విధేయత.. బానిసత్వం.. రెండింటికీ ఒకే మర్యాద ఇచ్చారుగా..
సొంత పార్టీ నాయకులపై మారని కాంగ్రెస్ వైఖరి
విధేయత.. బానిసత్వం.. రెండింటి మధ్య తేడా ఏంటీ? విధేయతలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంటే ఏదైన విషయం తప్పైన, ఒప్పైనా గౌరవంగా, మర్యాదగా పరిస్కరించుకునే అవకాశం ఉంటుంది. పరస్పర గౌరవం గుర్తింపుతోనే వ్యవహారం నడుస్తుంది.
అదే బానిసత్వంలో యజమాని అనే వాడు తయారవుతాడు. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాలి. ఎదురు చెప్పడానికి, సలహాలు, సూచనలు ఇవ్వడానికి బానిసకు స్వేచ్ఛ వుండదు. వీలులేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటారా? ఇద్దరు మాజీ ప్రధానులకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలు చూస్తే మీకు అర్థవుతుంది.
ఢిల్లీలోని యుమునా నదిలో సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్థికల నిమజ్జనం సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీకి చెందిన పేరున్న నాయకుడూ ఎవ్వరూ హజరు కాలేదు. గాంధీల కుటుంబం సంగతి పక్కన పెడితే కనీసం పేరున్న నాయకుడు ఒక్కరంటే.. ఒక్కరూ కూడా రాలేదు.
దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏంటంటే.. ‘‘ వారి ఏకాంతానికి భంగం కలిగించకూడదనే మేం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు’’ అని వివరణ ఇచ్చింది. ఈ సమాధానం ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. ఒక్కసారి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లండి..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన తరువాత అంత్యక్రియలు సరిగా నిర్వహించకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి మంత్రి కే. రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ పని మొత్తం కుటుంబ సభ్యులు చూసుకుంటారు. హిందూ సాంప్రదాయం అంటూ ’’ వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ కు ఈ విధానం అలవాటే..
పార్టీని నిలబెట్టిన నాయకులను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. అనేక మంది నాయకులను ఇలా అది ఘోరంగా అవమానించింది. పీవీ నరసింహారావు విషయాన్ని తీసుకుంటే.. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. అంతకుమించి దేశాన్ని క్లిష్టపరిస్థితుల నుంచి గట్టెక్కించారు. ఆర్థికంగా దివాలా తీసే స్థితి నుంచి, విదేశీ మారకాన్ని నిల్వలు భారీగా పెంచారు. అలాంటి నాయకుడికి కాంగ్రెస్ నుంచి సరైన గౌరవం దక్కలేదు.
అధికారంలో ఉన్నప్పుడు నమోదైన అన్ని కేసుల నుంచి రక్షించుకోవడానికి తన సొంత ఆర్థిక వనరులనే ఉపయోగించాడు. చివరకు పీవీ మరణిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన పార్ధీవ దేహాన్ని రానివ్వలేదు. చివరకు మాజీ ప్రధానులకు ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహిస్తే.. పీవీకి మాత్రం ఆ గౌరవం దక్కనివ్వలేదు.
ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పంపించేశారు. చివరకు అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేక విమర్శలు మూటగట్టుకుంది. ఆయన పేరు మీద ఓ స్మారకం కూడా నిర్మించలేదు. అప్పటి వరకూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని దారుణంగా అవమానించి పంపింది. తరువాత ఆయన ఏమయ్యారో చెప్పాలంటే.. పాత పేపర్లన్నీ క్షుణ్ణంగా వెతకాల్సిందే. అయితే ఆయన సమాచారం దొరుకుతుందని గ్యారెంటీ మాత్రం ఇవ్వలేము.
పీవీకి జరిగిన ఘోర అవమానంపై ప్రస్తుతం ఆయన సోదరుడు పీవీ మనోహార్ రావు స్పందించారు. దేశానికి ప్రధానిగా సేవలందించిన వారందరికి ఢిల్లీలోనే అంత్యక్రియలు జరిగాయి. వాళ్ల పేరు మీద స్మారకాలు ఉన్నాయి. కానీ పీవీకి ఆ గౌరవం కాంగ్రెస్ హయాంలో దక్కలేదని ఆయన మాట. నిజమే ఆయన ఆవేదన అర్థముంది.
ఆరునెలలు, సంవత్సరం పాటు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వారందరికి మాజీ ప్రధానులుగా గౌరవం దక్కించుకున్నారు. కానీ తెలంగాణ ముద్దు బిడ్డ పీవీని మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు.
గురువు కంటే శిష్యుడికే కాస్త గౌరవం.. కానీ..
పీవీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఒంటబట్టించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, చందా క్యాంపులో కొన్ని రోజుల పాటు ఉన్నారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో చురుకుగా పాల్గొన్నారు. నెహ్రూనూ తన రోల్ మోడల్ గా ఆరాధించారు.
కాంగ్రెస్ రెండుగా చీలిన సమయంలో కూడా ఇందిరాగాంధీ వైపే నిలబడ్డారు. తరువాత సీఎంగా ఉండి పార్టీ ప్రతిపాదించిన భూసంస్కరణలను అమలు చేశారు. స్వగ్రామం వంగరలో తన స్వంత భూమి 1000 ఎకరాలను దళితులు, బీసీలు ఇతర కులాలకు చెందిన ప్రజలకు పంచారు. తను చేతల మనిషినని చాటుకున్నారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
ప్రస్తుతం ఇవే భూములను తెలంగాణ ప్రభుత్వం సేకరించి ఫుడ్ ప్యాక్టరీని నిర్మిస్తోంది. ఇక్కడ బహిరంగ మార్కెట్ లో ఎకరం ధర 60 నుంచి 70 లక్షలు ఉంది. ఆయన భూమి పేదలకు పంచిన భూమి మొత్తం సిద్ధిపేట- హనుమకొండ ప్రధాన రహదారికి దగ్గరలో ఉంది. కానీ ఆయన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అంతటి విలువైన భూమిని పేదల పరం చేశారు. కానీ అవసాన దశలో కేసులను ఎదుర్కోవడానికి నానా కష్టాలు పడ్డారు.
మన్మోహాన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గం కంటే సోనియా గాంధీ నేతృత్వంలోని కోర్ కమిటీ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం దక్కింది. సంజయ్ బారు రాసిన ‘‘ ది ఆక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్(The Accidental Prime Minister)’’ పుస్తకం ప్రకారం.. ప్రతి నిర్ణయం పీఎంఓ కంటే వేరే దగ్గరే( అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు) ఎక్కువగా జరిగేదని తను స్వయంగా ఆ విషయాలను చూసి పుస్తకంలో రాశానని చెప్పారు.
అందుకే సింగ్ ను రిమోట్ కంట్రోల్ ప్రధానిగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఏ ఒక్కసారి అధినాయకత్వానికి ఆయన ఎదురు చెప్పలేదు. ఆఖరికి తన మంత్రివర్గం ఓ అంశం పై నిర్ణయం తీసుకుంటే రాహుల్ గాంధీ వచ్చి సదరు పేపర్లను మీడియా సమావేశంలో చించిపారేశారు.
దానిపై కూడా మౌన మోహనుడు నోరు విప్పలేదు. బహుశా అందుకేనేమో ఆయన పార్థీవ దేహానికి ఏఐసీసీ కార్యాలయానికి ప్రవేశం దక్కింది. ఆయన పేరు మీద స్మారకం ఇవ్వాలని పార్టీ డిమాండ్ చేసింది. ఆయన పై గౌరవం అక్కడితో ఆగిపోయింది. దీన్నే మహాప్రసాదంగా కళ్లకద్దుకునే వారు ఉన్నారు. కానీ ఒక్కరోజులోనే దాని నైజం భయటపడింది. ఆయన ఆస్థి నిమజ్జనానికి పార్టీ నుంచి ఒక్కరూ కూడా రాలేదు.
శత్రువులకు కూడా మర్యాద
1999 లో జరిగిన కార్గిల్ వార్ గుర్తుందా? పాక్ తన సైనికులకు ముజాహిదీన్ వేషం వేసి మనపైకి యుద్ధానికి పంపింది. కానీ వారంతా భారత సైన్యం చేతిలో హతమయ్యారు. పాకిస్తాన్.. వాళ్లంతా మా వాళ్లు కాదని మృత దేహాలను తీసుకోవడానికి నిరాకరించింది.
అప్పుడు భారత సైనికులే ఆ మృతదేహాలకు వారి మత సాంప్రదాయం ప్రకారం గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించింది. వారు శత్రువులు అయినప్పటికీ ఎలాంటి వివక్ష చూపలేదు. మనం రామాయణం తీసుకున్నా.. రావణుడు యుద్ధ భూమిలో నేలకొరిగిన తరువాత అన్న అంత్యక్రియలు చేయడానికి విభీషణుడు నిరాకరించాడు. అప్పుడు శ్రీరాముడు స్వయంగా తానే అంత్యక్రియలు చేస్తానని, చనిపోయిన వాడితో వైరం ఎందుకని అంటాడు. దానితో విభీషణుడు అంత్యేష్టి క్రియలు నిర్వహిస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం మీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది.
మిగిలిన విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించింది. ..
అంబేడ్కర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే వ్యవహరించింది. ఆయనను రెండుసార్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించిందనేది నిర్వివాదాంశం. మంత్రివర్గంలో కూడా ఆయన మాట చెల్లుబాటు కానివ్వలేదని, నామ్ కే వాస్తు మంత్రిగా విధులు నిర్వర్తించేలా చేసిందని బీజేపీ విమర్శలు గుప్పించింది.
చివరకు ఆయనకు ‘‘భారతరత్న’’ కూడా ఇవ్వకుండా అవమానించిందని మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆరోపణలు సంధించింది. కానీ వీటికి కాంగ్రెస్ నుంచి సరైన సమాధానం లేదు.. బహుశా రాకపోవచ్చు.. గట్టిగా తవ్వితే అన్ని తనమెడకు చుట్టుకుంటాయని వాటికి సమాధానాలు ఇవ్వకుండా తెలివిగా తప్పించుకుంది.
ఆధునిక కాలంలో ఈ పోకడ మరింత ఎక్కువైంది. ఇందిరాగాంధీ మరణం తరువాత తరువాత ప్రధాని ఎవరనే అంశం పై ప్రణబ్ ముఖర్జీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. పార్టీలో తనే సీనియర్ అని తనకే ప్రధానిగా ఛాన్స్ ఉందన్నారు. కానీ సీన్ కట్ చేస్తే రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
తరువాత పార్టీ నుంచి స్వయంగా వెళ్లిపోయేలా పావులు కదిపింది. ప్రస్తుతం ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. మన్మోహన్ కు స్మారకం డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రణబ్ కూతురు శర్మిష్ఠ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి విషయంలో అలా ఎందుకు అడగలేదని కడిగిపారేశారు. దీనిపై కూడా ఏఐసీసీ నుంచి సమాధానం లేదు.. వస్తుందని ఆశించడం కూడా తప్పే అవుతుంది.
అందరికి తెలిసిన విషయం ఏంటంటే అక్కడ పదవులు, గౌరవం కేవలం ఒక్క కుటుంబానివే. ఇదే విషయం శరద్ పవార్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన తరువాత మహారాష్ట్రలో సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు అక్కడి ఎన్నికల్లో ఆయన మాట జవదాటే పరిస్థితి లేదు.
మమతా బెనర్జీకి ఢిల్లీ నాయకత్వం సరిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తనో సొంత పార్టీని పెట్టుకుని గత 15 సంవత్సరాలుగా అప్రహాతితంగా బెంగాల్ లో రాజ్యమేలుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పది స్థానాలు కావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే ‘‘ ఇచ్చింది తీసుకోండి.. లేకపోతే పొండి’’ అని కసురుకున్నంత పనిచేసింది బెనర్జీ.
ఇప్పుడు ‘ఇండి’ కూటమికి తనే సమర్థ నాయకురాలినని ప్రకటించుకుంది. తన నిర్ణయాన్ని లాలు ప్రసాద్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలు కూడా సమర్థించారు. ఇంత జరిగిన కాంగ్రెస్ వైఖరిలో మార్పురాలేదు. తాజాగా మన్మోహన్ సింగ్ సంతాప దినాలు దేశంలో జరుగుతుంటే.. గాంధీ ఫ్యామిలి మాత్రం కొత్త సంవత్సరం వేడుకలకి వియత్నాం వెళ్లినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ విషయంలో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైఎస్ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది. టీడీపీ ధాటికి దాదాపు పది సంవత్సరాలుగా అసలు సోదిలో లేని కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించి తిరుగులేని విధంగా అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ దే.
రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చి మంచి స్థితిలో నిలబెట్టారు. కానీ ఆయన మరణం తరువాత కొడుకు మీద కేసులు ప్రారంభం అయ్యాయి. ఏకంగా 16 నెలలు జైళ్లోనే వైఎస్ జగన్ గడపాల్సి వచ్చింది. తమ పార్టీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారణం వైఎస్ఆర్ .. 2009 లో ఏపీ నుంచి ఆయన ఆధ్వర్యంలోనే 33 ఎంపీ స్థానాలను పార్టీ గెల్చుకుంది.
అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకాల వల్లే టీడీపీ పుట్టుకొచ్చింది. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులతో తనకు నచ్చిన వారిని పీఠం మీద కూర్చో బెట్టింది. అసలు వారికి ప్రజాబలం ఉందా.. లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు. విధేయత పేరుతో రాజకీయాలను భ్రష్టుపట్టించింది.
చివరకు సొంత పార్టీ ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించడంతో తెలుగువారిలో కాంగ్రెస్ పట్ల అసంతృప్తి మొదలయింది. అదే చివరకూ 1982 లో టీడీపీ ఆవిర్భావానికి దారి తీసింది. కథా నాయకుడు రాజకీయ నాయకుడై సీఎంగా పగ్గాలు చేపట్టారు.
ఇక హిమాంత్ బిశ్వ శర్మ.. ఇప్పుడు అసోం సీఎం, బీజేపీలో తిరుగులేని నేతగా ఉన్నాడు.. కానీ ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ లీడర్. పార్టీ గురించి రాహుల్ గాంధీతో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. అస్సాం లోని కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రావడంతో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఆయన కోరారు. కానీ రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనకు అసలు ఒప్పుకోలేదు నిజానికి పట్టించుకోలేదు.
ఈ అవమానంతో ఆయన చివరకు 2015 లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్ తన ఆత్మకథ అయిన ‘‘ ఆజాద్: ఏన్ ఆటోబయోగ్రఫి(Azaad : An Autobiography)’’ పుస్తకంలో రాశారు. ఇప్పుడు అసోంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ? అక్కడ బీజేపీ హవా కొనసాగుతోంది.
ఫీల్డ్ మార్షల్ సామ్ బహదూర్ షా గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 1971 లో భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్దం జరగడానికి ముందు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1971 జూన్ లోనే యుద్దం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ నిర్ణయాన్ని షా తప్పు పట్టారు. ఇప్పుడు యుద్ధం చేస్తే మనం ఓడిపోకతప్పదని హెచ్చరించారు.
చివరకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ మధ్యకాలం వరకూ ఆగాల్సిందే అని చెప్పారు. చివరకూ ఆయన నిర్ణయం మేరకు డిసెంబర్ లో యుద్దం జరిగి, భారత్ విజయం సాధించింది. కానీ ఆయన రిటైర్ అయిన తరువాత ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను మాత్రం ఇవ్వలేదు. ఆయన చివరకూ హస్పిటల్ లో ఉండగా రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం వాటిని క్లియర్ చేశారు.
కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మారుతుందా.. ఇదే రాజరిక పోకడలకు దిగుతుందా? దాని వైభవం, అధికారం క్రమక్రమంగా పడిపోతూ వస్తోంది. అయినా దాని వైఖరిలో మార్పు రాలేదు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా.. నిర్ణయాలు ఎవరూ తీసుకుంటారో.. అధ్యక్షుడు కూడా నిత్యం ఎవరి భజన చేస్తారో బహిరంగ రహస్యమే. ఇలాంటి వైఖరి వల్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతున్నా పట్టించుకోవడం కోలేదు. మన్మోహన్, పీవీ మరణించిన సమయాల్లో దాని కుసంస్కారాన్ని బయటపెట్టుకుంటూనే ఉంది.
Next Story