
ఈ వారం తెలంగాణ వార్తల్లో వ్యక్తి .... మీనాక్షినటరాజన్ ...
మీనాక్షి కాంగ్రెసోళ్లకు ఇబ్బందే, ప్రతిపక్షాలకు ఇబ్బందే. ఎందుకంటే....
మీనాక్షి నటరాజన్ ...ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఈమె పేరు మారుమోగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం కాస్త చల్లబడింది. ప్రభుత్వం, యూనివర్సిటీ మధ్య గ్యాప్ తగ్గింది. విద్యార్ధులపై ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకున్నారు.గత వారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వార్తలకెక్కింది. అక్కడ ఏదో జరిగిపోతోందని ప్రభుత్వం అరాచకం చేస్తోందని, కొన్ని విద్యార్ధి సంఘాలు, అంతకుమించి విపక్షాలు, వాటికి తోడైన మీడియా , ఇలాంటి వార్తలతో గత వారమంతా హాట్ హాట్ గా నడిచింది. విపక్షాలు సర్కారు ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాయి. ఇప్పుడు సీన్ రివర్స్ ,HCUలో ప్రశాంతం , బలగాలు వెనక్కి, కేసుల ఎత్తివేత. ఇదంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చొరవే.
మీనాక్షి ఏమి చేశారంటే....
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ , కంచె గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన 400 ఎకరాల ల్యాండ్ డెవలప్ మెంట్ వివాదం కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఆ భూముల అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణాన్ని, హెచ్ సీ యూ ని పట్టించుకోకుండా దూకుడుగా వ్యవహరిస్తోందని వర్శిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పర్యావరణ వేత్తలు నిరసన తెలిపారు. శృతిమించిన ఈ వివాదం సుప్రీంకోర్టు చేతులలోకి వెళ్లి, కోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ హైకమాండ్ రంగంలో దిగి , సమస్యను సమీక్షించే బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ చేతుల్లో పెట్టి హుటాహుటిన హైదరాబాద్ పంపించింది. ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ హుటాహుటిన గాంధీ భవన్ లో పార్టీ నేతల నుంచి సమాచారం సేకరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI నేతలూ ఆమెను కలిసి వివరాలు అందించారు.
ఆ తరువాత హెచ్ సీ యూ వివాద పరిష్కారం కోసం సమీక్షా సమావేశాలను సచివాలయంలో మంత్రులతో నిర్వహించారు. తనకున్న అనుభవంతో ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి వివాదం పెద్దది కాకుండా ఆపగలిగారు. తమ ప్రభుత్వానికి మచ్చ రాకుండా సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు. మొన్నటి దాకా ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన విపక్షాలకు మీనాక్షి నటరాజన్ రంగంలో దిగిన తరువాత అవకాశం లేకుండా పోయింది.
రూట్ మార్చిన విపక్షాలు..
HCUభూముల వివాదం సద్దుమణుగుతూ ప్రభుత్వం కుదుటపడుతున్న వేళ సమస్యను కొలిక్కి తెస్తున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను విపక్షాలు టార్గెట్ చేయడంతో మరోమారు ఆమె రాష్ట్ర రాజకీయాలలో చర్చగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్ కు పరిమితం కాకుండా సచివాలయంలో సమీక్షలు నిర్వహించడం ఆరోపణలకు పదునుబెట్టారు. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి డమ్మీగా మారారంటూ విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బాహాటంగా కాకపోయినా , విపక్షాలతో గొంతు కలిపి మా నాయకురాలు , సచివాలయంలో రివ్యూలు నిర్వహించడం తప్పేనంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అసలు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ చేసిందేమిటి.. తమ ప్రభుత్వానికి సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ట్రబుల్ ఘాటర్ గా నిలబడ్డారని ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటే విపక్షాల కెందుకని కాంగ్రెస్ సీనియర్లు, అమెకు మద్దతిచ్చేవారు వాదిస్తున్నారు. విపక్షాల విమర్శలు, కాంగ్రెస్ నేతల ప్రతివిమర్శలతో మీనాక్షి నటరాజన్ వార్తలలో వ్యక్తిగా నిలిచారు. అయితే ఎంత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ అయినా , మంత్రులు, అధికారులకే హక్కున్న సెక్రటేరియట్ లో మంత్రులతో సమీక్షలు నిర్వహించడం , దానికి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రోత్సహించడం కూడా తప్పేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మీనాక్షి నటరాజన్ వైఖరి ఏంటి?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్ ఫిబ్రవరిలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గా నియమితులైయ్యారు. పార్టీలో క్రమశిక్షణ, సమన్వయం పెంచడానికి వచ్చినట్లు ఆమె అప్పుడే ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే తాను
మిగిలిన ఇన్ ఛార్జ్ ల కన్నా భిన్నమన్న సంకేతాలు ఇచ్చారు. సాధారణంగా వుంటానని, హంగులు ఆర్భాటాలు వద్దని పార్టీ నేతలను వారించారు.పార్టీ గీత దాటితే ఒప్పుకునేదే లేదని, వచ్చిన వెంటనే కొందరిపై పార్టీ పరంగా కొరడా ఝళిపించారు.ఆమె సాధారణ ప్రయాణికురాలిలా రైల్లో రావడం, పార్టీ కేడర్ ను ఆర్భాటాలకు దూరంగా ఉండాలని ఆదేశించడంతో పార్టీలో మార్పు కనిపిస్తుందని అందరూ భావించారు. ఇంతకుముందు కాంగ్రెస్ ఇంఛార్జ్ లు కొందరిని ప్రలోభపెట్టి తమ పనులు అయ్యేలా చూసుకొని, పదవులు పొందిన కొందరు కాంగ్రెస్ సీనియర్లకు మీనాక్షి నటరాజన్ మింగుడు పడటంలేదు. అలాంటి నేతలు ప్రస్తుత వివాదాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
ఏదైమైనా ఇప్పుడు ఆమె వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంత క్రమశిక్షణతో వుండే మేడమ్ ఎందుకు సచివాలయంలో రివ్యూలు పెట్టారో గాని,అసలే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లు టార్గెట్ గా చేసుకుని విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో వారికి మరో అవకాశం ఇవ్వడం సరికాదు. కొన్ని రోజులలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ వివాదాలకు అతీతంగా ఇంకా చురుకుగా వ్యవహరించాల్సివుంది.