
టీటీడీ గోశాల గోవుల మృతి, నిజమా,రాజకీయమా?
తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన గోశాల డైరెక్టర్ ని కాపాడేందుకు వైసీపీ నేత గోశాల నిర్లక్ష్యం ఆరోపణలు చేశారని మంత్రుల ఎదురుదాడి. రంగంలోకి డా.సుబ్రమణియన్ స్వామి
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలని సరిగా వ్యవహరించడంలేదా? తిరుపతి ఎస్వీ గో సంరక్షణ కేంద్రంలో గోవులు చనిపోతున్నాయా? వైసీపీ నేత టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై నిజం నిగ్గుతేల్చాల్సినది ఎవరు? గోశాల గోవుల సంరక్షణ విషయంలో దాపరికాలు లేవు. లెక్కలతో ఆరోపణలకు జవాబు చెప్పే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కు వుంది. తప్పుడు ఆరోపణలు చేస్తే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి? అసలు నిజాలు బయటకు చెప్పకుండా ఆరోపణలు అవాస్తవమని టీటీడీ చేతులు దులుపుకుంటామంటే... సరిపోదు. నిజంగా టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందకపోతే, బట్ట కాల్చి మీద వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాలకు వేదికగా మారకూడదు. రాజకీయాలకు అవకాశం లేకుండా టీటీడీ బోర్డు వ్యవహరించాల్సి ఉంది.
టీటీడీ గోశాలలో 3నెలల్లో వంద ఆవులు చనిపోయాయని , వాటికి మృతి కారణాలను తెలుసుకోడానికి టీటీడీ పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదని, విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం టీటీడీ చేసిందన్నది వైసీపీ నేత , టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు. కూటమి ప్రభుత్వం గోశాల నిర్వహణను గాలికి వదిలేసిందని, పర్యవేక్షణ కరువైందని వైసీపీ నేత చేసిన ఆరోపణ రాజకీయ రంగు పులుముకుంది. టీటీడీ ఛైర్మన్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, మంత్రి లోకేష్ లు కూడా భూమన ఆరోపణలను కొట్టి పారేశారు. తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన గోశాల డైరెక్టర్ ని కాపాడే ప్రయత్నంలోనే భూమన ఈ ఆరోపణలు చేశారని మంత్రులు ఎదురుదాడి చేశారు. తిరుమల వ్యవహారం లో ఏ ఆరోపణ వచ్చినా అది రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది.
ఆరోపణలకు ఊతం... సుప్రీం కోర్టులో పిల్ కు సుబ్రమణ్య స్వామి సిద్ధం?
భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజానిజాలు ఇంకా తేలాల్సివున్నా, తరచూ ఏదో వివాదం చుట్టుముట్టడం ఇటు టీటీడీ, అటు ప్రభుత్వానికి సమస్యలను తెచ్చిపెడుతుంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు ముడిపడి వున్న తిరుమల శ్రీవారి విషయంలో ఏ అపచారం జరిగినా అది చర్చనీయాంశమే. ఇప్పుడు టీటీడీ గోశాలలో వాస్తవాలను తెలుసుకొని సుప్రీంకోర్టు లో పిల్ దాఖలు చేస్తామని , బీజేపీ నేత, వివాదాస్పద నేతగా సుబ్రమణ్యస్వామి రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. రాజ్యాంగం లోని ఆర్టికల్ 48 ప్రకారం గో సంరక్షణ ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్న సుబ్రమణ్య స్వామి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
గతంలో ప్రతి విషయంలోనూ సుబ్రమణ్యస్వామి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి, దేశ వ్యాప్తంగా చర్చను లేవనెత్తారు.
సుబ్రమణ్య స్వామితో పాటు మరికొందరు కూడా గోశాలలో ఏమి జరుగుతుందో తేల్చాలంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ కామెంట్లు కూడా ఆసక్తికరంగా మారాయి.భగవద్గీత పై ప్రమాణం చేసి చెప్తున్నా టీటీడీ గోశాలలో గోవులు అర్ధ ఆకలితో, అలమటించి చనిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది అసత్యమని తెలిపే సీఎం చంద్రబాబు, టిటిడి చైర్మన్, ఈవో ఆనంద నిలయం ముందు భగవద్గీత పై ప్రమాణం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
శ్రీవారి భక్తులు భగవంతునిపై అపార భక్తితో టీటీడీ కి , స్వామివారి సేవకు గోవులను దానం చేస్తే , వాటిని నిర్లక్ష్యం చేసి, మృతికి కారణం కావడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గోవుల మృతిని రాజకీయం కోణంలో చూడొద్దు అనేది భక్తుల మాట. వృద్ధాప్యం కొన్ని రకాల అనారోగ్యాలతో కొన్ని గోవులు చనిపోవడాన్ని ఎవరూ తప్పుపట్టారు... కాని గోవుల సంరక్షణ లో లోపం వుంటే మాత్రం ఎవరినీ ఉపేక్షించ కూడదు.
వృద్ధాప్యంలో గోవులు చనిపోతున్నాయి అంటున్నారు, కాని వాస్తవానికి లేగ దూడలు, పసి దూడలు కూడా చనిపోతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.టీడీపీ వెబ్ సైట్ లో 40 ఆవులు మాత్రమే చనిపోయాయని అధికారికంగా పోస్టులు పెట్టారు.టీటీడీ ఐతే అసలు గోవులే చనిపోలేదని సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ప్రకటించింది. చనిపోయిన ఆవుల ఫోటోలు టీటీడీ గోశాల కు సంబంధించినవి కావని చెబుతోంది.వాస్తవాలను లెక్కలతో సహా బయట పెట్టాల్సిన అవసరం వుంది. గోశాలో ఉన్న ప్రతి ఆవుకు, దూడకు ఒక నెంబర్ కేటాయిస్తారు.. జియో ట్యాగ్ పద్ధతి కూడా అమలవుతోంది. అందుకే గోశాల కు కొత్తగా ఆవులు వచ్చినా, గోవుల సంఖ్యలో ఒకటి తగ్గినా వెంటనే అధికారులకు తెలిసిపోతుంది. మరి లెక్కలు బయటపెట్టిన ఆరోపణలకు చెక్ పెట్టవచ్చు. వెంటనే అలా చేయకపోవడం అనుమానాలకు ఊతం ఇస్తుంది.దానితో పాటు ప్రస్తుతం గో సంరక్షణ కేంద్రానికి డైరెక్టర్ లేరు. తిరుపతి తొక్కిసలాట ఘటన సందర్భంగా అప్పటి గోశాల డైరెక్టర్ గా వున్న హరినాథ్ రెడ్డి ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత డీఎఫ్ వో కు గోశాల అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన గోశాల విషయంలో అధికారుల నియామకం విషయంలో జాప్యం కూడా వివాదానికి కారణమైంది.
టీటీడీ కి వివాదాలు కొత్త కాదు
టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం విషయంతో పాటు, భక్తులకు దర్శనాలు, కొండపై అన్యమత ప్రచారం, నిర్వహణ లోపాలు, ఇలా ప్రతి విషయంలోనూ కొన్ని విమర్శలు నిత్యం టీటీడీకి కొత్త కాకున్నా, మితిమీరిన ఆరోపణలు, వివాదాల విషయంలో టీటీడీ బోర్డు నిబద్ధతగా వ్యవహరించాలి. దేవదేవుని ఆభరణాలలో పింక్ డైమండ్ మిస్సయిందని ,దానికి చంద్రబాబు పై నెపం వేసి ,అప్పట్లో నానా యాగీ చేశారు. ఆ వివాదం అప్పట్లో రాజకీయ విమర్శలకే పరిమితమైంది. ఇటీవల తిరుమల కు సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ కలిసిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సాక్షాత్తు ముఖ్యమంత్రే కామెంట్ చేయడం, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏకంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తోంది. ఆ తర్వాత తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన పైన ప్రభుత్వ విచారణ కొనసాగుతోంది. ఇలా ఆరోపణలు వచ్చిన ప్రతిసారి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సాగడం, ఆ తరువాత విచారణ చేయడం పరిపాటిగా మారింది. విచారణ లో ఏమి తేలిందన్న విషయం మాత్రం బయటకు రావడం లేదు. అసలు దర్యాప్తు కొలిక్కి రావడం లేదు. ఇలా రాజకీయాల కోసం దేవదేవుని సన్నిధి టీటీడీ ని వాడుకోవడం రాజకీయ నేతలకే చెల్లింది.
ఎస్వీ గోసంరక్షణ కేంద్రం
తిరుమల శ్రీవారి చరిత్ర కూ గోమాత కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అలాంటి ఏడుకొండలవానికి భక్తులు దానంగా ఇచ్చిన గోవులను సంరక్షించే ప్రదేశం టీటీడీ గోశాల. దీనిని 1956 లో స్థాపించారు. 2004లో దీని పేరును ఎస్వీ గో సంరక్షణ శాల గా మార్చారు. శ్రీవెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ కింద దాతల నుంచి వచ్చే నిధుల ఆధారంగా దీని నిర్వహణ సాగుతోంది. టీటీడీ గోవులను ప్రత్యేకంగా కొనుగోలు చేయదు. భక్తులు దానంగా ఇచ్చిన గోవులను సంరక్షించి, వాటి గో సంతతి పెరిగేలా చూస్తోంది. ఆవులు, దూడలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడమే కాక , వాటి ఆహారం, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. టీటీడీ గోశాలలో ఎన్ని గోవులు వున్నాయన్న సంఖ్య , అధికారిక వెబ్సైట్ లో పెట్టకున్నా, 2600 గోవులు వున్నాయని చెబుతున్నారు. అనారోగ్యం తో ,వయసుమళ్ళిన గోవులు మరణించడం జరుగుతూ వుండటంతో గోవుల సంఖ్య మారుతూ ఉంటుందంటున్నారు. ఏదైనా టీటీడీ కార్యకలాపాలలో గోశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. గోశాలకు అనుబంధంగా డైరీ ఫాం ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలు, ఇతర ఉత్పత్తులను స్వామివారి పూజలో వినియోగిస్తారు. ఇతర టీటీడీ ఆలయాలలో ఆచారాలలోనూ ఈ పాలు, నెయ్యి ,ఇతర పదార్థాలు పవిత్రంగా వినియోగిస్తారు. టీటీడీ గోశాలలో దేశీయ గో సంతతికి ప్రాధాన్యం ఇస్తూ , అరుదైన జాతుల గో సంరక్షణ బాధ్యతను టీటీడీ చూస్తోంది. ఒంగోలు, పుంగనూరు,కపిలగోవు,కాంగేయం వంటి మేలుజాతి పశువులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మేలు జాతి గోవులు ఇక్కడ సంరక్షిస్తున్నారు. గోశాలలో పెరిగిన కోడెదూడలను టీటీడీ తరపున వ్యవసాయాభివృద్ధి కోసం రైతులకు అందజేస్తుంటారు. దానికి తోడు గోసంరక్షణ కు ప్రాధాన్యత ఇస్తే, ఇతర గోశాలకు టీటీడీ సాంకేతిక , వైద్య సహకారాన్ని అందిస్తుంది. టీటీడీ డైరీ ఫాం పాల ఉత్పత్తులను టీటీడీ ఆలయాలు, అనుబంధ సంస్థలకు సరఫరా చేస్తారు.