ్యాపితంగా మూసి వేసిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను తెరిపించాలని, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ లను అమలు చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
రాష్ట్ర స్థాయిలో కూడా కార్మిక సంఘాలు కొన్ని నిర్ధిష్ట డిమాండ్లను ముందుకు తెచ్చాయి. బీడీ కార్మికులకు గడువు లేకుండా ఆసరా పెన్షన్ వర్తింప చేయాలని, బీడీ కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, గిగ్ అండ్ ప్లాట్ ఫారం కార్మికులకు సమగ్ర చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని , హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, గృహ కార్మికులకు ఒక సమగ్ర చట్టాన్ని తేవాలని, సింగరేణి, ఆర్టీసీ సహా ప్రభుత్వ రంగ సంస్థలలో,యూనివర్సిటీ లలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు రోజుకు 800 రూపాయల కనీస వేతనాన్ని నిర్ణయించాలని, రాష్ట్ర స్థాయిలో అన్ని రంగాలలో కనీస వేతన జీవోలను ప్రకటించాలని, కార్మికులందరికే పి. ఎఫ్ ,ESI లాంటి సౌకర్యాలను అమలు చేయాలని, పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు, మరణించిన వారికి కనీసం కోటి రూపాయల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50,00,000 పరిహారం, గాయాల పాలైన వారికి 10,00,000 పరిహారం చెల్లించాలని, ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని, వివిధ రాష్ట్రాల నుండీ వలస వస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని, రాష్ట్రంలో పెరుగుతున్న కార్మికుల సంఖ్యకు అనుగుణంగా కార్మిక శాఖను బలోపేతం చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో మూడు కోట్లకు పైగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం విధానాలు రూపొందించకుండా కాలయాపన చేస్తున్నది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, నగరీకరణ పేరుతో, కార్పొరేట్లను, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటుకు కూడా కారణమవుతున్నది. పైగా ఆ పరిశ్రమలలో ప్రమాదాలు జరుగుతున్నా, కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నా, రాష్ట్ర పర్యావరణం దెబ్బ తింటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
పైగా కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్ లకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా వాణిజ్య సంస్థలలో ( దుకాణాలు కాకుండా) 8 గంటల పని దినాన్ని , 10 గంటలకు పెంచుతూ, జులై 8 నుండీ అమలయ్యేలా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని పరిశ్రమలకు కూడా విస్తరించాలని చూస్తున్నది. 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచడం 8 గంటల పని దినం కోసం పోరాడిన కార్మికుల త్యాగాలకు, మేడే స్పూర్తికి, కార్మిక చట్టాలకు భిన్నమైనది. దీనిని రాష్ట్ర ప్రభుత్వ గుర్తించి, తాను విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని ఈ రోజు సమ్మెలో ఉన్న కార్మికులు డిమాండ్ చేశారు.
సులభతర వాణిజ్యం పేరుతో, పెట్టుబడిదారులకు మేలు చేసేలా రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం , కార్మిక వ్యతిరేకమైనది. బీజేపే అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ తీసుకున్న నిర్ణయం ఇది. ఇండియా కూటమి ప్రభుత్వం కూడా బీజేపీ మార్గంలోనే పోతే, ఇంకా ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?ఇండియా కూటమి ప్రభుత్వం కూడా బీజేపీ మార్గంలోనే పోతే, ఇంకా ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది?
Next Story