‘పళని’ ఆలయ ప్రవేశంపై ముదురుతున్న వివాదం
మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తీర్పు భిన్నమైనదని ఒకరు, ఆచరణకు సాధ్యం కాదని మరొకరు పేరొంటున్నారు.
హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైందవేతరులు ఆలయ ధ్వజస్తంభం దాటి వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. తమ మతాచారాలను కాపాడుకోవడం హిందూవులు ప్రాథమిక హక్కు అని మదురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి పేర్కొన్నారు. ఆలయాలు పిక్నిక్ స్పాట్లు, టూరిస్ట్ ప్లేస్‌లు కావని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని ఆలయాల్లోకి ప్రవేశించిన హైందవేతరులు మాంసం తినడం, వారి మత గ్రంథాలను చదివేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది.
హిందూ దేవాలయాల్లో బోర్డులు పెట్టండి..
అన్యమతస్థుల ప్రవేశంపై అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాలలో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం సూచించింది. ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘హిందూయేతరులను అనుమతించరు’ అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ప్రమాణ పత్రం తీసుకోండి..
హిందూ దేవాలయాలను సందర్శించే హైందవేతరుల వివరాలను నమోదు చేయాలని సూచించింది. తాము ఆ దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నానని ప్రమాణపత్రం దాఖలు చేయాల్సి ఉంటుందని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది.
కేసు ఎందుకు వేశారు?
‘పళని దండాయుధపాణి స్వామి’ ఆలయంలోకి హిందూవులు కానివారిని అనుమతించవద్దని పళినికి చెందిన ‘పళని హిల్ టెంపుల్ డివోటీస్ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్ డి సెంథిల్ కుమార్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ‘హిందూవులు కాని వారికి పళని ఆలయంలోకి ప్రవేశం నిషిద్దం’ అనే బోర్డు ఉండేదని, కానీ ఆలయ పునరుద్ధరణ తరువాత ఆ బోర్డును అధికారులు ఏర్పాటు చేయలేదని సెంథిల్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. దయచేసి ఆ బోర్డును ఇప్పుడు తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. సెంథిల్ కుమార్ తరుపున లాయర్ ఆర్‌ఎం అరుణ్ స్వామనాథన్‌ను ఈ కేసును వాదించారు. ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చారు. తమిళనాడులోని హిందూ ఆలయాలను హెచ్‌ఆర్‌సీఈ విభాగం పర్యవేక్షిస్తోంది.
కేసు వేయడానికి ప్రేరేపించిందేమిటి?
షాహుల్ అనే పండ్ల దుకాణం వ్యాపారి బురఖాలు ధరించిన తన బంధువులను పళని ఆలయానికి తీసుకువచ్చాడు. ఆలయం కొండపైకి వెళ్లేందుకు టిక్కెట్లు కొనుగోలు చేశారు. బురఖా ధరించిన మహిళలను చూసిన అధికారులు టిక్కెట్లను వెనక్కి తీసుకున్నారు. దాంతో షాహుల్ వారితో వాగ్వాదానికి దిగాడు. ‘‘ఇది పర్యాటక ప్రదేశం. హిందువులు కానివారిని లోపలికి వెళ్లనివ్వమని ఏమైనా బోర్డులు ఉన్నాయా? అని అధికారులను ప్రశ్నించాడు.
ఈ ఘటన నేపథ్యంలో ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతించాలని కోరుతూ సెంథిల్‌కుమార్ 2023 జూన్‌లో కోర్టుకు ఆశ్రయించారు.
జస్టిస్ శ్రీమతి తీర్పుపై జస్టిస్ చంద్రు ఇలా స్పందించారు.
‘‘హిందూయేతరులు హిందూ దేవాలయాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించే ప్రస్తుత నిబంధన అనవసరం. ఇది సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది’’ అని జస్టిస్ చంద్రు ఫెడరల్‌తో అన్నారు. హిందూ మతం ఇతర మతాల వలె నిర్మాణాత్మక సంస్థ. మనకు తెలిసిన ఏ గ్రంథంలోనూ ‘హిందూ’ అనే పదానికి నిర్వచనం లేదు. శతాబ్ది క్రితం కూడా ‘హిందూ’ అనే పదాన్ని ఏ రికార్డుల్లోనూ ఉపయోగించలేదని చంద్రు చెప్పారు. 1940 వరకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని కూడా హిందువులుగా పరిగణించేవారని ఆయన పేర్కొన్నారు.
డ్రెస్ కోడ్ కేసు
ఏడాది క్రితం ఒక న్యాయమూర్తి భక్తుల కోసం డ్రెస్‌కోడ్ పెట్టాలని హిందూ రిలీజియన్స్ అండ్ ఎండోమెంట్ బోర్డ్‌కు ఆదేశించిన విషయాన్ని జస్టిస్ చంద్రు గుర్తు చేశారు. ఆ ఆదేశాలు ఇవ్వడానికి న్యాయస్థానాలు బాధ్యత వహించకూడదని భావించిన న్యాయమూర్తుల బృందం.. ఆ ఉత్తర్వును రద్దు చేసిందని చెప్పారు.
‘‘ఎవరికి ప్రవేశం కల్పించాలనే దానిపై వేర్వేరు ఆలయాల్లో వేర్వేరు నిబంధనలు ఉంటాయి. అది ఆలయ సంప్రదాయాలు, ఆచారాలపై ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి వాసుదైక కుటుంబం (ప్రపంచమంతా ఒకటే) అన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారని అర్థం. అందువల్ల మత విశ్వాసాల ఆధారంగా ఎవరినైనా దేవాలయాలకు వెళ్లకుండా నిరోధించాల్సిన అవసరం లేదు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా కొందరు ముస్లిం నేతలను కూడా ఆహ్వానించారు’’ అని జస్టిస్ చంద్రూ పేర్కొన్నారు.
మరో న్యాయవాది కస్తూరి శంకర్ ఎక్స్ (ట్విట్టర్)లో ఇలా స్పందించారు. మదురై బెంచ్ ఇచ్చిన తీర్పు తిరోగమన, ఆచరణ సాధ్యం కానిదని పేర్కొన్నారు. ఎవరి అంతర్లీన విశ్వాసాన్ని నిర్వచించడానికి లేదా ధృవీకరించడానికి మార్గం లేనందున ఇది అమలుకు సాధ్యంకాదన్నారు.
ఆలయ ప్రవేశంపై చట్టం..
1939లో ఎ వతియార్నాథియర్ ప్రారంభించిన ఆలయ ప్రవేశ ఉద్యమం, వెనుకబడిన సమూహాలు మదురై మీనాక్షి అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి ద్వారా టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ అండ్ ఇండెమ్నిటీ యాక్ట్, 1939 వచ్చింది. దీని తర్వాత 11 నిబంధనలతో ఓమండూరు పి. రామసామి రెడ్డి (తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి) ద్వారా 1947లో ఆలయ ప్రవేశ ఆథరైజేషన్ చట్టం వచ్చింది. ఆలయ పూజలను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా చేయడానికి, హిందువులందరికీ ఆలయంలోని ప్రవేశించే అవకాశం కల్పించడానికి చట్టాలు చేయబడ్డాయి.
1970లో అప్పటి ముఖ్యమంత్రి ఎం కరుణానిధి చట్టంలోని 3(ఎ)ని రద్దు చేసి రూల్ 4-ఎని ప్రవేశపెట్టి ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం కల్పించారు. కళ్యాణ్ దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు విషయంలో రూల్ 4-ఏ వివాదాస్పదమైంది. హిందూ మతాన్ని అనుసరించే నిర్దిష్ట వర్గానికి మాత్రమే నిషేధం ఎత్తివేయబడిరదని, అయితే ఇది ఇప్పటికీ హిందువులు కానివారికి వర్తిస్తుందని వాదించారు.